ఎమ్బీయస్‌: తమిళ రాజకీయాలు- 50

1963 జూన్‌లో తిరువణ్నామలైలో జరిగిన ఉపయెన్నికలో కామరాజ్‌ తను స్వయంగా పదిరోజుల పాటు ప్రచారం చేయడమే కాకుండా ఐదుగురు మంత్రులను కూడా దింపాడు. అయినా డిఎంకె గెలిచింది. దాంతో ఆయన అక్టోబరులో తను ముఖ్యమంత్రి…

1963 జూన్‌లో తిరువణ్నామలైలో జరిగిన ఉపయెన్నికలో కామరాజ్‌ తను స్వయంగా పదిరోజుల పాటు ప్రచారం చేయడమే కాకుండా ఐదుగురు మంత్రులను కూడా దింపాడు. అయినా డిఎంకె గెలిచింది. దాంతో ఆయన అక్టోబరులో తను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుని జాతీయరాజకీయాలకు వెళ్లిపోయి, ఎఐసిసికి అధ్యక్షుడయ్యాడు. తనే కాకుండా పదవులు అనుభవిస్తున్న నాయకులందరూ వాటిని త్యాగం చేసి పార్టీ పదవులు చేపట్టి పార్టీవ్యవస్థను పరిపుష్టం చేయాలని ప్రతిపాదించాడు. ఆ రోజుల్లో దాన్ని 'కామరాజ్‌ పథకం' పేరుతో పిలిచేవారు. కామరాజ్‌ స్థానంలో వచ్చిన అతని అనుచరుడు భక్తవత్సలం సామర్థ్యం లేనివాడే కాక, లౌక్యం లేనివాడు కూడా. ఆ రోజుల్లో బియ్యం కొరత వచ్చింది. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా చేసిన పంపిణీలో అవినీతి జరిగింది. 1964 నాటికి ఆహారధాన్యాల సమస్య తీవ్రమైంది. 1967 ఎన్నికల మ్యానిఫెస్టోలో డిఎంకె తాము అధికారంలోకి వస్తే 'రూపాయికి మూడు పడుల బియ్యం యిస్తామని' వాగ్దానం చేయడంతో ఓట్లు కురిశాయి. అధికారంలోకి వచ్చాక ఆ వాగ్దానం నెరవేర్చలేదన్నది వేరే సంగతి.

భక్తవత్సలం వైఫల్యం బాగా బయటపడినది – డిఎంకె నిర్వహించిన హిందీ వ్యతిరేక ఆందోళనను హ్యేండిల్‌ చేయడంలో! హిందీని జాతీయభాషగా ప్రకటించిన రాజ్యాంగపు 17 వ అధ్యాయం ప్రతులను 1963 నవంబరు 17న బహిరంగంగా దగ్ధం చేస్తామని డిఎంకె ప్రకటించింది. దానికి ఒకరోజు ముందుగా భక్తవత్సలం అణ్నాను అరెస్టు చేసి, జైల్లో పెట్టించాడు. ఆర్నెల్ల శిక్ష పడింది. అతను జైల్లో వుండగానే పెంపుడు తల్లి డిసెంబరు 31న మరణించింది. అణ్నా పెరోల్‌లో బయటకు వచ్చి అంత్యదశలో ఆమె వద్ద వుండి, అంత్యక్రియలు కూడా నిర్వహించాడు. అణ్నాపై ప్రజలకు సానుభూతి పెరిగింది. అది చాలనట్లు చిన్నసామి అనే తిరుచ్చి యువకుడు 1964 జనవరిలో ఆత్మహత్య చేసుకున్నాడు. చావడానికి అయిదు రోజుల ముందు అతను ముఖ్యమంత్రిని కలిసి ''హిందీని మనపై రుద్దడాన్ని వ్యతిరేకించి తమిళాన్ని బతికించడానికి మీరేం చేయలేరా?'' అని దీనంగా అడిగాడు. తర్వాత తనను మంటల్లో కాల్చుకుని చనిపోతూ ఒక లేఖ రాశాడు – ''తమిళమా! నువ్వు బతకడానికి నేను మరణిస్తున్నాను. అణ్నా, యితర డిఎంకె నాయకులు జైలునుంచి బయటకు వచ్చి తమిళాన్ని కాపాడాలని కోరుతూ నన్ను నేను బలి యిచ్చుకుంటున్నాను.'' అని. అతనికి భార్య, రెండేళ్ల కూతురు వున్నారు. చిన్నసామి ఆత్మాహుతిని డిఎంకె పూర్తిగా ఉపయోగించుకుంది. అతని చిత్రపటాన్ని తిరుచ్చిలో ఆవిష్కరించింది. 1967 ఎన్నికలలో అతనిపై ఒక నాటకం తయారుచేసి ప్రచారంలో వుపయోగించుకున్నారు. నెగ్గిన తర్వాత అతనికి ఓ స్మారకచిహ్నాన్ని కట్టారు. 

