ఎడిఎంకె పార్టీ ఏర్పరచిన 8 నెలలకే దానికి అగ్నిపరీక్ష ఎదురైంది. దిండిగల్‌లో పార్లమెంటు సీటు ఖాళీ అయి ఉపయెన్నిక వచ్చిపడింది. అప్పటికే కాంగ్రెసు రెండుగా విడిపోయింది. తమిళనాడులో కామరాజ్ వంటి మేరునగం పాతకాంగ్రెసు పక్షానికి పెద్దదిక్కుగా వున్నాడు. ఆ పార్టీ తరఫున సీతన్ నిలబడగా, డిఎంకె తరఫున ముత్తురామలింగం నిలబడగా, ఎమ్జీయార్ తన పార్టీ తరఫున మాయా తేవర్ అనే అతన్ని నిలబెట్టాడు. వీరితో బాటు ఇందిరా కాంగ్రెసు తరఫున ఒక అభ్యర్థి నిలబడ్డాడు. అయితే ఎమ్జీయార్ ఎన్నికలపై దృష్టి పెట్టడానికి వీలు లేకుండా కరుణానిధి ఒక పన్నాగం పన్నాడు. ఎమ్జీయార్ తనకున్న యావదాస్తి వెచ్చించి అష్టకష్టాలు పడి మూడేళ్లగా విదేశాలలో తీసిన మూడు గంటల భారీ సినిమా ''ఉలగం సుట్రుమ్ వాలిబన్'' రిలీజు కాకుండా అడ్డుపడ్డాడు. రాష్ట్రంలో థియేటర్లు దొరక్కుండా చేశాడు. సినిమాను ఆడించడానికి సిద్ధపడిన సినిమాహాలు యజమాన్లను డిఎంకె పార్టీ కార్యకర్తలు బెదిరించసాగారు. దాంతో సినిమా రిలీజు ఆలస్యమై పోయింది. 1973 మే 20 న ఎన్నికైతే చివరకు 10 రోజుల ముందు తన పక్షాన నిలిచిన హాలు ఓనర్ల సహాయంతో సినిమా రిలీజు చేయించుకోగలిగాడు. సినిమా సూపర్‌డూపర్ హిట్టయింది. ఎమ్జీయార్ ఆనందానికి మేర లేకపోయింది. తను పార్టీ నుంచి బయటకు వచ్చేసినా సినిమా ప్రేక్షకులు తనను ఆదరిస్తూనే వున్నారని అర్థం చేసుకున్నాడు.
దిండిగల్ ఉపయెన్నికలో ప్రచారం చేసిపెట్టమని తన అభిమాన సంఘాల వారిని కోరాడు. వారంతా కష్టపడి పనిచేశారు. ఫలితాలు వచ్చాయి. మొత్తం 5 లక్షల ఓటర్లలో ఎడిఎంకెకు 2.60 లక్షలు రాగా, కామరాజ్ కాంగ్రెసుకు 1.19 లక్షలు, తృతీయ స్థానంలో వచ్చిన డిఎంకెకు 93 వేలు వచ్చాయి. ఎడిఎంకెకు వచ్చిన ఓట్లలో దాదాపు మూడోవంతు మాత్రమే తన పార్టీకి రావడంతో కరుణానిధికి షాక్ తగిలింది. కామరాజ్ పార్టీని దెబ్బ కొట్టడానికై ఇందిరా కాంగ్రెసు తన ఓట్లను ఎడిఎంకెకు బదిలీ చేసిందంటారు. అందుకే వాళ్ల అభ్యర్థికి 11 వేల ఓట్లు వచ్చాయి. ఇంకో 9 నెలలు గడిచేసరికి ఈ ఏర్పాటు బెడిసి కొట్టింది. 1974 ఫిబ్రవరిలో కోయంబత్తూరు అసెంబ్లీ నియోజకవర్గానికి ఎన్నిక జరిగింది. ఈసారి ఎడిఎంకె అభ్యర్థికి కామరాజ్ కాంగ్రెసు కంటె కేవలం 517 ఓట్లు మాత్రం ఎక్కువ వచ్చాయి. దీనిలో కూడా మూడో అభ్యర్థిగా వచ్చిన డిఎంకెకు కాంగ్రెసు కంటె 8,700 ఓట్లు తక్కువ వచ్చాయి. డిఎంకె ప్రభ కొడిగడుతోందని అందరికీ అర్థమైంది.
