ఢిల్లీలో ఆప్ విజయం చూడగానే మన తెలుగువాళ్లకు ఆశ్చర్యం వేసింది. ఇంచుమించు యిదే ప్రయోగం యిక్కడ ఐదేళ్ల క్రితమే లోకసత్తా చేస్తే సక్సెస్ కాలేదు కానీ అక్కడెలా అయిందాని. అక్కడ గురువు అన్నా హజారే, శిష్యుడు అరవింద్ వున్నారు. క్రమేపీ ఇద్దరి మధ్యా సఖ్యత చెడి, శిష్యుణ్ని గురువు తీసిపారేసి ఆప్ పేరు చెడగొట్టడమూ జరిగింది. మన దగ్గర లోకసత్తాకు గురువూ, శిష్యుడూ రెండూ జెపియే. ఇగో క్లాష్ వచ్చే అవకాశమే లేదు. ఆయన మాటే వేదం, ఎవరికీ సమాధానం చెప్పుకోనవసరం లేదు. సామాజిక సంస్థను రాత్రికి రాత్రి రాజకీయపక్షంగా మార్చగలరు. రాత్రికి రాత్రి వ్యాపారవేత్తలకు పిలిచి పార్టీ టిక్కెట్టు యివ్వగలరు. ఆయన ఏం చేసినా అనుచరులకు మహబాగే. తప్పులే కనబడవు. పార్టీ ఏకతాటిపై నడుస్తుంది. మంత్రిపదవి దక్కక అలిగినవారిని బుజ్జగించడం, ప్రమాణస్వీకారం చేసేవరకు బస్సుల్లో తిరిగి, చేశాక ఇన్నోవా కార్లు ఎక్కడం, నాలుగు బెడ్‌రూమ్‌ల ఫ్లాట్ నుండి ఐదు బెడ్‌రూమ్‌ల డూప్లేకు మారబోయి ఎస్సెమ్మెస్ తడాఖాకు జంకడం – యిలాటి తలనొప్పులు ఆప్‌కు వున్నాయి తప్ప లోకసత్తాకు యిప్పటివరకు ఎదురుకాలేదు. అందువలన లెక్కప్రకారం ఢిల్లీలో ఆప్ కంటె ఆంధ్రలో లోకసత్తాకు ఎక్కువ ఛాన్సుండాలి. మరి ఉందా?
అన్నా హజారే పతాకచ్ఛాయ నుండి వచ్చిన అరవింద్
అరవింద్ కేజ్రీవాల్ చెప్పినది వింటూ వుంటే యిదంతా ఎక్కడో గతంలోనే వినేసినట్టు తెలుగువాళ్లకు అనిపించడానికి కారణం జెపి! అరవింద్ ఐఏఎస్ దక్కించుకోలేక ఐఆర్‌ఎస్‌కు సెటిలయినవాడు. జెపి డైరక్టుగా ఎంపికైన నికరమైన ఐఏఏస్. అరవింద్ ఇంజనీరింగు చదివితే, జెపి డాక్టరీ చదివారు. అరవింద్ ఇన్‌కమ్‌టాక్స్ డిపార్టుమెంటులో మాత్రం పని చేయగా, జెపి అనుభవం విస్తృతమైనది. రాజకీయనాయకులతో కూడా సన్నిహితంగా పని చేసి, వారి కుటుంబకలహాలను కూడా ప్రత్యక్షంగా చూసిన దిట్ట. అరవింద్ కంటె దేశవిదేశాల గురించిన సమాచారం జెపికే ఎక్కువ తెలుసని తోస్తుంది. వ్యాసకర్త. వక్త. చర్చావేదికల సమన్వయకర్త. అరవింద్‌కు యిన్ని కళలు వచ్చినట్టు లేదు. అరవింద్ అంతకుముందే మెగసెసే అవార్డు గ్రహీత అయినా, అన్నా హజారే వెల్లువలోనే ప్రజల దృష్టిలో పడ్డారు. అన్నా, అన్నా అంటూనే గ్రూపులు కట్టి ఆయన అభీష్టానికి వ్యతిరేకంగా పార్టీ పెట్టి నిందలు పడ్డారు.