1964 మేలో జవహర్‌లాల్‌ నెహ్రూ చనిపోయి, లాల్‌ బహాదూర్‌ శాస్త్రి ప్రధాని అయ్యారు. ఆయనకు నెహ్రూ అంత విశాలదృక్పథం లేదు. ఉత్తర ప్రదేశ్‌ నుంచి వచ్చిన శాస్త్రి తీవ్ర హిందీవాది. హిందీయేతర ప్రాంతాల మనోభావాలను పట్టించుకోకుండా 1965 జనవరి 26 నుండి ఇంగ్లీషు స్థానంలో హిందీని రుద్దడానికి నిశ్చయించుకున్నారు. ఒక స్థాయి తర్వాత సెంట్రల్‌ గవర్నమెంటు ఉద్యోగులందరూ విధిగా హిందీ నేర్చుకోవలసినదే. తక్కిన ఉద్యోగుల్లో కూడా హిందీ నేర్చుకున్నవారికి సీనియారిటీ యిస్తారు. అధికార భాషగా హిందీ మాత్రమే వుంటుంది. ఈ నిబంధన హిందీయేతర ప్రాంతాల వారిని విపరీతంగా మండించింది. 1961 ఆగస్టులో దేశంలోని ముఖ్యమంత్రులందరూ కలిసి సమావేశమై దేశఐక్యత కోసం దేశమంతటా త్రిభాషా సూత్రం అమలు చేయాలని తీర్మానం చేశారు. దాని ప్రకారం విద్యార్థులు మాతృభాష, మరో భారతీయభాష ఇంగ్లీషు చదవాలి. దక్షిణాది రాష్ట్రాలలో మూడో భాషగా పొరుగు రాష్ట్రపు భాష కాకుండా హిందీని అమలు చేస్తారు కాబట్టి ఉత్తరాది రాష్ట్రాలవారు మరో భారతీయభాషగా దక్షిణాది భాషల్లో ఏదైనా ఒకటి ఎంచుకుంటే బాగుంటుంది, ఆచరణలోకి వచ్చేసరికి ఏ ఉత్తరాది రాష్ట్రమూ దక్షిణాది భాషను తమ విద్యార్థులకు నేర్పలేదు. (హరియాణాలో మాత్రం కొంతకాలంపాటు తెలుగు నేర్పారు. పొరుగున వున్న పంజాబీని నేర్పినట్లయితే వాళ్లకు ఉపయోగపడేది, కానీ పంజాబీలపై కోపంతో తెలుగు నేర్పారు, కొంతకాలానికి టీచర్లు దొరకలేదంటూ నిలిపివేశారు) రెండో భారతీయ భాషగా సంస్కృతం ప్రవేశపెట్టారు. కొన్నాళ్లకూ టీచర్లు లేరంటూ అదీ ఆపేశారు. ఇంగ్లీషు వ్యతిరేకత ప్రబలిన కొద్దీ ఇంగ్లీషు కూడా ఎత్తివేసి ఏకభాషాసూత్రం – హిందీ మాత్రమే అమలు చేశారు. దక్షిణాది రాష్ట్రాలలో మాత్రం మాతృభాష, ఇంగ్లీషు, హిందీ నేర్పారు. తమిళనాడులో హిందీ కొంతకాలం అమలు చేసి హిందీ వ్యతిరేక ఉద్యమం ఊపందుకున్న తర్వాత స్టేటు సిలబస్‌లో హిందీ ఎత్తివేశారు.

త్రిభాషాసూత్రం అమలు చేయకపోగా యిప్పుడు తమ భాష మాత్రమే రాజభాష చేయడానికి శాస్త్రి నిశ్చయించుకోవడంతో హిందీయేతర రాష్ట్రాలలో నిప్పు ముట్టించినట్లయింది. రాజాజీ తిరుచ్చిలో హిందీవ్యతిరేక సమావేశం ఏర్పరచారు. మద్రాసు, కేరళ, మైసూరు, మహారాష్ట్ర నుండి ప్రతినిథులు వచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ నుండి ఎవరూ వెళ్లలేదు. 'మనం హిందీ నేర్చుకుని వాళ్లను ఆ భాషతోనే ఓడించాలి' అన్నారు ఆంధ్రప్రదేశ్‌ మంత్రి ఒకరు. ఇదెలా సాధ్యమో ఆయనకే తెలియాలి. అణ్నా ఒకసారి రాజ్యసభలో ప్రసంగిస్తూ అన్నారు – ''హిందీ ప్రాంతాల పిల్లలు ఆ భాషను పలురకాలుగా నేర్చుకుంటారు. తలిదండ్రులతో మాట్లాడినపుడు, యిరుగుపొరుగుతో మాట్లాడినపుడు, బజార్లో, పొలాల్లో, కర్మాగారాల్లో, మాటలద్వారా, పాటలద్వారా, సామెతల ద్వారా అడుగడుగునా వారికి హిందీ ఎదురవుతూనే వుంటుంది. జోలపాట నుండి చావుబాజా వరకు వారు వినేది హిందీయే! మరి మా ప్రాంతపు పిల్లలకు…? కేవలం పుస్తకాల్లో వున్నది మాత్రమే చదివి నేర్చుకోవాలి. చదివినదాన్ని ఎలా ఉచ్చరించాలో కూడా ఎరుగరు వాళ్లు. మా పిల్లలు మీ పిల్లలతో  ఎలా పోటీ పడగలరు? హిందీ మీకు వారసత్వంగా వచ్చింది. మేము కష్టపడి నేర్చుకుని ముక్కున పట్టుకోవాలి. పరుగుపందెంలో మా కాళ్లకు బందాలు వేసి పోటీ పడమంటే ఎలా పడగలం? ఇంగ్లీషుకు ప్రత్యామ్నాయంగా దేశమంతటికి అనుసంధాన భాష ఒకటి తయారుకావలసిన అవసరం వుంది, నిజమే. కానీ అది ప్రభుత్వం పూనుకోవడం చేత తయారుకాదు. వివిధప్రాంతాల ప్రజల మధ్య సంపర్కం పెరిగినప్పుడు, సంబంధబాంధవ్యాలు హెచ్చినకొద్దీ ప్రజల్లోంచే అది పుట్టుకువస్తుంది. అప్పటిదాకా మీరు ఓపిక పట్టాలి.''  ఫోటో – లాల్‌ బహదూర్‌ శాస్త్రి

(సశేషం) ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (సెప్టెంబరు 2015) 

[email protected]

Click Here For Archives