ఈ ఓటములు కరుణానిధిలో కసి రగిలించాయి. ఎమ్జీయార్ మూలాలపై దాడి ఆరంభించాడు. అతను శ్రీలంకలో పుట్టిన మలయాళీ అని, తమిళులకు నాయకుడిగా పనికిరాడని ప్రకటించాడు. 'మలయాళీలు తమిళనాడుపై పెత్తనం చలాయిస్త్తున్నారని, దక్షిణ భారతంలో రెండు కేరళలను అనుమతించమని' కరుణానిధి అసెంబ్లీలో ప్రకటించారు. వెంటనే డిఎంకె కార్యకర్తలు 'తమిళ ప్రొటెక్షన్ ఫోర్స్' అనే పేర ఒక సంస్థగా ఏర్పడి, సైకిలు చైన్లు, సోడా సీసాలు, కత్తులు చేతపట్టి ఎమ్జీయార్ సినిమాలు ఆడే థియేటర్ల మీదనే కాదు, రోడ్డు పక్క మలయాళీలు నడిపే టీస్టాల్స్, దుకాణాలపై కూడా దాడి చేశారు. అది డిఎంకెకు చాలా చెఱుపు చేసింది. ఇన్నాళ్లదాకా ఎమ్జీయార్‌ను కీర్తించిన డిఎంకె హఠాత్తుగా యిప్పుడు 'ఎమ్జీయార్ మలయాళీ, విదేశీయుడు' అంటూ మాట్లాడడంతో సామాన్య ప్రజలు నివ్వెరపోయారు. ఈ దాడులను నిరసించారు. . తను మలయాళీయా కాదా అన్న విషయంపై ఎమ్జీయార్ 'నేను ఎక్కడ పుట్టినా ఓనమాలు దిద్దినది తమిళంలోనే.., బాల్యం నుంచి పెరిగినదీ, తనను పెంచిపోషించినదీ తమిళనాడే' అని చెప్పుకున్నాడు. ఆ మాటకొస్తే కరుణానిధి తమిళుడు కాడని, అతని మాతృభాష తెలుగని, అతని 5 వ క్లాసు సర్టిఫికెట్టులో మాతృభాష తెలుగుగా నమోదైంది చూసుకోమని ఛాలెంజ్ చేశాడు. తమిళులు యీ మూలాల గురించిన చర్చలోకి వెళ్లలేదు. తమిళం గురించి వీళ్లు చేసిన సేవలనే పరిగణనలోకి తీసుకున్నారు.
ఎన్నికలలో విజయాలు, డిఎంకెతో అసంతృప్తి చెందిన నాయకులు వచ్చి తన పార్టీలో చేరడాలు ఎమ్జీయార్‌లో ఉత్సాహాన్ని నింపాయి. వరుసగా సినిమాల్లో వేస్తూ పోయాడు. ''ఉలగం..'' తర్వాత 1977లో ముఖ్యమంత్రి అయ్యేవరకు దాదాపు 20 సినిమాలు వేశాడు. అన్నిట్లో తన పార్టీ జండాను చూపిస్తూ, తన పార్టీ ఆశయాలను ప్రచారం చేశాడు. ''యాదోంకీ బారాత్'', ''సచ్చా ఝూఠా'', ''జంజీర్'', ''దో ఆంఖే బారా హాత్'', వంటి అనేక హిందీ సినిమాలను తమిళంలో రీమేక్ చేస్తూ సబ్జక్ట్‌తో సంబంధం లేకుండా పెట్టిన పేర్లు (తెలుగులో) చూడండి. ''రేపు మనదే'', ''తలచుకున్నది చేసేవాడు'' ''నవ్వు వర్ధిల్లాలి'', ''పదికాలాలపాటు వర్ధిల్లండి''. ఇవే కాదు, కొన్ని యితర సినిమాల పేర్లు కూడా గమనిస్తే ''శంఖారావం'', ''మంచి సమయం'', ''అన్నం పెట్టే చెయ్యి'', ''హక్కులకై నినాదం'', ''జాలర్ల మిత్రుడు'', ''నిన్న-నేడు-రేపు'', ''నీతికి