ఆ పై నెలలో అణ్నాకు అన్నామలై యూనివర్శిటీ గౌరవ డాక్టరేటు ప్రదానం చేసింది కానీ ఆ సభకు వెళ్లడానికి ముందే చేయించుకున్న వైద్యపరీక్షల్లో అణ్నాకు కాన్సర్ వున్నట్లు తేలింది. పొగాకు నమిలే అలవాటు కారణంగానే అణ్నాకు కాన్సర్ సోకింది. అంతకు ఏడేళ్ల క్రితమే అతనికి మెడమీద కణితి వచ్చింది. దాన్ని తీసేశారు కానీ కాన్సర్ ను తొలగించలేకపోయారు. వెంటనే అమెరికాలోని న్యూయార్కుకి తీసుకెళ్లి డా|| మిల్లర్ అనే ఆయన చేత ఆపరేషన్ చేయించారు. నవంబరులో తిరిగి వచ్చాడు. డాక్టరు విశ్రాంతి తీసుకోమని చెప్పాడు కానీ అది సాధ్యపడలేదు. 1969 జనవరి 20న అణ్నా స్పృహ తప్పాడు. అడయారు కాన్సర్ హాస్పటల్‌లో చేర్చారు. అమెరికా నుంచి డా|| మిల్లర్‌ను, అతని అసిస్టెంటును రప్పించారు. అణ్నాకు మరో ఆపరేషన్ జరిపించారు. ఈ ఖర్చంతా ఇండియన్ ఎక్స్‌ప్రెస్ అధినేత రామనాథ్ గోయెంకా భరించాడు. ఆపరేషన్ తేదీని ఒక రోజు వాయిదా వేయమని అణ్నా కోరాడు. ఎందుకని డాక్టరు అడిగితే ''మేరీ కరోలీ రాసిన ''ద మాస్టర్ క్రిస్టియన్'' పుస్తకం చదువుతున్నాను. రేపు సాయంత్రానికి పూర్తయిపోతుంది. ఆ తర్వాత నేను పోయినా ఫర్వాలేదు.'' అన్నాడు. అణ్నా పుస్తకప్రియత్వానికి డాక్టరు ఆశ్చర్యపడ్డాడు. ఆపరేషన్ జరిగింది. జరిగిన వారానికి 1969 ఫిబ్రవరి 3న అణ్నా చనిపోయాడు. అంత్యక్రియలకు రికార్డు స్థాయిలో లక్షలాది జనం విరగబడ్డారు. అణ్నా పార్థివదేహాన్ని చూసేందుకు ఎగబడడంలో 5గురు మరణించారు, 200 మంది గాయపడ్డారు. అదుపు చేసే పోలీసుల కాల్పుల్లో ఒకరు పోయారు. అప్పటికే బట్టతల ప్రారంభం కావడంతో సాధారణంగా టోపీ లేకుండా బయట కనబడని ఎమ్జీయార్ టోపీ లేకుండానే వూరేగింపులో పాల్గొన్నాడు. అణ్నా ఆస్తులేమీ కూడబెట్టలేదు. కుటుంబానికి ఆదాయం అంతంత మాత్రమే. జయలలిత ముఖ్యమంత్రి అయ్యాక ఆయన రచనలన్నిటినీ ప్రభుత్వం తరఫున కొనుగోలు చేసి రాయల్టీగా రూ.75 లక్షలు యిప్పించింది.
