సినిమాకి కథ కుదిరి, తారాగణం ఎంపిక జరిగి.. అది సెట్స్ మీదకు వెళ్ళి.. నిర్మాణం జరుపుకుని.. విడుదలవ్వాలంటే ఎన్నో కష్టాలు పడాల్సి వస్తుంది. ‘పురిటి కష్టాలు’ అని సినీ రంగంలో సీనియర్లు అంటుంటారు సినిమా గురించి చెబుతూ. ‘సినిమా కష్టాలు’ అని సాధారణ ప్రజానీకం కూడా సరదాగా కామెంట్ చేసుకోవడం వింటుంటాం. సినిమా కష్టం అంటే మామూలు విషయం కాదు. ఆ ‘పెయిన్’ని తట్టుకోలేక కొన్ని సినిమాలు బాక్సాఫీసుల్లో మగ్గిపోతాయి.. దర్శకులు, నిర్మాతలు, నటీనటులు అర్ధాంతరంగా తనువు చాలించేస్తుంటారు.. సినిమా కష్టం అంటే అంత దారుణమైనది మరి. సినిమా అంటే సమిష్టి కృషి. ఓ దర్శకుడి వల్లో, ఓ నిర్మాత వల్లో, ఓ హీరో వల్లో.. హీరోయిన్ వల్లో.. సినిమా హిట్టయి కూర్చోదు.. ఫ్లాపయి అటెకక్కదు. కలసికట్టుగానే విజయాన్ని అయినా, పరాజయాన్ని అయినా ఆస్వాదించడమో, ఆవేదన చెందడమో జరగాలి. కానీ, ఇపడు పరిస్థితి అది కాదు. డైరెక్టర్ అంటే కెప్టెన్ ఆఫ్‌ది షిప్.. అనే రోజుల్లేవిపడు. నిర్మాత అంటే చాలామందికి లెక్కలేని రోజులివి. కొన్ని సందర్భాల్లో హీరో హీరోయిన్లనూ లెక్కచేయని కాలంలో వున్నాం మనం. ట్రెండ్ మారిందని ఇలాంటి విషయాల్లో సరిపెట్టుకోవడం సాధ్యమా? కానే కాదు.
దర్శకుల బాధలివీ..
ఇటీవల ఓ దర్శకుడు ఓ సినిమాని రూపొందించాడు. హిట్టయ్యిందా? ఫ్లాపయ్యిందా? అన్నది వేరే విషయం. సినిమా హిట్టయ్యిందని ఆ దర్శకుడు భావిస్తున్నాడు. సినిమా యూనిట్ కూడా అదే భావనలో వుంది. సినిమాకి ప్రమోషన్ విడుదలకు ముందూ, విడుదలయ్యాకా బీభత్సంగా జరిగింది. కానీ, ఆ దర్శకుడ్ని హీరో లెక్క చేయడంలేదు. తన ఆవేదనను ఆ దర్శకుడు స్వయానా మీడియా ముందుకొచ్చి వెల్లగక్కాడు. ‘నీకెందుకు నేను పబ్లిసిటీ చేయాలి..’ అంటూ సదరు హీరో, ఆ దర్శకుడిపై గుస్సా అయ్యాడు. ఓ అసిస్టెంట్ డైరెక్టర్‌ని పొగడటానికి తీరిక వుందిగానీ, ఆ సినిమా విషయంలో దర్శకుడి గొప్పతనం గురించి ఒక్క మాట కూడా చెప్పలేదా హీరో. అదే ఆ డైరెక్టర్‌కి ఒళ్ళు మండేలా చేసింది. ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, ‘దర్శకుడు సినిమాకి కెప్టెన్.. అది నేనూ ఒపకుంటాను.. అతన్నీ పిలవండయ్యా..’ అని ఓ ఛానల్ ఈ ఉదంతంపై దర్శకుడితో చర్చా కార్యక్రమం షురూ చేస్తే హీరోగారు ఉచిత సలహా ఇచ్చారు. తొలి సినిమా రిలీజయ్యేదాకా పెద్దగా పేరు లేని ఓ దర్శకుడి పరిస్థితి ఇంత దారుణంగా తయారైంది. ఆ ఒక్క దర్శకుడి ఆవేదనే కాదిది.. చాలామంది విషయంలో జరుగుతోన్నదేనని సినీ ఇండస్ట్రీలో చెపకుంటున్నారు. అందరూ అలాగే వున్నారని అనలేం. ఎందుకంటే, కొత్త కొత్త సినిమాలు తెరపైకొస్తున్నాయి.. విజయం సాధిస్తున్నాయి.. వాటి ద్వారా పరిచయమయ్యే దర్శకులు మంచి మంచి ప్రాజెక్టుల్ని సొంతం చేసుకుంటున్నారు. అయినా ఓ దర్శకుడికి అన్యాయం జరిగాక, దానిపై సినీ పరిశ్రమ స్పందించి వుంటే పరిస్థితి ఇంకోలా వుండేది.
