ఎమ్బీయస్‌: కుట్ర తేటతెల్లమౌతోంది

ఎర్రబెల్లి దయాకరరావు పార్టీ ఫిరాయింపు వినగానే మొదటి తట్టిన కాప్షన్‌ – 'యూ టూ బ్రూటస్‌..' అని! నమ్మకద్రోహం చేసినవారిని వెంటనే అలా అనడం పరిపాటి. కానీ అది యిక్కడ అన్వయించదు. ఎందుకంటే బ్రూటస్‌కు…

ఎర్రబెల్లి దయాకరరావు పార్టీ ఫిరాయింపు వినగానే మొదటి తట్టిన కాప్షన్‌ – 'యూ టూ బ్రూటస్‌..' అని! నమ్మకద్రోహం చేసినవారిని వెంటనే అలా అనడం పరిపాటి. కానీ అది యిక్కడ అన్వయించదు. ఎందుకంటే బ్రూటస్‌కు ఒక ఫిలాసఫీ వుంది. సీజర్‌ నియంతగా మారుతున్నాడు కాబట్టి అతన్ని అంతమొందించి తీరాలి అని అతని మిత్రులే, సహచరులే నిశ్చయించుకుని అతన్ని పొడిచి చంపారు. సీజర్‌ వ్యక్తిగతంగా స్నేహితుడైనా అతని పోకడతో వ్యతిరేకించి బ్రూటస్‌ ఎదురు తిరిగాడు. చివరి కత్తిపోటు అతనిదే. ఇది ఎదురు చూడని సీజర్‌ 'నువ్వూనా, బ్రూటస్‌!' అని నివ్వెరపోయాడు. ఇక్కడ ఎర్రబెల్లికి బాబుతో సిద్ధాంతవైరుధ్యం ఏమీ లేదు. 'టిడిపి నాకెంతో యిచ్చింది, తెలంగాణ హితం కోరి తెరాసలో చేరుతున్నాను. బాబు అంటే గౌరవం వుంది. టిడిపి కార్యకర్తలు అర్థం చేసుకోవాలి' అంటూ ముకుళిత హస్తాలతో, సజల నయనాలతో యివాళ స్టేటుమెంటు యిచ్చారు. చూస్తూ వుండండి, వరంగల్లులోనో, నిజాం గ్రౌండ్స్‌లోనో త్వరలో జరగబోయే సభలో ఆయన టోన్‌ ఎలా మారుతుందో! బాబుపై ఎన్ని నిందలు వేస్తాడో చెవులారా విందురుగాని. తెలంగాణ బాగు పడాలంటే తెరాసలోనే చేరాలా? తెరాస యివాళ పుట్టిన పార్టీనా? పుష్కరం కింద పుట్టింది. వరంగల్లు, కరీంనగర్‌ జిల్లాలలో తెరాస మొదటినుంచీ బలంగా వుంది. స్థానిక కార్యకర్తలు తెరాసలో చేరాలని పట్టుబడుతూనే వుండి వుంటారు. అయినా చేరలేదే!? ఇవాళ గుర్తుకు వచ్చిందా, కెసియార్‌ నాయకత్వమే రాష్ట్రానికి అవసరమని..? ఇదంతా నాటకం. 

