ఎమ్బీయస్‌: యూరోప్‌ గాథలు – 28

అతని అధికార నివాసాన్ని రాజకీయ కార్యకలాపాలన్నీ జరిగే ఫోరమ్‌ అనే ప్రాంతంలో యిచ్చారు. అక్కడ వుండటం చేత అతనికి రోమ్‌ రాజకీయనాయకులతో పరిచయాలు బాగా పెరిగాయి. ఈ పరిచయాల మాట ఎలా వున్నా పదవులకోసం…

అతని అధికార నివాసాన్ని రాజకీయ కార్యకలాపాలన్నీ జరిగే ఫోరమ్‌ అనే ప్రాంతంలో యిచ్చారు. అక్కడ వుండటం చేత అతనికి రోమ్‌ రాజకీయనాయకులతో పరిచయాలు బాగా పెరిగాయి. ఈ పరిచయాల మాట ఎలా వున్నా పదవులకోసం పోటీ పడడానికి చాలా ఖర్చయింది. ఇప్పటిలాగానే అప్పుడూ రాజకీయాలు చాలా ఖర్చుదారీ వ్యవహారం. ఇటీవల ఒక పార్టీ వారు ''బాహుబలి'' సినిమా ఆడుతున్న థియేటర్లో కొన్ని షోల టిక్కెట్లన్నీ కొనేసి తమ పార్టీ అభిమానుల కోసం షోలు ఏర్పాటు చేశారని వార్త వచ్చింది. దాన్ని చూడాలని ప్రజలందరూ ఎగబడుతున్నపుడు వారికి ఆ అవకాశం ఉచితంగా కల్పించి, పార్టీ పట్ల, తమ పట్ల అభిమానం పెంచుకోవాలని నాయకుల ఆశ. అప్పట్లో సినిమాలు లేవు కానీ గ్లాడియేటర్‌ షోలు వుండేవి. రాజకీయనాయకులు కొన్ని గ్లాడియేటరు యుద్ధాల షోలను స్పాన్సర్‌ చేసి ఆ మల్లయుద్ధాలు ఓటర్లకు ఉచితంగా చూపించి పాప్యులారిటీ పెంచుకునేవారు. క్రీ.పూ. 65లో సీజరు అప్పులు చేసి, అనేకమంది గ్లాడియేటర్లను కొనేసేవాడు. వాళ్లు చనిపోయేదాకా యుద్ధం చేయనవసరం లేదనేవాడు. పదేపదే షోలు ఏర్పాటు చేసేవాడు. దానివలన అతనికి పలుకకుబడి ఎంత పెరిగిపోయిందంటే ఒక నాయకుడు యింతకు మించి షోలు స్పాన్సరు చేయడానికి వీల్లేదు అని పరిమితి విధిస్తూ సెనేట్‌ చట్టం పాస్‌ చేసేటంత! 

రోమన్‌ చట్టం ప్రకారం ఓటర్లకు డబ్బు పంచడాన్ని లంచంగా పరిగణించేవారు కాదు. పైగా తన సొంతానికి ఖర్చు పెట్టుకోకుండా పదిమందితో ఐశ్వర్యాన్ని పంచుకునే ఔదార్యంగా చూసేవారు. సీజరు సీనియర్లు, సమకాలీనులు పెద్ద పెద్ద బంగళాలలో వుంటూ, తరచుగా విందులిస్తూ, విలాసాలపై విపరీతంగా ఖర్చు పెడుతూ వుంటే సీజరు బయటకు ఆడంబరంగా కనబడేవాడు కాదు. అందరికీ ఉదారంగా కానుకలు యిస్తూ, సేవకులను కరుణతో చూస్తూ, మంచివాడిగా పేరు తెచ్చుకున్నాడు. క్రీ.పూ.62కి ప్రియేటర్‌ (జడ్జి) పదవి సంపాదించాడు. ఈ మంచివాడు యిమేజి కోసం, పదవుల కోసం చేసిన అప్పులు పెరిగి బాకీదారుల నుంచి తప్పించుకోవడానికి ఒక్కోసారి రాత్రిపూట ఊరి నుంచి తప్పించుకుని పారిపోతూ వుండేవాడు. ఈ తిప్పలు తప్పించుకునే మార్గం గురించి వెతికాడు. అప్పట్లో యీ పదవిలో వున్నవాడిని ఏదైనా ప్రాంతానికి గవర్నరుగా నియమించే పద్ధతి వుండేది. క్రీ.పూ. 61లో స్పెయిన్‌కు గవర్నరు అయ్యాడు. అక్కడ వచ్చిన ఆదాయంతో అప్పులు తీర్చేశాడు.

