సినీనిర్మాత కె. మురారి 78 వ యేట మరణించారు. యువచిత్ర బ్యానర్ మీద ‘‘సీతామాలక్ష్మి’’ (1978), ‘‘గోరింటాకు’’ వంటి మంచి సినిమాలు తీసి ‘‘నారీనారీ నడుమ మురారి’’ (1990) సినిమాతో నిర్మాణరంగం నుంచి తప్పుకున్నారు. ఎంబిబిఎస్ చదువు మధ్యలో మానేసి, ఏడెనిమిది సినిమాలకు అసిస్టెంటు దర్శకుడిగా పని చేసి, ఆ పై నిర్మాతగా మారి, తను అనుకున్న విధంగా సినిమాలు తీస్తూ పోయి, పోనుపోను నిర్మాత మాట చెల్లకుండా పోతోందని, దర్శకులు, హీరోలు తమ చిత్తం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారని గ్రహించి ఆ పరిస్థితుల్లో సినిమాలు తీయడం అనవసరమని గ్రహించి విరమించుకున్నారు. సినిమారంగంలో నిర్మాతల ప్రాముఖ్యతను ఎలుగెత్తి చాటడానికి నిర్మాతల డైరక్టరీని ప్రచురించారు. మంచి అభిరుచి, దర్శకత్వంలో అనుభవం రెండూ ఉండడంతో కథాచర్చలు, పాటల రచన, బాణీల ఎంపిక.. యిలా అన్నిటిలో కలగజేసుకుని, తనకు నచ్చే విధంగా వచ్చేవరకూ సాంకేతిక నిపుణులను రాపాడించేవారు.
తన కంటూ నిశ్చితమైన అభిప్రాయాలు ఉండడం, వాటిని ఘాటుగా వెలిబుచ్చడంతో ఆయనకు తిక్క అని, అహంకారం అని పేరు వచ్చింది. తెలుగు సినిమా పరిశ్రమ పంపిణీ రంగంపై పట్టున్న కాట్రగడ్డ కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో సినీరంగ ప్రవేశం సులభమైంది. కానీ ఆ తర్వాత అనేక పాట్లు పడ్డాడు. ఆయన సినిమాల్లో పాటలు బాగుండడంతో అభిరుచి కల నిర్మాతగా పేరు పడ్డాడు. పదేళ్ల క్రితం ‘‘నవ్విపోదురుగాక…’’ పేరుతో రాసిన ఆత్మకథలో సినీరంగంలోని అనేక విశేషాలు నిర్భయంగా చెప్పారు. దానితో పాటు తమ ఉమ్మడి కుటుంబ విశేషాలు కూడా రాశారు. అవి చదివితే ఆనాటి రాజకీయాలు, సామాజికపరమైన మార్పులు అనేకం అర్థమౌతాయి. ఆ పుస్తకం అనేక ముద్రణలు పొందింది. సినిమా విషయాలైతే అందరికీ ఆసక్తి ఉంటుంది కాబట్టి ఆయన పుస్తకంలోంచి కొన్నికొన్ని విశేషాలను అప్పుడప్పుడు నేను పాఠకులకు అందిస్తూ వచ్చాను. ఈసారి మరి కొన్ని విషయాలు చెప్తాను.
*కెవి మహదేవన్ సంగీత దర్శకత్వం మొదలు పెట్టినప్పటి నుంచి చివరి చిత్రం వరకు ఆయన ఆర్థిక వ్యవహారాలు చూసిన నటరాజన్ అనే అతను దశాబ్దాలుగా తనకు తెలియకుండా డబ్బు కొట్టేస్తూ వచ్చాడని తెలిసిన క్షణం నుంచి మహదేవన్ అనారోగ్యంతో కృంగిపోయారు. ఆ నమ్మకద్రోహం ఆయన్ని కుదిపివేసి, మరపు తెప్పించింది. మాటలు మర్చిపోయారు. మనుష్యులను గుర్తు పట్టలేక పోయేవారు. దగ్గరగా వెళ్లి కూర్చుంటే గుర్తుపట్టేవారు కానీ ఏదో చెప్పాలనుకుని చెప్పలేకపోయేవారు. అలా తొమ్మిదేళ్లు గడిపి 2001లో మరణించారు. ఆయన పోయిన నాలుగేళ్లకు ఆయనకు అత్యంత ఆత్మీయుడైన సహాయకుడు పుహళేంది కూడా మరణించారు.
