ఎమ్బీయస్‌ : బిజెపి ఎవర్ని ఎంచుకుంటుంది?

మహారాష్ట్రలో ఫడ్నవీస్‌ ప్రభుత్వం ఎవరి మద్దతు తీసుకుంటుందో యిప్పటిదాకా తేలలేదు. ఎన్నికలకు ముందు వీరాలాపాలు పలికిన శివసేన తర్వాత చతికిల పడింది. కూటమిలో పెద్దన్న 63 సీట్లున్న శివసేన కాదు, 122 సీట్లున్న బిజెపియే…

మహారాష్ట్రలో ఫడ్నవీస్‌ ప్రభుత్వం ఎవరి మద్దతు తీసుకుంటుందో యిప్పటిదాకా తేలలేదు. ఎన్నికలకు ముందు వీరాలాపాలు పలికిన శివసేన తర్వాత చతికిల పడింది. కూటమిలో పెద్దన్న 63 సీట్లున్న శివసేన కాదు, 122 సీట్లున్న బిజెపియే అని నిర్ద్వంద్వంగా తేలడంతో రగులుతోంది. ఇప్పటిదాకా శివసేన చెప్పినట్లు ఆడుతూ వచ్చిన బిజెపి నూతనోత్సాహంతో తుళ్లిపడుతోంది. 23 సీట్లు తక్కువగా వున్న వాళ్ల ప్రభుత్వానికి ఎవరో ఒకరి మద్దతు కావాలి. శివసేన చూస్తే ధాటీగా బేరాలాడుతోంది. విశ్వాస తీర్మానం పాస్‌ అయ్యే లోపునే కాబినెట్‌ను విస్తరించాలని, తమ పార్టీకి ఉప ముఖ్యమంత్రి ప్లస్‌ 10 మంత్రి పదవులు కావాలని, ఉపముఖ్యమంత్రి పదవి లేకపోతే 12 కావాలని అడుగుతోంది. విస్తరణ సంగతి తీర్మానం తర్వాత చూసుకుందాం, మొదట విశ్వాసం ప్రకటించి, మాకు మద్దతుగా ఓటింగులో పాల్గొనండి అంటోంది బిజెపి. రేవు దాటాక ఓ బోడి మల్లయ్యా, 12 పదవులు కాదు, మూడో నాలుగో యిస్తాంలే అంటే అప్పుడు వెనక్కి తగ్గడం కష్టమని, ఆ బేరాలేవో ముందే తేల్చాలని శివసేన అంటోంది. బిజెపి మొండికేసుకుని కూర్చుంది. బిజెపితో ఎలా వేగాలో శివసేనకు అంతు పట్టడం లేదు. ప్రమాణస్వీకారానికి ఉద్ధవ్‌ మాత్రమే హాజరయ్యాడు. కేంద్ర కాబినెట్‌లో నుంచి తమ మంత్రిని ఉపసంహరించలేదు. కూటమిలో నెంబర్‌ వన్‌, నెంబర్‌ టూ స్థానాలు తారుమారు అయ్యాయి కాబట్టి ఎజస్ట్‌ కావడానికి యిద్దరికీ టైము పడుతోంది. 

శివసేన లేకపోయినా బిజెపికి ఎన్‌సిపి యిస్తానంటున్న బేషరతు మద్దతు తీసుకోవడమనే యింకో ఆప్షన్‌ కూడా వుంది. వాళ్లు ఓటింగు టైముకి గైరుహాజరవుతామని కబురు పెట్టారు. మహారాష్ట్రలో సుస్థిరప్రభుత్వం ఏర్పడాలనే ఉత్తమబుద్ధితో మద్దతు యిస్తున్నాం తప్ప మాకు యితరత్రా కోరికలేమీ లేవని చెపుతున్నారు. ఎన్‌సిపి అంటే అవినీతికి మారుపేరు అని ఎన్నికల్లో ప్రచారం చేసిన మోదీ ఎన్‌సిపి మద్దతు తీసుకుంటారా అని కొందరి సందేహం. ఎన్నికల ప్రచారం టైములో మోదీ కాంగ్రెస్‌, ఎన్‌సిపిలకు చెరో పది సీట్ల కంటె ఎక్కువ రావని మనకు జోస్యం చెపుతూ ఎన్‌సిపిని తిట్టిపోశారు. ఫలితాలు చూస్తే కాంగ్రెసుకు 42, ఎన్‌సిపికి 41 వచ్చాయి. మరి వాళ్లను పట్టించుకోకుండా ఎందుకుంటారు? బిజెపికి, శరద్‌ పవార్‌కు వున్న బంధాలు ఎటువంటివి? పార్లమెంటు ఎన్నికలలో బిజెపికి మిత్రపక్షంగా వున్న రాష్ట్రీయ సమాజ్‌ పక్ష అధ్యకక్షుడు మహదేవ్‌ ఝంకార్‌ ఒక టీవీ ఛానెల్‌లో ఒక విషయం చెప్పాడు – ''పార్లమెంటు ఎన్నికల తర్వాత కేంద్రంలో బిజెపికి ఎంపీలు తక్కువ పడితే తన ఎంపీలతో మద్దతు యిస్తానని శరద్‌ పవార్‌ మోదీకి మాట యిచ్చాడు. అందుకు ప్రత్యుపకారంగా 'బారామతి నియోజకవర్గంలో అభ్యర్థిగా నిలబడుతున్న మీ అమ్మాయి సుప్రియా సూలేకు వ్యతిరేకంగా నేను ప్రచారం చేయను' అని మోదీ మాట యిచ్చాడు. 