నిర్మాత అన్న పదానికి అర్థమే మారిపోయింది
ఒకపడు నిర్మాత అంటే అతనికి వుండే గౌరవం అంతా ఇంతా కాదు. కానీ, ఇపడు నిర్మాత పరిస్థితి అత్యంత దయనీయం.. అని సినీ పరిశ్రమ పెద్దలే ఒపకుంటున్నారు. నిర్మాత అంటే జస్ట్ కాంబినేషన్ సెట్ చేసేవాడన్నట్టుగా కొత్త అర్థం చెబుతున్నాయి కొన్ని సినిమాలు. ‘సినిమా తీసి, ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కొనితెచ్చుకోవాలేమో..’ అని కొందరు సీనియర్ నిర్మాతలు (సినిమాలు తీయడం మానేసి చాన్నాళ్ళే అయ్యింది కొందరికి) సరదాగా వ్యాఖ్యానిస్తున్నా, వారి అంతరంగం అత్యంత ఆవేదనా భరితం. ఒకపడు ఎడా పెడా సినిమాలు తీసిన నిర్మాతలు, ఇపడు సినిమా తియ్యాలంటే భయపడిపోతున్నారన్నది కాదనలేని వాస్తవం. ఎందుకూ? అంటే బడ్జెట్ లిమిట్స్ దాటేశాయి. దాంతో, జస్ట్ ఓ గేమ్ ఆడుతున్నారంతే. నలభై కోట్లు బడ్జెట్ పెట్టి సినిమా తీస్తే.. సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చినా, నిర్మాతకు మాత్రం డబ్బులు రాని పరిస్థితులున్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా వుందో అర్థం చేసుకోవచ్చు. రెమ్యునరేషన్లు పెరిగిపోయాయ్.. అదే సమయంలో సినిమా పట్ల బాధ్యత తగ్గిపోయింది.. నిర్మాతపై గౌరవమూ తగ్గిపోయిందని వాపోతోన్న సీనియర్ నిర్మాతల ఆవేదనను పట్టించుకునేవారెవ్వరు? నిర్మాతగా అశ్వనీదత్ సినిమా వచ్చి ఎన్నాళ్ళయ్యింది? లిస్ట్ తీస్తే ఒకపడు సంచలన నిర్మాతలుగా ఓ వెలుగు వెలిగిన సీనియర్లు బోలెడంతమంది దొరుకుతారు.
బూడిదపాలవుతున్న కోట్లు
ఏడు కోట్లు.. పది కోట్లు.. పదిహేను కోట్లు.. పద్ధెనిమిది కోట్లు.. ఇదీ హీరోల రెమ్యునరేషన్ గురించి సినీ వర్గాల్లో జరుగుతోన్న ప్రచారం. ఫలానా సినిమా కోసం హీరో ఇంత మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకున్నాడంటూ గాసిప్స్ రావడం.. ఆ సినిమా రిలీజయ్యే రోజు దగ్గర చేసి, ఆ నిర్మాత ఇంటిపై ఆదాయపు పన్ను శాఖ దాడులు చేయడం సర్వసాధారణమైపోయింది. వసూళ్ళు వెలవెలబోతోంటే, తారల రెమ్యునరేషన్లు మాత్రం వెలిగిపోతున్నాయి. ఓ హీరోయిన్ రెమ్యునరేషన్ రెండు కోట్లకు చేరిపోయిందిపడు. అలాంటిది స్టార్ హీరో రెమ్యునరేషన్ ఏ స్థాయిలో వుందో అర్థం చేసుకోవచ్చు. ఇంతా చేసి, సినిమా ద్వారా నిర్మాతేకమన్నా మిగులుతోందా.? అంటే కొన్ని సినిమాలు డబ్బులు మిగుల్చుతోంటే, కొన్ని దారుణంగా ముంచేస్తున్నాయి. మిగిలేది తక్కువ.. పోయేది ఎక్కువ.. అన్నట్టుగా తయారైందిపడు సినిమా ‘యాపారం’. దర్శకులు కూడా హీరోలకు ధీటుగా రెమ్యునరేషన్లు తీసుకుంటున్నపడు, నిర్మాత పరిస్థితేమిటి.. అంటే, దానికి సినీ పరిశ్రమలో ఎవరివద్దా సమాధానం దొరకదు. ‘ఫలానా దర్శకుడు నన్ను నిలువునా ముంచేశాడు.. చెప్పిన బడ్జెట్ కన్నా ఎక్కువ ఖర్చు చేయడంతో నేను ఆర్థికంగా కుదేలైపోయాను..’ అని ఆ మధ్య ఓ నిర్మాత, ఓ ప్రముఖ దర్శకుడి తీరుపై ఆవేదన వ్యక్తం చేసిన ఘటనను లైట్‌గా ఎలా తీసుకోగలం.?
