సిఐడి చేతిలో ‘ఇంటి దొంగల’ అవినీతి చిట్టా!?

‘ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టుకోలేరంటారు’. కానీ, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు అలియాస్‌ కేసీఆర్‌ మాత్రం ఇంటి దొంగల్ని పట్టుకొనేటట్లే ఉన్నారు. పేదల ఇళ్ల నిర్మాణంలో జరిగిన అక్రమాల నిగ్గుదేల్చేందుకు…

‘ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టుకోలేరంటారు’. కానీ, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు అలియాస్‌ కేసీఆర్‌ మాత్రం ఇంటి దొంగల్ని పట్టుకొనేటట్లే ఉన్నారు. పేదల ఇళ్ల నిర్మాణంలో జరిగిన అక్రమాల నిగ్గుదేల్చేందుకు టి.ముఖ్యమంత్రి కేసీఆర్‌ సిఐడి విచారణకు ఆదేశించడంతో సిఐడి తనకు అప్పగించిన పనిని శరవేగంగా పూర్తి చేసినట్లు అత్యంతమైన విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తున్నది. సర్కార్‌ ఆదేశించడమే తరువాయి అన్నట్లుగా సిఐడి చేపట్టిన తొలి దశ విచారణలో గృహ నిర్మాణ శాఖలో సుమారుగా 300కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అయినట్లు  సమాచారం. ఇప్పుడు ఇదే అంతటా హాట్‌ హాట్‌ టాపిక్‌. ఇంటి దొంగలు బాగానే అవినీతికి పాల్పడ్డట్టు సిఐడి నివేదికను రూపొందించి, నివేదికను ప్రభుత్వానికి అందచేసేందుకు సమాయత్తమయ్యే పనిలో ఉన్నట్లు ప్రచారం జరుగుతుండటం…   గృహ నిర్మాణ(హౌసింగ్‌) శాఖను ఒక కుదుపు కుదుపేస్తున్నది. సంబంధిత ఉద్యోగుల గుండెళ్లో రైళ్లు పరుగెత్తుతున్నాయి. వానా కాలంలో ముచ్చెమటలు పడుతున్నాయి. ఎప్పుడు ఏం వార్త వినాల్సి వస్తుందోననీ తెలియక సంబంధిత శాఖలోని అధికారులు, సిబ్బంది ఆగమాగం అవుతున్నట్లు సమాచారం. 

తెలంగాణ ఉద్యమంలో పాల్గన్నాం కాబట్టి తమ మీద ఎలాంటి ఒత్తిళ్లు ఉండవనే ధీమాతో తెలంగాణ ఉద్యోగులుండేవారు. కానీ, తాజా పరిణామాలు మాత్రం అలా ఎంత మాత్రం అగుపించడం లేదు. కేసీఆర్‌ మాత్రం ‘తమ్ముడు తమ్ముడే…పేకాట పేకాటే’ అన్న సిద్ధాంతంతో ముందుకు దూసుకెళ్తున్నట్లు కనిపిస్తున్నది. అయితే, ఇది టి ఉద్యోగులకు ఇబ్బందికరంగా మారిందనే చెప్పాలి.   గృహ నిర్మాణ శాఖలో జరిగిన అక్రమాలపై గతంలో ప్రభుత్వం విచారణ జరిపి అక్రమాలకు బాధ్యులైన సుమారు 288మంది అధికారులను డిస్మిస్‌ చేయడం జరిగింది. తాజాగా  ఇళ్ల అక్రమాలపై సిఐడి విచారణ జరగడంతో తమ ఉద్యోగం ఏమిటన్నది తలచుకుని హౌసింగ్‌లోని సిబ్బంది బిక్కు బిక్కుమంటున్నారు. అయితే, ఇళ్ల నిర్మాణంలో అక్రమార్కుల గుట్టును రట్టును చేసేందుకు సీఎం కేసీఆర్‌ సిఐడి విచారణకు ఆదేశించడం  చూస్తుంటే అవినీతి నిర్మూలనపై ‘వార్‌’ ప్రకటించారా?  ప్రభుత్వాధినేతగా పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంలో అవినీతి నిర్మూలనకు సంబంధించి చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉండబోతున్నారా? దీనిలో భాగంగా తొలుత పక్కా గృహ నిర్మాణ శాఖను శాంపిల్‌గా ఎంచుకున్నారా? ఇంటి దొంగలను పట్టుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారా? అంటే, హౌసింగ్‌ శాఖలో జరిగిన అక్రమాలపై సిఐడి విచారణకు ఆదేశించడం…సిఐడి విచారణలో 300కోట్ల రూపాయల మేరకు అవినీతి జరిగిందనీ వెల్లడి కావడంతో కేసీఆర్‌ ముందుగా చెప్పినట్లుగా అవినీతిని ఏ మాత్రం సహించరనే సంకేతాలు ఇవ్వకనే ఇస్తున్నారనీ చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. 