కాస్త కవిత్వం కలిపి చెప్పాలంటే – సూర్యుడి వలన వికసించిన తామరపువ్వు అరవింద్ కాగా జయప్రకాశ్ నారాయణ్, స్వయంప్రకాశం గల సూర్యనారాయణుడు! జెపి స్వయంప్రతిభతో ప్రజల దృష్టిని ఆకర్షించారు. ఆయన ఉద్యమానికి ఆయనే సారథి. అందరి వెక్కిరింతలు ఎదుర్కుంటూ ఉద్యమం నడిపారు. ఓ పుణ్యదినాన ఏమనుకున్నారో ఏమో పార్టీగా మార్చి ఎన్నికలలోకి దిగారు. అది కూడా ఏ పంచాయితీకో, మునిసిపాలిటీకో కాదు, ఏకంగా ఎసెంబ్లీకే ఎసరు పడేశారు. అది అత్తెసరులా కూడా తేలలేదు సరికదా, పొయ్యి సైతం ఆరిపోయింది. ఎన్నికల ఫలితాలు చూశాక ఎమ్మెల్యేలు, నాయకులు పార్టీని విడిచి వెళ్లిపోలేదు. ఎందుకంటే పార్టీలో జెపి తప్ప ఎమ్మెల్యేలు లేరు, ఇద్దరు ముగ్గురు తప్ప యితర నాయకులూ లేరు. అయితే అభిమానుల సంఖ్యలో, ఉత్సాహంలో మాత్రం క్షీణత వచ్చింది.
లోకసత్తా అభిమానుల్లో మళ్లీ చిగురించిన ఆశలు
అయితే యిప్పుడు ఆప్ విజయంతో లోకసత్తా అభిమానుల్లో మళ్లీ ఉత్సాహం రగులుతోంది. ఆప్ కంటె ముందుగానే ఆ బాట వేసి చూపిన జెపి మన రాష్ట్రంలో ఆప్ యూనిట్‌ను కలుపుకోవడమో, లేక పొత్తు పెట్టుకోవడమో చేసి తన ఉద్యమాన్ని ముందుకు తీసుకుని వెళ్లాలని వారాశిస్తున్నారు. దేశంలో పలు నియోజకవర్గాల్లో ఆప్ తన కార్యకర్తలను తయారుచేద్దామని చూస్తోంది. ఆప్ వ్యాప్తికి బలం చేకూర్చినది నెటిజన్లే కాబట్టి, నెటిజన్లలో తెలుగువారి సంఖ్య గణనీయంగా వుంది కాబట్టి, ఆప్ యూనిట్లు మన రాష్ట్రంలో వెలిసేందుకు గట్టి అవకాశం వుంది. అప్పుడే కొంతమంది ఆ ప్రయత్నాల్లో వున్నారు కూడా. దక్షిణాదిన సినిమా నటీనటులకు రాజకీయ కార్యకలాపాలు కూడా అలవాటే కాబట్టి వాళ్లూ చేరతారు. ఏదో ఒక స్థాయిలో ఆప్ ఉద్యమం యిక్కడ ఊపు అందుకుంటుంది. జనం దృష్టంతా తెలంగాణ బిల్లుపైనే వుంది కాబట్టి జనవరి 23 వెళ్లాక ఏ రిపబ్లిక్ దినోత్సవం నాడో, మాఘమాసంలో ఓ మంచిరోజునో ఆప్ కార్యకలాపాలు ప్రారంభం కావచ్చు.
ఆ ఉద్యమంతో జెపి ఏదో ఒకలా సంపర్కం పెట్టుకోకపోతే లోకసత్తాకున్న 1-2% ఓట్లు కూడా ఆప్ పట్టుకుని పోవచ్చు, కనీసం గండి కొట్టవచ్చు. అందువలన ఆప్ విషయంలో ఎలా వ్యవహరించాలో జెపి త్వరగా ఒక ఆలోచనకు రావడం మేలు. 'మీరు కావాలంటే దేశంలో మిగతా రాష్ట్రాలలో తంటాలు పడండి, మీ తరహా ఉద్యమం ఎప్పణ్నుంచో యిక్కడ నడుస్తోంది. ఈ రాష్ట్రానికి మాకు వదిలేయండి' అని లోకసత్తా అభిమానులు ఆప్ అభిమానులకు చెప్పలేరు కదా! ఈ యిద్దరి మధ్య విలీనం/పొత్తు/అవగాహన ఏదైనా ఏర్పడుతుందా అని ఆలోచించే ముందు వీరిద్దరి మధ్య పోలికలు, వ్యత్యాసాలు చూడాలి.
