ఎమ్బీయస్‌ : తమిళ రాజకీయాలు – 51

ఇది అక్షరసత్యం. హిందీ యీనాడు యీ మేరకైనా వ్యాప్తి చెందిందంటే కారణం,  భిన్నరాష్ట్రాల మధ్య పెరిగిన రాకపోకలు, ఒకరితో మరొకరు కలిసి పనిచేసే అవసరం కల్పించిన వాణిజ్య, వ్యాపార, ఉద్యోగపరమైన పరిస్థితులు. ఈనాడు పొరుగు…

ఇది అక్షరసత్యం. హిందీ యీనాడు యీ మేరకైనా వ్యాప్తి చెందిందంటే కారణం,  భిన్నరాష్ట్రాల మధ్య పెరిగిన రాకపోకలు, ఒకరితో మరొకరు కలిసి పనిచేసే అవసరం కల్పించిన వాణిజ్య, వ్యాపార, ఉద్యోగపరమైన పరిస్థితులు. ఈనాడు పొరుగు రాష్ట్రాలలో పని చేసే చాలామందికి హిందీలో వర్కింగ్‌ నాలెజ్‌ ఏర్పడింది. కానీ పోటీ పరీక్షల్లో హిందీ భాషీయులతో పోటీ పడేందుకు అది ఏ మాత్రం చాలదు. కొన్ని దశాబ్దాలు గడిచాక పరిస్థితి మారవచ్చేమో తెలియదు. ఏది ఏమైన ఒప్పుకోవలసిన విషయం ఏమిటంటే – హిందీ వ్యాప్తికి దోహదపడినవి హిందీ సినిమాలు, వాటిలో పాటలు, హిందీపై యితరులకు అసహ్యాన్ని కలిగించినది – హిందీవాదులు! అణ్నా వాదనకు హిందీ భాషోన్మాదుల వద్ద సమాధానం లేదు. హిందీని వ్యతిరేకిస్తే నువ్వు దేశద్రోహివి, విచ్ఛిన్నకరశక్తివి. వీరిలో చాలామందికి దక్షిణాది భాషలెన్నో కూడా తెలియదు. కానీ దేశఐక్యత గురించి ఉపన్యాసాలు దంచుతారు. (ఈ సందర్భంలో ఒక విషయం చెప్పాలి – తెలుగువాళ్లు ఎన్నో హిందీ రచనలను అనువదించుకుని హిందీ సాహిత్యం గురించి తెలుసుకుంటారు. స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లవుతున్నా తెలుగు నేర్చుకుని తెలుగు రచనను హిందీలోకి అనువదించిన ఒక్క హిందీ భాషీయుడు లేడు. హిందీలో కనబడే తెలుగు పుస్తకాల అనువాదాలు చేసేది హిందీ నేర్చుకున్న తెలుగువారు మాత్రమే! సహజంగానే వారు హిందీ సాహిత్యరంగంలో ప్రముఖులు కారు. వారి అనువాదాలు ఖ్యాతి నొందవు. అందువలన తెలుగులో ఎంత గొప్ప రచన వచ్చినా హిందీ వారి కంటికి ఆనదు. పివి నరసింహారావుగారు రాజకీయంగా ప్రముఖుడు కాబట్టి ఆయన ''సహస్ర ఫణ్‌'' (''వేయిపడగలు''కు హిందీ అనువాదం) గురించి కొందరు హిందీవారు విని వుండవచ్చు)

