ఈజిప్టు చరిత్రలో ప్రజాస్వామికంగా ఎన్నికైన మొట్టమొదటి దేశాధ్యక్షుడు మహమ్మద్ మోర్సీ 67 వ యేట జూన్ 17 న కోర్టులో చనిపోయాడు. ప్రస్తుతం ఈజిప్టు నేలుతున్న మిలటరీ ప్రభుత్వం అతన్ని 2013 సైనిక కుట్ర ద్వారా గద్దె దించి, అప్పణ్నుంచి వేలాది మంది అనుచరులతో సహా జైల్లో పడేసింది. ఆరేళ్లగా జైల్లో మగ్గిన మోర్సీ మధుమేహంతో సహా అనేక రోగాలతో బాధపడుతున్నాడు. మందులు సరిగ్గా యివ్వకపోవడంతో బాటు, రోజుకి 11 గంటల సేపు అతన్ని ఏకాంతనిర్బంధంలో ఉంచుతున్నారు. ఎక్సర్సైజ్ చేయడానికి రోజుకి గంట మాత్రమే అనుమతిస్తున్నారు.
కారాగారంలో మౌలిక వసతులు కూడా అతనికి అందించడం లేదని, అతని ప్రాణానికి ముప్పు వుందని హ్యూమన్ రైట్స్ వాచ్ వాళ్లు హెచ్చరిస్తూనే ఉన్నారు. చివరకు కైరో కోర్టులో అతను కుప్పకూలి మరణించాడు. ఆ కోర్టు సంప్రదాయం ప్రకారం ముద్దాయిలందరూ బోనులో నిలబడాలి, లేదా నేలమీద కూర్చోవాలి. తమ ఆరోగ్యపరిస్థితి బాగా లేదు కాబట్టి తరచుగా కోర్టుకి హాజరు కానక్కర లేకుండా అనుమతించమని మోర్సీ, అతని అనుచరులు ప్రాధేయపడినా కోర్టు వినలేదు. స్పృహ తప్పి పడిపోతున్న మోర్సీ కోర్టుతో ''ఈజిప్టుకు న్యాయబద్ధమైన అధ్యక్షుణ్ని నేనే'' అంటూనే చనిపోయాడు.
ఈజిప్టును ఇనుపహస్తంతో 30 ఏళ్లు పాలించిన నియంత హోస్నీ ముబారక్‌కు వ్యతిరేకంగా తలెత్తిన 'అరబ్ స్ప్రింగ్' ఉద్యమం సఫలమై ముబారక్ గద్దె దిగాల్సి వచ్చింది. అప్పుడు స్వేచ్ఛగా ఎన్నికలు జరిగి అనేక పార్టీలు పాల్గొన్నాయి. వాటిల్లో ముస్లిమ్ బ్రదర్హుడ్ రాజకీయ విభాగమైన ''ఫ్రీడమ్ అండ్ జస్టిస్ పార్టీ'' కూడా ఒకటి. మోర్సీ నాయకత్వంలో ఆ పార్టీకి 51% ఓట్లు పడ్డాయి. నిజానికి అధ్యక్ష పదవికి మరొకర్ని ఎంచుకుంది ఆ పార్టీ. కానీ కోర్టులు అతన్ని అనర్హుడిగా ప్రకటించడంతో మోర్సీ పేరు ముందుకు వచ్చింది. అతను ఇంజనీరింగు కైరోలో, కాలిఫోర్నియాలో చదివాడు. కాలిఫోర్నియాలో అసోసియేట్ ప్రొఫెసరుగా పనిచేసి, 1985లో ఈజిప్టుకి తిరిగి వచ్చి జగాజిగ్ యూనివర్శిటీలో చేరాడు. ఎంబీకి అభిమానిగా ఉంటూ 2000 ఎన్నికలలో స్వతంత్రుడిగా అధ్యక్షపదవికి పోటీ చేసి ఓడిపోయాడు.
