తెలుగు రాష్ట్రాల యువతకు ఏం పిచ్చి పట్టిందో తెలియకుండా వుంది. ఇన్నాళ్లూ ప్రత్యేక రాష్ట్రం కోసం ఆత్మహత్యలంటూ కొందరు చచ్చిపోయారు. ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్య జరిగింది. ఇది ఆరంభం కాదని, ఆఖరేనని ఆశిద్దాం. తెలంగాణకై జరిగిన ఆత్మహత్యల విషయంలో కూడా ప్రతీసారి యిలాగే అనుకునేవాళ్లం. కానీ మళ్లీ ఎవరో చేసుకున్నారనే వార్త వచ్చేది. వాళ్లని తిట్టి మానిపించేవాళ్ల కంటె ఆకాశానికి ఎత్తేసేవారు ఎక్కువై పోయారు. నిజంగా జరిగినవి కొన్నయితే ఆ సంఖ్యను 'ఖలేజా' సినిమాలో మహేశ్‌బాబు పద్ధతిలో రౌండింగ్ చేసి యింత కింతని చెప్పేశారు. ఆటో నడవకపోయినా తిరిగిపోయే హైదరాబాదు ఆటో మీటరులా ప్రతీ కొన్ని నెలలకు అంకె దానంతట అదే పెరిగిపోయేది. తెలంగాణ కావాలని వాదించే ప్రతి నాయకుడు ఆత్మహత్యల గురించి ప్రస్తావించడం, నోటి కొచ్చిన పెద్ద అంకె చెప్పడం జరుగుతూ వచ్చింది. రాష్ట్రావతరణ బిల్లు చర్చలో కూడా వీటిని ప్రస్తావించారు. చివరకు ఆత్మహత్యల ఆధారంగా వచ్చిన రాష్ట్రంగా తెలంగాణ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు ఆంధ్రకు కూడా ఆత్మహత్యల ప్రత్యేక హోదా దక్కుతుందేమో చూడాలి.
హోదా దక్కినా చచ్చిపోయినవారికి దక్కేది ఏమిటి అంటే గుండు సున్నే. తెలంగాణ అమరవీరులు 1200 అని కొందరంటే, అబ్బే 1500 అని మరి కొందరన్నారు. పరిహారం యివ్వడానికి లెక్కలు తీస్తే దానిలో నాల్గో వంతే తేలారు. సరే, అమరవీరులుగా గుర్తింపబడి పరిహారానికి ఎలిజబిలిటీ తెచ్చుకున్నవారికైనా గుర్తింపు వుందా? వారి పేర కడతానన్న స్తూపం ఎక్కడ? సెక్రటేరియట్ కూల్చి వేరే చోట కడతాం, ఉస్మానియా కూల్చి మరోటి కడతాం అంటున్నారు కానీ యీ స్తూపం మాట ఎత్తుతున్నారా? స్తూపం కడితే అమరవీరుల పేర్లు రాయాలి. తెలంగాణ సాధనలో వారికీ చోటుందని చరిత్రలో రికార్డయిపోతుంది. అది కెసియార్‌కు యిష్టం లేదు. తెలంగాణ వచ్చిందంటే ఆయన ఒక్కరి కారణంగానే అని భావితరాలు అనుకోవాలి. నిజానికి తెలంగాణకై క్రెడిట్ యివ్వాలంటే దానికై లేఖ యిచ్చిన టిడిపికి, అక్రమ మార్గాలకు సైతం తెగబడి బిల్లు ప్రవేశపెట్టిన కాంగ్రెసుకు, దానికి ఫుల్ స్కేలు మద్దతు యిచ్చి అక్రమంలో పాలు పంచుకున్న బిజెపికి, ఉద్యమం చల్లారి పోకుండా నిరంతరం సక్రమ, అక్రమ మార్గాలలో ఆందోళన చేస్తూనే వున్న వివిధ వర్గాల ఉద్యమకారులకు, అతిశయోక్తులు వండివార్చిన మీడియాకు – అందరికీ పంచాలి. అలా పంచితే కెసియార్ వాటాకు వచ్చేదెంత? అందువలన తెెలంగాణ ఉద్యమ చరిత్రలో అమరవీరుల పేజీమీద ఫోకస్ పడదు. పడినా 'అమరవీరులు' అనే కలక్టివ్ నౌన్ వుంటుంది కానీ వ్యక్తిగతంగా ఎవరూ లైమ్‌లైట్‌లోకి రారు. వారి కుటుంబాల వారికి ఎన్నికలలో టిక్కెట్టు యిచ్చి ఒక్కరు ఎమ్మెల్యే అయినా ఆ విషయం అప్పుడప్పుడు గుర్తుకు వచ్చే ప్రమాదం వుంది కాబట్టి టిక్కెట్టు కూడా యివ్వకుండా జాగ్రత్త పడ్డారు.