ఇతర ప్రాంతాలకు వెళ్లి తమ ఇంగ్లీషు ప్రావీణ్యంతో ఉద్యోగాలు తెచ్చుకోవడంలో దిట్టలైన తమిళులకు యికపై తమ ఇంగ్లీషు ఎందుకూ కొరగాకుండా పోతుందని, హిందీ రాకపోవడం చేత ఎంత కష్టపడినా, ఎంత అణకువగా వున్నా ఉద్యోగాలు దక్కవని అర్థం కావడంతో కడుపు రగిలింది. విద్యార్థులు, నిరుద్యోగులు ఆందోళనకు గురయ్యారు. దీన్ని డిఎంకె చక్కగా వుపయోగించుకుంది. ఇంగ్లీషును తొలగించేస్తానన్న 1965 జనవరి 26ను శోకదినంగా పరిగణిస్తామని, నల్లజండాలతో ప్రదర్శనలు నిర్వహిస్తామని ప్రకటించింది. హిందీ పట్ల తన ప్రజల భయాందోళనలను సరిగ్గా అంచనా వేయలేక భక్తవత్సలం 'ఇది దేశద్రోహం, దీన్ని అణచివేస్తాం' అని ప్రకటించాడు. జనవరి 25 న అణ్నాను, తక్కిన డిఎంకె నాయకులను మర్నాడు  జైల్లో పెట్టించాడు. ఇక దానితో ఉద్యమం విద్యార్థుల చేతిలోకి వెళ్లిపోయింది. 50 వేల మంది విద్యార్థులు తమంతట తామే ఊరేగింపుగా ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి, స్కూళ్లలో నుంచి హిందీ తొలగించమని అర్జీ అందించబోయారు. కానీ భక్తవత్సలం మూర్ఖంగా వారిని కలవడానికి నిరాకరించడమే కాక, వారిపై లాఠీ చార్జి చేయించాడు. బాష్పవాయు ప్రయోగం చేయించాడు. వందలాది విద్యార్థులు గాయపడినా చలించకుండా 'వాళ్లు స్కూళ్లు, కాలేజీలు మానేస్తే ప్రభుత్వానికి ఖర్చు మిగులుతుంది' అన్నాడు. ఈ పిచ్చి చేష్టలు కాంగ్రెసుకు ఎంత అపకారం కలిగించాయంటే 1967 ఎన్నికల సమయంలో చాలామంది విద్యార్థులు ఓటర్ల కాళ్లపై పడి 'మా బతుకులను నాశనం కాకుండా, నిరుద్యోగులుగా మిగలకుండా వుండాలంటే కాంగ్రెసును ఓడించండి' అని ప్రార్థించారు.

ఇక ఆ తర్వాత ప్రదర్శనలు, బస్సు దహనాలు, ఆత్మహత్యల పర్వం ప్రారంభమైంది. హిందీని బలవంతంగా రుద్ది మా భవిష్యత్తు నాశనం చేయడం ఆపాలి అనే నినాదంతో ఒకరి తర్వాత మరొకరు పెట్రోలు పోసుకుని తగలబెట్టుకోవడమో, పురుగుల మందు తాగడమో చేయసాగారు. వీటిపై వ్యాఖ్యానిస్తూ భక్తవత్సలం 'హిందీ అమలు చేస్తే వీళ్లకేం నష్టం? వీళ్లు దరిద్రం చేత అత్మహత్య చేసుకుంటున్నారేమో, లేకపోతే ఎవరైనా వీళ్లను చంపేసి, ఆత్మహత్యలుగా చిత్రీకరిస్తున్నారేమో' అన్నాడు. దాంతో విద్యార్థులు, యువత మరింత మండిపడ్డారు. డిఎంకె ముఖ్యమంత్రి రాజీనామా కోరింది. 'నేను ఎప్పుడు గద్దె దిగాలో నిర్ణయించేది మీరు కాదు, నేనే' అన్నాడు భక్తవత్సలం. తమిళనాడులో జరుగుతున్న ఆందోళన, ఆ సందర్భంగా వెలికివచ్చిన వాదనలు యితర రాష్ట్రాల ప్రజలను కూడా మేల్కొల్పాయి. కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లలో ఆందోళనలు జరిగాయి. నెల్లూరులో పోలీసు కాల్పులు జరిగి యిద్దరు చనిపోయారు. బెంగాల్‌, అసాంలలో కూడా ప్రదర్శనలు జరిగాయి. ఇవన్నీ చూసి ఆ యా రాష్ట్రాల కాంగ్రెసు నాయకులకు గుబులు పుట్టింది. మైసూరు ముఖ్యమంత్రి నిజలింగప్ప బెంగుళూరులో ఒక సమావేశం ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్‌ నుండి సంజీవరెడ్డిని, కామరాజ్‌ను, బెంగాల్‌ కాంగ్రెసు అధ్యక్షుడు అతుల్య ఘోష్‌ను ఆహ్వానించి మంతనాలు జరిపాడు. అందరూ కలిసి హిందీకి అంతటి ప్రాధాన్యత యిస్తే దేశవిచ్ఛిత్తి ఖాయం అని కేంద్రాన్ని హెచ్చరించారు. కానీ కేంద్రప్రభుత్వంలో నాయకులందరూ హిందీ ఉన్మాదులే. ద్వితీయ స్థానంలో వున్న మొరార్జీ దేశాయి 'అసలు 1950లలోనే హిందీకి యీ స్థానం దక్కాల్సింది, నెహ్రూ కారణంగా ఆలస్యమైంది. హిందీని వ్యతిరేకించే పొరపాటు చేయవద్దని మీరు మీ ప్రజలకు నచ్చచెప్పండి.' అని వీళ్లకు హితవు చెప్పాడు. హోం మంత్రిగా వున్న గుల్జారీలాల్‌ నందా మరో హిందీవాది. 'కుర్రాళ్ల ఆందోళనలు చూసి చలించకుండా మేరుపర్వతంలా నిలబడ్డావ్‌' అంటూ భక్తవత్సలంను మెచ్చుకున్నాడు. 