అనుకోకుండా అధ్యక్షుడయిన మోర్సీ తను రక్షణ మంత్రిగా నియమించిన జనరల్ ఎల్-సిసి చేతిలోనే మోసానికి గురయ్యాడు. ఏడాది తర్వాత సిసి మోర్సీపై తిరుగుబాటు చేసి దింపేసి, జైల్లో పెట్టాడు. దేశద్రోహం, గూఢచర్యంతో సహా అనేక కేసులు పెట్టి వేధించాడు. 2014 మేలో పేరుకి ఎన్నికలు జరిపి, జూన్‌లో అధ్యక్షుడై పోయాడు. గతంలో సాదత్, ముబారక్ వంటి నియంతల సమయంలో కూడా ప్రతిపక్ష పార్టీలకు కొద్దిపాటి స్వేచ్ఛ ఉండేది. ఇప్పుడు అది కూడా లేదు, పైగా మీడియా ప్రభుత్వ అధీనంలోనే ఉంది. అందువలన మోర్సీ మరణానికి వ్యతిరేకంగా తెలిపిన నిరసనలకు స్పందన లేకుండా పోయింది. ప్రస్తుతం ఈజిప్టు ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బ తింది. అయినా ఎల్-సిసి 2030 వరకు అధికారంలో ఉండడానికి మిలటరీ అనుమతించింది.
ఈ సందర్భంగా ఈజిప్టు రాజకీయ చరిత్ర గురించి, ముస్లిమ్ బ్రదర్హుడ్ సంస్థ గురించి గుర్తు చేసుకోవడం సమయోచితం. 1882 నుండి బ్రిటన్ అధీనంలో ఉన్న ఈజిప్టుకి (సుడాన్‌కి కూడా) ఫరూక్ అనే రాజు నామమాత్రంగా ఉండేవాడు. అంటే బ్రిటిషు ఇండియాలో సంస్థానాధీశుల టైపులో అన్నమాట. రాజుకి ఆస్తులుంటాయి, పాలన ఉంటుంది, పెత్తనం మాత్రం బ్రిటిషు వాళ్లది. రెండవ ప్రపంచయుద్ధంలో రాజు అక్షరాజ్యాల వైపుకి మొగ్గు చూపితే ఇంగ్లీషు వాళ్లు ఒప్పుకోలేదు. 1936 నాటి ఒప్పందం సాకుతో తమ సైన్యాన్ని పంపారు. రెండు కూటముల రణానికి రంగస్థలమైంది ఈజిప్టు. ఆ సమయంలో రాజు విలాసాల్లో మునిగి తేలడం చేత ప్రజల చేత ఛీత్కరించుకోబడ్డాడు. ఆ అదను చూసి 1952లో ఈజిప్టు మిలటరీ ఆఫీసర్లు కొంతమంది కలిసి ''ఫ్రీ ఆఫీసర్స్ మూవ్మెంట్'' అనే పేర సైనిక కుట్ర జరిపి రాజుని గద్దె దింపేశారు. రాజు ఇటలీ పారిపోయి ప్రవాసంలో ఉండగానే 1965లో చనిపోయాడు.