నా ఉద్దేశంలో కాంగ్రెసు నుండి, టిడిపి నుండి యిప్పుడు తెరాసలోకి జరుగుతున్న ఫిరాయింపులు ఎప్పుడో ప్లాన్‌ చేసినవి. అంతా ఒక పథకం ప్రకారమే జరుగుతోంది. నా ఊహ ప్రకారం – యిది కేవలం వూహ మాత్రమే, నిజానిజాలు ఆ యా నాయకులకు, దేవుడికి తెలియాలి – కెసియార్‌ తెరాస పెట్టిన తర్వాత యీ నాయకులందరందరినీ కదలేసి వుంటారు. 'ఉమ్మడి రాష్ట్రంలో మీరు నాయకులుగా ఎదగలేరు. ఆంధ్ర నాయకుల పలుకుబడి ముందు మీరు నిలవలేరు. టిడిపి వున్నంతకాలం బాబే ముఖ్యమంత్రి. కాంగ్రెసు అధికారంలోకి వస్తే మూడు ప్రాంతాల్లో ఎవరైనా కావచ్చు. వాటాల్లో తెలంగాణాకు ఎంత వస్తుందో, కులాల లెక్కల్లో మీకు మంత్రి పదవైనా దక్కుతుందో లేదో తెలియదు. రాష్ట్రాన్ని చీలిస్తేనే మీకు పదవులు వస్తాయి. లేకపోతే చిన్న పదవుల్లోనే కొట్టుమిట్టులాడాలి. ఆలోచించుకోండి' అని వుంటారు. 'సరే, అయితే పార్టీలో చేరమంటారా?' అంటే 'ఇప్పుడే వద్దు, మీరు బయటకు వచ్చేస్తే మీ స్థానంలో మరో నాయకుణ్ని ఆ పార్టీ తయారు చేసుకుంటుంది. అందువలన మీరు మీ పార్టీలోనే వుంటూ నాపై నిప్పులు కక్కుతూ, మీ నాయకుణ్ని ఏమారుస్తూ వుండండి.' అని చెప్పి వుంటారు. 

'అలా అయితే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం ఎలా? మాకు పదవులు దక్కడం ఎలా?' – ఈ ప్రశ్న కాంగ్రెసు నాయకులు, టిడిపి నాయకులు యిద్దరూ వేసి వుంటారు.  ఎందుకంటే కాంగ్రెసు 1969, 1972 వేర్పాటు వుద్యమాలను అణిచివేసింది. దేశంలో తలెత్తిన అనేక ప్రత్యేక ఉద్యమాలకు స్పందించటం లేదు. ఢిల్లీ కాంగ్రెసు నాయకులతో ఆంధ్ర కాంగ్రెసు నాయకులకు దోస్తీ ఎక్కువ. వ్యాపారబంధాలు ఎక్కువ. విభజనకు కాంగ్రెసు ఒప్పుకునే అవకాశాలు బహు తక్కువ. ఇక టిడిపి – తెలుగుజాతి ఐక్యత, ఆత్మగౌరవం నినాదాలపై ఏర్పడినది. నాయకత్వం ఆంధ్రులదైనా తెలంగాణలో పటిష్టమైన పార్టీ నిర్మాణం కలది. వాళ్లెందుకు విభజనకు అంగీకరిస్తారు? 'ఇక్కడే మీ చాతుర్యం చూపించాలి. తెలంగాణ ప్రజలందరూ ప్రత్యేక రాష్ట్రం కోరుతున్నారని మీ అధినాయకత్వానికి చెప్పి వాళ్ల మైండ్‌సెట్‌ మార్చండి. లేకపోతే పార్టీ విడిచి పెట్టవలసిన అవసరం వస్తుందని బెదిరించండి. మీ ఒత్తిడికి లొంగి తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేసేట్లా చూడండి.' అని కెసియార్‌ ఉపాయం చెప్పి వుంటారు. ఇది టిడిపికి వర్తింప చేస్తూ కాంగ్రెసు వాళ్లతో 'రాష్ట్రం యిస్తే నేను మీ పార్టీలో చేరతానని, నన్ను పట్టుకుని వచ్చి ఆమె కాళ్ల దగ్గర పడేస్తానని మీరు సోనియాకు నమ్మబలకండి. నేనూ అప్పుడప్పుడు బ్లో హాట్‌, బ్లో కోల్డ్‌గా మాట్లాడుతూంటాను. నేను టిడిపిలోంచి వచ్చేసి పార్టీ పెట్టాను కాబట్టి, దానిలో మళ్లీ చేరతానంటే నమ్మరు. కాంగ్రెసులో చేరి, టిడిపి భరతం పడతానని సోనియా, ఆమె సుపుత్రుడు నమ్ముతారు.' అని చెప్పి వుంటారు. 

