నెట్టింట్లో నెంబర్‌వన్ కెసిఆర్… బాబు కన్నా టాప్

తెలంగాణ రాష్ట్రముఖ్యమంత్రి కెసీఆర్ నెటిజన్లను ఆకర్షించడంతో దేశంలోనే నెంబర్‌వన్ సిఎం అయ్యారు. దేశవ్యాప్తంగా ముఖ్యమంత్రుల ఫేస్‌బుక్ ఖాతాల విశ్లేషణలో ఈ విషయం వెల్లడైంది. అధికారిక ఎఫ్‌బి పేజ్‌ల ఫాలోవర్ల సంఖ్యాపరంగా కెసీఆర్ నెంబర్‌వన్ ఘనతను…

తెలంగాణ రాష్ట్రముఖ్యమంత్రి కెసీఆర్ నెటిజన్లను ఆకర్షించడంతో దేశంలోనే నెంబర్‌వన్ సిఎం అయ్యారు. దేశవ్యాప్తంగా ముఖ్యమంత్రుల ఫేస్‌బుక్ ఖాతాల విశ్లేషణలో ఈ విషయం వెల్లడైంది. అధికారిక ఎఫ్‌బి పేజ్‌ల ఫాలోవర్ల సంఖ్యాపరంగా కెసీఆర్ నెంబర్‌వన్ ఘనతను దక్కించుకున్నారు. పొద్దున్న లేస్తే హైటెక్ జపం చేసే చంద్రబాబు అధికారిక పేజ్ మాత్రం ఫాలోయింగ్‌లో కెసీఆర్‌కన్నా చాలా వెనుకబడి ఉండడం గమనార్హం. 

‘ప్రత్యూషోదయం’కు లైకులే లైకులు..
దాదాపు 2.70లక్షల మంది నెటిజన్లు ఫాలో అయ్యే కెసిఆర్ ఎఫ్‌బి పేజ్‌లో ఆయన పాల్గొనే అధికారిక కార్యక్రమాలన్నీ ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతుంటాయి.గత ఏడాదిగా ఈ ఎఫ్‌బి పేజ్‌కు లైక్‌లు కూడా కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి.

హైదరాబాద్‌కు చెందిన ప్రత్యూష అనే బాలికను స్వంతవారే చిత్రహింసల పాలుజేసిన ఉదంతంలో  కెసీఆర్ స్పందించిన తీరు, ఆమెని దత్తత తీసుకుంటానని చెప్పి, ఆ బాలికను ఇంటికి తీసుకెళ్లి భోజనం చేయడం… వంటివి ఆయనలోని మానవత్వాన్ని ప్రతిబించాయంటూ  నెటిజన్లు జేజేలు పలికారు. ఈ విషయంలో ఆయనకు దాదాపు 12వేల మందికిపైగా ‘లైక్’లు అందిస్తే, దాదాపు 1600 మంది  దీన్ని ‘షేర్’ చేశారు.

బండ్లగూడలోని ఎల్లమ్మ గుడి, సికింద్రాబాద్‌లోని ఉజ్జయినీ మహంకాళి దేవాలయాలను కేసీఆర్ సందర్శించి పూజలు చేసిన సందర్భంగా కూడా లైక్‌లు వెల్లువెత్తాయి. 

తెలంగాణ సిఎంఓ నిర్వహించే ఈ ఎఫ్‌బి పేజ్‌కు అత్యధిక ఆదరణ విదేశాల నుంచి లభిస్తోంది. తెలంగాణ వాసులు పెద్ద సంఖ్యలో నివసించే గల్ఫ్ దేశాలతో పాటుగా, అమెరికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియాల నుంచీ కూడా ఈ పేజీని అధిక సంఖ్యలో సందర్శిస్తుండడం ఆసక్తికరం. 

 బాబు ‘పర్సనల్’గా… సూపర్‌హిట్…
అధికారిక పేజ్‌లకు సంబంధించి మరికొంత మంది సిఎంల ఫాలోయింగ్ చూస్తే…మధ్యప్రదేశ్ సిఎం శివరాజ్ సింగ్ చౌహాన్ (2.64లక్షలు) రెండో స్థానంలో ఉంటే… మహారాష్ట్ర సిఎంఓ పేజ్ అతి తక్కువగా కేవలం 26వేల ఫాలోవర్లకే పరిమితమైంది. అధికారిక పేజ్‌లో కేవలం 32వేల మంది ఫాలోవర్లతో సరిపెట్టుకున్న ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు… వ్యక్తిగత పేజ్ మాత్రం 4లక్షలకు పైగా ఫాలోవర్స్‌ను సాధించడం విశేషం.

-ఎస్బీ