రాజుని దింపేశాక, మహమ్మద్ నగ్యూబ్ అనే మిలటరీ అధికారి 1953 జూన్‌లో ఈజిప్టుకి తొలి అధ్యక్షుడయ్యాడు. ఆంగ్లేయులను తరిమివేసి, సుడాన్‌కి స్వాతంత్య్రం యిచ్చేసి, ఈజిప్టును రిపబ్లిక్‌గా ప్రకటించి, అరబ్ జాతీయవాదాన్ని ముందుకు తీసుకుని వచ్చాడు. అరబ్, ఆఫ్రికాలలో తలెత్తుతున్న జాతీయవాదం వలసరాజ్యాలు కలిగి వున్న బ్రిటన్, ఫ్రాన్సులను కలవర పరిచింది. వాళ్లు ఇజ్రాయేలును దువ్వారు. ఈజిప్టు కొత్త పాలకులు పాలస్తీనా ఉద్యమానికి మద్దతు తెలపడంతో ఇజ్రాయేలు కూడా వాళ్లపై గుఱ్ఱుగా ఉంది. చివరకు 1956లో బ్రిటన్, ఫ్రాన్స్, ఇజ్రాయేల్ కలిసి ఈజిప్టుపై దండెత్తాయి. దానిలో ఈజిప్టు సైన్యపరంగా చాలా నష్టపోయినా, సూయజ్ కాలువపై తన ఆధిపత్యాన్ని స్థిరపరుచుకుంది. దీంతో అప్పటి అధ్యక్షుడు గమాల్ అబ్దుల్ నాసర్ పేరు మారుమ్రోగింది. అతను దేశానికి రెండవ అధ్యక్షుడు, 1952 కుట్ర తర్వాత అధ్యక్షుడైన మహమ్మద్ నగ్యూబ్ను గృహనిర్బంధంలో పెట్టి, 1954లో తను అధ్యక్షుడయ్యాడు. దీనికి గాను అతను చూపిన సాకు ఎంబీ (ముస్లిమ్ బ్రదర్హుడ్) సభ్యుడు తనపై హత్యాప్రయత్నం చేయడం!
ముస్లిమ్ బ్రదర్హుడ్ అనే పేరుతో పిలిచినా ఆ సంస్థ అసలు పేరు ద సొసైటీ ఆఫ్ ద ముస్లిమ్ బ్రదర్స్. 1928లో హసన్ అల్-బన్నా అనే స్కూలు టీచరు స్థాపించిన సున్నీ ఇస్లామిస్ట్ సంస్థ. ఇది సమాజానికి సేవ చేసే ధార్మిక సంస్థగా వెలిసింది. ఇస్లాంలోని అన్ని వర్గాలను అక్కున చేర్చుకుంటూ, పేదలకు విద్య, వైద్యం అందించడానికి పాఠశాలలు, ఆసుపత్రులు నెలకొల్పడంతో పాటు నిధులు నిరంతరంగా అందేట్లుగా వ్యాపార సంస్థలను కూడా ప్రారంభించింది. దాతృత్వ కార్యకలాపాల కారణంగా ఆ సంస్థకు ఎంతో ప్రజాదరణ ఉంది. ఇప్పటివరకు ఆ సంస్థ సభ్యులపై అవినీతి ఆరోపణలు లేవు.
అక్కడితో ఆగి వుంటే ఏ చిక్కూ లేకపోయేది. కానీ క్రమంగా రాజకీయ రంగంలోకి కూడా దిగి ఆంగ్లేయుల వలస పాలనను ఎదిరించ సాగింది. విదేశీయులను తరిమివేసి ఈజిప్టులో షరియా సూత్రాల ప్రకారం పాలన సాగించే ప్రభుత్వస్థాపనకై కృషి చేస్తామని ప్రకటించుకుంది. ప్రజల మధ్య ఆ సంస్థ కున్న పలుకుబడి రాజకీయ నాయకులను ఉలిక్కిపడేలా చేసింది. బ్రిటిషు వాళ్లను ఎదిరించేందుకు, 1948లో ఇజ్రాయేలుతో యుద్ధంలో ఈజిప్టు తరఫున పోరాడేందుకు ఆ సంస్థ పనికి వచ్చింది కానీ 1948 నవంబరు నుంచి దాన్ని ఓ కంటకంగా చూశారు. అప్పటికే దానికి 2 వేల శాఖలు, 5 లక్షల మంది సభ్యులు ఉండేవారు.
