ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన బలపరీక్ష ఎట్టకేలకు ముగిసింది. ముందుగా ఊహించిన విధంగా కాంగ్రెస్ – జేడీఎస్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వానికి ఎట్టకేలకు శుభంకార్డు పడింది. 2018 మే 23వ తేదీన కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన హెచ్డీ కుమారస్వామి 2019 జూలై 23వ తేదీ సరిగ్గా 14 నెలల కాలానికి అధికారం కోల్పోయింది. ఈనెల 12వ తేదీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన రోజున సీఎం కుమారస్వామి మాట్లాడుతూ కాంగ్రెస్ – జేడీఎస్కు చెందిన 15 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో విశ్వాస పరీక్షకు తాము సిద్ధమని సవాల్ విసిరారు. ఈక్రమంలో 15వ తేదీకి వాయిదా వేశారు. అనంతరం అక్కడి నుంచి 19వ తేదీకి మార్చారు.
చివరికి జూలై 22వ తేదీ తుది గడువుగా నిర్ణయించగా.. అర్ధరాత్రి వరకు సాగిన సభలో 23వ తేదీకి పొడిగించారు. ఎట్టకేలకు 23వ తేదీ బల పరీక్ష పూర్తిచేశారు. సాయంత్రం ఆరు గంటలకు నిర్వహించిన విశ్వాస పరీక్షను 7.21 గంటలకు ప్రారంభించారు. స్పీకర్ కేఆర్ రమేశ్కుమార్ నేతృత్వంలో బలపరీక్ష నిర్వహించారు. ఒక్కో ఎమ్మెల్యే చేయి పైకెత్తి ఓటు వేశారు. ఈసందర్భంగా సంకీర్ణ ప్రభుత్వానికి కాంగ్రెస్ నుంచి 65, జేడీఎస్కు చెందిన 34 మంది కలిపి మొత్తం 99 మంది సభ్యులు మద్దతు తెలిపారు. మొత్తం 224 మంది సభ్యులకు గానూ 20 మంది సభ్యులు గైర్హాజరయ్యారు. ఈనేపథ్యంలో సభకు హాజరైన 204 మంది సభ్యులకు గానూ ప్రభుత్వం ఏర్పాటుకు 103 మంది సభ్యుల బలం అవసరమైంది. కానీ కుమారస్వామి ప్రభుత్వానికి కేవలం 99 ఓట్లు మాత్రమే వచ్చాయి. ప్రతిపక్షంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి 105 మంది మద్దతు తెలిపారు. దీంతో కుమారస్వామి ప్రభుత్వం దిగిపోవాలని స్పీకర్ కేఆర రమేశ్కుమార్ ప్రకటించారు.
బల పరీక్ష నిరూపించుకుంటామని ప్రగల్బాలు పలికిన సీఎం కుమారస్వామి గడువు ముంచుకొచ్చే కొద్దీ వెనుకడుగు వేస్తూ వచ్చారు. బల పరీక్షను మూడుసార్లు వాయిదాలు వేయించుకున్న సీఎం కుమారస్వామి మంగళవారం సాయంత్రం వరకు కూడా మరోసారి వాయిదా కోసం పలు ప్రయత్నాలు చేశారు. స్పీకర్ కేఆర్ రమేశ్కుమార్తో పాటు సీఎల్పీ నేత సిద్ధరామయ్య కూడా బలపరీక్ష నిర్వహించాలని సూచించడంతో సీఎం కుమారస్వామి టెన్షన్లో పడ్డారు. ఈమేరకు ఉదయమే నగరంలోని ఓ ప్రముఖ ప్రైవేటు హోటల్లో కాంగ్రెస్ నేత, ట్రబుల్ షూటర్గా పేరుగాంచిన మంత్రి డీకే శివకుమార్తో సీఎం కుమారస్వామి గంటల తరబడి చర్చించారు. ఉదయం 10 గంటలకు సభ ప్రారంభమైనా.. సీఎం కుమారస్వామి మాత్రం సాయంత్రం 4 గంటలకు సభకు వచ్చారు. ఆరు గంటలకు విశ్వాస పరీక్ష నిర్వహించాల్సి ఉండగా… రాత్రి 7 గంటల వరకు సీఎం కుమారస్వామి ప్రసంగించారు. అనంతరం 7.21 గంటలకు బల పరీక్ష జరిగింది. కుమారస్వామి ఓడిపోయారు.
కుమార ప్రభుత్వం బలనిరూపణకు 103 సభ్యుల బలం అవసరం కాగా.. స్పీకర్, నామినేటెడ్ ఎమ్మెల్యేను మినహాయిస్తే అధికార పక్షానికి 99 మంది సభ్యుల బలమే ఉంది. ఈ నేపథ్యంలో కుమార ప్రభుత్వం ఏ మార్గంలోనూ బలం నిరూపించుకోలేక పోయింది. ముందుగా ఊహించిన విధంగా విశ్వాస పరీక్షలో సీఎం కుమారస్వామి ఓడిపోయారు. దీంతో బీజేపీ సభ్యులు 105 మంది బీఎస్ యడ్డూరప్ప నేతృత్వంలో ఆనందంగా బయటికి వచ్చారు.