*‘‘గోరింటాకు’’ సినిమాకై మురారి వేటూరిని పిలిచారు. పల్లవిగా ‘కొమ్మకొమ్మకో సన్నాయి, కోటి రాగాలు ఉన్నాయి’ అని వేటూరి రాశారు. పక్కనే ఉన్న యువచిత్ర సలహాదారు పాలగుమ్మి పద్మరాజు ‘‘కృష్ణశాస్త్రిగారు ‘కొమ్మకొమ్మకో సన్నాయి, రెమ్మరెమ్మకో గవాయి’ అని రాశారు కదా. ఇక్కడ వాడడం బాగుంటుందా?’ అన్నారు. వేటూరి వెంటనే ‘రెండో లైను వేరేగా ఉందిగా, అయినా కొమ్మలు, సన్నాయిలు అనే పదాలు వేరెవరూ వాడకూడదా?’ అన్నారు. పద్మరాజు మాట్లాడలేదు. పల్లవి బాగా అనిపించడంతో మహదేవన్ ట్యూన్ కట్టేశారు కూడా. చరణాలు తర్వాత రాసుకుని వస్తానంటూ వేటూరి వెళ్లిపోయారు. మళ్లీ రాలేదు. నాలుగు రోజులాగి మురారి వెళ్లి అడిగితే ‘నేను రాసిన ప్రతీ వాక్యం పద్మరాజుగారు ఎప్రూవ్ చేయాలా?’ అని అడిగారు. ‘ఆయన లేనిదే యువచిత్రలో ఒక్క అడుగు కూడా ముందుకు పడదు.’ అన్నారు మురారి. దాంతో వేటూరి పాట రాయలేదు. ట్యూన్ బాగుండడంతో మురారి ఆత్రేయను పిలిపించి, చరణాలు రాయించారు. సినిమాలో పేరు మాత్రం వేటూరిదే ఉంచారు. ఆ విధంగా ఆత్రేయ ఆ బ్యానర్‌లో అడుగుపెట్టి చాలా పాటలే రాశారు.
*మురారి పద్ధతేమిటంటే, రచయిత పల్లవి రాసి చేతికిస్తే అది నచ్చి మహదేవన్‌ను ట్యూన్ చేయమనేవారు. ఆ ట్యూన్ నచ్చకపోతే, ట్యూన్ కుదరటం లేదు, మరో పల్లవి రాయమని రచయితను అడిగేవారు. ‘ట్యూన్ నచ్చకపోతే నేనెందుకు మరో పల్లవి రాయాలి?’ అని వేటూరి ఒకసారి తగాదా పడ్డారు. ‘సరే మీరు పల్లవికి వెయ్యి రూపాయలు తీసుకుంటారు కదా, పల్లవి నాకు నచ్చగానే వెయ్యి రూపాయలు యిచ్చేస్తాను. ట్యూన్ కుదిరిందంటే దానితో సరి. కుదరక మరో పల్లవి రాయాల్సి వస్తే ఇంకో వెయ్యి యిస్తాను. కుదిరేదాకా యిస్తూ పోతాను.’ అని మురారి ఒప్పందం చేసుకున్నారు. ఆత్రేయ ఐతే కంపోజింగుకి వస్తూనే ఏడెనిమిది పల్లవులు రాసుకుని వచ్చి, పాట రికార్డింగు అయ్యేలోపున ఏడెనిమిదిసార్లు డబ్బులు అడిగేవారు. రికార్డింగుకి కూడా వచ్చేవారు. ఆయన అడిగినప్పుడల్లా మురారి యిస్తూ పోయారు. చిత్రమేమిటంటే ఆత్రేయ, వేటూరి యింత సంపాదించినా, చివరి రోజులకు ఏమీ మిగల్లేదు.