1952లో ఎంబీ వాళ్లు బాంబులతో దాడులు చేయడంతో రాచరిక ప్రభుత్వం 32 మంది నాయకులను అరెస్టు చేసి, ఆ సంస్థను నిషేధించింది. తర్వాతి నెలల్లో ఒక ఎంబీ సభ్యుడు ప్రధానిని హత్య చేశాడు. అతని అనుచరులు ఎంబీ స్థాపకుడైన అల్-బన్నాను హత్య చేశారు. కైరోలో ఇంగ్లీషు వాళ్లు యిళ్లు, క్లబ్బులు, హోటళ్లు ఉన్న ప్రాంతాల్లో 750 భవంతులను ఎంబీ దగ్ధం చేసింది. ఈ పరిస్థితుల్లో సైనిక కుట్ర జరిగింది. కొత్త ప్రభుత్వం ఎంబీపై నిషేధం ఎత్తివేసింది. నెగ్యూబ్ కాబినెట్లో ఉన్న నాసర్ భూసంస్కరణలు తెచ్చి పేదల ప్రేమ చూరగొన్నాడు.
ఎంబీ తేవాలనుకున్నది షరియాకు అనుగుణంగా నడిచే ప్రభుత్వం. కానీ 1954లో దేశాధ్యక్షుడైన నాసర్ వ్యాప్తి చేస్తున్న సోషలిస్టు, సెక్యులర్ విధానాలను ఎంబీ వ్యతిరేకించింది. అతనిపై హత్యాప్రయత్నం చేసింది, మళ్లీ నిషేధానికి గురైంది. వేలాది మంది సభ్యులు జైళ్లలో, కాన్సట్రేషన్ క్యాంపులలో మగ్గారు. దేశం విడిచి పారిపోయిన సభ్యులకు మతఛాందస రాజరికం సాగించే సౌదీ అరేబియా ఆశ్రయం యిచ్చింది. (ఇప్పుడు పరిస్థితి మారింది. ఎంబీ ఒక టెర్రరిస్టు సంస్థ అంటోంది సౌదీ) అల్-బన్నా అల్లుడు సయీద్ రమదాన్ మ్యూనిక్‌లో కట్టిన మసీదులో కూడా కొందరు ఆశ్రయం పొందారు. ఈ సమయంలోనే ఎంబీ యితర ముస్లిము దేశాలకు వ్యాపించింది.
నాసర్ 1956లో నామమాత్రపు ఎన్నికలు జరిపి అధ్యక్షుడిగా ప్రకటించుకున్నాడు. పైన చెప్పిన యుద్ధం తర్వాత సూయెజ్ కాలువను జాతీయం చేయడంతో అతను అరబ్ దేశాలలో హీరో అయిపోయాడు. అమెరికా, రష్యా క్యాంపులకు దూరంగా అలీన ఉద్యమం (నాన్-ఎలైన్డ్ మూవ్మెంట్)లో నెహ్రూతో పాటు భాగస్వామి అయ్యాడు. అనేక సోషలిస్టు సంస్కరణలు చేపట్టి ఈజిప్టును ఆధునీకరించాడు. ఆశ్వాన్ డామ్, హెల్వాన్ సిటీ వంటివి కట్టాడు. రాజకీయంగా మాత్రం తనను ఎదిరించినవాళ్లను అణిచివేసేవాడు.
నాసర్ ప్రభ వెలుగుతూండగానే 1967లో ఇజ్రాయేల్‌తో ఆరు రోజుల యుద్ధం జరిగి, ఈజిప్టు ఘోరంగా ఓడిపోయింది. ఇజ్రాయేలు ఈజిప్టులోని కొన్ని ప్రాంతాలను ఆక్రమించి విడిచిపెట్టనంది. ఖిన్నుడైన నాసర్ రాజీనామా చేశాడు కానీ ప్రజల ఒత్తిడి మేరకు మళ్లీ పదవి చేపట్టాడు. 1968లో తనను తాను ప్రధానిగా నియమించుకుని పోయిన ప్రాంతాలను తిరిగి తెచ్చుకోవడానికి అందర్నీ కూడగట్టుకోవాలనుకున్నాడు. రాజకీయ సంస్కరణలు చేపట్టి కొంత స్వేచ్ఛ నిచ్చాడు, మిలటరీలో రాజకీయ ప్రమేయం ఉన్నవారిని తప్పించి వేయసాగాడు. 1970లో గుండెపోటుతో మరణించాడు. అతని అంత్యక్రియలకు 50 లక్షల మంది హాజరయ్యారు.