ఆప్-లోకసత్తా పోలికలు, తేడాలు
ఆప్ ఫోకసంతా అవినీతి మీదే వుంది. నీరు, విద్యుత్ వంటి జనాకర్షక పథకాలమీదే వుంది. ఉద్యోగులలో క్రమశిక్షణ తెస్తామంటున్నారు. ఆర్థికవిధానాల రూపకల్పన, నిధుల సేకరణ, వాటిని ఏయే రంగంపై ఎలా ఖర్చు చేయాలి యిత్యాది గంభీరమైన విషయాల జోలికి వెళ్లినట్లు లేదు. జెపి ఆ విషయాల్లో ఘటికుడు. సిద్ధాంతపరమైన అనేక విషయాలపై సాధికారికంగా ప్రసంగించగలరు. ప్రణాళికలు రచించగలరు. అవే ఆయనపై మేధావి ముద్ర కొట్టాయి. మనకంటె ఉన్నతస్థానంలో నిలబడిన వ్యక్తిగా చూపించి, గౌరవాన్ని కలిగించాయి. అదే సమయంలో 'యీయన మనలాటివాడు కాడు, మన వేవ్‌లెంగ్త్‌లో ఆలోచించడు' అనిపించి 'ఎలీయనేషన్' (తెలుగులో పరాయీకరణ అంటున్నారు) కలిగించింది కూడా. అరవింద్ విషయంలో అతను మామూలు మాటలే మాట్లాడడం వలన తన పార్టీ పేరుకి తగ్గట్టుగా 'సామాన్యుడే' అనిపించి ఆత్మీయంగా అనిపించాడు. జెపికి మధ్యతరగతిలో మాత్రమే ఫాలోయింగ్ ఏర్పడింది. అరవింద్‌కు కింది తరగతివాళ్లలో కూడా క్రేజ్ ఏర్పడింది. వాళ్లకు తగిన భాష మాట్లాడాడు అతను. పైగా ఆప్ ఉద్యమం ఎక్కువకాలం లేదు కాబట్టి ప్రజలు ఆశలు పెట్టుకోవడానికి ఛాన్సు కలిగింది. లోకసత్తా ఉద్యమం చాలాకాలం నడిచి 'ఇది పేపర్ టైగరే, ఆశయాలు వల్లిస్తుంది తప్ప ఆచరణలోకి దిగదు' అని అనిపించింది. ఇంకో ఏడాది తర్వాత ఆప్‌పై కూడా యిలాటి అభిప్రాయమే కలిగితే కలగవచ్చు.
అరవింద్‌కు మీడియా, సోషల్ మీడియా విపరీతంగా మద్దతు యిచ్చింది. అన్ని వర్గాల వాళ్లూ వెంట నిలిచారు. ఎందుకంటే అతను వ్యవస్థలో వున్న అందరినీ తిట్టిపోశాడు. అన్ని పార్టీలను సమానదృష్టితో ఏకిపారేశాడు. అది సామాన్యుడికి నచ్చింది. జెపి విషయంలో అది జరగలేదు. ఆయన ''ఈనాడు''తో బాగా ఐడెంటిఫై అయిపోయారు. ఈనాడులో వ్యాసాలు రాశారు, ఈటీవీలో చర్చావేదికలు నిర్వహించారు. ఆయన ఉద్యమానికి ఈనాడు మద్దతు యిచ్చింది. వారి 'జనబలం' పత్రికను ఈనాడు గ్రూపు మార్కెట్ చేస్తోంది. ఈనాడు కేవలం మీడియా గ్రూపుగానే వుండి, రాజకీయపరమైన రాగద్వేషాలు చూపకుండా వుండి వుంటే పేచీ లేకపోయేది. కానీ అది 'మేం కాంగ్రెసుకు వ్యతిరేకం. దానికి ప్రత్యామ్నాయంగా ఎవరు వచ్చినా వారికి మద్దతు యిస్తాం' అని బాహాటంగా ప్రకటించుకుని పక్షపాతాన్ని ప్రకటించుకుంది. అలా అని కాంగ్రెసును వ్యతిరేకించిన పార్టీలన్నిటికీ మద్దతు యివ్వలేదు. తెలుగుదేశం పార్టీతో మమేకమై పోయింది. వార్తల మాట ఎలా వున్నా, వ్యాఖ్యలు మాత్రం టిడిపికి అనుకూలమైనవే అన్నది తెలుగువారందరూ ఎరిగిన సత్యం.