*సినిమాల్లో ఫైటింగులు ఉత్తినే పెట్టేస్తూ ఉంటారంటూ మురారి రాసిన ‘‘జానకిరాముడు’’ (1988) ఉదంతం గుర్తుంచుకోదగ్గది. ఆ సినిమాను ‘‘మూగమనసులు’’ ఆధారంగా విజయేంద్ర ప్రసాద్, ఆయన సోదరుడు శివశక్తి దత్తా (కీరవాణి తండ్రి)ల చేత రాయించారు. మూగమనసుల కంటె భిన్నంగా ఉండాలని, ప్రేమతో బాటు పగ కూడా వేచి ఉంటుందని చెప్పడానికి. హీరో మళ్లీ పుట్టాక గత జన్మలో తనను, ప్రేయసిని దూరం చేసిన విలన్‌ను చంపాలనుకుంటాడు. అందుకని మోహన్‌బాబు చేత వేయించిన విలన్ పాత్రను చివరిదాకా ఉంచారు. నాగేశ్వరరావు పాత్రను నాగార్జున కిచ్చి, సావిత్రి వేషం అమలకు, జమున వేషం సుహాసినికి యిద్దామనుకున్నారు. కానీ దర్శకుడు రాఘవేంద్రరావు అమల వేషం విజయశాంతికి యిప్పించారు. సుహాసిని మేనేజరంటే మురారికి పడదు కాబట్టి, ఆవిడకు బదులు జీవితను తీసుకున్నారు.
క్లయిమాక్స్ సీనులో నాగార్జున, మోహన్‌బాబుల మధ్య గుర్రాలు, కత్తులు, కఠార్లతో ఫైట్ పెట్టి పోలవరం దగ్గరున్న ఓ గుడి దగ్గర ఏడు రోజులు షూట్ చేశారు. ఆ విలన్ పాత్రను తొలగించడానికి హీరో అంత శ్రమ పడనక్కరలేదని మురారి ఉద్దేశం. ‘ఆ వారం రోజులు దర్శకుడు విశ్రాంతి తీసుకోవచ్చు. ఫైట్ మాస్టరు, అతని అసిస్టెంట్లు ఆ వారం రోజులకి నిర్మాత దగ్గర్నుండి ఓ పది పదిహేను లక్షలు గుంజవచ్చు.’ అని ఆయన భావన. ప్రేక్షకులు చూస్తారు, ఫైట్ ఉండాల్సిందే అని రాఘవేంద్రరావు ఆయనతో వాదించారు. నాగార్జునకూ యిష్టం లేదు. అయినా దర్శకుడి మాట కాదనలేక పోయారు. ఎడిటింగు అయిన తరువాత చూస్తే యీ ఫైట్ సీను 8 ని.లు తేలింది. మురారికి దాన్ని ఉంచడం యిష్టం లేదు. అందుకని మహదేవన్‌తో చెప్పి దానికి రీరికార్డింగు వేరే చేయించారు.
సినిమా విడుదల కాగానే విడుదలైన అన్ని థియేటర్లకు మురారి ఫోన్ చేసి, ఆ ఫైట్ గురించి అడిగారు. అందరూ అక్కడ ఫైట్ అనవసరం అన్నారు. అంతే, 800 అడుగుల ఆ ఫైట్ భాగాన్ని కట్ చేసి చూపించండి అని మురారి హాలు వాళ్లకు చెప్పేశారు. మర్నాటికి ఆ ఫైట్ లేకపోవడంతో రాఘవేంద్రరావుగారికి తెలిసింది. మురారికి ఫోన్ చేసి ‘‘ఎందుకు తీసేశావ్?’’ అని అడిగారు. ‘‘జనానికి నచ్చదని ముందే చెప్పాను కదా’’ అన్నారు మురారి. ‘‘మరి రీరికార్డింగు ఎలా మ్యాచ్ అయింది?’’ ‘‘ఆ ఏర్పాట్లు ముందే చేశానులే’’అన్నారు మురారి. అలాటి నిర్మాతలుంటే ప్రేక్షకులకు ఎంతో హాయి. కథ చివరి ఘట్టంలోకి వచ్చాక కూడా వచ్చే ఫైట్లు నిజంగా విసుగు కలిగిస్తాయి. సినిమా బాగానే ఆడింది కానీ నాగార్జున తల్లి అన్నపూర్ణమ్మగారికి నచ్చలేదు. విలన్ తిరిగి రావడం బాగాలేదని ఆవిడ అన్నారు. మురారిదీ అదే అభిప్రాయం. అయ్యవారిని చేయబోతే కోతి అయినట్లు మూగమనసులు తీయబోతే జానకి రాముడు అయిందని ఆయన వాపోయాడు.