కేసీఆర్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టిన మరుక్షణమే రాజకీయ అవినీతిని నిర్మూలించాల్సిన అవసరం ఎంతో ఉందనీ, అవినీతి నిర్మూలననే తన లక్ష్యమనీ, అవినీతికి పాల్పడేవారు ఎంతటివారైనా తాను ఊపేక్షించననీ, చివరకు తన కూతురు, కుమారుడు ఎవరైనా సరే అవినీతికి పాల్పడితే ఊచలు లెఖ్కించాల్సిందేననీ కుండబద్దలు కొట్టినట్లు చెప్పుకొచ్చారు. అవినీతిపై కేసీఆర్‌ అప్పుడు మాట్లాడినట్లుగానే ఇప్పుడు ఆచరణలో నూటికి నూరు శాతం  అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలంగాణ గృహ నిర్మాణ శాఖలో జరిగిన అవినీతిపై సిఐడి విచారణకు ఆదేశించడంతో స్పష్టమవుతున్నది. గడిచిన 10ఏళ్లలో  ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో జరిగిన అక్రమాలపై నిగ్గుతేల్చేందుకు సిఐడి విచారణకు ఆదేశించడం చూస్తుంటే అవినీతి నిర్మూలన పట్ల కేసీఆర్‌ ఎంత సీరియస్‌గా ఉన్నారో వేరే చెప్పనక్కర్లేదు.   అయితే, గృహ నిర్మాణ శాఖలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో జరిగిన అక్రమాలను వెలికితీసేందుకు కేసీఆర్‌ ఆదేశించిన సిఐడి విజయవంతంగా తన పనిని ముగించిందనీ తెలుస్తున్నది. ఈ అవినీతిలో గృహ నిర్మాణ శాఖాధికారులతో పాటు గత పదేళ్ల కాలంలో అధికారంలో ఉన్న పలువురు ప్రజా ప్రతినిధులు కూడా భాగస్వాములేననీ ఓ నివేదికను తయారీ చేసినట్లు సమాచారం. 

ప్రజాప్రతినిధుల సిఫార్సుల మేరకే గృహ నిర్మాణ శాఖాధికారులు తమ ఇష్టానుసారంగా నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డట్లు సిఐడి తన విచారణలో ఓ అంచనాకు వచ్చినట్లు తెలుస్తున్నది. ఈ నివేదికను త్వరలోనే సిఐడి టి.సర్కార్‌ సీఎం కేసీఆర్‌కు అందచేయనున్నట్లు సచివాలయంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నివేదికపై కేసీఆర్‌  ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది అంతటా ఆసక్తికరంగా మారింది. అయితే,అవినీతి విషయంలో కేసీఆర్‌ ముందుగా చెప్పినట్లు అన్నంత పని చేస్తారా? అనే దానిపై అధికార వర్గాల్లో వాడి వేడిగా చర్చ సాగుతుండగా…గృహ నిర్మాణ శాఖలో పనిచేసే వర్క్‌ ఇన్స్‌పెక్టర్‌ మొదలుకుని జిల్లా స్థాయి అధికారి(డిస్ట్రిక్‌ మేనేజర్‌)వరకు భయంలో పడ్డారు. వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే హౌసింగ్‌ అధికారులు అర చేతిలో ఉద్యోగాన్ని పెట్టుకుని కాలం వెళ్లదీస్తున్నారనీ చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.  ఈ శాఖలో పనిచేసే పలువురు అధికారులు, సిబ్బంది హౌసింగ్‌ను పూర్తిగా కొల్లగొట్టినట్లు సమాచారం. సిఐడి విచారణతో ఇటువంటి వారి ఉద్యోగులు ఊడటమే కాదు, ఊచలు లెఖ్కపెట్టడం ఖాయమనీ తెలుస్తోంది.   

