అచ్చెంన్నాయుడు, బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడు.. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో తెలుగుదేశం పార్టీ తరఫున గళం విప్పుతున్న వాళ్లు ఎవరైనా ఉన్నారంటే వీళ్లు ముగ్గురే! అసలే తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచింది 23 మంది. గతంలో అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్స్ పేరు పొందిన వాళ్లు చాలామంది ఎమ్మెల్యేలుగా నెగ్గలేకపోయారు.
గెలిచిన వారిలో వీరు ముగ్గురూ కాస్త గళం విప్పుతున్నారు. గట్టిగా అరుస్తూ అయినా టీడీపీ ఉనికిని చాటుతూ ఉన్నారు. ఇలాంటి క్రమంలో వారి ముగ్గురు మీదా వేటుపడింది. వారిని బడ్జెట్ సమావేశాలు ముగిసేంత వరకూ సభ నుంచి సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఇక సభలో తెలుగుదేశం పార్టీకి దిక్కుఎవరు? అనేది చర్చనీయాంశంగా మారింది.
చంద్రబాబు నాయుడు ప్రతిసారీ తనే లేచి మాట్లాడలేరు! అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరిలు ఆయనకు ఎంతగా హెల్ప్ చేస్తున్నారో సమావేశాలను చూస్తున్నవారు గమనించే ఉంటారు. ఇక వారు సభలో ఉండకపోవచ్చు. సమావేశాలు ఇంకా కొన్నిరోజులు ఉన్నాయి.
మిగిలిన టీడీపీ ఎమ్మెల్యేలు సభలో కామ్ గా ఉండిపోతున్నారు. వారిలో ఒక్కోరిది ఒక్కో కథ. జగన్ పిలిస్తే వెళ్లిపోవడానికి రెడీ అన్నట్టుగా కొందరున్నారు. మరి కొందరేమో మనకెందుకు వచ్చిన గొడవ, ఏం మాట్లాడితే పాత బాగోతాలు ఎక్కడ బయటపడిపోతాయో అన్నట్టుగా ఉన్నారు.
ఇలాంటి నేపథ్యంలో సభలో చంద్రబాబుకు ఇక సభలో మాట సాయం చేసేవాళ్లు ఎవరు అనేది చర్చనీయాంశంగా మారింది. వాళ్ల సస్పెన్షన్ తర్వాత మంగళవారం కూడా సభలో టీడీపీ ఉండకుండా వాకౌట్ అంటూ బయటకు వచ్చింది. మిగతా రోజుల్లోనూ సీన్ ఇలానే ఉండబోతోందా?