దీనితో కాబినెట్‌లో వున్న తమిళ మంత్రులు సుబ్రహ్మణ్యం, అలగేశన్‌లకు చిర్రెత్తింది. రాజీనామా చేస్తామన్నారు. పాకిస్తాన్‌ యుద్ధవిజయం కారణంగా తర్వాతి రోజుల్లో శాస్త్రికి పేరు వచ్చింది కానీ ఆయన పరిపాలనాకాలంలో నెహ్రూ వారసుడిగా తగడు అనిపించుకున్నాడు. ఏం చేయాలో పాలుపోలేదు, హిందీపై వెనక్కి తగ్గడమూ యిష్టం లేదు. నెహ్రూపై అపారమైన గౌరవం వున్న హిందీయేతర నాయకులు నెహ్రూ కూతురిగా కాబినెట్‌ మంత్రిగా వున్న నువ్వేమీ చేయలేవా? అని ఇందిరపై ఒత్తిడి తెచ్చారు. ఆమె మద్రాసు వెళ్లి పరిస్థితి గమనించి వచ్చి కాబినెట్‌ సమావేశంలో 'మద్రాసు ప్రజలు అవమానభారంతో మండిపడుతున్నారు. ఉపేక్షిస్తే ప్రమాదమే' అని చెప్పింది. అప్పటిదాకా తటపటాయిస్తున్న తమిళ మంత్రులిద్దరూ 'ఇంగ్లీషు కొనసాగింపుకు రాజ్యాంగబద్ధమైన హామీ' డిమాండ్‌ చేస్తూ ఫిబ్రవరి 11న రాజీనామాలు శాస్త్రి చేతికి యిచ్చారు. ఆమోదించేయండి, పీడా వదిలిపోతుంది అన్నారు కాబినెట్‌లో హిందీవాదులు. ఆమోదించమని శాస్త్రి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ సిఫార్సు చేశారు. అప్పుడు ఆయన శాస్త్రిని పిలిచి ''దేశం నుంచి తమిళప్రాంతం విడిపోవాలనుందా? మీ సిఫార్సు వెనక్కి తీసుకుంటే మంచిది'' అని హితవు చెప్పారు. అప్పటికే ఆత్మహత్యలు, పోలీసు కాల్పుల్లో చనిపోయినవారు కలిపి హిందీ మరణాల సంఖ్య 60కి చేరింది. అప్పుడు శాస్త్రి తన సిఫార్సును వెనక్కి తీసుకోవడమే కాక, నెహ్రూ యిచ్చిన హామీని పునరుద్ధరించవలసి వచ్చింది. రేడియోలో ప్రసంగిస్తూ 'సివిల్‌ సర్వీసెస్‌కు హిందీ నిర్బంధం కాదని, యిదివరకటిలాగే పరీక్షలు ఇంగ్లీషులో నిర్వహించబడతాయని' హామీ యిచ్చారు. 1965 ఫిబ్రవరి నాటి కాంగ్రెసు వర్కింగ్‌ కమిటీ సమావేశంలో అన్ని ప్రాంతీయ భాషల్లో సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలు జరపాలని ప్రతిపాదించారు. వీటివలన హిందీయేతర ప్రాంతాల్లో ఆందోళన చల్లారింది కానీ తమిళ రాష్ట్రంలో మాత్రం కాంగ్రెసుకు మృత్యుఘంటికలు మోగడం ఆగలేదు. తమిళులు కాంగ్రెసును ఉత్తరాది పార్టీగా చూసి, మళ్లీ ఎన్నడూ పట్టం కట్టలేదు. ఫోటో – భక్తవత్సలం (సశేషం)

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (సెప్టెంబరు 2015) 

[email protected]

Click Here For Archives