ఎమ్జీయార్ వారసురాలినని చెప్పుకుని అధికారంలోకి వచ్చినా జయలలితకు ఎమ్జీయార్‌కు చాలా విషయాల్లో పోలిక లేదు. ఎమ్జీయార్ తర్వాతి రోజుల్లో హీరో అయినా, చిన్నప్పుడు కటికదరిద్రం అనుభవించాడు. పేదల పట్ల చాలా కరుణ చూపేవాడు. శత్రువుల పట్ల ఔదార్యం చూపిన సంఘటనలు ఎన్నో వున్నాయి. జనం మధ్యలో మసలడం, వారిని కౌగలించుకోవడం, వాటేసుకోవడం, ఆత్మీయత కురిపించడం – యివన్నీ సహజంగా చేసేవాడు. తనెంత డబ్బు సంపాదించినా అతి సింపుల్‌గా తెల్ల లుంగీ, తెల్ల చొక్కా, తెల్ల టోపీ, శాలువాతో తిరిగేవాడు. రంగురంగు దుస్తులన్నీ సినిమాకే పరిమితం. జయలలితలో యీ లక్షణాలు లేవు. ఆమె చిన్నప్పటినుంచి దర్జాగానే బతికింది. పేదలతో తిరిగే అవసరం ఎప్పుడూ పడలేదు. ఆకలిదప్పులు తెలియవు. మామూలు ప్రజలతో మసలడం ఎలాగో తెలియదు. పాతికేళ్ల రాజకీయానుభవం తర్వాత, పోరాటం తర్వాత ఎమ్జీయార్ ముఖ్యమంత్రి అయ్యాడు. జయలలిత గట్టిగా పోట్లాడినది ఐదేళ్లు కూడా లేదు. ఆమెకు ఆడంబరం హెచ్చు. ముఖ్యమంత్రి అయ్యాక మరీ పెరిగింది. 1995లో తన పెంపుడు కొడుకు పెళ్లంటూ ఆమె చేసిన అట్టహాసం అంతా యింతా కాదు. 1996 ఎన్నికల్లో ఆమె ఓడిపోయాక కరుణానిధి ఆమె పోయెస్ గార్డెన్ యింటిపై దాడి చేయించి, అక్కడి వైభవాన్ని సన్ టీవీ ద్వారా అందరికీ చూపించాడు. వందలాది చెప్పుల జతలు, ఆభరణాలు, దుస్తులు… మాయాబజార్ సినిమాలో కూడా అన్ని చూసి వుండరు ప్రజలు. ఈ ఆడంబర జీవనం ఆమెను ప్రజలకు దూరం చేసింది. ఎమ్జీయార్ పేరు చెప్పుకుని గెలిచిన జయలలిత అధికారంలోకి వచ్చాక ఎమ్జీయార్ బొమ్మను వెనక్కి నెట్టేసి, తన కటౌట్సే పెట్టించసాగింది. ఎన్నికలలో ఓడిపోయి, మళ్లీ అధికారంలోకి రావడానికి చేసే ప్రయత్నంలో మళ్లీ ఎమ్జీయార్ నామస్మరణ మొదలుపెట్టింది.
ఎమ్జీయార్‌కు పార్టీపై పూర్తి పట్టు వుండేది, అతని వ్యవహారశైలి పూర్తిగా ఫ్యూడల్ తరహా. అయినా కొంతమందికి తగు గౌరవం యిచ్చేవాడు. పార్టీలో అతనంటే పడిచచ్చేవాళ్లు వుండేవారు. కానీ జయలలిత వచ్చాక పార్టీలో బానిసలకు తప్ప యితరులకు స్థానం లేకుండా పోయింది. ఎమ్జీయార్‌కు అందరిపై అనుమానం వున్నా కనబరచేవాడు కాదు, జయలలిత బాహాటంగా అపనమ్మకాన్ని, అసహ్యాన్ని ప్రదర్శించేది. చాలామంది నాయకులు రాజకీయ ప్రయోజనాల కోసమే ఆమె కాళ్ల దగ్గర పడివున్నారు తప్ప ఆమెపై అభిమానంతో కాదని సులభంగా చెప్పవచ్చు. ఎమ్జీయార్ అధికారులను కూడా రూల్సుకి వ్యతిరేకంగా తన మాట వినాలని శాసించేవాడు. ఎమ్జీయార్ ఆదేశాలు మన్నించడం తమ తరం కాక 20 మంది ఐయేయస్‌లు రాజీనామా చేశారు. 1947 నుండి అతను అధికారంలోకి వచ్చేదాకా అలా చేసిన ఐయేయస్ ఒక్కరే. జయలలితా అధికారగణాన్ని ఏడిపించిన సందర్భాలున్నాయి. తన మాట వినని మహిళా ఐయేయస్ అధికారి పై యాసిడ్ దాడి కూడా చేయించిన కేసు వుంది.