ఆ స్కీము ప్రకారమే ఎర్రబెల్లి, కడియం యిత్యాదులు తెలంగాణకు అనుకూలంగా లేఖ యివ్వకపోతే రాష్ట్రంలో కొంప మునిగిపోతుందని బాబును ఊదరగొట్టేశారు. ఆయన స్వతహాగా సమైక్యవాది అయినా, వీళ్ల బోధనలకు లొంగారు. ఆంధ్ర నాయకులందరూ ఠాఠ్‌ వీల్లేదన్నారు. బాబు ఎర్రన్నాయడు పేర కమిటీ వేసి, ప్రజాభిప్రాయ సేకరణ అంటూ ఒక తంతు నిర్వహించి (ఎవర్నీ అడగలేదని ఎర్రన్నాయుడే తర్వాతి రోజుల్లో చెప్పారు) లేఖ యిచ్చేశారు. ఆంధ్ర టిడిపి నాయకులందరూ బహిరంగంగానే టీవీ చర్చల్లో, సభావేదికలపై 'మేం సమైక్యవాదులమే, పార్టీ ప్రయోజనాలను దృష్ట్యా నాయకుడి మాటను గౌరవిస్తున్నాం' అని పదేపదే చెప్పుకున్నారు. ఈ నాడు పార్టీయే తుడిచిపెట్టుకుపోతోంది. మిగిలిన అడుగూబొడుగూ కూడా ఎంతకాలం వుంటుందో తెలియదు. ఒకరి తర్వాత మరొకరు తమ మారువేషాలు చాలించి నిజరూపాల్లో దర్శనమిస్తున్నారు. కడియంపై మొన్నటిదాకా కారాలు మిరియాలు నూరిన ఎర్రబెల్లి యీ రోజు ఆయన పక్కనే చేరారు. ఎర్రబెల్లిపై వైరం ప్రదర్శించి, కెసియార్‌పై ఎన్నో దుర్భాషలాడిన మోత్కుపల్లి నర్సింహులు కూడా తెరాసలో చేరిన రోజున వీళ్ల నాటకం మనకు పూర్తిగా అర్థమవుతుంది. ఎర్రబెల్లి వంటి వారు పార్టీలో వుంటూనే నాయకులను బయటకు పంపేస్తూ, టిడిపిని బలహీనపరుస్తూ, చివరకు తాము పైకి ఎక్కివచ్చిన నిచ్చెనను తన్నేసి, ముసుగులు తీసేస్తున్నారు. 

ఇక కాంగ్రెసు విషయానికి వస్తే తెలంగాణ యిస్తే చాలు, కెసియార్‌ మన పార్టీలో చేరతాడు అంటూ నమ్మబలికి సోనియాను ముంచిన వారందరూ కేశవరావుతో సహా పలు నాయకులు తెరాసలో చేరి పదవులు అలంకరిస్తున్నారు. జానారెడ్డిని చూసి నేర్చుకోవాలి,  పార్టీలోనే వుంటూ గోతులెలా తీయాలో! తెలంగాణ యిచ్చి కాంగ్రెసు అటూయిటూ తిరుక్షవరం చేసుకుంది. తెలంగాణ యివ్వాలని లేఖ యిచ్చి టిడిపి సగం గుండు కొట్టించుకుంది. తెలంగాణలో పార్టీ తుడిచిపెట్టుకుపోతోంది. ఈ లీడర్లందరూ ముందే పోయి వుంటే యీ పాటికి వారి స్థానంలో కొందరు యువకులనైనా తయారుచేసుకునే వారు. వీళ్లను నమ్మడంలో బాబు తెలివితక్కువతనం బయటపడుతోంది. అపర చాణక్యుడిగా ఒకప్పుడు పేరు తెచ్చుకున్న బాబుకు 'అతని కంటె ఘనుడు ఆచంట మల్లన' రూపంలో కెసియార్‌ ఎదురయ్యాడు. తెలంగాణలో టిడిపి కున్న గుడ్‌విల్‌, నిర్మాణవ్యవస్థ చాలా గొప్పది. ఓర్పుతో, ఓపికతో, పట్టుదలతో పార్టీని పునరుజ్జీవింప చేసుకోవచ్చు. బాబు ప్రతిపక్షంలో వుంటే తీరిక వుండేది. కానీ ఆయన అనేక సమస్యలతో మునిగి తేలే కొత్త రాష్ట్రానికి ముఖ్యమంత్రి. వయసు కూడా ఆయన పక్షాన లేదు. ఆయన ఎవరికైనా బాధ్యత అప్పగించి, స్వేచ్ఛ నివ్వాలి. అప్పుడే పార్టీ మనగలుగుతుంది. ఎన్టీయార్‌ సమైక్యవాదాన్ని వదిలిపెట్టి తత్కాల రాజకీయాల కోసం సిద్ధాంతాలను బలిపెట్టినందుకు బాబు పశ్చాత్తాపపడుతూండాలి. 