ఇళ్ల నిర్మాణం, తెల్ల రేషన్‌ కార్డుల జోలికి అధికారంలో ఉన్న పాలకులు పోవాలంటే భయపడేవారు. కానీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాత్రం ఈ రెండు విషయాల్లోనూ కాస్త దూకుడుగానే వెళ్తున్నారనీ చెప్పాలి.  ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ సానుభూతిపరులు, కార్యకర్తలకు ఇళ్లను, రేషన్‌కార్డులను ఇప్పించుకోవడం…మిగతా కొన్నింటిని ఆయా శాఖల అధికారులు తమకు తోచిన విధంగా చేసుకోవడం  ఆనవాయితీగా వస్తోంది. ఎమ్మెల్యే నుంచి సీఎం దాకా ఎదిగిన కేసీఆర్‌కు ఈ విషయాలన్నీ తెలియందేమీ కాదు. కానీ,  ఈ ఆనవాయితీకి ఫుల్‌స్టాప్‌ పెట్టాలనీ ఆలోచన రావడమే తరువాయి అన్నట్లుగా తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై ర్యాండమ్‌ సర్వేను చేయించారు. ర్యాండమ్‌ సర్వేలో అనేక అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. శాంపిల్‌గా 593గ్రామాల్లో సర్వే చేస్తే అసలు బాగోతం బయటపడ్డది. అధికారిక రికార్డులు చెబుతున్న లెఖ్కలన్నీ కాకి లెఖ్కలేననీ తేలింది. 36వేల ఇళ్ల నిర్మాణమే చేపట్టలేదనీ ర్యాండమ్‌ సర్వే నిగ్గుతేల్చింది. దీంట్లో సుమారు 233కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అయినట్లు తేల్చేసింది. 

ఇందిరమ్మ ఇళ్ల లెఖ్కలన్నీ తప్పుల తడక అనీ, ఈ పథకంలో అధికారుల చేతి వాటం బాగానే ఉందనీ ప్రభుత్వానికి నివేదికలందాయి. శాంపిల్‌గా సర్వే చేస్తేనే ఇంత అవినీతి, అక్రమాలు జరిగినట్లు తేలడంతో పక్కా గృహ నిర్మాణ శాఖకు పట్టిన అవినీతిని చెదలు దులపాల్సిందేననే నిర్ణయానికి వచ్చిన సీఎం కేసీఆర్‌ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశించారు. గృహ నిర్మాణ శాఖ పలువురు రాజకీయ నాయకులకు, ఆ శాఖలో పనిచేసే వర్క్‌ ఇన్స్‌పెక్టర్‌ మొదలుకుని జిల్లా మేనేజర్‌ వరకు ‘పాడిగేదె’లాగా మారింది. ఇలాంటి శాఖపై కేసీఆర్‌ దృష్టిని మళ్లించడమే కాకుండా, సిఐడి విచారణకు ఆదేశించడంతో  చూస్తుంటే   గృహ నిర్మాణ శాఖకు చెందిన అక్రమార్కుల భరతం పట్టడానికి పెద్ద సాహసమే చేస్తున్నారనీ చెప్పొచ్చు. అయితే, ఇక్కడ మరో చిక్కు కూడా ఉంది. ఇప్పటికే హౌసింగ్‌లో అక్రమాలకు పాల్పడిన 288మంది సిబ్బంది డిస్మిస్‌ అయ్యారు. పలువురు కటకటాల వెనక ఊచలు లెఖ్కలు పెడుతున్నట్లు తెలుస్తున్నది. తాజాగా టి. ప్రభుత్వం ఆదేశించడం… సిఐడి విచారణలో మరిన్ని అక్రమాలు వెలుగు చూడటం… ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న హౌసింగ్‌ శాఖలో మెజారిటీ అధికారులు అక్రమాలకు పాల్పడినట్లు తేలడంతో… ఈ అక్రమాలకు పాల్పడిన వారందరినీ జైలుకు పంపుతారా? లేదంటే, కేవలం రాజకీయ నాయకులనే జైలుకు పంపుతారా? కేసులతోనే సరి పెడతారా? అనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్న. హౌసింగ్‌ శాఖలో ఏఈ స్థాయి అధికారులు కొందరు ఉన్నతాధికారులు, రాజకీయ నాయకుల అండదండలతో ఏళ్ల తరబడిగా తమ హవాను కొనసాగిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. 