అప్పట్లో చికిత్స లేని కాన్సర్‌కు అణ్నా గురయ్యాడని తెలియగానే ఆయన వారసుడెవరన్న ప్రశ్న వచ్చింది. కాబినెట్‌లో ద్వితీయ స్థానంలో వుండి, అణ్నా విదేశాలు వెళ్లినపుడు తాత్కాలిక ముఖ్యమంత్రిగా పనిచేసిన నెడుంజెళియన్‌కే ఛాన్సుందని అందరూ అనుకున్నారు. నెడుంజెళియన్ మేధావి, నడిచే విజ్ఞానసర్వస్వంగా అణ్నాచే ప్రశంసింపబడినవాడు, గొప్ప వక్త, నిజాయితీపరుడే కానీ కరుణానిధిలా కార్యసాధకుడు కాదు. కరుణానిధి జిల్లా కార్యదర్శులను మచ్చిక చేసుకున్నాడు. జిల్లాలలో తన నాటకాలు ప్రదర్శింపచేసి, దానిపై వచ్చిన ఆదాయంలో కొంత భాగాన్ని వారిని తీసుకోమనేవాడు. ఎన్నికలలో తనకు కావలసిన అభ్యర్థులకు టిక్కెట్లు యిప్పించుకోవడంలో, వారిని గెలిపించుకునేందుకు ప్రణాళికలు రచించడంలో కరుణానిధి దిట్ట. నీతి గురించిన చాదస్తాలు లేవు. పార్టీ కోశాధికారిగా నిధుల సేకరణ, వితరణ అతని చేతులమీదుగానే జరిగేది. తను తిని, పదిమందికి పెట్టగల సమర్థుడు. ఇవన్నీ తెలిసిన అణ్నా తన ఆదర్శాలకు విరుద్ధంగా నడిచే కరుణానిధియే తన వారసుడిగా ఎన్నికవుతాడని, అధికారానికి మరిగిన యితర నాయకులు నెడుంజెళియన్‌ను పక్కన పెట్టేస్తారని గ్రహించి, కరుణానిధి నా వారసుడు అని నోరారా చెప్పడం యిష్టం లేక మౌనంగా వున్నాడు. అణ్నా మరణం తర్వాత కరుణానిధి ఆయన్ని కీర్తిస్తూ పెద్ద గేయం రాసి, దాన్ని గ్రామఫోను రికార్డుగా విడుదల చేయించి, ద్రవిడోద్యమంలో ఆ గేయాలాపనను భాగం చేశాడు. ఆ విధంగా తనే అణ్నాకు సన్నిహితుడనన్న భావం ప్రజల్లో నాటుకునేట్లు చేశాడు. ఎమ్జీయార్ చనిపోయినపుడు జయలలిత యిలాగే గంటల తరబడి అతని శవం వద్ద కదలకుండా నిలబడి అతని వారసురాలిగా ప్రజల్లో ముద్ర వేయించుకుంది.
అణ్నా తదనంతరం కరుణానిధి ముఖ్యమంత్రి కావడానికి ఎమ్జీయార్ సాయపడ్డాడు. తన మద్దతు బహిరంగంగా ప్రకటించాడు. దానితో పార్టీ జనరల్ కౌన్సిలులోని 383 సభ్యులుంటే వారిలో 300 మంది కరుణానిధి పక్షాన నిలబడ్డారు. నెడుంజెళియన్ పోటీ నుంచి తప్పుకున్నాడు. కరుణానిధి మూలాల గురించి, రాజకీయంగా ఎదిగిన విధానం గురించి యీ సీరీస్ 1 నుండి 14 భాగాల్లో చదవవచ్చు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కరుణానిధి పార్టీపై కూడా పట్టు బిగించాడు. అందరూ తన కనుసన్నల్లో నడిచేట్లే చూసుకున్నాడు. అతని గురించి అందరూ చెప్పే జోక్ లాటి నిజం ఏమిటంటే – కరుణానిధి ఏ కార్యకర్తనైనా తలకిందులుగా నిలబడు అని ఆజ్ఞాపిస్తే అతను 'ఎందుకు?' అని అడగడట, 'ఏ మూల?' అని మాత్రమే అడుగుతాడట. హద్దుల్లేని యీ అధికారం కరుణానిధికి తలకెక్కింది. పార్టీ అంతా తన వలననే నడుస్తోందని, తను కాక వేరే ఏ నాయకుడూ వుండకూడదనీ తలపోశాడు. నానాటికీ పెరుగుతున్న ఎమ్జీయార్ పలుకుబడి చూసి అసూయతో రగిలి తనకు అండగా నిలచిన అతనితో కూడా చెడగొట్టుకున్నాడు. 1971లో మధురైలో పార్టీ మహానాడు జరిగింది. లక్షమంది వచ్చారు. డిఎంకె సమావేశాలన్నిటిలో పది, పన్నెండుమంది వక్తలుంటారు. అందరూ పెద్దపెద్ద విశేషణాలతో నాయకుణ్ని స్తుతిస్తారు. చివరిగా కరుణానిధి ప్రసంగిస్తాడు. అమోఘమైన తన వక్తృత్వంతో అందర్నీ ఆకట్టుకుంటాడు. కానీ ఆ రోజు ఎమ్జీయార్ ప్రసంగం ముగియగానే జనాలు కరుణానిధి ఉపన్యాసం గురించి వేచి చూడకుండా చాలామంది జనాలు లేచి వెళ్లిపోయారు. అది చూసి కరుణానిధి నివ్వెరపోయాడు. తన ప్రసంగంలో తడబడ్డాడు.
