భారతీయ సమాజంలో కులశృంఖలాలు ఎంత గట్టిగా బిగించినా కొందరు ప్రేమికులను బంధించడంలో అనాదికాలం నుంచీ అవి విఫలమవుతూనే ఉన్నాయి. అందుకే అనులోమ వివాహాలనీ, ప్రతిలోమ వివాహాలనీ, వాటి వలన పుట్టిన సంతానాన్ని ఫలానా పేరుతో పిలుస్తారని మన పురాణగ్రంథాల్లోనే కనబడుతుంది. కానీ యిప్పటికీ పెద్దలు కులాంతర వివాహాలను నిరసిస్తూనే ఉంటారు. స్వేచ్ఛ కోరే యువత వారిని ధిక్కరిస్తూనే ఉంటారు. స్థానికంగా ఉన్న సమాజ పరిస్థితుల బట్టి, సంస్కారం బట్టి పెద్దల ప్రతిచర్య ఉంటూంటుంది. కుల, మత రాజకీయాలు కూడా చొరబడినప్పుడు సమస్య తీవ్రమౌతుంది. మొన్నటిదాకా 'లవ్ జిహాద్' అనేది పెద్ద అంశంగా చిత్రీకరించ బడింది. ఇటీవల హిందువుల్లోనే కులాంతర వివాహాలు ఎక్కువయ్యాయి. తక్కిన ప్రాంతాల్లో జరిగినప్పుడు వార్తల్లోకి రావు కానీ ఉత్తరాది రాష్ట్రాలలో జరిగినప్పుడు అవి ప్రాధాన్యత సంతరించుకుంటాయి. ఎందుకంటే పరువుహత్యల పేరుతో సంతానాన్ని చంపుకోవడానికి కూడా వెనుకాడని కుటుంబాలున్నాయక్కడ!
యుపిలోని బరేలీకి చెందిన ఒక బ్రాహ్మణ బిజెపి ఎమ్మెల్యే కూతురు సాక్షి మిశ్రా ఉదంతం యీ మధ్య అందరి దృష్టినీ ఆకర్షించింది. అన్నగారికి స్నేహితుడైన ఒక బంజారా యువకుణ్ని ఆమె ప్రేమించి, యింట్లో ఎవరూ లేని సమయం చూసి జులై 3న అతనితో పారిపోయింది. దాంతో ఆమె తండ్రి అనుచరులైన కొందరు గూండాలు ఆ జంటను వెంటాడారు. మా మానాన మమ్మల్ని బతకనీయండి అంటూ తండ్రిని, అన్నను ఉద్దేశించి ఆమె ఒక వీడియో తయారు చేసి సోషల్ మీడియాలో పెట్టేసింది. దాంతో తండ్రి యిబ్బందిలో పడ్డాడు. ఆ జంట జులై 15న ఇలహాబాద్ హైకోర్టుకి వచ్చినపుడు అడ్వకేట్ల వేషంలో ఉన్న తండ్రి అనుచరులు వారిపై దాడి చేయడంతో కోర్టు వారిని దొడ్డి గుమ్మం ద్వారా బయటకు పంపించి వేసింది. ఆ అమ్మాయికి 24, అతనికి 29 కాబట్టి వారి వివాహం చెల్లుతుందని కోర్టు తీర్పు యిచ్చింది. వారి వివాహాన్ని తను ఆమోదించనని, కానీ తన వలన వారికి ప్రాణహాని లేదని ఎమ్మెల్యే కోర్టుకి హామీ యిచ్చాడు. తన పట్టింపంతా అబ్బాయి కులం గురించి కాదని, వారిద్దరి మధ్య ఉన్న వయసు తేడా (5 ఏళ్లు) గురించి అని, పైగా అబ్బాయికి ఆదాయం లేదని అతను ప్రెస్‌కి చెప్పాడు. అబ్బాయి తండ్రి బ్యాంకు ఉద్యోగి. అబ్బాయి, అతని అన్నగారు కలిసి టైల్స్ వ్యాపారం చేస్తున్నారు. తండ్రి ఊరుకున్నా, కొందరు మాత్రం సాక్షిని సోషల్ మీడియాలో బండబూతులు తిడుతున్నారు. ఈమె వారికి ధాటీగా సమాధానం చెపుతోంది.