క్రీ.పూ. 60 వచ్చేసరికి సీజరు పాంపే, క్రాసస్‌లతో జట్టుకట్టాడు. ఈ త్రయంలో పాంపేకు మిలటరీ శక్తి వుంది, క్రాసస్‌కు డబ్బుంది, సీజరుకు పాప్యులారిటీ వుంది. మిగతా యిద్దరి సహాయంతో వచ్చే ఏడాది అంటే క్రీ.పూ. 59లో కాన్సల్‌ పదవికి పోటీ పడి, అతి సులభంగా గెలిచాడు. మరో కాన్సల్‌గా మార్కస్‌ బిబ్యులస్‌ నెగ్గాడు. కాల్‌పూర్నియాను పెళ్లాడాడు. ఇక యిప్పణ్నుంచి క్రాసస్‌, పాంపేలు తన మాట జవదాటకుండా వుండే అవకాశాలు వెతికాడు. గుఱ్ఱాలను పెంచి, పోషించే కార్పోరేషన్లు రోమన్‌ సామ్రాజ్యంలో బలంగా వుండేవి. క్రాసస్‌ ఆ లాబీకిి ఋణాలు యిచ్చి, వారి ప్రయోజనాల కోసం సెనేట్‌లో పోట్లాడేవాడు. అయితే ఆ కార్పోరేషన్ల లావాదేవీల్లో గోల్‌మాల్‌ జరిగింది. వాళ్లు పన్ను బకాయి బడ్డారు. బకాయి రద్దు చేయాలని, లేకపోతే వాళ్లు దివాళా తీస్తారని క్రాసస్‌ సెనేట్‌లో వాదించాడు. అయినా సెనేట్‌ ఒప్పుకోలేదు. అది క్రాసస్‌ సమస్య. అలాగే పాంపేకు కూడా మరో సమస్య వుంది. అతని సైనికులు సైన్యంలో పదవీవిరమణ చేసిన తర్వాత రావలసిన డబ్బుల గురించి అడుగుతున్నారు. వాటి కోసం పాంపే అడిగినా సెనేట్‌ ఒప్పుకోలేదు. సీజరు వీళ్లిద్దరినీ మచ్చిక చేసుకోవడానికి యిదే తరుణం అనుకున్నాడు. ''సెనేట్‌ ఆమోదంతో పని లేకుండా చట్టాలు చేసే అధికారాలు కాన్సల్‌కు వుంది. మీ యిద్దరి కష్టాలు గట్టెక్కేట్లా నేను చట్టాలు పాస్‌ చేస్తాను, దానికి బదులుగా మీరు నాకు సాయం చేయాలి. నేను కోరుకున్న ఒక ప్రాంతానికి గవర్నరుగా నేను ఒకటీ, రెండూ కాదు, ఐదేళ్లు వుందామనుకుంటున్నాను. దానికి అనుగుణంగా చట్టం మార్చడానికి మీరు మద్దతు యివ్వాలి.'' అని ప్రతిపాదించాడు. అంతకు ముందే పాంపేకు తన కుమార్తె జూలియాను యిచ్చి పెళ్లి చేశాడు.