జెపి యిమేజి దెబ్బ తిన్న సందర్భం
ఈ సంస్థతో ముడివేసుకోవడం జెపికి నష్టదాయకంగా పరిణమించింది. 'ఆయన అభిప్రాయాలకు వేదికగా ఉపయోగించుకున్నారు తప్ప ఈనాడు విధానాలతో ఆయనకు సంబంధం లేదు' అని జెపికి మనం మినహాయింపు యివ్వవచ్చు. (నేను తరచుగా చెప్తూ వుంటాను – 'దాదాపు 40 పబ్లికేషన్స్‌కి నేను రాసినపుడు వారందరి ఎడిటోరియల్ పాలసీతో, ఆర్థికపరమైన లావాదేవీలతో, రాజకీయ ఉద్దేశాలతో నేను ఏకీభవించినట్టు కాదు కదా' అని). కానీ మార్గదర్శి విషయంలో తను యిచ్చిన స్టేటుమెంటుతో జెపి ఆ కవచాన్ని పోగొట్టుకున్నారు. మార్గదర్శి ఆర్థిక నేరాల గురించి ఉండవల్లి బయటపెట్టినపుడు జెపి ఉండవల్లిని విమర్శించారు – అది ఆయన పని కాదని, ఆ పని చేయడానికి వేరే గవర్నమెంటు ఏజన్సీలు వున్నాయనీ. పెట్రోలు కల్తీ గురించి చూడడానికి కూడా వేరే శాఖలున్నాయి, కానీ లోకసత్తా వాలంటీర్లు తనిఖీలు ఎందుకు చేసినట్లు? ఎక్కడైనా భారీ సభ జరిగితే చెత్త ఎత్తడానికి కార్పోరేషన్ ఉద్యోగులు వుంటారు, మర్నాడు పొద్దున్నే వీళ్లెందుకు తయారయినట్టు? ఇలా గట్టిగా నిలదీస్తే 'నాకు ఆ రూల్సు గురించి సరిగ్గా తెలియదు' అని చెప్పి తప్పించుకోబోయారు.
ఆస్ట్రేలియా ఆర్థికపరిస్థితి గురించి, ఆర్కిటికాలో మంచినీటి సరఫరా గురించి కూడా ఉపన్యాసాలు యివ్వగలగిన సత్తా వున్న వ్యక్తి యిలా మాట్లాడడం చేత 'ఈయనకు ఈనాడుతో మొహమాటం వుండి నిక్కచ్చిగా మాట్లాడలేకపోతున్నాడు. వ్యాపారవేత్తలతో, కాంట్రాక్టర్లతో మొహమాటాలతో రాజీ పడే రాజకీయనాయకులకు, యీయనకు తేడా ఏముంది?' అన్న ఆలోచన కలిగింది ఆయన అభిమానులకు. అప్పటినుండి ఆయన పాప్యులారిటీ తగ్గసాగింది. 2009 ఎన్నికలలో పోటీ చేసేముందు లోకసత్తా ఘనంగా చాటుకుంది – 'ఇవి సెమి ఫైనల్స్, 2014 నాటికి అధికారం మాదే' అని. 2014 వచ్చేసింది. లోకసత్తాకు సత్తా లభిస్తుందంటే జనాలు జోక్ అనుకుంటారు. వారు ఆశించిన రీతిలో పార్టీ పురోగతి సాధించలేదు. 2009 ఎన్నికలలో సాధారణ పార్టీల్లాగే విజ్ఞాన్ రత్తయ్యగారిని అప్పటికప్పుడు పార్టీలో చేర్చుకుని టిక్కెట్టు యివ్వడం వంటివి జరిగాయి. పార్టీ టిక్కెట్టు కోసం ఎవరు ముందుకు వస్తే వాళ్లకు యివ్వడం జరిగింది. వారి గుణగణాలను విశ్లేషించే టైము, సాధనసంపత్తి కూడా లేకపోయింది. అలా వచ్చినవారిలో యాదృచ్ఛికంగా జెపి కులంవారే ఎక్కువమంది తేలారుట. జెపికి ఆ దృష్టి వుండి వుండదు. తన విధానాలను నమ్మి వచ్చినవారికి టిక్కెట్టు యిచ్చారు. ఆయన కులం వారికే ఆయనపై నమ్మకం ఎక్కువ వున్నట్టుంది. దానికి ఆయనేం చేస్తారు? పైగా ఆ కులం ప్రాబల్యం ఎక్కువగా వున్న జిల్లాలలోనే ఆ పార్టీ ఎక్కువ ఓట్లు సంపాదించుకోగలిగింది.
టిడిపి లోకసత్తాపై ఎందుకు విరుచుకుపడింది?
