సుభాష్ చంద్ర బోస్ కాంగ్రెసునుంచి బయటకు వచ్చాక ఫార్వార్డ్ బ్లాక్ అనే పార్టీ స్థాపించారు. దానికి బెంగాల్‌లో తప్ప వేరే చోట్ల పెద్దగా ఆదరణ లభించలేదు. రెండవ ప్రపంచయుద్ధంలో జర్మనీ, ఇటలీ, జపాన్‌లు అక్షరాజ్యాల పేర ఒకవైపు, ఇంగ్లండ్, అమెరికా, రష్యా, ఫ్రాన్సు మిత్రదేశాల పేర మరోవైపు పోరాడుతూండడం చూసి 'శత్రువుకి శత్రువు మిత్రుడు' అనే సిద్ధాంతాన్ని అవలంబించి బోసు ఇంగ్లండ్‌కు శత్రువులైన జర్మనీ, జపాన్‌లతో చేతులు కలిపారు. కలకత్తా గృహనిర్బంధం నుండి తప్పించుకుని జర్మనీ చేరి అక్కడ కొంతకాలం వుండి ఆ తర్వాత జలాంతర్గామి ద్వారా జపాన్ చేరి, వారి సహాయంతో ఇంగ్లీషు పాలనలో వున్న భారతదేశంపై దండెత్తారు. బోసు జర్మనీలో వుండగా ఆయనకు సహాయకుడిగా పనిచేసిన ఎసిఎన్ నంబియార్‌పై యిప్పుడు బ్రిటిషు గూఢచారి సంస్థ కొంత సమాచారాన్ని వెలుగులోకి తెచ్చింది. బోసు 1942 జనవరిలో ఫ్రీ ఇండియా సెంటర్ స్థాపించి నంబియార్‌ను సెకండ్ ఇన్ కమాండ్‌గా నియమించారు. దాన్ని జర్మనీ ప్రభుత్వం గుర్తించింది కూడా. జర్మనీ పట్టుకున్న భారతీయ యుద్ధ ఖైదీలతో ఇండియన్ లిజియన్ (భారత సైనికదళం) తయారు చేశారు. ఈ కార్యకలాపాల్లో బోసుకి సహకరిస్తూ, జర్మనీలో ఆజాద్ హింద్ రేడియోను నిర్వహించినది, బోసుకు నాజీ ప్రముఖులతో చర్చల్లో సహాయపడినది నంబియారే. 1943లో జపాన్ వెళ్లిపోయాక బోసు యూరోప్‌లో 'ఫ్రీ ఇండియా' ఉద్యమ నాయకత్వాన్ని అతనికే అప్పగించాడు. జర్మనీ అధికారులతో సంప్రదింపులు జరిపి ఇండియన్ లీజియెన్ సేవల్ని యుద్ధరంగంలో వినియోగించుకోవడానికి ప్రయత్నించింది కూడా నంబియారే. (ఆ దళంలో సైనికులు జర్మన్ అధికారులు చెప్పిన ఆదేశాలను మన్నించలేదు. చెప్పిన చోటకు వెళ్లి యుద్ధం చేయలేదు. ఆ ప్రయోగం విఫలమైందనే చెప్పాలి) 1944 మార్చిలో బోసు ప్రవాస భారత ప్రభుత్వం ఏర్పరచినపుడు నంబియార్‌ను మినిస్టర్ ఆఫ్ స్టేట్‌గా నియమించారు.