*‘‘కళ్యాణమండపం’’ సినిమాను దర్శకుడు వి మధుసూదనరావు నిర్మించారు. హీరోయిన్ కాంచనను భాగస్వామిగా తీసుకున్నారు. హీరో శోభన్‌బాబు. మురారి అప్పట్లో మధుసూదనరావుకి అసిస్టెంటు డైరక్టరు. మధుసూదనరావు కోపిష్టి. షాటు సరిగ్గా రావాలని ఆర్టిస్టులను తెగ తోమేవారు. అరిచేసేవారు. దాంతో అందరికీ భయం. ఆ భయంతో టేకులు తినేవారు. ఓ షాటులో కాంచన ప్లేటు నిండా లడ్డూలు పెట్టుకుని, ఒకటి తింటూ పెద్ద డైలాగు చెప్పాలి. ఎన్ని కావాలో అన్నే తెప్పిస్తే రిస్కు. షాటు మధ్య గ్యాప్‌లో ప్రొడక్షన్ కుర్రాళ్లు, అసిస్టెంటు డైరక్టర్లు, సాటి ఆర్టిస్టులు వాటిని తినేస్తూంటారు. అందుకని 20-30 లడ్డూలు ఎక్కువ పెట్టుకోవాలని మురారి తెప్పిస్తే, నిర్మాణ వ్యవహారాలు చూస్తున్న మధుసూదనరావు బావమరిది రాఘవయ్య ‘ఒక్క షాట్ కోసం యిన్ని లడ్డూలు ఎందుకు?’ అంటూ వీరంగం వేశారు.
షూటింగు ప్రారంభమైంది. డైరక్టరంటే భయం చేత కాంచన టేకులు తినసాగింది. 10 టేకులు, 10 లడ్డూలు, టేకుకి 150 అడుగుల చొప్పున 1500 అడుగుల కలర్ ఫిల్మ్ ఖర్చయ్యాయి కానీ టేక్ ఓకే కాలేదు. మర్నాడు అదే సీను షూట్ పెట్టుకున్నారు. కాంచన మొదటి షాటులో లడ్డూ నోట్లో పెట్టుకుని ‘‘ఇదేమిటి? లడ్డూలు కిరోసిన్ వాసన వేస్తున్నాయి?’’ అన్నారు. అప్పుడు మురారి ‘‘మీరు తినే లడ్డూల మీద కిరోసిన్ చల్లలేదండి. తక్కినవాటి మీద చల్లించాం.’’ అన్నారు. జూనియర్ ఆర్టిస్టుల విషయంలో యిది పరిపాటి. వాళ్లు అవసరానికి మించి తినేస్తారని తిండి పదార్థాలపై కిరోసిన్ చల్లేస్తూంటారు. ఆ కంపు భరిస్తూనే వాళ్లు రుచి, సువాసన ఆస్వాదిస్తున్నట్లు నటిస్తారు. కానీ హీరోయిన్‌కే యిలా జరగడంతో మధుసూదనరావు ‘అలా ఎందుకు చేశావ్?’ అని మురారిని అడిగారు.
‘‘ఒక్క షాట్ కోసం 20 లడ్డూలు కావాలా? అని రాఘవయ్యగారు తిడతారు. తెప్పించకపోతే మీరు తిడతారు. పైగా షాట్ అయిపోయాక ఆమె టేకులు తింటే మేం లడ్డూలు తిన్నామని మమ్మల్ని ఆడిపోసుకుంటారు. కిరోసిన్ చల్లేస్తే అలా అనలేరు కదా’’ అన్నారు మురారి. ‘‘ఏడిసినట్లే ఉంది. ఆవిడకి మరో టేకు కావలిస్తే యింకో లడ్డూ ఎలా తినగలుగుతుంది? మళ్లీ తెప్పించండి.’’ అన్నారు మధుసూదనరావు. మళ్లీ లడ్డూలు తెప్పించేటప్పటికి గంటన్నరైంది. అయితే యీసారి మొదటి షాట్‌లోనే టేకు ఓకే అయింది. రంగుల తెర మీద చూపే జీవితం ఒకటి, తెర వెనుక జీవితం మరొకటి. ఆ సినిమా షూటింగులోనే పైనుంచి లైట్ పడి మురారి తలకు గాయమై రక్తం కారింది. వేషం వేస్తున్న అంజలి వెంటనే పరిగెట్టుకుని వచ్చి మేకప్ బాక్స్‌లోంచి ఐస్ ముక్క తీసి చీరకొంగులో చుట్టి రక్తం కారుతున్న చోట అద్దింది. దర్శకనిర్మాత మధుసూదనరావు మురారి గురించి పట్టించుకోకపోగా, అంజలి చీర పాడైతే కంటిన్యుటీ దెబ్బ తింటుంది కదాని అల్లాడి పోయారట.