తనకు వ్యతిరేకంగా వార్తలు రాసిన మీడియా అంటే ఎమ్జీయార్‌కు మంట. 1980లో యాంటీ-స్కరిలిటీ (నిందాపూర్వక రాతల వ్యతిరేక) చట్టం తెచ్చాడు. బిహార్‌లో జగన్నాథ్ మిశ్రా కూడా యిలాటిదే తెచ్చాడు కానీ ఎమ్జీయార్‌దే ముందంజ. జయలలిత ఎమ్జీయార్ బాటలోనే వెళ్లి పత్రికలపై కక్ష కట్టి వేధించింది. ఎమ్జీయార్ పోలీసులకు పూర్తి స్వేచ్ఛ నిచ్చి తన ప్రత్యర్థులను వేధించడానికి దాన్ని వాడుకున్నాడు. దేశంలో ఎక్కడా లేని గూండా చట్టాన్ని తెచ్చాడు. దాని ప్రకారం ఏ విచారణా లేకుండా, కేవలం అనుమానం మీద ఒక వ్యక్తిని ఏడాదిపాటు నిర్బంధంలోకి తీసుకునే అధికారం జిల్లా కలక్టరు కుంది. ఆ చట్టాన్ని వుపయోగించి నెలకు 50 మంది దాకా లోపల కూర్చోబెట్టేవారు. ఎమ్జీయార్‌కు రాష్ట్రాన్ని పారిశ్రామికంగా ముందుకు తీసుకెళ్లాలనే శ్రద్ధ లేదు. 1977లో అతను ముఖ్యమంత్రి అయ్యేనాటికి తమిళనాడు దేశంలో పారిశ్రామికంగా మూడో స్థానంలో వుండేది. పదేళ్ల తర్వాత అతను పోయేనాటికి అది 13కి దిగింది. ఎమ్జీయార్ సంక్షేమ పథకాల ద్వారా తన యిమేజి పెంచడానికే నిధులన్నీ ఖర్చు చేసేవాడు. జయలలితా అదే బాటలో నడిచింది. ఎమ్జీయార్ కేంద్రంతో ఎప్పుడూ కలహించలేదు, సర్దుకుపోయాడు. హిందీ వ్యతిరేక ఉద్యమాలకు, కేంద్రాన్ని యిబ్బంది పెట్టే ఆందోళనలకు మద్దతు యివ్వలేదు. ఎందుకంటే అతనికి కావలసినది తన సంక్షేమ పథకాలకు నిధులు! కానీ జయలలితకు ఆ సంయమనం లోపించింది. తన అహంకారం భరించలేక కేంద్రం డిఎంకెను దువ్వుతోంది అన్న అనుమానం వచ్చినప్పుడల్లా కేంద్రంతో కయ్యానికి కాలుదువ్వేది.