బ్రిటన్ గూఢచారి సంస్థ ఎంఐ5 తన పాత రికార్డులను యిటీవలే బహిర్గతం చేసింది. వాటిలో కొన్ని ఫైళ్లు నంబియార్‌ను కమ్యూనిస్టుగా గూఢచారిగా, నాజీ సమర్థకుడిగా పేర్కొన్నాయి. నంబియార్ జర్మనీలో జర్నలిస్టుగా వుండేవాడు. కమ్యూనిస్టు సానుభూతిపరుడు. భారత కమ్యూనిస్టు పార్టీ సభ్యుడు హరీంద్రనాథ్ చట్టోపాధ్యాయ (ఈయన కవి, కొన్ని సినిమాల్లో వేశాడు కూడా. సరోజిని నాయుడుకు సోదరుడు, విజయవాడలో కమ్యూనిస్టు ప్రాబల్యం ఎక్కువగా వుండే రోజుల్లో 1952లో అక్కణ్నుంచి ఎంపీగా ఎన్నికయ్యాడు) సోదరి సుహాసినిని పెళ్లాడాడు. ఆమె భారత కమ్యూనిస్టు పార్టీలో తొలి మహిళా కార్యకర్త. భారత కమ్యూనిస్టు ఉద్యమంలో పాలు పంచుకునే రోజుల్లో 1929 ప్రాంతంలో రష్యా యితన్ని అతిథిగా పిలిచింది. అప్పుడే యితన్ని తన గూఢచారి సంస్థ జిఆర్‌యు గూఢచారిగా నియమించిందని ఎంఐ5 అనుమానం. అనుమానమనే అనాలి, ఎందుకంటే కమ్యూనిస్టు గూఢచారిగా పనిచేసి తర్వాతి రోజుల్లో రంగు ఫిరాయించిన ఒకతను నంబియార్ గురించి యిచ్చిన సమాచారం యిది. దీన్ని నిర్ధారించుకోవాలి అని ఫైల్లో రాసుకున్నారు. నాజీలకు కూడా యితనిపై అలాటి అనుమానమే వుంది కాబోలు, 1930లలో యితన్ని చితకబాదారు, జైల్లో పెట్టారు. జర్మనీ నుంచి బహిష్కరించి ప్రేగ్‌కు పంపారు. అక్కణ్నుంచి యితను పారిస్ చేరాడు. బోసు నాజీలతో చేతులు కలిపి, తనకు నంబియార్ సహాయం కావాలని కోరడంతో అతన్ని పారిస్ నుంచి జర్మనీలోకి మళ్లీ అనుమతించారు. పెద్ద జీతంపై ఉద్యోగం యిచ్చారు. అప్పణ్నుంచి యితను నాజీ సానుభూతి పరుడయ్యాడని ఎంఐ5 అంటుంది. రెండవ ప్రపంచయుద్ధంలో అక్షరాజ్యాలు ఓడిపోయి, బోసు అంతర్ధానం అయిపోయాక 1945 జూన్‌లో నంబియార్‌ను ఆస్ట్రియాలో అరెస్టు చేసి నాజీగా విచారణ ప్రారంభించారు. విచారణ సమయంలో అతను తను నెహ్రూకి అనుచరుణ్నని, బెర్న్‌లో అతన్ని కలిశానని, బోసుతో ముఖపరిచయం మాత్రమే వుందనీ చెప్పుకున్నాడు. దాంతో బ్రిటిషు గూఢచారులకు యితనిపై అనుమానం మరింత పెరిగింది. ఎందుకంటే అతనికి, బోసుకి మధ్య నడిచిన ఉత్తరప్రత్యుత్తరాలు వారికి దొరికాయి. అంతేకాదు, వాళ్లిద్దరూ కలిసి జర్మనీలో ఏర్పరచిన ఇండియన్ లీజియెన్ వివరాలు కూడా…!
సుహాసినితో విడిపోయాక నంబియార్‌కు సహచరిగా వున్న ఇవా గైజ్లర్ అనే జర్మన్ మహిళ జర్మన్లకు గూఢచారిగా పనిచేసిందని ఎంఐ5 గట్టిగా నమ్మింది. ఆమె తర్వాతి రోజుల్లో వాల్టర్ అనే అతన్ని పెళ్లి చేసుకుంది. యుద్ధానంతరం నంబియార్ ఆనుపానులు తెలపమంటూ ఆమె బ్రిటిషు అధికారులకు ఉత్తరం రాసింది. నంబియార్ ఏ దేశపు గూఢచారో చెప్పమని వారు అడిగితే 'అతను ఏ దేశం కోసం పని చేయలేదు, తన గురించే తను తాపత్రయపడ్డాడు' అంది. చివరకు అతను బ్రిటిషు చేతుల్లోంచి తప్పించుకుని స్విజర్లండ్ పారిపోయాడు. 1947కు పూర్వం ఏర్పడిన నెహ్రూ మధ్యంతర ప్రభుత్వం అతనికి ఇండియన్ పాస్‌పోర్టు యిచ్చింది – బ్రిటిషు వాళ్లు వద్దన్నా వినకుండా. 1948లో బెర్న్‌లో ఇండియన్ లెగేషన్‌కు కౌన్సిలర్‌గా, ఆ తర్వాత స్కాండినేవియాలో భారత రాయబారిగా, 1951లో జర్మనీకి రాయబారిగా పనిచేశాడు. ఈ నియామకాలకు కారణం ఏమిటో మనకు తెలియదు. నంబియార్ వ్యక్తిగత ప్రతిభ కావచ్చు, అతని బంధువైన సరోజిని నాయుడు, నాయకుడు బోసులపై నెహ్రూకు గల గౌరవం కావచ్చు, తమ గూఢచారి కదాని రష్యావారు నెహ్రూకు చేసిన సిఫార్సు కావచ్చు. ఇతను ఒకవేళ రష్యా గూఢచారియే అయితే బోసు కదలికలపై అతను రష్యాకు సమాచారం అందించాడేమో! తెలియదు. గూఢచారుల విషయంలో కొన్ని ఎప్పటికీ మిస్టరీలుగా మిగిలిపోతాయి.
– ఎమ్బీయస్ ప్రసాద్ (నవంబరు 2014)