*మురారి అసిస్టెంటు డైరక్టరుగా ఉన్న రోజుల్లోనే శోభన్‌బాబుకి సన్నిహితుడయ్యారు. యువచిత్ర ప్రారంభించినప్పుడు శోభన్‌బాబు వచ్చి మొదటి కొబ్బరికాయ కొట్టారు. నువ్వు హీరోగా, నేను దర్శకుడిగా మొదటి సినిమా తీస్తా అనేవారు మురారి. ‘మొదటి సినిమా పెద్ద దర్శకుడితో తీయిద్దాం. తర్వాతిది నువ్వు తీద్దువుగాని’’ అని నచ్చచెప్పారు శోభన్‌బాబు. ‘‘జీవనజ్యోతి’’ శతదినోత్సవానికి విజయవాడ వచ్చినపుడు విశ్వనాథ్‌కు మురారిని పరిచయం చేసి ‘‘నా కోసం మీరు వాడికి సినిమా చేయాలి. ఎప్పుడు చేయడమనేది తర్వాత నిర్ణయిద్దాం.’’ అన్నారు. ఆయన సరేనన్నారు. తీరా చూస్తే ‘‘సీతామాలక్ష్మి’’ కథ ఫైనలైజ్ అయ్యాక హీరో వేషం శోభన్‌బాబుకి నప్పదనుకుని, చంద్రమోహన్‌ను తీసుకోవలసి వచ్చింది. టైటిల్స్‌లో శోభన్‌బాబుకు కృతజ్ఞతలు అని ఉంటుంది. ‘‘సీతామాలక్ష్మి’’ సినిమా కథాచర్చల సందర్బంగా మురారి కలగజేసుకోవడం విశ్వనాథ్ గారికి చికాగ్గా ఉండేది.
ఓసారి ‘‘అందుకే నేనెప్పుడూ ఏడిద నాగేశ్వరరావు వంటి వాళ్లనే నిర్మాతలుగా ఎన్నుకుంటాను. మా నిర్ణయాలలో వాళ్లు జోక్యం చేసుకోరు. మాకిలాంటి తలనొప్పులు ఉండవు.’’ అనేశారు. చర్చల్లో ఉన్న జంధ్యాలను మురారి విడిగా అడిగితే ‘‘ఔను, మేమూ, విశ్వనాథ్ స్టోరీ డిస్కషన్స్‌లో ఉంటే ఏడిద నాగేశ్వరరావు బయటే కూర్చునేవారు.’’ అని చెప్పారు. ,సీతామాలక్ష్మి సినిమాలో ‘సీతాలు సింగారం..’ పాట చాలా ప్రసిద్ధి. అది విశ్వనాథ్‌కు నచ్చలేదట. ఇంటర్వెల్ తర్వాత హుషారైన పాట రావాలని మురారి అంటే విశ్వనాథ్ అప్పట్లో బాగా పాప్యులర్ అయిన ఇంగ్లీషు పాట ‘మనీ మనీ’లాగ ఉండాలన్నారట. కానీ ఆ ట్యూన్ తెలుగుకి నప్పదనిపించింది. మర్నాడు వేటూరి ‘నూరేళ్లు చల్లగా, వర్ధిల్లు తల్లిగా’ అని రాసుకుని వస్తే మహదేవన్ ట్యూన్ చేశారు. మురారి ‘ఇదేమిటి అంపకాల పాటలా ఉంది. డబ్బులు వచ్చినందుకు హీరో, హీరోయిన్‌ల గంతులు వేయాల్సిన సందర్భంలో యిలాటి పాటేమిటి?’ అన్నారు. విశ్వనాథ్ ‘లిరిక్ బాగుంది. సందర్భానికి సరిపోతుంది.’ అన్నారు.