ఈ విధమైన క్విడ్‌ప్రోకో సెనేట్‌ సభ్యులను మండించింది. ముఖ్యంగా సీజరు తోటి కాన్సల్‌ బిబ్యులస్‌ను. ఈ గూడుపుఠాణీని అడ్డుకుంటాం అంటూ సెనేట్‌లో కొందరు గోల చేశారు. ఈ ముగ్గురి అనుయాయులూ గోల చేశారు. ఈ గలభాలో సీజర్‌ ప్రత్యర్థిపై సెనేట్‌ హాలులో వున్న చెత్తబుట్టను బిబ్యులస్‌ నెత్తిమీద బోర్లించారెవరో. గందరగోళంలో చట్టాలు పాస్‌ అయిపోయాయి. పాంపే, క్రాసస్‌లకు వాళ్లకు కావలసినది వాళ్లకు దక్కింది. సీజరుకు ఒకటి కాదు, మూడు ప్రాంతాలపై గవర్నరు గిరీ దక్కింది. అలా క్రీ.పూ. 58 వచ్చేసరికి సీజరు దక్షిణ ఫ్రాన్సు, ఉత్తర ఇటలీ, ఇప్పటి క్రోషియాలపై ఆధిపత్యం వచ్చేసింది. క్రీ.పూ.58 నాటికి కాన్సల్‌ పదవీకాలం ముగిసిపోయాక 8 ఏళ్ల పాటు సీజరు మిలటరీ జనరల్‌గా ఘనవిజయాలు సాధిస్తూ రోమ్‌ కీర్తిని దశదిశలా వ్యాపింపచేస్తూ, రోమన్‌ ప్రజలకు ఆరాధ్యుడైపోయాడు. నిజానికి సీజరు అప్పటివరకు సీజర్ని ఎవరూ గొప్ప శూరుడిగా అనుకోలేదు. కానీ రాజకీయతంత్రాన్ని పూర్తిగా వంటపట్టించుకున్న సీజరు రణరంగంలో కూడా దీర్ఘప్రణాళికలతో, ముందుచూపుతో, గూఢచారుల సాయంతో శత్రువులను విడగొట్టి, గందరగోళ పరచి విజయాలు సాధించాడు. అంతేకాదు, దండెత్తిన చోట స్థానిక ప్రజలను ఆదరంగా చూస్తూ, వారి అభిమానాన్ని చూరగొంటూ వాళ్లు తనకు సహకరించేట్లా చేసుకున్నాడు. 'ద గాలిక్‌ వార్స్‌' అనే పేరుతో తన జైత్రయాత్రను గ్రంథస్తం చేయించాడు కూడా. ఇప్పటి పేర్లతో చెప్పాలంటే అతను స్విజర్లండ్‌, బెల్జియం, ఫ్రాన్సు, జర్మనీ, బ్రిటన్‌లోని అనేక తెగలను ఓడించాడు. 

సీజరుకు యింత పేరు రావడం క్రాసస్‌, పాంపేలకు రుచించలేదు. క్రాసస్‌ తను కూడా సొంతంగా పేరుప్రఖ్యాతులు సంపాదించాలనుకుని,  నేటి ఇరాన్‌, ఇరాక్‌లు కలిసి వున్న ఆనాటి పార్థియన్‌ సామ్రాజ్యంపై దండెత్తాడు. అది రోమ్‌ సరిహద్దుల్లో వుంది కానీ వారికీ వీరికీ వైరం లేదు. అయినా క్రాసస్‌ అన్యాయంగా క్రీ.పూ. 53లో దాడికి తెగించాడు. క్రాసస్‌ వెంట వున్న పెద్ద సైన్యం ఇప్పటి టర్కీలో పార్థియన్ల చేతిలో చావు దెబ్బ తింది. క్రాసస్‌ కూడా మరణించాడు. ఆ విధంగా సీజరు పోటీదారుల్లో ఒకడు తగ్గాడు. ఇక రెండోవాడైన పాంపే సీజరుకు అల్లుడు. అయితే ఆ బంధం సడలేలా ఒక దుర్ఘటన జరిగింది. సీజరు కూతురు, పాంపే భార్య అయిన జూలియా పిల్లవాణ్ని ప్రసవిస్తూ క్రీ.పూ. 54లో ప్రసూతిలో మరణించింది. ఇక యిద్దరి మధ్య మధ్యవర్తి లేకుండా పోయారు. ఇతరులు పుల్లలు పెట్టారు. క్రీ.పూ. 52 కల్లా పాంపే సీజరుతో బంధాలన్నీ తెంచుకుని, అధికారం కోసం అవసరమైతే అంతర్యుద్ధం చేయడానికైనా సిద్ధం అనుకుని సన్నాహాలు చేయసాగాడు. 