కొన్ని ఉదాహరణల ద్వారా పై పోకడలను మనం గమనించవచ్చు. ఎమ్జీయార్ నాస్తికుడిగా పేరు తెచ్చుకున్నాడు కానీ రహస్యంగా దేవుణ్ని ప్రార్థించేవాడట. డిఎంకె నుండి బయటకు వచ్చాక, నాస్తికత అనే భారాన్ని తొలగించుకున్నాడు. ముఖ్యమంత్రి అయ్యాక కర్ణాటకలోని మూకాంబిక దేవాలయాన్ని దర్శించుకుని దేవికి కత్తి బహూకరించాడు. కానీ బహిరంగంగా పూజాపునస్కారాలు చేయలేదు. జయలలిత ద్రవిడోద్యమంలోంచి రాలేదు కాబట్టి నాస్తికభావాలను ఎన్నడూ చాటుకోలేదు. కానీ 1992 ఫిబ్రవరి 18 నాటి మహామహం పండగలో ఆమె, ఆమె స్నేహితురాలు శశికళ పాల్గొనడం వలన చాలా అనర్థం జరిగింది. కుంభకోణంలో 6 ఎకరాల స్థలంలో మహామహం కొలను వుంది. దాని చుట్టూ 16 చిన్న మండపాలున్నాయి. కొలనులో 21 బావులున్నాయి. పన్నెండేళ్ల కోసారి గురువు సింహరాశిలో ప్రవేశించినప్పుడు అక్కడ పెద్ద ఉత్సవం జరుగుతుంది. లక్షలాది భక్తులు వచ్చి ఆ చెఱువులో స్నానం చేసి పాపప్రక్షాళన జరిగిందని భావిస్తారు. ఆ ఏడాది 10 లక్షల మంది భక్తులు వచ్చారని అంచనా. అంత జనసమ్మర్దం వున్న చోట ముఖ్యమంత్రి, ఒకప్పటి సినీతార అయిన జయలలిత వెళదామని నిశ్చయించుకోవడం తెలివితక్కువ ఆలోచన. ఆమె, ఆమె స్నేహితురాలు శశికళ ముహూర్త సమయానికి మధ్యాహ్నం 12.15కి అక్కడికి చేరారు. ఒకరిపై మరొకరు నీళ్లు పోసుకున్నారు. కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి ఉత్సవాన్ని ప్రారంభించారు. ఈ విఐపిల కోసం చెఱువులో కొంత భాగాన్ని కేటాయించి భక్తులను అటువైపు రానీయలేదు. దాంతో భక్తులకు చోటు సరిపోలేదు. పైగా వారందరూ జయలలితను చూడడానికి ఎగబడ్డారు. తోపుడులో 50 మంది భక్తులు చచ్చిపోయారు. 74 మంది గాయపడ్డారు. తాకిడికి ఒక భవంతి కూలిపోయింది. చనిపోయినవారిలో 30 మంది దాకా మహిళలు, పిల్లలు. కేవలం ఐదు నిమిషాల్లో యీ దుర్ఘటన జరిగింది. ముహూర్తం టైముకే ముఖ్యమంత్రి అక్కడికి ఎందుకు రావాలి? భక్తులకు చోటు లేకుండా ఎందుకు చేయాలి? అని విమర్శలు వచ్చాయి.
దానిపై ప్రభుత్వం ఒక విచారణ కమిటీ వేసి ఫిబ్రవరి 20న ఒక వివరణ యిచ్చింది. '1968, 1980లలో చేసిన ఏర్పాట్లే 1992లో కూడా చేయడం జరిగింది. భక్తులను ఉత్తర, దక్షిణ దిక్కుల నుండి లోపలకు రానిచ్చి, తూర్పు పడమర వైపు బయటకు పంపించడం జరిగింది. ఉత్తరవైపు వున్న బంగూర్ ధర్మశాలలో అన్నదానం నిర్వహించిన విశ్వహిందూ పరిషత్ సభ్యులు అన్నం పాకెట్లు భక్తులకు విసిరివేయడంతో వాటిని అందుకోవడానికి చాలామంది భక్తులు ఎగబడ్డారు. అందువలన ఆ ఆశ్రమస్తంభాలు కూలి వాటి కింద పడి భక్తులు చనిపోయారు. నీటిలో మునిగి ఎవరూ చావలేదు. ఈ సంఘటన మధ్యాహ్నం 1 గం||కు అనగా ముఖ్యమంత్రి అక్కణ్నుంచి వెళ్లిపోయిన 45 ని||ల తర్వాత జరిగింది. ముఖ్యమంత్రికై కేటాయించిన చోటు 20 అడుగుల పొడుగు, 12 అడుగుల వెడల్పు మాత్రమే వుంది. ముఖ్యమంత్రిని చూడడానికి అందరూ ముందుకు వచ్చారని, వారిపై పోలీసులు లాఠీచార్జి చేయడం చేత కొందరు చనిపోయారని వస్తున్న వార్తలు నిరాధారం. అందువలన ముఖ్యమంత్రి రాకకు, భక్తుల మరణానికి ఏ సంబంధమూ లేదు.' అని దాని సారాంశం.
ఇది చదివాక 2015 గోదావరి పుష్కరాల దుర్ఘటన తర్వాత ఆంధ్ర ప్రభుత్వం వివరణ గుర్తుకు వస్తే రచయిత బాధ్యుడు కాడు. – (సశేషం) (ఫోటో – జయలలిత, శశికళ)
– ఎమ్బీయస్ ప్రసాద్ (డిసెంబరు 2015)