ఆత్మగౌరవం నినాదంతో రాయలసీమ గర్జించడానికి సిద్ధమైంది. దీనికి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఆధ్మాత్మిక నగరం తిరుపతి వేదికైంది. అలాగే వికేంద్రీకరణ ఉద్యమానికి తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి నేతృత్వం వహించనున్నారు. కనీవినీ ఎరుగని రీతిలో ఈ నెల 29న తిరుపతిలో భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించేందుకు భూమన కరుణాకరరెడ్డి సమాయత్తం అవుతున్నారు.
వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం ప్రస్తుతం న్యాయస్థానం పరిధిలో వుంది. అయితే అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ రెచ్చగొట్టే ధోరణితో అరసవెల్లి వరకూ పాదయాత్ర-2ను చేపట్టారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజానీకం అమరావతి పాదయాత్ర-2ను దండయాత్రగా భావిస్తోంది.
ఇటీవల ఉత్తరాంధ్ర సమాజం విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధాని చేయాలనే బలమైన ఆకాంక్షను “గర్జన” ద్వారా ప్రపంచానికి చాటి చెప్పారు. భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ర్యాలీ, అనంతరం బహిరంగ సభను విజయవంతం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం తమ ప్రాంతానికి రాజధాని కావాలనే బలమైన డిమాండ్‌ను వ్యక్తీకరించేందుకు మరోసారి రాయలసీమ సమాజం సన్నద్ధమవుతోంది.
సీమ సమాజ ఆకాంక్షను, ఆశయాల్ని చాటి చెప్పేందుకు తిరుపతిలో భారీ ర్యాలీ, సభ నిర్వహణకు ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి గురువారం సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భూమన మాట్లాడుతూ …అమరావతి రియల్ ఎస్టేట్ వ్యాపారులు రాయలసీమకు రాజధాని ఇస్తే ఏమవుతుందని ప్రశ్నించడాన్ని గుర్తు చేశారు. రాజధాని వల్ల ఏమొస్తుందని ఆర్థిక ప్రయోజనాల కోణంలో వారు అడుగుతున్నారని విమర్శించారు. పచ్చ కామెర్లున్న వారికి లోకమంతా అట్లే కనిపిస్తుందన్న చందంగా, అమరావతి రాజధాని భూస్వాముల మాటలున్నాయన్నారు.
అయితే రాయలసీమ సమాజం దృష్టిలో రాజధాని అంటే ఆత్మాభిమానం, ఆత్మగౌరవానికి సంబంధించిన వ్యవహారమని తేల్చి చెప్పారు. తమ ప్రభుత్వం సీమ ఆకాంక్షలను పరిగణలోకి తీసుకుని న్యాయ రాజధాని ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చిందన్నారు. కానీ దీనికి కొందరు కోస్తా రాజధాని రియల్ ఎస్టేట్ వ్యాపారులు అడ్డు తగులుతున్నారన్నారు. ఇది ఎంత మాత్రం సమర్థనీయం కాదన్నారు.
అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని, అందులో అమరావతి ఉండాలన్నారు. కానీ అక్కడి వారు మాత్రం కేవలం 29 గ్రామాల పెత్తందారులు , భూస్వాములు అభివృద్ధి కావాలని ఉద్యమాలు చేస్తున్నారని విమర్శించారు. కేవలం వైఎస్సార్ వల్లే రాయలసీమ దప్పిక అంతోఇంతో తీరిందన్నారు. ఇకపై రాయలసీమకు అన్యాయం జరగడానికి వీల్లేదన్నారు. సీమ ఆకాంక్షలను ఇప్పుడు కాకపోతే, మరెప్పుడు నెరవేర్చుకుంటామనే నినాదంతో ఉద్యమానికి శ్రీకారం చుట్టామన్నారు.
భవిష్యత్ తరాలను కరువుకాటకాలతో ఎండనీయకూడదనే సదాశయంతో సీమ ప్రజాసంఘాలు, ఉద్యమకారులు, బుద్ధి జీవులను కలుపుకుని ఈ నెల 29న తిరుపతి కృష్ణాపురం ఠాణా నుంచి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వరకూ భారీ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించుకున్నట్టు చెప్పుకొచ్చారు. అనంతరం సభ కూడా నిర్వహిస్తామన్నారు. ఇది రాయలసీమ ఉద్యమానికి దివిటీలా మారనుందని ఆయన అన్నారు. విశాఖ గర్జనను మించి, సీమ గర్జన వుంటుందని ఆయన స్పష్టం చేశారు.