పవన్ జాతీయ పార్టీ పొగరు అణిచాడా?

ఏపీలో టీడీపీ -జనసేన కలయికపై అనేకమంది అనేక రకాలుగా మాట్లాడుతున్నారు. ఎవరికీ తోచిన భాష్యాలు వారు చెబుతున్నారు. విశ్లేషణలు చేస్తున్నారు. కొందరు పవన్ జాతీయ పార్టీ (బీజేపీ) పొగరు అణిచాడని చెప్పుకుంటున్నారు. పవన్ ఉన్నట్లుండి…

ఏపీలో టీడీపీ -జనసేన కలయికపై అనేకమంది అనేక రకాలుగా మాట్లాడుతున్నారు. ఎవరికీ తోచిన భాష్యాలు వారు చెబుతున్నారు. విశ్లేషణలు చేస్తున్నారు. కొందరు పవన్ జాతీయ పార్టీ (బీజేపీ) పొగరు అణిచాడని చెప్పుకుంటున్నారు. పవన్ ఉన్నట్లుండి చంద్రబాబుతో కలవడం బీజీపీలో కలకలం రేపింది. ఢిల్లీ నాయకులు కూడా కంగుతిన్నారు. చంద్రబాబు -పవన్ వైసీపీపై ఒక్కటిగా, కలిసికట్టుగా పోరాటం చేస్తామని సడన్ గా ప్రకటించారు కానీ ఈ ప్రకటన వెనుక చాలా కాలంగా చర్చలు జరిగి ఉండొచ్చు. కాకపొతే ఉమ్మడిగా పోరాటం చేస్తామని వారిద్దరూ ప్రకటన చేయడానికి అవసరమైన సందర్భం వచ్చింది.

బీజీపీ – జనసేన పొత్తు ఏనాటికైనా పటాపంచలు కావొచ్చని ఎప్పుటినుంచో వినిపిస్తున్నదే. వైసీపీపై పోరాటం చేయాలంటే అటు టీడీపీకి బలం చాలదు. ఇటు జనసేనకు బలం చాలదు. అందుకే ఆలోచించుకొని ఇద్దరూ కలిశారు. బీజేపీతో పొత్తు పెట్టుకొని ముందుకు సాగడం తనవల్ల కాదని పవన్ అనుకున్నాడు. ఒంటరిగా పోటీ చేసి బీజేపీ గెలవలేదు. కాంగ్రెస్ గెలవలేదు. ఈ రెండు పార్టీలపై ఏపీ ప్రజల ఆగ్రహం ఇప్పటికీ చల్లారలేదు. బీజీపీ నాయకులు మోడీని చూసుకొని ఎగిరెగిరి పడుతున్నారు. పొగరుగా వ్యవహరిస్తున్నారు. జనసేన పట్ల కూడా అదే వైఖరి అవలంబించారు. 

175 నియోజకవర్గాల్లోను వైసీపీ బలంగా ఉండటంతో ఏ నియోజకవర్గానికి వెళ్లినా, ఏ ప్రాంతానికి వెళ్లినా అడ్డంకులు తప్పవనే అభిప్రాయానికి పవన్ వచ్చారు. జెండా మోయాలన్నా, గౌరవప్రదమైన సంఖ్యలో సీట్లు సాధించి అసెంబ్లీలోకి అడుగుపెట్టాలన్నా, అందులోను ముఖ్యంగా తాను అసెంబ్లీలో ఉండాలన్నా, బలమైన మిత్రపక్షం అవసరాన్ని పవన్ గుర్తించారు. బీజేపీతో స్నేహం ఉన్నప్పటికీ తాను మొదటి నుంచి అధికార పార్టీపై చేస్తున్న పోరాటంలో ఆ పార్టీ నేతలెవరూ కలిసి రాకపోవడం, రోడ్ మ్యాప్ ఇస్తామన్న ఢిల్లీ పెద్దలు అలసత్వం ప్రదర్శించడంలాంటివన్నీ పవన్ ను పునరాలోచనలో పడేశాయి. దీంతో అందివచ్చిన పరిణామాలను అనుకూలంగా మార్చుకున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జనసేన శ్రేణుల్లో ఎక్కడా వ్యతిరేకత వ్యక్తం కాకుండా చూసుకున్నారు. ఓట్లు చీలిపోవడంవల్లే గత ఎన్నికల్లో నష్టపోయామనే అవగాహనతో ఉన్న చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలిసి పోటీచేయడం దాదాపు ఖాయమైంది. అధికారిక ప్రకటనే తరువాయి. విశాఖ సంఘటన జరగనంతవరకు, అంతకు కొద్దిరోజుల క్రితం వరకు పవన్ ఒంటరిగానే పోటీచేయడానికే మొగ్గుచూపారు. అయితే పార్టీ తరఫున ఏ కార్యక్రమం తలపెట్టినా, తాను ఎక్కడికి వెళ్లినా వైసీపీ నేతలు అడ్డుకోవడంతోపాటు కార్యక్రమాల నిర్వహణకు కూడా అడ్డంకులేర్పడుతున్నాయి. దీంతో ఒంటరిగా పోటీ చేయాలనుకున్నప్పటికీ తనకు బలమైన రాజకీయ పార్టీ అండగా ఉండాలని భావించారు.

తాను ముఖ్యమంత్రిని కావాలనే ఉద్దేశంతోనే పవన్ రాజకీయ రంగ ప్రవేశం చేశారు. పార్టీ పెట్టారు. ఆయనకు లక్షలాదిమంది అభిమానులు ఉన్నప్పటికీ రాజకీయాలను సీరియస్ గా తీసుకోకపోవడం, తగిన వ్యూహాలు లేకపోవడంతో విఫలమయ్యారు. ఇప్పుడు చంద్రబాబుతో జత కట్టారంటే తాను ముఖ్యమంత్రి కావడంకంటే జగన్ ను గద్దె దింపడం లక్ష్యం కావొచ్చు. నేరుగా అధికారం చేపట్టే అవకాశం రాకపోయినా టీడీపీ – జనసేన కూటమి గెలిస్తే అధికారం పంచుకోవచ్చని, పాలనలో కీలక భాగస్వామిగా మారొచ్చనే ఉద్దేశం కావొచ్చు.