రామ్ గోపాల్ వర్మ..సంచలన దర్శకుడే కాదు..సంచలన కామెంటేటర్ గా మారిపోయారు..తన ట్వీట్ ల ద్వారా. ఆయన ఇప్పుడు వంగవీటిరాధా అనే సినిమాను అందిచబోతున్నారు. ప్రస్తుతం ముంబాయ్ లో వున్న ఆర్జీవీతో కొద్ది నిమషాలు మాట్లాడింది గ్రేట్ ఆంధ్ర.
వంగవీటి రాధా మీ ఆఖరు సినిమా అన్నది నిజమేనా?
తెలుగులో నా ఆఖరి ఫీచర్ ఫిల్మ్ అదే. ఇప్పుడు నేను గత ముంబాయిలో వుంటున్నాను. గత నెలలోనే షిఫ్ట్ అయిపోయాను.
ఇప్పుడు ఈ సినిమా తీయడం వెనుక మీ ఉద్దేశం?
వంగవీటి రాధా అనే సబ్జెక్ట్ ఎప్పటి నుంచో నా మదిలో వుంది. నాకు చాలా ఇష్టమైన సబ్జెక్ట్. నేను విజయవాడలోనే చదివాను..పెరిగాను. చలసాని వెంకటరత్నం, రాధా, రంగా, దేవినేని, ఇలా అందరి గురించీ తెలసు..
అంటే మరో రక్త చరిత్ర మాదిరిగానా?
అలా అని కాదు. ఇందులో హీరోయిజం వుండదు. ఎమోషనల్ క్యారెక్టర్లు మాత్రం వుంటాయి. మరో సత్య సినిమా మాదిరిగా వుంటుంది.
పవన్ విషయంలో మీ అసంతృప్తి ఏమిటి?
ఓ వ్యక్తి తన ఉద్దేశాలు ప్రకటిస్తూ పార్టీ పెట్టారు. ఏడాదో, ఏడాదిన్నరో గడిచింది. మరి ఇప్పటివరకు ఆ ఐడియాలజీ, లేదా ఆ ప్రసంగానికి అనుగుణంగా ఏం చేసినట్లు? ఎవరో ఒకరు అడగాలి కదా?
మీరు ట్వీట్ లు చేయడం అందుకేనా?
నేను ట్వీట్ లు ఊరికనే చేయను..అలా అని అనుకుంటారు. రోజంతా పని చేసి వచ్చి, ప్రశాంతంగా కూర్చుని, ఆ రోజు ఏం జరిగింది అన్నది అంతా ఆలోచించి, నా అభిప్రాయాలు నిర్మొహమాటంగా ట్వీట్ చేస్తా అంతే.
..సారీ షూట్ లో వున్నా..మీతో మరోసారి వివరంగా మాట్లాడతా అంటూ ముగించారు ఆర్జీవీ.
విఎస్ఎన్ మూర్తి