యుపి కంటె సామాజికంగా వెనుకబడిన బిహార్‌లో కూడా కులాంతర వివాహాలు గతంలో కంటె పెరిగాయి. నీతీశ్ పాలనలో ఆడవారికి విద్యావకాశాలు, 35% రిజర్వేషన్ కారణంగా ఉద్యోగావకాశాలు బాగా పెరిగి వారికి ధైర్యం సమకూరింది. అందువలన పెద్దలు కుదిర్చిన సంబంధాలు కాదని నచ్చినవాడితో లేచిపోతున్నారు. ఇలాటి కేసుల్లో తలిదండ్రులు 'మా అమ్మాయి మైనర్, అవతలి అబ్బాయి బలవంతంగా ఎత్తుకుపోయాడు' అని కేసులు పెడుతున్నారు. అప్పుడు అమ్మాయిలు మేం మేజర్లం, మా యిష్టప్రకారమే పారిపోయి పెళ్లి చేసుకున్నాం అని సోషల్ మీడియాలో జవాబిస్తున్నారు. ఇటీవల ఒకమ్మాయి తను మైనరు కాదని నిరూపించడానికి ఆధార్ కార్డును కూడా పోస్టు చేసింది. 2018లో 10,271 కిడ్నాప్ కేసులు నమోదైతే వాటిలో 3,017 (30%) కేసులు యిలా పారిపోయిన కేసులేట. ఈ ఏడాది మే వరకు 4,576 కేసులు నమోదయ్యాయి. వాటిలో 1626 (35%) యిలాటివేట. ఇలా కేసులు పెట్టి హంగామా చేసిన తర్వాత కొన్నాళ్ల తర్వాత చాలా సందర్భాల్లో రాజీ పడుతున్నారుట. పడని సందర్భాలూ ఉన్నాయి కాబట్టి జంకు మాత్రం ఉంటోంది. కులాంతర వివాహం చేసుకుంటే బిహార్ ప్రభుత్వం ఆ జంటకు లక్ష రూ.లు యిస్తుంది. కానీ దాని కోసం అర్జీ పెట్టుకుంటే తాము ఎక్కడున్నామో తెలుస్తుందనే భయంతో యీ జంటలు అడగటం లేదట. 2017-18లో ఆ పద్దు కింద బిహార్ ప్రభుత్వం ఖర్చు పెట్టినది రూ.1.03 కోట్లు మాత్రమే. అంటే 103 జంటలు మాత్రమే అడిగాయన్నమాట. ఎలా చూసినా గతంలో కంటె కులాంతర వివాహాలు పెరుగుతున్నాయి. దీనికి గాను యువతలో మారుతున్న దృక్పథమే కారణం.