క్రియేటివిటీకి కరువు లేదు.. పరమ రొటీన్‌కి అంతు లేదు
క్రియేటివిటీకి తెలుగు సినీ పరిశ్రమలో కరువే లేదు. అదే సమయంలో ‘కమర్షియల్’ పేరు చెప్పి మూస సినిమాలకు హద్దూ అదుపూ లేదు. ఒకటీ అరా సినిమాలు క్రియేటివిటీని చాటుకుంటోంటే, పెద్ద సంఖ్యలో సినిమాలు మూస ఫార్మాట్‌లో వెళుతూ బాక్సాఫీస్ వద్ద చేదు ఫలితాలు చవిచూస్తున్నాయి. కానీ, మంచి సినిమాలూ.. కమర్షియల్ సినిమాలూ.. ఇవేవీ వంద రోజుల పండుగను జరుపుకునే పరిస్థితే లేకపోవడం అత్యంత శోచనీయమైన వ్యవహారం. ఎందుకూ? అంటే తొలి వారమే సినిమాకి కీలకం.. అపడు డబ్బులొచ్చేస్తే సరి.. అంటూ కొత్త లెక్కలు చెబుతున్నారు కొందరు. ఏ సినిమాకైనా ఎంత ఎక్కువమంది చూశారన్నది ముఖ్యం.. ఎక్కువ థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి, తక్కువ టైమ్‌లో ఎక్కువమంది చూసేస్తున్నారు.. ఇక ఎక్కువ రోజులు ఆడి ఉపయోగం ఏంటి.? అని చాలా తేలిగ్గా మాట్లాడేసేవారు ఎక్కువైపోయారు. కానీ, సినిమా యాభై రోజులో వంద రోజులో ఆడితే.. ఆ సినిమాలో మళ్ళీ మళ్ళీ చూసే కంటెంట్ వుందని అర్థం. ఒకటికి పది సార్లు చూసే సినిమాలు రావడంలేదు. ఆ విషయాన్ని ఒపకోవడం చేతకాక, ఎక్కువమంది చూస్తే సరిపోద్ది కదా.. అని కహానీలు చెప్పడం పరిపాటిగా మారిపోయింది.
అక్కడా ఇక్కడా అదే ట్రెండ్
బాలీవుడ్‌లో అయినా, టాలీవుడ్‌లో అయినా, కోలీవుడ్‌లో అయినా ఇదే ట్రెండ్ నడుస్తున్నప్పటికీ, అక్కడలాగే జరుగుతోంది కాబట్టి.. అని సరిపెట్టుకుంటే మన ప్రత్యేకత ఏముంటుంది.? తెలుగు సినిమాకి ఓ ప్రత్యేకమైన గౌరవం వుండేది. ఆ గౌరవం ఇపడూ అలాగే వుందా.? అన్న అనుమానం కలుగుతోంది. మన సినిమాల్ని హిందీలోకి కాపీ కొడితేనే మన గొప్పతనం బయటపడిందని అనుకోవడానికి వీల్లేదు. తెలుగు సినిమాని చాలా కష్టాలు వెంటాడుతున్నాయి. పైరసీ లాంటి పెద్ద సమస్యలున్నా.. అంతకన్నా పెద్ద పెద్ద సమస్యలు సినీ పరిశ్రమని జాడ్యంలా పట్టి పీడిస్తున్నాయి. ఆ జాడ్యం కారణంగా మంచి భవిష్యత్ వున్న యువ నటుడు ఉదయ్‌కిరణ్ బలవన్మరణానికి పాల్పడ్డాడు.. అన్న విమర్శలు లేకపోలేదు. తొలి సినిమాతో సూపర్ హిట్ కొట్టిన హీరోయిన్ అవకాశాల్లేక ‘చెయ్యకూడని పని’ చేసి, పోలీసులకు చిక్కిందంటే ఆమె కష్టాన్ని అర్థం చేసుకునేవారు సినీ పరిశ్రమలో లేరనే ఆరోపణలు అనేకం.
చెపకుంటూ పోతే ఈ సినిమా కష్టాల వ్యవహారం ఎప్పటికీ తరగదు. సినీ పరిశ్రమకు మచ్చలాంటి ఓ ఘటన చోటుచేసుకున్నాక, దానిపై అంతర్మధనం అనేది మొదలవ్వాలి. అది, ఇంకో చేదు ఘటన చోటుచేసుకోకుండా వుండటానికి మార్గం వెతకాలి. అంతే తప్ప, ఆ చావుకి కారణాలు అనేకం.. ఈ విమర్శ గిట్టనివారు చేస్తోన్న దుష్ర్పచారం.. ఆమె ఎందుకలా చేసిందో ఆమెకే తెలియాలి.. ఫలానా దర్శకుడు / నిర్మాత ట్రెండ్‌తో అప్ డేట్ అవడంలేదు.. అని పెదవి విరిస్తే.. తెలుగు సినిమా ఖ్యాతి భవిష్యత్తులో ప్రశ్నార్థకమవుతుంది.. కాదు కాదు, తెలుగు సినిమా ఉనికికే ప్రమాదమేర్పడుతుంది. ఈ కష్టాల నుంచి తెలుగు సినిమా గట్టెక్కేదారేదీ.?
– సింధు