సాధారణంగా మన కిష్టం వచ్చిన మనం తిండి తింటాం. వద్దని ఆంక్షలు పెట్టగలిగేది ఎవరు? తలిదండ్రులు – 'మన యింట్లో యిది తినం, బయట ఫ్రెండ్స్‌తో కలిసి నువ్వు తింటున్నావని తెలిసింది, వద్దు' అని! గురువులు – 'ఇన్ని వారాలపాటు ఫలానా రోజున ఫలానాది తినడం మానేసి, నిష్టగా వుంటే నీ కోరిక తీరుతుంది' అని! ఒక్కోప్పుడు మన మీద మనమే ఆంక్షలు పెట్టుకుంటాం – కాశీలో యిష్టమైన కూరగాయ వదిలేసి! మన యిష్టాయిష్టాలు పట్టించుకోకుండా ఆంక్షలు పెట్టగల ఘనుడు ఒకడున్నాడు – వైద్యుడు! వీళ్లందరినీ మనం సహిస్తాం. కానీ యింటిపక్కవాడు వచ్చి మీరిది తినవచ్చు, యిది తినకూడదు అంటే ఒళ్లు మండుతుంది.
ఒకవేళ ఆ యింటిపక్కవాడు యింటి ఓనరే అయితే ఒళ్లు మండినా ఒప్పుకోవలసి వస్తుంది. కొంతమంది వెజిటేరియన్లు తమ యింట్లో అద్దెకి దిగేవాళ్లు కూడా వెజిటేరియన్లు అయి వుండాలని షరతు పెడతారు. వాళ్లు పక్కవాటాలో వుండేటప్పుడైతే అర్థం చేసుకోవచ్చు. వేరే చోట వున్నా సరే నాన్‌వెజ్ తినేవారికి యిల్లు యివ్వరు. గుజరాత్‌లో యీ సమస్య మరీ తీవ్రం. అక్కడ అనేక కులాలవారు వెజిటేరియన్లు. గుడ్డు తింటానన్నా యిల్లివ్వరు. రెడ్డి అనే నా కొలీగ్ గుజరాత్‌లో భావనగర్ అనే జిల్లా కేంద్రానికి బదిలీ అయ్యాడు. ఇంకో కొలీగ్ యిల్లిప్పిద్దామని ప్రయత్నించాడు. ''బ్రాహ్మలా?'' అని అడిగాడు యింటాయన. ''అవును, బ్రాహ్మడే. ఇక్కడ బ్రాహ్మలకు భట్, దేశాయి అని యింటి పేర్లు వున్నట్లే ఆంధ్రాలో బ్రాహ్మలకు రెడ్డి అనే యింటిపేరు వుంటుంది.'' అని చెప్పాడు. అతను తృప్తిపడి యిల్లు యిచ్చాడు. ఇంకో కొలీగ్ సాహు అనే ఒడియా ఆయన ఏం చెప్పుకున్నా పప్పులుడకలేదు. ఒడిసాలో, బెంగాల్‌లో బ్రాహ్మలు కూడా చేపలు తింటారని జగద్విదితం. చివరకు ఆయన క్రిస్టియన్ కాలనీలో యిల్లు తీసుకోవాల్సి వచ్చింది.
బ్రాహ్మలంటే వెజిటేరియన్లే అనే భావం మన తెలుగువాళ్లలో బలంగా నాటుకుంటుంది. బెంగాలీ బ్రాహ్మలు మడి కట్టుకుని చేపలు వండుకుంటారట అని తోస్తే భలే నవ్వు వచ్చేది. బెంగాల్ వెళ్లాక చూస్తే చేపలే కాదు, అన్ని రకాల జీవరాశుల్నీ తింటున్నారు. గృహప్రవేశం అయితే – హిల్సానో మరోటో గుర్తు లేదు – ఆ చేప తలతో చేసిన కూర చేసి తీరాలి వాళ్లకు. మా చిన్నప్పుడు గౌడీయ బ్రాహ్మలని తెల్లగా మిసమిసలాడుతూ యాయవారానికి వచ్చేవారు. తిథివారనక్షత్రాలు చెప్పి చెంబులో బియ్యం వేయించుకునేవారు. వీళ్లు దొంగబ్రాహ్మలు, చేపలు తింటారట అని చెప్పుకునేవాళ్లం. ఒడిశా నుంచి తూర్పుతీరంలో బ్రాహ్మలు సైతం చేపలు తిన్నట్టే, పశ్చిమతీరంలో కొంకణస్థ బ్రాహ్మణులు చేపలు తింటారు. ఈ గౌడీయ సారస్వత్ బ్రాహ్మణులు ఆ కోవకే చెందుతారు. వాళ్లు ఏం తింటే మనకేం? అని వూరుకోవచ్చుగా, కానీ వూరుకోం. మన ప్రాంతాల అలవాట్లతో వాళ్లను చూసి జడ్జ్ చేస్తాం.