కరుణానిధి ముఖ్యమంత్రి అయిన రెండేళ్లకే 1971లో ఎన్నికలు వచ్చాయి. ఎన్నికల ప్రచారంలో ఎమ్జీయార్‌ని దింపకుండా కేవలం తన మొహం చూపించే గెలవాలని కరుణానిధి అనుకున్నాడు. డిఎంకె ఎలాగూ గెలుస్తుందని, ఎమ్జీయార్ కూడా ప్రచారంలో వుంటే ఆ ఖ్యాతిని అతనితో కలిసి పంచుకోవాల్సి వస్తుందని అతని అంచనా. కాంగ్రెసు తరఫున కామరాజ్ ప్రచారం చేస్తూ డిఎంకె గెలవదని, గెలిచినా అతి స్వల్ప మెజారిటీతో గెలుస్తుందని అన్నాడు. అది విని కొందరు డిఎంకె నాయకులు భీతిల్లారు. కరుణానిధికి నచ్చచెప్పి ఎమ్జీయార్‌ని ప్రచారంలోకి దింపారు. అతను 15 రోజుల పాటు రాష్ట్రమంతా తిరిగి డిఎంకెకు ఓట్లు తెచ్చిపెట్టాడు. అలా చేసినా కనీసం 100 నియోజకవర్గాలలో డిఎంకెకు వచ్చిన మెజారిటీ 2 వేలు మాత్రమే. ఎమ్జీయార్ భాగస్వామ్యం లేకపోతే డిఎంకె ఓటమి అంచుల్లో వుండేదనే అనుకోవాలి. ఈ విషయాన్ని ఎమ్జీయార్ కూడా గ్రహించాడు. అందుకే తను చెప్పినవారికి మంత్రివర్గంలో పదవులు యివ్వాలని ఆశించాడు. పార్టీలో అతని హోదా కోశాధికారి కానీ, నిధుల నిర్వహణంతా కరుణానిధి చేతుల్లోనే వుండేది. కనీసం కొందరు మంత్రులు తన చెప్పుచేతల్లో వుండాలని ఆశించాడు. కానీ కరుణానిధికి అలా యిచ్చే ఉద్దేశం ఏ కోశానా లేదు. తన అనుచరులతోనే కాబినెట్ నింపాడు. తను రాసిన శక్తిమంతమైన డైలాగులు తెరపై చెప్పి సూపర్‌మ్యాన్ యిమేజి తెచ్చుకున్న ఎమ్జీయార్ తనకు యీ రోజు ప్రతిద్వంద్వి కావడం సహించలేకపోయాడు. తన యింటి నుంచే ఒక హీరోని తయారుచేసి ఎమ్జీయార్‌కు పోటీగా నిలబెట్టి, అతన్ని పడగొట్టాలని నిశ్చయించుకున్నాడు. తన యింట్లో అతనికి తారగా కనబడినది – కొడుకు ము.క. ముత్తు! (సశేషం)
-ఫోటో – అణ్నా శవం వద్దకు అతడి తల్లిని తెస్తున్న ఎమ్జీయార్, అణ్నా అంతిమయాత్ర
-ఎమ్బీయస్ ప్రసాద్