నాసర్ తర్వాత అతని అనుచరుడు, ఉపాధ్యక్షుడు ఐన అన్వర్ సాదత్ దేశాధ్యక్షుడయ్యాడు. 11 ఏళ్లు పాలించాడు. ఎంబీపై నిషేధం ఎత్తివేసి, దాని సభ్యులను జైళ్ల నుంచి విడుదల చేశాడు. విదేశాలలో తలదాచుకున్న వారందరినీ వెనక్కి ఆహ్వానించి, ఈజిప్టు రాజకీయాల్లో పాలుపంచుకోవచ్చన్నాడు. బహుళ పార్టీల వ్యవస్థను ఏర్పరచాడు. 1973లో ఇజ్రాయేలు ఆక్రమణలో ఉన్న సినాయ్‌పై దాడి చేసి అరబ్బుల ప్రశంసలు అందుకున్నాడు. తనకు శాంతి ముఖ్యమంటూ ఇజ్రాయేలుతో శాంతి ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ సంవత్సరం యితనికి, ఇజ్రాయేలు ప్రధానికి కలిపి ఉమ్మడిగా నోబెల్ శాంతి పురస్కారం యిచ్చారు. ఆ విధంగా సాదత్ నోబెల్ అందుకున్న మొట్టమొదటి ముస్లిమ్ అయ్యాడు.
కానీ అతను పాలస్తీనా విషయంలో పట్టుబట్టలేదని ఎంబీ కోపగించుకుంది. ఒప్పందం కుదుర్చుకునేముందు తమను సంప్రదించలేదని పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ ఆగ్రహించింది. అనేక అరబ్ దేశాలు దానికి వత్తాసు పలికి అరబ్ లీగ్ నుంచి ఈజిప్టు 1979లో బహిష్కరించాయి. ఇజ్రాయేలుతో రాజీ పడిపోయాడంటూ కొందరు కన్సర్వేటివ్ మిలటరీ అధికారులు 1981 అక్టోబరులో అతనిపై కాల్పులు జరిపి చంపేశారు. అతని తర్వాత అధ్యక్షుడై ఈజిప్టును అత్యధిక కాలం పాలించిన వాడు హోస్నీ ముబారక్. ఈజిప్షియన్ ఎయిర్ ఫోర్సులో పని చేసి, చీఫ్ మార్షల్ అయ్యాడు. ఇజ్రాయేలుతో సంధికి అతను వ్యతిరేకి. అతని హయాంలో అనేక రంగాల్లో ఉత్పాదన పెరిగింది కానీ దానితో పాటు అవినీతీ పెరిగింది.
ముబారక్ కూడా నియంత గానే పాలించాడు. తనను వ్యతిరేకించినవాళ్లను తొక్కేశాడు, హింసించాడు. నామమాత్రపు ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతూ తన పదవీకాలాన్ని పొడిగించుకుంటూ పోయాడు. చివరకు 2005 సెప్టెంబరులో ప్రజాభిప్రాయ సేకరణ కుదరదు, అనేక పార్టీలు పాల్గొనే ఎన్నికలు కావాలనే డిమాండ్ తలెత్తింది. ముబారక్ సరేనన్నాడు. ఎన్నికల యంత్రాంగమంతా తన చేతిలో పెట్టుకుని రిగ్గింగ్ చేసి నెగ్గేశాడు. అంతేకాదు, ప్రతిపక్ష పార్టీ నాయకుడిని ఫోర్జరీ నేరంపై ఐదేళ్లపాటు జైల్లో పెట్టించాడు. 30 ఏళ్ల పాలనలో ముబారక్, అతను కుటుంబసభ్యులు అవినీతి ద్వారా విపరీతంగా సంపాదించి, విదేశాల్లో డబ్బు దాచుకున్నారు.
