ఇన్కమ్ టాక్స్ దాడులు చేయించిన పిఎంఓయే ఏడాది తిరక్కుండా వినోద్‌ను ఓ సాయం అడిగింది. దానిలో సీనియర్ ఆఫీసరైన అశోక్ సైకియా వినోద్‌కు ఫోన్ చేసి ''అర్ణబ్ దత్తా అనే యువ జర్నలిస్టుకు మీ పత్రికలో ఏదైనా ఉద్యోగం చూడు. వాళ్ల కుటుంబం నాకు బాగా తెలుసు. మీ పత్రికలో చేరాలని ఉబలాటపడుతున్నాడు.'' అని అడిగాడు. వినోద్ వెంటనే అతనికి ఉద్యోగం యిచ్చాడు. పిఎంఓతో సంబంధాలు బెడిసిన కారణంగా ఔట్‌లుక్‌కు అక్కణ్నుంచి సమాచారం అందటం లేదు. అర్ణబ్ ఆ లోటును పూరిస్తాడని అనుకున్నాడు. అప్పటికే సాఫ్ట్‌లైన్ వాజపేయి గ్రూపు (నమితా, రంజన్), హార్డ్ లైన్ ఆడ్వాణీ గ్రూపు (భార్య కమల, కూతురు ప్రతిభా) ఒకరంటే మరొకరు విముఖంగా వున్నాయి. గోధ్రా అల్లర్ల తర్వాత మోదీ గద్దె దిగాలని వాజపేయి పట్టుదలగా వుంటే, అక్కరలేదని ఆడ్వాణీ మరింత పట్టుదలగా వున్నారు. చివరకు ఆడ్వాణీ మాటే చెల్లింది. వాజపేయి 'రాజధర్మం' ఒట్టి కొటేషన్గానే మిగిలింది. గోధ్రా అల్లర్ల సమయంగా సమీకరించిన హిందూ ఓటును ఎన్‌క్యాష్ చేసుకోవడానికి మోదీ 8 నెలల ముందుగానే అసెంబ్లీని రద్దు చేసి 2002 జులైలో అసెంబ్లీ ఎన్నికలు జరపాలని ప్లాన్ చేశాడు. అయితే ఆ ప్లానుకు చీఫ్ ఎన్నికల కమిషనర్ లింగ్డో అడ్డుగా నిలబడ్డాడు. అతను తక్కిన యిద్దరు కమిషనర్లను వెంట వేసుకుని గుజరాత్ పర్యటించి అక్కడ ఎన్నికలు జరిపే స్వేచ్ఛా వాతావరణం వుందా లేదా అని అధ్యయనం చేయడానికి పూనుకున్నాడు.
లింగ్డో యిలా స్వయంగా వస్తున్నాడనగానే మోదీకి ఒళ్లు మండిపోయింది. బహిరంగసభల్లో ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ లింగ్డో పూర్తి పేరును 'జేమ్స్ మైకేల్ లింగ్డో' అని వర్ణక్రమంతో సహా ఉచ్చరిస్తూ అతను క్రైస్తవుడు కాబట్టే యిలా ప్రవర్తిస్తున్నాడన్న భావం ఓటర్లకు నాటుకునేట్లా ప్రయత్నించాడు. పర్యటన పూర్తయ్యాక ఆగస్టు 17 న సమర్పించిన 40 పేజీల నివేదికలో ''పోలీసు వ్యవస్థపై, పౌరనిర్వహణపై, రాజకీయ నాయకత్వంపై ప్రజలకు నమ్మకం నశించింది. మానవత్వం వున్న అధికారగణం వున్నపుడే వారికి స్వేచ్ఛగా ఓటేసే ధైర్యం చిక్కుతుంది. ప్రస్తుతానికి ఎన్నికలు జరిగినా ఉపయోగం లేదు. నవంబరు-డిసెంబర్లలో మళ్లీ ఒకసారి పర్యటించి అప్పుడు ఎన్నికలపై నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది'' అని రాశాడు. ఇది మోదీకి శరాఘాతం. అప్పటికి గోధ్రా వేడి చల్లారిపోతే ముందస్తు ఎన్నికల ప్లానంతా వ్యర్థమవుతుంది. అతని తరఫున అతని మిత్రులు ఆయుధాలు పట్టారు. ఆడ్వాణీ క్యాంపులో ప్రముఖుడు, మోదీకి సన్నిహితుడు అయిన అరుణ్ జైట్లే లింగ్డోపై విరుచుకుపడ్డాడు. ఆడ్వాణీ వద్దకు వెళ్లి 'ఎన్నికల కమిషనర్ చేసినది రాజ్యాంగవిరుద్ధం. ఆ ఆదేశాన్ని వెనక్కు తీసుకోమని చెప్పించాలని రాష్ట్రపతికి ఫిర్యాదు చేద్దాం' అని వాదించాడు. ఆడ్వాణీ సరేనన్నాడు. కానీ అలా చేయకూడదని వాజపేయి ఫీలయ్యారు. అయితే కాబినెట్ మీటింగు పెట్టండి, చర్చిద్దాం అన్నాడు ఆడ్వాణీ. మంత్రివర్గంలో అధికశాతం మంది ఆడ్వాణీ అనుయాయులే. ''ఆడ్వాణీ, వాజపేయి యిద్దరూ న్యాయనిపుణులు కారు. అరుణ్ జైట్లే పేరు మోసిన న్యాయవాది కాబట్టి ఆయన సలహా ప్రకారం రాష్ట్రపతికి ఫిర్యాదు చేద్దాం'' అని చాలామంది మంత్రులు వాదించారు.