ఇప్పుడు ప్రత్యేక హోదాకై ఆత్మహత్య చేసుకున్న మునికోటి విషయంలో కూడా యిలాగే జరుగుతుంది. ఈ రోజు రాష్ట్రమంతా చేసిన బంద్‌లో అమర్ రహే అంటారు. అతని త్యాగం వృథా పోదు అంటారు. రేపు నిజంగా ప్రత్యేక హోదా వస్తే అప్పుడు యితన్ని ఎవరైనా తలుస్తారా? 'నా మొహం చూసి, నా మాట కాదనలేక యిచ్చార'ని చంద్రబాబు అంటారు, ఆయన అడక్కముందే ఆంధ్రుల మీద ప్రేమతో మోదీ యిచ్చారని బిజెపి వాళ్లంటారు, నా దీక్ష చూసి యిచ్చారని జగన్ అంటారు, అసలు మా సమావేశంలో కనబడిన ఆవేశం చూసి భయపడి యిచ్చారని కాంగ్రెసు వారంటారు. ఈ మునికోటి సోదెలోకి లేకుండా పోతాడు. ఈ పాటి దానికి నిండు ప్రాణం తీసుకోవడం దేనికి? తెలంగాణకై ఆత్మహత్యలు జరిగే రోజుల్లో 'భద్రం బీ కేర్‌ఫుల్ బ్రదరూ, సమిధగ మారకు' అని నేను వ్యాసాలు రాశాను. ఏం లాభం? ఆత్మహత్యలు ఆగలేదు. 'ఆత్మహత్య చేసుకోబోయి మీ వ్యాసం చదివి ఆగిపోయాను' అని నాకెవరూ మెయిలూ రాయలేదు. ఇప్పుడీ మునికోటి వారసులు కూడా ఆగుతారో లేదో తెలియదు. టిడిపి, బిజెపిని యిరుకున పెట్టడానికి ప్రతిపక్షాలు దీన్ని పూర్తిగా వుపయోగించుకుంటాయి – సహజంగా! ఇకపై జరిగే ఆత్మహత్యలన్నీ ప్రత్యేక హోదా ఖాతాలో పడేస్తూ పోవచ్చు. ఆ విషయంలో గైడెన్సు కావాలంటే టి-ఉద్యమకారుల నడిగితే చెప్తారు. నటుడు శివాజీ నిరాహారదీక్ష చేశారు కానీ ప్రజలను యింతలా కదిలించ లేకపోయారు. ఇతను రాజకీయేతర వ్యక్తి కావడం, నిజంగా ప్రాణం తీసేసుకోవడం వలన అతని నిజాయితీని శంకించలేక, అతని మరణాన్ని తలచుకుని దుఃఖిస్తున్నాం.
'టిడిపికి ప్రత్యేక హోదాపై చిత్తశుద్ధి వుంటే బిజెపితో పొత్తు తెంచుకుని కేంద్ర కాబినెట్‌లోంచి బయటకు వచ్చేయాలి' అని ప్రతిపక్షాలు సవాలు చేస్తున్నాయి. అదే జరిగితే అప్పుడు 'ప్రత్యేక హోదాకై అత్మహత్య' ట్యాగ్ టిడిపికి అన్వయిస్తుంది. కానీ టిడిపి పార్టీ నాయకులు మునికోటి తరహాలో భార్యాబిడ్డలు, వారసులు లేనివారు కారు. వాళ్లకు చాలా దూరదృష్టి వుంది. రాబోయే పాతికేళ్లదాకా రాజధాని నిర్మాణం సాగుతుందని, అప్పటివరకు తాము, తమ పుత్రపౌత్రులు అధికారంలో వుండి ఆ కార్యనిర్వహణాభారం వహించాలని వారు ప్రణాళికలు వేస్తున్నారు. అంతటి ఆశాభావం వున్నవారిని ఆత్మహత్య చేసుకోమనడం సబబు కాదు. 'అయితే హత్య చేయాలంటావా? ప్రతిపక్షాలతో చేతులు కలిపి, లేదా బిజెపిలో చీలిక తెచ్చి కేంద్రంలోని అధికారపక్షాన్ని గద్దె దించి అనుకున్నది సాధించాలంటావా?' అని అడగకండి. అది కుదిరే పని కాదు. బిజెపికి పూర్తి మెజారిటీ వుంది. మోదీతో తలపడే నాయకుడూ బిజెపిలో లేడు. 