చివరకు ప్రజలు విసిగిపోయి, అతని పరిపాలనపై 2011 జనవరిలో తిరగబడ్డారు. దానినే అరబ్ స్ప్రింగ్ అన్నారు. అది గ్రహించి, 2011 సెప్టెంబరులో రాబోయే ఎన్నికలలో తను పోటీ చేయనని ముబారక్ ప్రకటించాడు. కానీ అతను వెంటనే రాజీనామా చేసి తీరాలని నిరసనకారులు పట్టుబట్టారు. అతని సమర్థకులు, వ్యతిరేకుల మధ్య వీధుల్లో హింసాత్మక పోరాటాలు జరిగాయి. చివరకు ఫిబ్రవరిలో ముబారక్ రాజీనామా చేశాడు.
ముబారక్ హయాంలో ఎంబీ బలపడింది. 2005 ఎన్నికల సమయానికి సంస్థపై నిషేధం ఉండడంతో, దాని సభ్యులు స్వతంత్రులుగా నిలబడి 20% సీట్లలో గెలిచారు. అరబ్ స్ప్రింగ్ సమయంలో ఎంబీ నాయకులు బాహాటంగా నిరసన కార్యక్రమాల్లో పాల్గొనలేదు. ముబారక్ పతనం తర్వాత సంస్థపై నిషేధం తొలగిపోయింది. 2011 ఏప్రిల్‌లో ఎంబీ ''ఫ్రీడమ్ అండ్ జస్టిస్ పార్టీ'' నెలకొల్పి అదే ఏడాది జరిగిన ఎన్నికలలో పోటీ చేసి 47% స్థానాలు గెలిచింది. 2012 అధ్యక్ష ఎన్నికలలో ఎంబీ తరఫున 52% ఓట్లు తెచ్చుకుని మోర్సీ నెగ్గాడు. దీని తర్వాత ఎన్నికలు జరిగిన ట్యునీసియాలో ఎంబీ అభ్యర్థులు గెలిచారు. సౌదీ అరేబియా, యుఎఇ లలో నడుస్తున్న రాచరిక పాలకులు ఎంబీ బలాన్ని చూసి దడిశారు. దానధర్మాల ద్వారా ప్రజలలో పలుకుబడి పెంచుకుని, తమ దేశాలలో కూడా ప్రజస్వామ్యం కావాలని ఆందోళనలు చేసి తమ నియంతృత్వానికి ఎదురు నిలుస్తారని వాళ్ల భయం.
మోర్సీ అధికారంలోకి వస్తూనే మిలటరీ తోక కత్తిరించబోయి, వారి ఆగ్రహాన్ని మూటకట్టుకున్నాడు. వాళ్లు తిరగబడబోతే 2012 నవంబరులో తనకు తానే సర్వాధికారాలు ప్రకటించుకున్నాడు. ముబారక్ శకంలో ఏర్పడిన అధికార యంత్రాంగాన్ని అదుపు చేయడానికి ఆ మాత్రం అధికారాలు ఉండాలని వాదించాడు. ఇదంతా ఇస్లామిక్ కుట్ర అని ప్రతిక్షకులు ఆరోపించారు. ఎందుకంటే ఎంబీ ఆడవాళ్లకు సమాన హక్కులిచ్చే లాటి కొన్ని విషయాల్లో ఛాందసవాదాన్ని ప్రచారం చేస్తుంది.
మోర్సీలో కూడా ముబారక్ లక్షణాలు కనబడ్డాయి. తనను వ్యతిరేకించిన జర్నలిస్టులపై, నిరసనకారులపై ఎంబీ గ్యాంగులను ఉసికొల్పాడు. ప్రతిపక్షాలపై మిలటరీ విచారణలు జరిపించి, శిక్షలు వేయించాడు. అప్పటిదాకా ఎంబీను ఈజిప్టులో అసలైన ప్రతిపక్షంగా, ప్రజాస్వామ్యం కోసం పోరాడే సంస్థగా విదేశీ మీడియా మెచ్చుకునేది. కానీ మోర్సీ పాలనలో ఇంధనపు కొరత, విద్యుత్ అంతరాయాలు పెరిగాయి. మోర్సీకి చెడ్డపేరు రావాలని మిలటరీ వాళ్లు పన్నిన పన్నాగమది అని ఎంబీ అంటుంది, కాదు మోర్సీకి పాలన చేతకాదు అని మిలటరీ వాళ్లు అంటారు. ముబారక్ అనుచరులతో నిండిన కోర్టు, మిలటరీ అధికారులు కలిసి మోర్సీకి జోరుకి కళ్లెం వేశారు.