ఆ విధంగా వాజపేయి ప్రభుత్వం మోదీ కోసం ఎన్నికల కమిషనర్‌తో తలపడవలసి వచ్చింది. ఇది వాజపేయికి ఎంతో అసంతృప్తి కలిగించింది. రాజీనామా చేసేద్దామా అన్నంత చికాకు కలిగింది. మోదీ కంటె, ఆడ్వాణీ కంటె అరుణ్ జైట్లేపై వాజపేయికి ఆగ్రహం కలిగింది. ఎందుకంటే యీ వ్యవహారం కోర్టుకి వెళ్లినపుడు ఐదుగురు న్యాయమూర్తులున్న సుప్రీం కోర్టు కాన్స్టిట్యూషనల్ బెంచ్ ప్రభుత్వం రాష్ట్రపతికి లేఖ రాయబూనడాన్ని తప్పు పట్టింది. ఈ లోపునే యీ విషయాలన్నీ వాజపేయి కుమార్తె నమిత, అశోక్ సైకియాల ద్వారా సేకరించిన అర్ణబ్ దత్తా ''ఔట్లుక్''లో సెప్టెంబరు సంచికలో తన పేరు బయట పెట్టకుండా కథనం రాసేశాడు. కోర్టు ఆదేశాలతో ఒళ్లు మండి వున్న అరుణ్ జైట్లేకు యీ కథనం పుండు మీద కారం రాసినట్టయింది. ఈ వివరాలు ఎక్కణ్నుంచి వచ్చాయో చెప్పమని వినోద్‌ని ఒత్తిడి చేశాడు. అతను చెప్పలేదు. వాజపేయి దత్తత కూతురే చెప్పి వుంటుందని అరుణ్ వూహించాడు. ఆడ్వాణీ ద్వారా పిఎంఓను నిలదీయించాడు. పిఎంఓ సహజంగానే మేమేమీ చెప్పలేదన్నారు. వాళ్లు చెప్పనిదే యింత వివరాలతో కథనం రాదని ఆడ్వాణీ, అరుణ్ గ్రహించారు. అశోక్ సైకియాకు ఆప్తుడైన అర్ణబ్ ఔట్లుక్ సిబ్బందిలో వున్నాడని కూడా వాళ్లకు తెలిసింది. బ్రజేష్ మిశ్రా చేత వినోద్‌కు సమాచారం ఎలా వచ్చిందో చెప్పమని ఫోన్ చేసి అడిగించారు. 'ఇవన్నీ ఎందుకు, మా కథనం తప్పని మీ పిఎంఓ నుంచి ఒక లేఖ రాస్తే సరిపోతుంది కదా' అన్నాడు వినోద్. చివరకు అరుణ్ జైట్లే రాసిన నిరసన లేఖ, కథనంలో నిజం లేదంటూ మెత్తగా వ్యతిరేకించిన వాజపేయి కుటుంబీకుల లేఖ ఔట్లుక్ ప్రచురించింది. తమ కథనం తప్పని ఎక్కడా ఒప్పుకోలేదు. వ్యవహారం యిలా ముగిసిందను కుంటూండగానే అర్ణబ్ వచ్చి 'నా కారణంగా అశోక్ అంకుల్, నమితా ఆంటీకి యిబ్బంది కలిగింది' అంటూ రాజీనామా చేసేశాడు. వినోద్ వారించినా వినలేదు.
చివరకు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు 2002 నవంబరులో జరిగాయి. గోధ్రా అల్లర్ల సమయంలో మోదీ గుజరాత్ పోలీసులను ఉపయోగించిన తీరుపై తీవ్ర అభ్యంతరాలున్న వినోద్ ''ఔట్లుక్'' పత్రిక ద్వారా శాంతిభద్రతలు పరిరక్షించేవారికే ఓటేయమంటూ గుజరాత్ ఓటర్లకు బహిరంగ లేఖ రాశాడు. ఇంగ్లండ్, అమెరికాలలో పత్రికా సంపాదకులు వ్యక్తులకు, పార్టీలకు ఓటేయమని సలహా యిచ్చే సంప్రదాయం వుంది కానీ, ఇండియాలో అలా ఎవరూ చేయరు. వినోద్ కూడా గతంలో అలా ఎప్పుడూ చేయలేదు. ఈసారి మాత్రం యీ తెగింపు చూపించాడు. అల్లర్లు అరికట్టడంలో వైఫల్యం మోదీదే కాబట్టి, యీ పిలుపు మోదీకి వ్యతిరేకమని అందరూ గ్రహించుకున్నారు. ఈ లేఖతో బాటు ఔట్లుక్ 'సి ఫోర్' అనే సంస్థ ద్వారా నిర్వహించిన ఎన్నికల సర్వే ఫలితాలను కూడా ప్రచురించారు. దాని ప్రకారం 182 సీట్లున్న అసెంబ్లీలో కాంగ్రెసుకు 95-100 సీట్లు వస్తాయని, బిజెపికి 80-85 వస్తాయని తేలింది. కానీ ఫలితాలు తారుమారుగా వచ్చాయి. బిజెపికి 127 రాగా కాంగ్రెసుకు 51 వచ్చాయి. ఇక ఔట్లుక్ సర్వేను చూసి అందరూ నవ్వసాగారు. దానితో బాటు 'నీ సలహా ఎవరూ వినలేదు చూశావా' అని వినోద్‌ను వెక్కిరించారు. కొన్ని వారాలపాటు పాఠకులు ఎత్తిపొడుపు ఉత్తరాలతో ముంచెత్తారు. (సశేషం)
-ఎమ్బీయస్ ప్రసాద్ (జూన్ 2015)