అదే కులం దన్నుతో రాజకీయాలు నడుపుతున్న టిడిపి ఓట్లకు యీ విధంగా గండి పడింది. దాంతో చంద్రబాబు లోకసత్తాపై మండిపడ్డారు. నాన్-సీరియస్ పార్టీలు వచ్చి రాజకీయాలను చెడగొడుతున్నాయన్నారు. నిజానికి చాలామంది అనే మాట ఏమిటంటే – 'పోనుపోను మధ్యతరగతి బుద్ధిజీవుల్లో టిడిపి విధానాలపై అసంతృప్తి పెరుగుతోందని గ్రహించిన బాబు, రామోజీరావుగార్లు ఆ ఓట్లు కాంగ్రెసువైపు మళ్లకుండా జెపిని నిలబెట్టారని, ఎన్నికల తర్వాత అవసరమైతే 'లెస్సర్ ఈవిల్' ప్రాతిపదికపై (అన్ని పార్టీలు పనికిమాలినవే కానీ వున్నవాళ్లలో టిడిపి కాస్త ఫర్వాలేదు అనే వాదంతో) టిడిపికి మద్దతు యిచ్చేట్లా ఏర్పాటయిందనీ!'. కానీ అనుకోని విధంగా లోకసత్తా టిడిపి ఓట్లనే పట్టుకుపోవడంతో బాబు జెపిని బాగా విమర్శించసాగారు. ఆ వైరం యిటీవలి కాలంలో తగ్గిపోయినట్లుంది. జెపి యిప్పుడు చంద్రబాబు భాషే మాట్లాడుతున్నారు, ఆయన భావాలనే ప్రతిబింబిస్తున్నారు. రాష్ట్రవిభజనపై ఆయన కెంత స్పష్టత వుందో, యీయనకే అంతే వుంది. కాస్సేపు యిదంటారు, కాస్సేపు అదంటారు. ఏ వర్గాన్నీ మెప్పించలేని స్థితిలో వున్నారు.
అరవింద్ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు. ప్రభంజనంలా వచ్చారు. షీలా దీక్షిత్ ఎక్కడ నిలబడితే అక్కడ నిలబడి ఓడిస్తానని ప్రతిన పూనారు. అది దుస్సాహసంగా తోచినా కార్యకర్తలలో ఉత్తేజం నింపింది. మొరేల్ బూస్టర్ అంటారు కదా అలా పనిచేసింది. మరి జెపి? టిడిపికి సన్నిహితులని పేరుబడ్డారు. వైయస్సార్ అవినీతిపై నిప్పులు కురిపించారు కాబట్టి పులివెందలలోనే నిలబడి వుంటే అదో మాట, బాబుపై కూడా విమర్శలు చేశారు కాబట్టి కుప్పంలో నిలబడినా గొప్పగా వుండేది. అలాటిది ఏమీ చేయకుండా కూకట్‌పల్లిలో నిలబడ్డారు. ఆంధ్రప్రాంతం నుండి వచ్చి స్థిరపడిన మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా వున్న నియోజకవర్గం కాబట్టి, తెరాసతో పొత్తు పెట్టుకున్న టిడిపిపై కోపంతో ఓటర్లు యీయన్ని గెలిపించారు. కార్పోరేషన్ ఎన్నికల టైముకి తెరాసతో సంబంధం తెంపుకున్నాక మళ్లీ టిడిపిని ఆదరించారు, లోకసత్తా అభ్యర్థులను ఓడించారు. 2014లో జెపి మళ్లీ గెలుస్తారని ఎవరూ గ్యారంటీ యివ్వలేని పరిస్థితి. జెపి సమైక్యం కోసం దృఢంగా నిలబడి వుంటే పోనీ ఆంధ్రలోనైనా ఆదరించేవారు. ఆయన 'ఇదో పెద్ద అంశం కాదు, అధికార వికేంద్రీకరణే అసలు లక్ష్యం కావాలి' అంటూ పాఠాలు చెపుతూ కాలక్షేపం చేయడం వలన సమైక్య ఉద్యమం టైములో జెపి వెళ్లి మాట్లాడితే తిరస్కరించి, అవమానించి పంపారు.
మరి యిలాటి లోకసత్తా పార్టీతో ఆప్ చేతులు కలపడానికి సిద్ధపడుతుందంటారా? కలపకపోతే ఆప్‌కి నష్టమా? లోకసత్తాకు నష్టమా? వేచి చూదాం.
– ఎమ్బీయస్ ప్రసాద్ (జనవరి 2014)