అదను చూసుకుని 2013 జులైలో మిలటరీ అధికారులు ఎల్-సిసి నాయకత్వాన తిరుగుబాటు చేసి మోర్సీని జైల్లో పెట్టారు, ఎమర్జన్సీ విధించి, ఎంబీని టెర్రరిస్టు సంస్థగా ప్రకటించి, నిషేధించారు. సౌదీ, యుఎఇ వారి బాటలో నడిచాయి. ఆ దేశాలను వ్యతిరేకిస్తున్న టర్కీ, కతార్ మాత్రం ఎంబీని సమర్థిస్తున్నాయి. మోర్సీతో సహా తమ పార్టీ నాయకులనేకులను జైలుపాలు చేయడంతో ఎంబీ ఈజిప్టులో ప్రదర్శనలు నిర్వహించింది. ప్రభుత్వం వారిపై కాల్పులు జరిపి, 1150 మంది మృతికి. 4 వేల మంది గాయపడడానికి కారణమైంది. దానికి ప్రతిగా ఎంబీ పోలీసు స్టేషన్లను, డజన్ల కొద్దీ చర్చిలను దగ్ధం చేసింది. ఆ కారణం చూపి మిలటరీ మరింతమంది ఎంబీ నాయకులను ఖైదుపాలు చేసింది. ఇదంతా మిలటరీ ఆడిస్తున్న నాటకమని, క్రైస్తవుల దాడిలో తమ ప్రమేయం లేదని ఎంబీ వాదించింది. అయినా మిలటరీ అధీనంలో ఉన్న ఈజిప్టు కోర్టు 2015లో వందలాది ఎంబీ సభ్యులకు మరణశిక్ష విధించింది. వారిలో మోర్సీ ఒకడు.
మోర్సీని అధికారంలో ఉండగా ఈజిప్టు కోర్టులలో ముబారక్‌పై, అతని కొడుకుల అవినీతిపై అనేక కేసులు నడిచాయి. 2012 లో ముబారక్ యావజ్జీవ కారాగార శిక్ష పడింది కూడా. అయితే మోర్సీని దింపేశాక, మిలటరీ అధికారులు ముబారక్ పట్ల ఉదారంగా ఉండసాగారు. 2014 ఫిబ్రవరిలో ముబారక్ ఒక పత్రికకు యిచ్చిన యింటర్వ్యూలో సిసిని మెచ్చుకున్నాడు. ఆ తర్వాత మూడేళ్ల కారాగారవాసం తదనంతరం ముబారక్‌ను, కొడుకులను వదిలిపెట్టారు. 2017లో కేసులన్నీ కొట్టేశారు. అతనింకా సజీవుడే. మూడు దశాబ్దాలు పాలించిన అతనికి దేశంలో అనుచరగణం బలంగా ఉంది కాబట్టి, వాళ్లు ఎంబీకి వ్యతిరేకులు కాబట్టి సిసి యీ విధంగా ప్రవర్తించి ఉంటాడని ఊహించవచ్చు. మోర్సీ మృతిపై టర్కీ, కతార్, మలేసియా దేశాలు సంతాపం వ్యక్తం చేశాయి. ఐక్యరాజ్యసమితి మోర్సీ చావుపై స్వతంత్ర విచారణ సాగాలని పిలుపు నిచ్చింది.
– ఎమ్బీయస్ ప్రసాద్ (జులై 2019)
[email protected]