సీజరు తన పట్ల ప్రజలకు ఆరాధన పెరుగుతోందని గ్రహించి, మళ్లీ కాన్సల్‌ పదవిపై ఆశ పెట్టుకున్నాడు. పదేళ్ల వ్యవధి వుండాలి కాబట్టి క్రీ.పూ. 48లో జరగబోయే ఎన్నికలో పోటీ చేద్దామనుకున్నాడు. అయితే అప్పటి చట్టం ప్రకారం ఎవరైనా జనరల్‌ రోమన్‌ సామ్రాజ్యంలో ఏదైనా ప్రాంతాన్ని పాలిస్తూ వుంటే ఆ పదవి వదిలేసి, రోమ్‌ నగరానికి వచ్చి అప్పుడు పోటీ చేయాలి. శూలా నాటి నియంతృత్వం మళ్లీ రాకుండా చేయాలంటే యిది అవసరం అని సెనేట్‌ భావన. కానీ సీజరుకు అది యిష్టం లేదు. గాల్‌ (ఫ్రాన్స్‌ ప్లస్‌ జర్మనీ, బెల్జియంలలోని కొన్ని ప్రాంతాలు)పై తన సైనికాధిపత్యాన్ని వదులుకుని వస్తే తన శత్రువులు గతంలో తను కాన్సల్‌గా చేసినప్పటి పనులపై విచారణ మొదలుపెట్టి, తీర్పు వచ్చేవరకు పదవికి పోటీ పడేందుకు తనను అనర్హుడిగా ప్రకటించగలరు. తన చేతిలో సైన్యం వుండదు కాబట్టి దాన్ని ఎదుర్కోలేడు. మరి యీ సమస్యను పరిష్కరించడం ఎలా? 

సీజరు తన సైన్యంతో రోమ్‌ సామ్రాజ్యంపై దండెత్తి అంతర్యుద్ధం లేవదీయ దలచుకున్నాడు. క్రీ.పూ. 49 జనవరిలో రూబికాన్‌ నది వద్ద తన ఏలుబడిలోని రాజ్యాన్ని దాటి రోమ్‌ నగరపు ఏలుబడిలోని ప్రాంతాలలో చట్టవిరుద్ధంగా సైన్యంతో ప్రవేశించి 'రణభేరి మోగింది' అని ప్రకటించాడు. రోమ్‌ను రక్షించే బాధ్యత పాంపే తీసుకున్నాడు. పాంపే, సీజర్‌ సైన్యాలు తలపడ్డాయి. కానీ పాంపే సైన్యం ఓడిపోయి లొంగిపోసాగింది. లొంగిపోయిన వారిపట్ల ఉదారంగా ప్రవర్తించి, క్షమాభిక్ష ప్రసాదించి సీజరు వారి ఆదరాన్ని చూరగొన్నాడు. పాంపే సైన్యం క్రమేపీ సీజరు వశం కాసాగింది. యుద్ధం సాగుతూండగానే సీజరు కాన్సల్‌ పదవికి పోటీ పడి గెలిచాడు. క్రీ.పూ. 48 ఆగస్టు కల్లా ఉత్తర గ్రీసులో పాంపే సైన్యం పరాజయంతో యుద్ధం ముగిసింది. ఓడిపోయిన పాంపే  పొరుగు సామ్రాజ్యమైన ఈజిప్టుకి పారిపోయాడు. అతన్ని వెంటాడుతూ ఈజిప్టు వెళ్లిన సీజరుకు క్లియోపాత్రా పరిచయమైంది. రోమ్‌, ఈజిప్టు సామ్రాజ్యాల చరిత్రలను మలుపు తిప్పిన ఆ సమాగమం అతి వింతగా జరిగింది. (ఫోటో – పాంపే)

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఫిబ్రవరి 2016) 

[email protected]

Click Here For Archives