హౌసింగ్‌ శాఖను తమకు తోచిన విధంగా దోచుకుతిన్నారు. కోట్లకు పడగెత్తారనే విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానం లేదు. ఇలాంటి వారు సీఎం  కేసీఆర్‌ సొంత జిల్లాలో కూడా ఉన్నారనీ తెలుస్తున్నది.  సిఐడి ఇదే తేల్చినట్లు తెలుస్తున్నది.  అయితే, తెలంగాణ ఉద్యమంలో ప్రభుత్వ ఉద్యోగులు పోషించిన పాత్ర గురించి మనం వేరే చెప్పనక్కర్లేదు. తెలంగాణలో కేసీఆర్‌ నాయకత్వంలోని టీఆర్‌ఎస్‌ సర్కార్‌ ఏర్పాటు చేయగానే తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకున్న ఉద్యోగులకు వరాల జల్లును కురిపించారు. తమది అట్లాంటి ఇట్లాంటి గవర్నమెంటు కాదనీ, తమది ఫ్రెండ్లీ గవర్నమెంటు అని కేసీఆర్‌ చాలనే చెప్పుకొచ్చారు. ఆ దిశగా ఇంక్రిమెంట్లను కూడా ప్రకటించారు. అయితే, ఇప్పుడేమో సర్వేలనీ, విచారణలనీ కేసీఆర్‌ తన అధికార ప్రతాపాన్ని చూపిస్తున్నారు. ఇదీ, ఇప్పుడు హౌసింగ్‌ శాఖను ఒక కుదుపు కుదేపిస్తోంది. అ శాఖలోని అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.  సిఐడి విచారణ  అనేక మంది అధికారుల ఉద్యోగానికి ఎసరు పెట్టడం ఖాయంగా తెలుస్తున్నది. 

అయితే, ఫ్రెండ్లీ గవర్నమెంటు అని అవినీతికి పాల్పడిన వారిని వదిలేస్తారా? లేదంటే, చట్టం తన పని తాను చేసుకుని పోతుందనీ ముందుగా చెప్పిన మాటకు కట్టుబడి ఉంటారా? అన్నదానిపై కూడా ఇప్పుడు అంతటా ఆసక్తికరమైన చర్చ సాగుతున్నది. అయితే, అవినీతిపై ప్రక్షాళన మొదలుపెట్టిన కేసీఆర్‌ సర్కార్‌కు మునుముందు రాజకీయంగా పలు ఇబ్బందులు కూడా వస్తాయనీ  తెలుసు. ప్రభుత్వ ఉద్యోగులను టార్గెట్‌ చేస్తే తన సర్కార్‌ పట్ల ఉద్యోగుల నుంచి వ్యతిరేకత వస్తుందనే విషయం కూడా కేసీఆర్‌కు తెలియందు కాదు. అయితే, వీటన్నింటిని ముందస్తుగా గ్రహించి వాటిని ఎలా ఎదుర్కోవాలనే దాని గురించి కూడా కేసీఆర్‌ ఇప్పటికే తనదైనశైలిలో కసరత్తులు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తున్నది. అవినీతిని రూపు మాపే విషయంలో కేసీఆర్‌ అంతా పక్కా ప్రణాళికతోనే ముందుకు సాగుతున్నట్లు సచివాలయ వర్గాల ద్వారా సమాచారం అందుతున్నది.

(ఎ.సత్యనారాయణ రెడ్డి)