అప్పుడు వేటూరి ‘సీతాలు సింగారం..’ లిరిక్ రాసిస్తే, మహదేవన్ ట్యూన్ కట్టి వినిపిస్తే, మురారికి నచ్చింది. వేటూరి ‘ఈ పాట నూరేళ్లు ఉంటుంది’ అన్నారు. విశ్వనాథ్‌కి కోపం వచ్చింది. ‘ఈ సినిమాలో పాటలతో నాకు ఎటువంటి సంబంధం లేదు.’ అని విసుక్కుని వెళ్లిపోయారు. సినిమాను ట్రాజెడీగా ముగిస్తే క్లాసిక్ టచ్ వస్తుందని విశ్వనాథ్ ఆలోచన. కథకు స్ఫూర్తి నిచ్చిన ‘‘మల్లీశ్వరి’’ సుఖాంతం కాబట్టి యిదీ సుఖాంతం కావాలని మురారి వాదన. విశ్వనాథ్ యిష్టపడక పోయినా మురారి రెండో వెర్షన్ తను అనుకున్నట్లుగా తీయించారు. అదే రిలీజు చేశారు. సినిమా బ్రహ్మాండంగా ఆడింది కానీ విశ్వనాథ్ మురారితో మరో సినిమా చేయలేదు. ‘‘గోరింటాకు’’ తర్వాత మరో సినిమా చేద్దామా అని మురారి అడిగితే ‘‘నీతో పనిచేయడం కష్టం’’ అని చెప్పేశారు. సినీనిర్మాణం నాకు కొత్త కాబట్టి విశ్వనాథ్‌ను బాగా విసిగించాను అని మురారి ఆత్మకథలో రాసుకున్నారు. తర్వాతి సినిమాల టైటిల్స్‌లో నా తొలి సినిమా దర్శకుడు విశ్వనాథ్‌కు కృతజ్ఞతలు అని వేస్తూ వచ్చారు.
మురారి నాకు వ్యక్తిగతంగా తెలుసు. ‘‘హాసం’’ నడిపే రోజుల్లో పరిచయమయ్యారు. బాపుగారు చెప్పడంతో ఆ పత్రిక చూసి ముచ్చటపడ్డారు. సంగీతాభిమాని కాబట్టి మా పత్రికకు ఆత్రేయ గురించి, మహదేవన్ గురించి వ్యాసాలు రాశారు. కొన్ని విషయాలు ఆయనకు చెప్పే ఎడిట్ చేశాం. మనిషి మంచివాడే కానీ మాట చాలా కటువు. అవసరం లేని చోట కూడా దురుసుగా మాట్లాడతారు. మద్రాసు నుంచి ఓ సారి వచ్చినపుడు గ్రీన్‌పార్కు హోటల్లో కలిశాను. పత్రిక గురించి మెచ్చుకుంటూ మాట్లాడారు. తన పక్కనే ఉన్న ఎన్టీయార్ తనయుడు, ఫోటోగ్రాఫర్ మోహనకృష్ణను పరిచయం చేశారు. తర్వాతి రోజుల్లో మురారికి, వరప్రసాద్‌కు స్నేహం ఏర్పడింది. తన దగ్గరున్న గ్రామఫోన్ రికార్డులను పంపి, వరప్రసాద్ సిబ్బంది ద్వారా సిడి రికార్డులుగా మార్పించుకున్నారు. ఆయన దగ్గర మంచి కలక్షనే ఉంది. పోనుపోను తన సినిమాల క్వాలిటీ తగ్గిందనే బాధను తన కథనంలో వ్యక్తపరిచారు. నిష్కర్షగా ఉండే తన ఆత్మకథ ద్వారా చాలాకాలం పాటు ఆయన జనాల నాళ్లలో నానతారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను.
– ఎమ్బీయస్ ప్రసాద్ (అక్టోబరు 2022)