జూన్ నెలలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కొత్తగా ఎన్నికైన 20 మంది తన బిజెడి పార్టీ ఎంపీలను వెంటబెట్టుకుని మోడీని కలిసి రాష్ట్రప్రయోజనాలపై మాట్లాడారు. ఆ సందర్భంగా మోడీ తనకు మూడు సీట్ల అవతల కూర్చున్న బిజెడి ఎంపీ అయిన జయ్ పండా దగ్గరకు లేచి వెళ్లి పలకరించి మాట్లాడారు. పండా కూడా నవ్వుతూ మాట్లాడాడు. ఇది చూసి నవీన్ మొహం మాడ్చుకున్నాడట. అప్పటిదాకా ఎంతో ఆత్మీయుడిగా చూసుకున్న పండాను కాస్త దూరం పెట్టడం మొదలుపెట్టాడు. జయ్ పండా డబ్బున్నవాడు, విద్యాధికుడు, మర్యాదా, మప్పితం తెలిసినవాడు. ఢిల్లీ సర్కిల్స్‌లో అందరి గౌరవాన్నీ పొందేవాడు. టీవీ చర్చల్లో బిజెడి ప్రతినిథిగా పాల్గొంటూ నవీన్ విధానాలను సమర్థిస్తూ మాట్లాడతాడు. నవీన్ కున్న హుందాతనం అతనిలో కూడా వుంది కాబట్టి ఏనాటికైనా నవీన్ పార్టీని చీల్చాలని ప్రత్యర్థులు ప్రయత్నిస్తే అతను సరైన అభ్యర్థి అనుకోవచ్చు. ఆ భయంతోనే నవీన్ అతని స్థాయిని తగ్గిస్తున్నాడని పరిశీలకులు అంటున్నారు. మొన్న మేలోనే 21 పార్లమెంటు సీట్లలో 20 సీట్లు, 147 అసెంబ్లీ సీట్లలో 117 సీట్లు గెలిచి దేశమంతా వీచిన మోడీ వేవ్‌ను తట్టుకుని నిలబడిన నవీన్‌కు ఇలాంటి సందేహం ఎందుకు రావాలి అంటే దానికో ఫ్లాష్ బ్యాక్ వుంది.
నవీన్‌కు కుడిభుజంగా వుండి, పార్టీ, ప్రభుత్వ వ్యవహారాలను సర్వం తానై నడిపించినవాడు ప్యారీ మోహన్ మహాపాత్ర. అధికారంలోకి వచ్చి పదేళ్లు గడిచాక 2012 మేలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టమని ఆహ్వానించడానికి నవీన్ ఇంగ్లండ్ వెళ్లాడు. వెంటనే మన నాదెండ్ల భాస్కరరావు శైలిలో ప్యారీ మోహన్ 33 మంది ఎమ్మెల్యేలను భువనేశ్వర్‌లోని స్వస్తి హోటల్‌కు రమ్మనమని ఆదేశించి, నవీన్ వ్యవహారశైలి ఖండిస్తూన్న ప్రకటనపై సంతకాలు చేయించబోయాడు. ఆ 33 మందిలో ఒకడు వెంటనే నవీన్‌కు ఉప్పందించాడు. ఆగమేఘాలపై వెనక్కి వచ్చి ప్యారీ మోహన్‌ను పార్టీలోంచి తొలగించి కుట్ర జరగకుండా చూసుకున్నాడు, ప్రభుత్వాన్ని నిలుపుకున్నాడు. కానీ ఎవరినీ గుడ్డిగా నమ్మకూడదన్న భావంతో అభద్రతా భావం అతనిలో పెరిగింది. ప్యారీ మోహన్ ఒడిశా జన మోర్చా పేరుతో సొంతంగా పార్టీ పెట్టుకున్నాడు. దానికి కొద్దికొద్దిగా ప్రజాదరణ పెరుగుతోంది. ఇటీవల ఒడిశాలో ఒక భూభాగోతం వెలుగులోకి వచ్చింది. పార్టీ నాయకులే ఒకరిపై మరొకరు కక్ష సాధించడానికి వీటిని బయటపెట్టారని పుకార్లు చెలరేగుతున్నాయి.
ముఖ్యమంత్రి సన్నిహితుడైన కల్పతరు దాస్ పేరు కావాలని ఇరికించారని కూడా అంటున్నారు. కాంగ్రెసు ముఖ్యమంత్రిగా పని చేసిన నందినీ శతపథి కుమారుడు, అప్పట్లో సంజయ్ గాంధీ అనుచరుడు అయిన తథాగత శతపథి ఇప్పుడు బిజెడి పార్టీ ఎంపీ, ధరిత్రి అనే ఒడియా పత్రికకు సంపాదకుడు. అతను, డా॥ దామోదర్ రౌత్ అనే మంత్రి కలిసి అవినీతిపరులైన పార్టీ సభ్యులపై చర్యలు తీసుకోవాలని బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు. వీటన్నిటి వెనుక ప్యారీ మోహన్ హస్తం వుందన్న అనుమానంతో నవీన్ అతని ఇంటిపై నిఘా పెట్టాడని అనుమానాలున్నాయి. తన ఫోన్ ట్యాప్ అవుతోందని ప్యారీ మోహన్ ఫిర్యాదు చేశాడు కూడా. ఈ పరిస్థితుల్లో జయ్ పండా కూడా ప్యారీ మోహన్‌లా తయారవుతాడన్న భయాలతో నవీన్ సతమతమవుతున్నాడు.
ఎమ్బీయస్ ప్రసాద్