ఆర్ కె లక్ష్మణ్ రాసిన 'స్వామి అండ్ ఫ్రెండ్స్'లో స్వామినాథన్ అనే ఓ స్కూలు పిల్లవాడు క్రైస్తవ పాఠశాలలో చదువుతూంటాడు. ఎబెనెజార్ అనే టీచరు, హిందూమతాన్ని తిట్టిపోసి, క్రీస్తును పొగుడుతూంటాడు. అప్పుడు స్వామినాథన్ లేచి నిలబడి 'క్రైస్తు దేవుడైతే మాంసం ఎందుకు తిన్నాడు? మద్యం ఎందుకు తాగాడు?' అని అడుగుతాడు. అయ్యర్ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన స్వామినాథన్ దేవుడు మాంసం తినడం హరాయించుకోలేక పోతాడు. వాడు స్కూలు పిల్లవాడు కాబట్టి అలా అనుకున్నాడు అనే కాదు, యిప్పటికీ మన హిందువులకు దేవుళ్లు మాంసం తింటారు అనే ఆలోచన మింగుడు పడదు. రాముడు, కృష్ణుడు క్షత్రియులు, మాంసం తిన్నారు అని తెలుసు. అయినా మన నాటకాల్లో కాని, సినిమాల్లో కానీ చికెనో, మటనో తింటున్నట్లు చూపించరు. నైవేద్యం పెట్టినప్పుడు పళ్లు, శాకాహార పిండివంటలు పెడతాం కానీ నాన్‌వెజ్ పెట్టం. పెట్టేవాడు కన్నప్పలా అనాగరికుడు, మూఢభక్తుడు అనుకుంటాం. గ్రామదేవతలకు మాత్రమే మాంసాహారం నైవేద్యం పెడతారు. వాతాపి జీర్ణం కథలో అగస్త్యుడు మాంసాహారం తింటాడు. ఆ ఘట్టాన్ని సినిమాలో చూపిస్తే ఋషులను అవమానించారంటూ పెద్ద గొడవలై పోతాయి.
ఎవరినైనా తీసిపారేయాలంటే వాళ్ల ఆహారపు అలవాట్ల మీద పడతాం. మా నాన్నకు గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూల మీద కోపం. వాళ్ల విధానాలను విమర్శించడంతో బాటు 'నెహ్రూ బ్రాహ్మడై వుండి కూడా మాంసం తింటాడు చూడండి' అంటూ ఆయనా, ఆయన ఫ్రెండ్సూ తిట్టిపోసేవారు. నేను నా ఫ్రెండు కుటుంబంతో కలిసి శ్రీనగర్‌లో అఫ్జల్ గురు మేనమామ డా|| గురు యింటికి డిన్నర్‌కు వెళ్లామని ఓ సారి రాశాను కదా. అవేళ ఆయన తెలుగు బ్రాహ్మణులు శాకాహారులని విని తెగ ఆశ్చర్యపడ్డాడు. ''మా కశ్మీర్ పండిట్లు బ్రహ్మాండంగా మాంసం తింటారే..'' అన్నాడు. నెహ్రూది కశ్మీర్ పండిట్ కుటుంబం కాబట్టి వాళ్లకు మాంసాహారం ఒప్పేనన్నమాట. మన తెలుగు కళ్లతో చూసి నెహ్రూ తప్పు చేసినట్లు భావించి, భ్రష్టుడు అని ముద్ర కొట్టేశామన్నమాట! చిలకమర్తి వారో ఎవరో రాశారు ఓ చమత్కారం! పూరీ క్షేత్రంలో తెలుగు బ్రాహ్మణులు ప్రసాదాన్ని రావి ఆకుల్లో పెట్టుకుని తింటూ వుంటే ఒడియా బ్రాహ్మలు ఎద్దేవా చేశారట! 