అయితే దీనికి భిన్నంగా ఉంది మిజో యువత దృక్పథం. మిజోయేతరులను పెళ్లి చేసుకోవద్దని వాళ్లు ఉద్యమిస్తున్నారు. మిజోలు కానివాళ్లను పెళ్లి చేసుకున్న మిజో అమ్మాయిలను గ్రామాల నుండి బహిష్కరించిన వార్తలు గత ఏడాదే వచ్చాయి కానీ యిప్పుడు ''మిజో జిర్లాయ్ పాల్'' అనే అత్యంత బలమైన విద్యార్థి సంఘం దీన్ని ఒక ఉద్యమంలా చేపట్టింది. వాళ్లు స్కూళ్లకు, కాలేజీలకు వెళ్లి విద్యార్థినీవిద్యార్థుల చేత మిజోయేతరులను పెళ్లి చేసుకోమని ప్రతిజ్ఞలు చేయిస్తున్నారు. ఎందుకు అంటే మన సంస్కృతి, సంప్రదాయం కాపాడుకోవడానికి.. అంటున్నారు. మిజో వారందరూ అని పైకి అంటున్నా, నిజానికి వారి తాపత్రయమంతా మిజో అమ్మాయిలు యితరులను పెళ్లి చేసుకోకుండా చూడడమే! ఆ మాట వారే చెప్తున్నారు. బయటివారిని పెళ్లి చేసుకోవడంలో మిజో యువకుల కంటె యువతులు ముందంజలో ఉన్నారు కాబట్టి.. అంటున్నారు. మిజోయేతరులను పెళ్లి చేసుకున్న మిజో యువతులకు గిరిజన రిజర్వేషన్లు వర్తింప చేయకూడదంటూ కితం ఏడాది 'యంగ్ మిజో అసోసియేషన్' అనే శక్తివంతమైన యూత్ ఆర్గనైజేషన్ ఒక ప్రతిపాదన చేసింది.
ఇలాటి ఆలోచనలు మిజోరాంలోనే కాదు, మేఘాలయ, మణిపూర్‌లలో కూడా ఉన్నాయి. మేఘాలయ లోని గిరిజన కౌన్సిల్ గత ఏడాది ఒక బిల్లు ప్రవేశపెట్టబోయింది. దాని ప్రకారం ఖాశీ యువతులు యితర జాతుల వారిని పెళ్లి చేసుకుంటే వారసత్వపు హక్కులు కోల్పోతారు. మహిళా గ్రూపులు అభ్యంతర పెట్టడంతో ఆ బిల్లు పాస్ కాలేదు. కశ్మీరులో మాత్రమే కాదు, ఈ మూడు రాష్ట్రాలలో కూడా యితరులు భూమి కొనడానికి రాజ్యాంగం ఒప్పుకోదు. బయటివాళ్లను పెళ్లాడితే వారసత్వం, పౌరసత్వం పోతుందన్న కశ్మీరు నిబంధనను అక్కడి హైకోర్టు కొట్టేసింది కూడా. అయినా యిక్కడ యీ ప్రయత్నం జరిగింది. మిజోయేతరులు మిజోరాంలో భూమి కొనలేక పోవడమే కాదు, అక్కడికి వెళ్లాలన్నా వీసా లాటి స్పెషల్ పాస్ – ఇన్నర్‌లైన్ పర్మిట్ (ఐఎల్‌పి)ని పరిమితి కాలానికి తీసుకోవాలి. ఈ నిబంధనలు పాటిస్తూనే యితర ప్రాంతాల నుంచి కార్మికులు, వ్యాపారులు అక్కడకు వెళుతున్నారు. వారిలో కొందర్ని మిజో యువతులు వలచి, పెళ్లాడుతున్నారు. దీన్ని మిజో విద్యాధికులు సైతం సహించలేక పోతున్నారు. 'ఇలా అయితే మా సంస్కృతి, సంప్రదాయం, మతం ఏమయ్యేట్లు?' అని వాదిస్తున్నారు.
2011 జనాభా లెక్కల ప్రకారం 11 లక్షల మంది ఉన్న మిజోరాం జనాభాలో 87% మంది క్రైస్తవులే. ఉన్న 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 39 గిరిజనులకే కేటాయించారు. ఆర్టికల్ 371 (జి) ప్రకారం మిజోలకు సంబంధించిన మతపరమైన, సామాజికపరమైన ఆచారవ్యవహారాల్లో రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం లేకుండా పార్లమెంటు ఏమీ చేయలేదు. భూమి కొనుగోళ్ల వ్యవహారంలో కూడా..! కశ్మీరు విషయంలో యిలాటి హక్కులను కాలరాసిన బిజెపి ప్రభుత్వం యింకా వీటి జోలికి రాలేదు. అందువలన మిజో మగవారే తమ స్త్రీలపై ఆంక్షలు విధించడానికి పూనుకున్నారు. కానీ అక్షరాస్యతలో కేరళ, లక్షద్వీప్ తర్వాతి స్థానం మిజోరాందే. విద్యావంతులైన మిజో మహిళలు దీనిని ఎంతవరకు సహిస్తారో చూడాలి. ముఖ్యంగా బయటివారితో వివాహమనే సాకు చెప్పి, అసలే అంతంత మాత్రంగా ఉన్న ఆస్తిహక్కులు హరిస్తూంటే ఊరుకుంటారా అన్నది ప్రశ్న.
