ఎమ్బీయస్‌ : తెలంగాణలో బలాబలాలు -2

మోదీ వ్యక్తిగత అభిప్రాయం ఏ మేరకు చెల్లుతుందో చూడాలి కదా. బిజెపి మానిఫెస్టోలో అయితే యీ ప్రస్తావన ఏదీ లేదు. అయినా హైదరాబాదు, రంగారెడ్డి ప్రజలు కెసియార్‌ మాటలను నమ్మారంటే తెరాసకే ముప్పు. విభజన…

మోదీ వ్యక్తిగత అభిప్రాయం ఏ మేరకు చెల్లుతుందో చూడాలి కదా. బిజెపి మానిఫెస్టోలో అయితే యీ ప్రస్తావన ఏదీ లేదు. అయినా హైదరాబాదు, రంగారెడ్డి ప్రజలు కెసియార్‌ మాటలను నమ్మారంటే తెరాసకే ముప్పు. విభజన తర్వాత హైదరాబాదు కళ తప్పుతుందని భయపడేవారికి యూటీ చేస్తారనేది చల్లని కబురు. వాళ్లంతా బిజెపికి జై అనవచ్చు. కెసియార్‌ హఠాత్తుగా బిజెపిపై విరుచుకుపడడానికి కారణం – వాళ్లకు బలం పెరుగుతోందన్న సందేహమా? లేక నిజామాబాద్‌లో తన కూతురు బిజెపి ప్రత్యర్థిని దెబ్బ తీయడానికా? ఒకవేళ అదే నిజమైతే తెలంగాణ యిచ్చినందుకు బిజెపికి కూడా ఓట్లు వచ్చే అవకాశం వుందన్నమాట. తెలంగాణ కోరుకున్నవారి ఓట్లు కాంగ్రెసు, తెరాస, బిజెపిల మధ్య ఏదో ఒక నిష్పత్తిలో చీలతాయని గట్టిగా అనవచ్చు. టిడిపికి మాత్రం పడకపోవచ్చు. టిడిపి తెలంగాణకై పోరాడామని ఎంత చెప్పుకున్నా వీరతెలంగాణవాదులైతే నమ్మరు. టిడిపికి ఓట్లు వేరే కారణాల వలన పడాలి తప్ప యీ కారణం చేత మాత్రం కాదు. తెలంగాణ ఉద్యమం 40 అసెంబ్లీ నియోజకవర్గాలలో బలంగా వుందనుకుంటే వాటిలో బిజెపికి ఓ 6,7 వస్తాయనుకుంటే కాంగ్రెసు, తెరాస చెరో 17-18 స్థానాలు పంచుకోవాలి. ఉద్యమం సాగుతున్నంతకాలం నిస్తేజంగా వుండి, పదవులు అనుభవించి, ఆఖరి క్షణంలో తెలంగాణ తెచ్చింది మేమే అంటూ వచ్చిన కాంగ్రెసుకు తెరాసతో సమానంగా సీట్లు వస్తాయా అన్న సందేహం కలుగుతుంది. 