'ప్రళయకాలంలో శ్రీమహావిష్ణువు బాలుడి రూపంలో శయనించిన పవిత్రమైన ఆకు అది, దానిలో తింటూ ఎంగిలి చేస్తారా?' అని. అప్పుడు తెలుగు బ్రాహ్మలు అన్నారట – ''శ్రీ మహావిష్ణువు అవతారం ఎత్తిన మత్స్యాన్నే తినేసే మీరు మమ్మల్ని వెక్కిరించడమా?' అని. అది విన్నాక నాకు అనిపించింది – అవును కదా, మనం హిందువులం విష్ణువును పూజిస్తూనే చేపలు తింటాం, ఇంకో అవతారమైన తాబేళ్లనూ కొందరు తింటారు, వరాహాన్ని కొందరు తింటారు. ఆ మాటకొస్తే మనం ఏ జంతువును, పక్షిని, సరీసృపాన్ని పూజించం కనక? పొట్టేలు అగ్నికి వాహనం, నెమలి కుమారస్వామి వాహనం, జింక వాయుదేవుడి వాహనం.. తినటం లేదా? పాము సాక్షాత్తూ సుబ్రహ్మణ్యేశ్వరుడే, ఎలుక వినాయకుడి వాహనం, యివీ కొందరు తింటారు. రాముడికి సాయం చేసింది కదాని ఉడతనైనా వదిలిపెట్టరు, కొంతమంది తింటారు. (అన్నట్టు యిక్కడ యింగ్లండులో ఉడతలకు వీపుల మీద చారలు లేవండోయ్)
వెజిటేరియన్ తినేవాడు గొప్పవాడు, నాన్‌వెజ్ తినేవాడు అంతకంటె తక్కువవాడు అనగలమా? అనలేం కానీ మన మనసులో అటువంటి భావం అంతర్లీనంగా వుంటుంది. మామూలుగా నాన్‌వెజ్ తినేవాళ్లు కూడా 'మేం చాలా నిష్ఠగా వుంటామండీ, శనివారం నాడు నీచు ముట్టం' అంటూంటారు. వెజిటేరియన్ తిన్నంత మాత్రాన గొప్పవాడవుతాడా? హిట్లర్ కూడా వెజిటేరియనే. గొడ్డుమాంసం తిననివాడు తినేవాడి కంటె గొప్పవాడా? బహుభాషావేత్త, పండితుడు అయిన మద్దిపట్ల సూరిగారు ఓ సారి నాతో చెప్పారు – ''మహా పండితుడు మల్లాది రామకృష్ణ శాస్త్రిగారిని లలితా మంత్రోపాసన నేర్పమని అడిగాను. సరే మొదట వ్యాఖ్యానం నేర్పుతాను, సిగరెట్టు ముట్టించు అన్నారు. ఇదేమిటండీ, శుభమా అని మంత్రోపాసన మొదలెడుతూ సిగరెట్టేమిటి? అన్నాను. ఆయన నవ్వి, 'అంతఃకరణ, శ్రద్ధ ముఖ్యం. మాక్స్‌ముల్లర్ గొడ్డుమాంసం తినేవాడు, మరి ఆయన ఋగ్వేదానికి చేసినంత సేవ యింకెవరు చేశారు? ఆయన చూపు మందగించిపోయాక, బూటుకాళ్లతో కుర్చీలో బాసింపట్టు వేసుకుని కూర్చుని తాళపత్రాలను తెరుచుకుని చదువుకుంటూ వుండేవాడుట. ఆ ఋగ్వేదగ్రంథం ఆయన బూటుకాళ్లను తాకుతూ వుండేది. అపచారం చేశాడనుకోవాలా!? తెలుసుకోవలసినదేమిటంటే ఆహారపు అలవాట్లు, పొగతాగడాలు యివి కాదు చూడాల్సింది. చేసేపని మీద, నమ్ముకున్న దైవం మీద భక్తి వుండాలి' అని చెప్పారు.'' నిజానికి యిలాటి బోధలు మన పురాణాల్లోనే వున్నాయి. ధర్మవ్యాధుడనే కసాయివాడిని కూడా మన సంస్కృతి గౌరవించింది. తినే తిండి, చేసే వృత్తి పరిగణనలోకి తీసుకోనక్కరలేదు. ఇలా చెప్తున్నా వెజిటేరియన్సుకి తాము యితరుల కంటె పవిత్రులమనే భావం మనసులో వుంటుంది. (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (నవంబరు 2015)