తలవంచు'', ''ఊరికి ఉపకారి'', ''ఉపకారం చేసే చేతులు'',.. యిలా వున్నాయి. తన పక్కన హీరోయిన్లగా చిన్న వయసులో వున్న తారలను వేసుకునేవాడు. హిందీ నుంచి రాధూ సలూజాను కూడా రప్పించి ఒక సినిమాలో వేయించాడు. వీటిలో చాలా సినిమాలు బాగా ఆడాయి. అయితే అతని ఆఖరి సినిమా ''మధురై గెలిచిన సుందరపాండ్యన్'' ఫ్లాపయింది. అది అతన్ని బాధించింది. ముఖ్యమంత్రిగా వుంటూనే మళ్లీ సినిమాల్లో వేద్దామనుకున్నాడు. ''నాన్ ఉణ్నై విడమాట్టేన్'' (నేను నిన్ను విడిచిపెట్టను) అని ఆ సినిమాకు పేరు కూడా ప్రకటించాడు. కానీ కుదరలేదు.
సినిమాలలో యిలా రాణిస్తూనే రాజకీయంగా ఉద్యమం చేస్తూ ముందుకు పోయాడు. కరుణానిధిపై అవినీతి ఆరోపణలు గుప్పిస్తూ కేంద్రప్రభుత్వానికి మహజర్లు యిస్తూ పోయాడు. అప్పట్లో ఇందిరా గాంధీ ప్రధానమంత్రి. 1975లో కామరాజ్ మరణం తర్వాత కూడా తమిళనాడులో తన పార్టీ పెద్దగా పుంజుకోవటం లేదన్న బాధ వుంది. డిఎంకె, ఎడిఎంకెలలో ఎవరో ఒకర్ని మంచి చేసుకుంటే బాగుంటుందనే ఆలోచన వుంది. డిఎంకెతో మంచి చేసుకోవడం అసాధ్యంగా తోచింది. ఎందుకంటే ఎమర్జన్సీ విధించాక కరుణానిధి మరింత కొరకరాని కొయ్య అయిపోయాడు. అరెస్టు తప్పించుకుని అజ్ఞాతవాసం చేస్తున్న జార్జి ఫెర్నాండెజ్ వంటి ప్రతిపక్ష నాయకులందరికి తమిళనాడులో ఆశ్రయం యిచ్చాడు. పైగా ఎమర్జన్సీని బాహాటంగా వ్యతిరేకించి, ఎద్దేవా చేశాడు. ''ఇరవై సూత్రాల పథకం తమిళనాడులో అమలు కావటం లేదు'' అని ఇందిర ఆరోపిస్తే ''..ఎందుకంటే యివన్నీ యీవిడకు యిప్పుడు గుర్తుకు వచ్చాయి. తమిళనాడులో ఎన్నో ఏళ్లగా యిటువంటి పథకాలు అమలు చేస్తున్నాం'' అని ఎదురుదెబ్బ కొట్టాడు. ఒక రాజకీయనాయకురాలి జీవితంపై తీసిన''ఆంధీ'' అనే హిందీ సినిమా ఉత్తరాదిన కొంతకాలం ఆడింది. అయితే మద్రాసులో ఆ సినిమా ఆడే థియేటర్ల వద్ద 'తెరపై ఇందిరా గాంధీ జీవితం..' అనే కటౌట్స్ పెట్టారు. ఇవన్నీ ఇందిరను మండించాయి. సినిమాను నిషేధించింది. చివరకు ఎమర్జన్సీ విధించిన ఏడు నెలలకు 1976 జనవరిలో 356 ఆర్టికల్ కింద కరుణానిధి ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించింది. అప్పణ్నుంచి ఎమర్జన్సీని తమిళనాడులో కూడా అమలు చేసింది. కరుణానిధి అవినీతి ఆరోపణలపై సర్కారియా కమిషన్ వేసింది. (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (అక్టోబరు 2015)