కాంగ్రెసుకు సంస్థాగతమైన బలం ఎప్పుడూ వుంటుంది. కొందరు నాయకులు తమ అనుచరగణాన్ని ఎప్పుడూ మేన్‌టేన్‌ చేస్తూ వుంటారు. తమ వద్దకు వచ్చినవాళ్లకు పనులు చేసి పెడుతూ వుంటారు. నియోజకవర్గానికి పనికివచ్చే ప్రాజెక్టులు, ఫ్యాక్టరీలు తేకపోవచ్చు కానీ వ్యక్తిగతంగా కొందరికి పనులు చేసి పెట్టి మంచి పేరు సంపాదించుకుంటారు. సీమాంధ్రలో కాంగ్రెసు తిరుక్షవరం అంటున్నారు కదా, అయినా వాళ్లు 10 సీట్లు తెచ్చుకుంటే నేను ఆశ్చర్యపోను. అవి స్థానిక నాయకుల బట్టి వస్తాయి, పార్టీ సిద్ధాంతాల బట్టి కాదు, మానిఫెస్టో చదివి కాదు. తెరాస కానీ, కాంగ్రెసు కానీ – ప్రజలకు అందుబాటులో వుండే ఎమ్మేల్యే అభ్యర్థి కనబడితే అతనికి గెలుపు అవకాశాలు బాగుంటాయి. తెలంగాణ వచ్చినా, ఉమ్మడి రాష్ట్రం పోయినా ప్రతి వాడికీ నాకు పనులు జరగడం ఎలా? అన్న రంధే వుంటుంది. తమకు తెలిసిన నాయకుడు ఏ పార్టీలోకి దూకినా అతనికి వేసే ఓట్లు వేస్తూ వుంటారు. తెరాస ఎమ్మెల్యేలు ఎన్నికలలో, ఉపయెన్నికలలో గెలుస్తూ వచ్చినా వాళ్లు రాజీనామా చేసి అధికారానికి దూరంగా వుండడమే ఎక్కువ. అధికారంలో వున్న కాంగ్రెసు ప్రభుత్వం వాళ్ల ప్రాబల్యం తగ్గించడానికే చూసింది. అందువలన తెరాస ఎమ్మెల్యేల కంటె కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, మంత్రులే పనులు ఎక్కువ చేసి పెట్టి వుండవచ్చు. హరీశ్‌ రావు వంటి పెద్ద నాయకుల కథ వేరు. తక్కిన వాళ్ల సంగతి మాట్లాడుతున్నాను. పైగా యీ ఎన్నికలలో కాంగ్రెసు నాయకులందరూ రాష్ట్రమంతా తిరిగి పార్టీని బలోపేతం చేసుకునే పని పెట్టుకోలేదు. తమ నియోజకవర్గంలోనే మకాం వేసి, పూర్తిగా ఫోకస్‌ చేసుకుంటున్నారు. ఆ కృషి, ఆ ప్రచారం కొంతవరకైనా తప్పక ఫలిస్తుంది. 

తెలంగాణ సెంటిమెంటు బలంగా లేని తక్కిన 80 స్థానాల మాటేమిటి? ఇక్కడ మళ్లీ ప్రాక్టికల్‌ విషయాలే గణనకు వస్తాయి. ఎవడి వలన తెలంగాణకు లాభం? అంతకంటె నాకు లాభం? అన్న ప్రశ్న వేసుకుని చూసుకుంటారు. కేంద్రంలో ఎన్‌డిఏ వస్తుందంటున్నారు కాబట్టి బిజెపి-టిడిపి కూటమికి వేసేస్తారని అనుకోవడానికి లేదు. తమిళులు బిజెపి ఫ్రంట్‌కు యిబ్బడిముబ్బడిగా ఓట్లేస్తారని అనగలమా? ఇప్పటివరకు ఏ రాష్ట్రమూ అలాటి లెక్కలు వేసుకుని ఓట్లు వేయలేదు. కొత్త రాష్ట్రం కాబట్టి నిధుల అవసరం వలన యీసారి లెక్కలు వేస్తారు అనుకుందామనుకుంటే పాత రాష్ట్రానికి మాత్రం నిధుల అవసరం లేదా? తాము ప్రకటించే సంక్షేమపథకాల ఖఱ్చు కేంద్రమే భరించాలని ప్రతి రాష్ట్ర ప్రభుత్వమూ డిమాండ్‌ చేస్తుంది. అక్కడా యిక్కడా పదేళ్లగా కాంగ్రెసు అధికారంలో వున్నా మన రాష్ట్రానికి ఒరిగిందేమిటి? ఇప్పుడు మాట్లాడుతున్న ప్రాణహిత జాతీయ హోదా, పోలవరం జాతీయ హోదా, స్టీలు ఫ్యాక్టరీలు, ఐఐఎమ్‌లు యిన్నాళ్లూ మచ్చుకి ఒకటైనా విదల్చలేదేం? కేంద్రంలో ఎవరున్నా కొట్లాడి తెస్తాం అని తెరాస చెప్పవచ్చు. కొట్లాడనక్కరలేకుండా, యుపిఏ1లో కేంద్రంలో, రాష్ట్రంలో మంత్రిపదవులు యిచ్చినపుడు ఏం చేశారు? కెసియార్‌ మన రాష్ట్రానికి గాని, కనీసం తెలంగాణకు కానీ ఏమైనా తెచ్చారా? రాష్ట్రమంత్రులుగా చేరినవారు తమ నియోజకవర్గాలకు ఏమైనా చేశారా? గిల్లికజ్జాలు పెట్టుకుని బయటకు వచ్చేశారు. రేపు యిదే పని కేంద్రంలో చేయరని నమ్మకం ఏమిటి? 