ఇక్కడ వారసత్వం విషయంలో మిజో ఆచారాల గురించి కొంత తెలుసుకోవాలి. అక్కడ పితృస్వామ్యమే నడుస్తోంది కాబట్టి ఆస్తిలో మగవాళ్లకే వాటా. కొడుకుల్లో ఆఖరివాడికి ఆస్తి వెళుతుంది. తక్కిన కొడుకులకు కూడా తండ్రి దయతలచి యిస్తే యివ్వవచ్చు. కొడుకులు లేకపోతే బంధువుల్లో మగవారసుడు ఎవరుంటే వాళ్లకే వెళుతుంది. ఇంటి పెద్ద మరణించే సమయానికి, పిల్లలు మైనర్లయితే, వారి ఆస్తి కస్టడీ అతని భార్యకు రాదు, భర్త వైపు మగబంధువులకు వస్తుంది. కొడుకులు పెద్దవాళ్లయాక వాళ్లకు అజమాయిషీ వస్తుంది. ఇంటిపెద్ద వైపు మగబంధువులు ఎవరూ లేకపోతేనే భార్యకు కానీ, కూతురుకు కానీ ఆస్తి వస్తుంది. పెళ్లి సమయంలో భర్త యిచ్చే కన్యాశుల్కంపైనే ఆమెకు సంపూర్ణమైన హక్కు ఉంటుంది. ఇటీవలి కాలంలో తండ్రి విల్లు ద్వారా కూతురికి వాటా యిస్తే అప్పుడు మాత్రమే వారికి దక్కుతోంది. ఇలాటి పరిస్థితుల్లో ఆస్తిలో వాటా దక్కదనే బెదిరింపు మిజో మహిళలపై ఏ మేరకు పని చేస్తుందో మరి.
ఆర్టికల్ 370 రద్దు చేయగానే ఎల్లెడలా వినబడిన నినాదం – కశ్మీరులో యిక మనం కూడా భూమి కొనవచ్చు, కశ్మీరు అమ్మాయిలను పెళ్లి చేసుకోవచ్చు అని. హరియాణా ముఖ్యమంత్రి కూడా కశ్మీరీ వధువులు అందుబాటులో రావడం గురించి మాట్లాడాడు. విశ్వనాథ్ ఆనంద్ అనే గాయకుడు భోజపురి భాషలో 'లాయీబ్ కశ్మీర్‌సే దుల్హనియా..', అంటూ పాట పాడి ప్రాచుర్యంలోకి తెచ్చాడు. ఇదే కాదు, వివిధ భాషల్లో కశ్మీరీ యువతుల గురించి యింకా అనేక పాటలు చలామణీలోకి వచ్చాయి. ఇవి విని కశ్మీరీ యువకులు గొణుక్కుని ఊరుకుంటున్నారేమో కానీ ఉద్యమాలు లేవదీసే స్థితిలో లేరు. మిజో యువతుల గురించి యిలాటి ప్రకటనలు, పాటలు వస్తే ప్రతిఘటించడానికి అక్కడి విద్యార్థి సంఘాలు తయారుగా ఉన్నాయి. జాగ్రత్త! (ఫోటో – మిజోయేతరులను పెళ్లాడమని ప్రతిజ్ఞ చేస్తున్న విద్యార్థులు)
-ఎమ్బీయస్ ప్రసాద్ (సెప్టెంబరు 2019)
[email protected]