'హత్యా లేదు, ఆత్మహత్యా లేదు, జీవించే వుంటాం, ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతూనే వుంటాం' అంటుంది టిడిపి. మొన్న కలాం గారు పోయినప్పుడు రాజకీయ నాయకులందరూ ఆయన్ను ఆకాశానికి ఎత్తేసింది ఎందుకనుకుంటున్నారు? ఆయన క్షిపణి పితామహుడు, గొప్ప శాస్త్రవేత్త వగైరా అనా? అబ్బే, వాస్తు కోసం భవంతులు కూల్చేస్తున్న వీళ్లకు ఆయన చెప్పే శాస్త్రీయ దృక్పథం ఏం నచ్చుతుంది? ఆయన చెప్పిన ఒక సూక్తి వీళ్లకు బాగా అనువుగా వుంది. 'కలాం గారు ఏం చెప్పారు, కలలు కనండి' అని మనకు చెప్తున్నారు. మనని నిద్ర పోనివ్వని కలల గురించి ఆయన మాట్లాడితే వీళ్లు మనల్ని జోకొట్టే కలలు కనమంటున్నారు.
మన తెలుగు రాష్ట్రాలు రెండింటిలో ముఖ్యమంత్రులకు బాగా నచ్చిన పదం – హబ్! ' …. రాష్ట్రం దేశం మొత్తం మీద … హబ్‌గా మారే రోజులు దూరంలో లేవు' అనేది స్టాండర్డ్ ఫ్రేజ్. కెసియార్ అంటే తెలంగాణ అని, బాబు అంటే ఆంధ్ర అని మొదటి బ్లాంక్‌లో పూరిస్తారు. ఇక రెండో దానిలో ఏదైనా రావచ్చు, సాఫ్ట్‌వేర్, హార్డ్ వేర్, ఇన్నర్‌వేర్, కల్చర్, అగ్రికల్చర్, సెరికల్చర్, ఆక్వాకల్చర్, థర్మల్ పవర్, సోలార్ పవర్, హైడ్రోపవర్… యీ జాబితా అనంతం. నాకు యితర రాష్ట్రాల మీద జాలి వేస్తుంది. అన్ని హబ్బులూ మన దగ్గరే వుంటే, యిక వాళ్ల దగ్గరేం వుంటాయా అని. ప్రపంచంలోని అన్ని దేశాలు మనతో భాగస్వామ్యానికై ఉవ్విళ్లూరుతున్నాయని మనని ఊరిస్తారు. దానికి గాను మనం నోచుకున్న నోములేమిటో నాకు తెలియదు, మన దగ్గర వున్న క్వాలిటీ ఏమిటో తెలియదు. మన యింజనీరింగు కాలేజీల క్వాలిటీ అతి పూర్ అని మన యూనివర్శిటీలే చెప్తున్నాయి, మన విశ్వవిద్యాలయాల్లో చాలావాటికి వైస్ ఛాన్సలర్లే లేరు, ఆసుపత్రుల నిర్వహణ బాగా లేవని, యిలా అయితే వేరే చోటికి మార్చేస్తామనీ ముఖ్యమంత్రులే హుంకరిస్తూ వుంటారు. ఉద్యోగులలో అలసత్వం పెరిగిపోతోందని, తను అక్కడ పక్కేయకపోతే బాగుపడేట్టు లేరని సిఎంలు వాపోతూ వుంటారు. చూడబోతే ఇరు ప్రాంతాల ఉద్యోగులలో అయోమయం, విద్యార్థుల పరిస్థితి 'అయ్యో'మయం. ఆంధ్ర రాష్ట్రం పరిపాలన వేరే చోట నుండి సరిగ్గా సాగడం లేదు కాబట్టి బెజవాడకు మార్చేస్తామని బాబే చెప్తున్నారు. జీతాలివ్వడానికి డబ్బు లేదని రెండు ప్రభుత్వాలూ అల్లాడుతున్నాయి. పరిస్థితి యిలా వుందని ఓ పక్క చెపుతూనే, 'విదేశాల భాగస్వామ్యంతో రేపు మీదే' అనే రంగుల సినిమా మనకి చూపిస్తున్నారు. (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఆగస్టు 2015)