పార్టీలుగా పాలనానుభవం మాకుంది అని టిడిపి, కాంగ్రెసు అనవచ్చు. వ్యక్తులుగా యితర పార్టీల్లో వున్నవారికీ వుంది. ఎందుకంటే యీ పార్టీల్లోంచే వాళ్లు ఆ పార్టీల్లోకి వెళ్లారు. ఏ పనిలోనైనా అనుభవం వుండడం అదనపు అర్హతే తప్ప చిత్తశుద్ధి వుండడం ముఖ్యం. కిరణ్‌కు ఏ అనుభవం వుందని మూడేళ్లకు పైగా ముఖ్యమంత్రిగా లాగించేశారు? ఎన్టీయార్‌కు..? ఎమ్జీయార్‌కు…? జయలలితకు…? మాయావతికి..? నవీన్‌ పట్నాయక్‌కు..? వీళ్లంతా మంత్రి పదవి చేయకుండానే అయిన ఫస్ట్‌ టైమ్‌ చీఫ్‌ మినిస్టర్లే కదా! ఓ మూడు నాలుగు నెలలు తడబడతారు. తర్వాత సర్దుకుంటారు, సలహాదారులు మంచివాళ్లని పెట్టుకుంటే సరి! 

మోదీ హవా తెలంగాణను ఊపేస్తోంది అని కొన్ని పత్రికలు రాస్తున్నాయి. మోదీ హవా పేపర్లలో, యింటర్నెట్‌లో కనబడినంతగా ప్రజల్లో కనబడదు. గుజరాత్‌ అభివృద్ధి అబ్బో అంటూ కొంతకాలంగా వూదరగొడుతూ వచ్చారు. ఆ మోడల్‌లో వాస్తవం తక్కువ, అతిశయోక్తులు ఎక్కువ. అయినా సీమాంధ్రకు వేరే మాస్టర్‌ ప్లాన్‌, తెలంగాణకు వేరే మాస్టర్‌ ప్లాన్‌ వేసేవాళ్లు గుజరాత్‌ ప్లాన్‌ అన్ని చోట్లా వర్తిస్తుందని ఎలా అనగలరు? గుజరాతీల్లో వున్న వ్యాపారగుణం తెలంగాణవారిలో వుందా? వాళ్లకున్న సముద్రతీరం వుందా? ఇక్కడున్న మావోయిస్టులు అక్కడున్నారా? మోదీ పేరు నగరయువతను కదిలించినట్లుగా గ్రామీణులను, మైనారిటీలను కదిలించదు. అందువలన బిజెపికి ఓట్లు కురుస్తాయని నమ్మడానికి లేదు.  వారితో కలిసినందుకు టిడిపికి ఒరిగేదీ ఏమీ లేదు. టిడిపితో కలిసి బిజెపి నష్టపోవడం తప్ప! టిడిపి-బిజెపి పొత్తుకు తెలంగాణ బిజెపి నాయకత్వం ససేమిరా అందని అందరికీ తెలిసిపోయుంది కాబట్టి ఓట్లు బదిలీ కావు. అదే సమయంలో పొత్తు గురించి బిజెపిపై ఆగ్రహమూ వుండకపోవచ్చు. (సశేషం)

 – ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఏప్రిల్‌ 2014)

[email protected]

Click Here For Part-1