నేను పైన వూహించిన సినారియో తప్పు అని వాదించేవాళ్లు యింకోలా ఎలా జరిగి వుంటుందో చెప్పాలి. ఎందుకంటే తెలంగాణలో జరుగుతున్న ఫిరాయింపులకు అర్థం, పర్థం లేకుండా పోయింది. ఏ పార్టీకైనా జయాపజయాలు తప్పవు. ఓడిపోయినంత మాత్రాన గెలిచిన పార్టీలోకి దుమికేయరు. అదే అయితే ఈ ఎర్రబెల్లి, కడియం, నాగం వీళ్లందరూ 2004లోనే కాంగ్రెసులోకి దుమికేయాల్సింది. 1994లో కాంగ్రెసు వాళ్లందరూ టిడిపిలోకి జంప్‌ చేసి వుండాల్సింది. అప్పుడు జరగని ఫిరాయింపులు యిప్పుడే జరగడమేం? ఇదంతా కోవర్టు వ్యవహారం. శత్రుకూటమిలో తన వాడిని నియమించుకుని వారిని తప్పుదోవ పట్టించడం. ఈ టెక్నిక్కు యిప్పటిది కాదు. పంచతంత్రంలోనే గ్రంథస్తమైంది. మూడో తంత్రం, కాక-ఉలూకీయం చదవండి. గుడ్లగూబలను జయించలేక కాకులు ఒక పథకం వేస్తాయి. ఒక ముసలి కాకిని గాయపరచి, ఎక్కడికో వెళ్లిపోతాయి. ఆ ముసలి కాకి గుడ్లగూబలు వచ్చినపుడు 'మీతో సఖ్యంగా వుండమని సలహా చెప్పినందుకు వాళ్లు హింసించారు' అని చెప్పి వాపోతుంది. గుడ్లగూబలు సంతోషించి దాన్ని తమ స్థావరంలోకి తీసుకెళ్లి తిండి పెట్టి పోషిస్తాయి. స్థావరం ఆనుపానులు బాగా తెలుసుకున్నాక, ఆ ముసలికాకి తన కాకులబృందాన్ని తీసుకుని వచ్చి గుడ్లగూబల స్థావరాన్ని కాల్చివేస్తుంది. కెసియార్‌ ఎర్రబెల్లి వంటి వారిని గాయపరచి శత్రుస్థావరానికి పంపలేదు. అక్కడే వుండి, నాతో వైరం నటిస్తూ మీ రాజు బుర్ర చెడగొట్టు అన్నారు. విభీషణుడు కోవర్టు పని చేసిి బంగారు లంకను ఏలుకున్నాడు. బంగారు నాణాలకు ఆశపడి గోల్కొండ కోట గుమ్మం తెలుపు తెరిచి ఔరంగజేబును రప్పించేసినవారు యీ గడ్డమీదే పుట్టారు. వారసత్వం వూరికే పోతుందా?

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఫిబ్రవరి 2016) 

[email protected]