నేనిచ్చిన తీర్పు తప్పు అని ఒప్పుకున్న జడ్జి

అమెరికా న్యాయచరిత్రలో ఎన్నడూ జరగని వింత జరిగింది. బ్రూక్లిన్‌ రాష్ట్రంలో జడ్జిగా పని చేసి రిటైరైన ఫ్రాంక్‌ బార్బరా అనే 85 ఏళ్ల పెద్దమనిషి  14 ఏళ్ల క్రితం తాను యిచ్చిన తీర్పు తప్పు…

అమెరికా న్యాయచరిత్రలో ఎన్నడూ జరగని వింత జరిగింది. బ్రూక్లిన్‌ రాష్ట్రంలో జడ్జిగా పని చేసి రిటైరైన ఫ్రాంక్‌ బార్బరా అనే 85 ఏళ్ల పెద్దమనిషి  14 ఏళ్ల క్రితం తాను యిచ్చిన తీర్పు తప్పు అని కోర్టులో బోనెక్కి చెప్పాడు. 

1998 నవంబరు 4 న బ్రూక్లిన్‌లో ఓ సినిమాహాలుకి వెళ్లిన వాళ్లల్లో యిద్దరు యువకులున్నారు. ఒకడు వేవెల్‌ వింట్‌. తాగి తన స్నేహితులతో సినిమాకు వచ్చాడు. ఇంకోడు ఫ్రాంక్‌ కాగన్‌. తాగలేదు కానీ లైసెన్సు లేని పిస్టల్‌ ఒకటి జేబులో పెట్టుకుని వచ్చాడు. సినిమా అయిపోయిన తర్వాత ఎందుకోగానీ వీళ్లిద్దరూ ఘర్షణ పడ్డారు. వింట్‌ తన బంగారు గొలుసు లాక్కోబోయాడని, అందుకే జేబులోంచి పిస్టల్‌ బయటకు లాగానని కాగన్‌ కోర్టులో చెప్పాడు. వింట్‌ను అతని స్నేహితులు పక్కకు లాక్కెళ్లారు. అయితే తాగి వున్న వింట్‌ మహోద్రేకంతో వాళ్లను విదుల్చుకుని మళ్లీ కాగన్‌పై పడ్డాడు. జేబులో పెట్టేసుకున్న పిస్టల్‌ను కాగన్‌ మళ్లీ బయటకు లాగి వింట్‌ను బెదిరించాడు. వింట్‌ దాన్ని లాక్కోబోయాడు. తుపాకీ పేలింది. గుళ్లు వింట్‌ ఛాతీలోకి, కడుపులోకి వెళ్లి అతను కుప్పకూలి చనిపోయాడు. అక్రమంగా ఆయుధం కలిగి వున్నందుకు, హత్య చేసినందుకు పోలీసులు కాగన్‌ను అరెస్టు చేశారు. 1999 అక్టోబరులో కేసు విచారణకు వచ్చింది. ఆత్మరక్షణ కోసమే కాల్చానని, తనకు జడ్జి నిర్ణయంపై నమ్మకం వుందని, జ్యూరీకై అడిగే హక్కున్నా తాను ఆ హక్కు వినియోగించుకోవడం లేదనీ కాగన్‌ కోర్టులో చెప్పాడు. 

కాగన్‌ తలరాత రాసే ఛాన్సు జడ్జికి వచ్చింది. ఆయన అంతకుముందు రాజకీయవేత్త. తెల్లవాళ్లు నల్లవాళ్లపై చూపుతున్న జాతివివక్షతకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేసిన వ్యక్తి. అతను కాగన్‌ ఆత్మరక్షణ వాదాన్ని కొట్టి పారేసి 15 ఏళ్ల జైలుశిక్ష వేశాడు. దానిపై 2004లో అప్పీల్‌ కెళితే పై కోర్టువారు కొట్టేసారు. కేసు అంత పటిష్టంగా వుందన్నమాట. '..కానీ అవేళ యిచ్చిన తీర్పు తప్పేమోనన్న సందేహం నా మనస్సులో అలాగే వుండిపోయింది. రిటైరై పోయిన తర్వాత పేపర్లో ఏదైనా తప్పు జడ్జిమెంటు గురించి చదివినపుడు నా తీర్పును సింహావలోకనం చేసుకోమని నా అంతరాత్మ చెపుతూ వుండేది. ఏడాది ఏడాదికీ అది పెరగసాగింది. దాంతో నేను కాగన్‌ డిఫెన్సు లాయర్‌గా పనిచేసినతన్ని సంప్రదించి, ఆ కేసంతా కక్షుణ్ణంగా చదివాను. కాగన్‌ ఆత్మరక్షణకోసమే పోరాడాడని నాకు యిప్పుడు తోచింది. మరి ఆ రోజు అలా ఎందుకు తోచలేదా అని ఆత్మపరిశీలన చేసుకుంటే నాకు ఓ విషయం తట్టింది. కాగన్‌ తెల్లవాడు, వింట్‌ నల్లవాడు. తెల్లవాళ్ల జాతివివక్షతకు వ్యతిరేకంగా పోరాడిన నాలో అంతర్గతంగా తెల్లవాళ్లపై కోపం వుండిపోయినట్టుంది. అవకాశం రాగానే దాన్ని వినియోగించుకున్నాను. దానికి యిప్పుడు పశ్చాత్తాపపడుతున్నాను. ఆ నాటి తీర్పును పక్కన పెట్టేసి కాగన్‌కు న్యాయం చేకూర్చండి' అని బార్బరో కోర్టుకి అపీల్‌ చేశాడు. కేసు మళ్లీ తెరిచారు. అతను గతవారం కోర్టులో బోనెక్కి యీ విషయాలు చెప్పగానే ఏం చేయాలో తోచక తలలు పట్టుకున్నారు. కొన్ని సందర్భాల్లో జ్యూరీ సభ్యులు 'తాము ఫలానా కేసులో వెలిబుచ్చిన నిర్ణయం తప్పనిపిస్తోందంటూ కోర్టుకి రావడం జరుగుతూంటుంది. ఆ కేసుల్లో తీర్పు తిరగదోడిన సందర్భాలు లేవు. కానీ సాక్షాత్తూ జడ్జే యిలా అంటున్నపుడు ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారు.

-ఎమ్బీయస్‌ ప్రసాద్‌ 

[email protected]