ఇది తెలియని నేను సుప్రియాపై పోటీ చేస్తూ ప్రచారానికి రమ్మనమని మోదీని కోరాను. ఆయన రాలేదు.'' అని.

పృథ్వీరాజ్‌ చవాన్‌ కాబినెట్‌ సభ్యులైన శరద్‌ పవార్‌ సోదరుని కుమారుడు అజిత్‌ పవార్‌, అదే పార్టీకి చెందిన సునీల్‌ తత్కారే యిద్దరూ ఇరిగేషన్‌ స్కామ్‌లో యిరుక్కున్నారు. ఈ ఆగస్టులో ఏంటీ కరప్షన్‌ బ్యూరో (ఎసిబి) 'మేం వారిపై విచారణ ప్రారంభిస్తాం, అనుమతి యివ్వండి' అని హోం శాఖను కోరింది.   ఆ ఫైలు పృథ్వీరాజ్‌ వద్ద పెండింగులో వుందని తెలిసిన అజిత్‌ పవార్‌ వెంటనే తమ పార్టీ మద్దతు వుపసంహరించుకుని ప్రభుత్వాన్ని పడగొట్టాడు. రాష్ట్రపతి పాలన విధించారు. ఇక ఆ ఫైలుపై నిర్ణయం తీసుకోవలసినది – కేంద్రంలో వున్న బిజెపి ప్రభుత్వం. ఇరిగేషన్‌ స్కామును వెలుగులోకి తెచ్చిన ఫడ్నవీస్‌ 'మీరు గవర్నరుకి చెప్పి ఆ ఫైలుపై సంతకం చేయించండి. ఎన్‌సిపిపై విచారణ ప్రారంభమైతే అది మనకు ఎన్నికలలో ఎంతో లాభిస్తుంది' అని బిజెపి కేంద్రనాయకత్వంపై ఒత్తిడి తెచ్చాడు. అయినా బిజెపి ఏమీ చేయలేదు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఎవరితో అవసరం పడుతుందో చూసి అప్పుడు పని మొదలెడదాం అని. ఇప్పుడు ఎన్‌సిపి బేషరతు మద్దతు ప్రకటించడానికి యిది ప్రధాన కారణం. ఇంకో కారణం కూడా ఏమిటంటే – ఎన్‌సిపి, కాంగ్రెసు రెండూ కోపరేటివ్‌ రంగంలో ప్రత్యర్థులు. చక్కెర, పాల సహకార సంస్థలన్నిటిలో ఎన్‌సిపి, కాంగ్రెస్‌ సమర్థకులతో పోటీ పడాలి. ఇప్పుడు కాంగ్రెస్‌ పరిస్థితి బాగా లేదు కాబట్టి బిజెపి సహాయంతో కోపరేటివ్‌ రంగంలో, గ్రామీణ ప్రాంతంలో కాంగ్రెసును ఓడించి, తాము బలపడాలని శరద్‌ పవార్‌ ఆలోచన. శరద్‌ పవార్‌ రాజకీయ చాణక్యుడు. పరిపాలనలో కూడా దిట్ట. వ్యవసాయానికి సంబంధించిన వ్యవహారాల్లో వాజపేయి కూడా అతన్ని సంప్రదించేవారట. శరద్‌తో పూర్తిగా చెడగొట్టుకోవడానికి బిజెపి సిద్ధంగా లేదు. అందువలన ఆరెస్సెస్‌ వాళ్లు ఎంత గింజుకున్నా బిజెపి, ఎన్‌సిపితో రహస్య ఒప్పందం కుదుర్చుకుని శివసేనకు ముకుతాడు వేయడానికి చూడవచ్చు. 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (నవంబరు 2014)

[email protected]