జనం మాట్లాడతారు జాగ్రత్త

ఎప్పటిలాగే పట్టువదలని విక్రమార్కుడు భేతాళుడ్ని భుజాన వేసుకుని, నడవసాగాడు. దార్లో భేతాళుడు తెలుగు సినిమాలో పోసాని కృష్ణ మురళి మాదిరిగా, రాజా..నీకు శ్రమెందుకు రాజా..హాయిగా నచ్చిన రాజధానిలో కూర్చుని, నచ్చిన జనాలతో జేజేలు కొట్టించుకుంటూ…

ఎప్పటిలాగే పట్టువదలని విక్రమార్కుడు భేతాళుడ్ని భుజాన వేసుకుని, నడవసాగాడు. దార్లో భేతాళుడు తెలుగు సినిమాలో పోసాని కృష్ణ మురళి మాదిరిగా, రాజా..నీకు శ్రమెందుకు రాజా..హాయిగా నచ్చిన రాజధానిలో కూర్చుని, నచ్చిన జనాలతో జేజేలు కొట్టించుకుంటూ కూర్చోక. అయినా నీ బాధ నే చూడలేను కానీ, నీకు శ్రమ తెలియకుండా కథ చెబుతాను అని మొదలుపెట్టాడు.

విభజన పుణ్యమా అని, విభజనపై రెండు కళ్ల సిద్ధాంతాన్ని ప్రతిపాదించి, అందులో డాక్టరేటు కొట్టేయగలిగిన చాకచక్యం ప్రదర్శించిన చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ముఖ్యమంత్రి కావడం అటుంచితే మూడు రంగుల జెండా పట్టుకున్న కాంగ్రెస్ ఏ మూలకో పోయింది. గెలిచినా,గలవకున్నా, ఏ పక్షాన వున్నా వీలయినంతవరకు బాబు కుడి ఎడమల ఎర్రజెండాలు పట్టుకుని దన్నుగా నిలబడగలిగిన కమ్యూనిస్టులకు కలికంలోకి లేకుండా పోయారు. ఇక రెండు మంత్రి పదవులు తీసుకుని, కమలవాసలు కిమ్మన్నాస్తిగా వుండిపోయారు. కానీ చెవిలో జోరిగ మాదిరిగా ఈ వైకాపా జనాలు మాత్రం తెగ లొల్లి చేస్తున్నారు. అందుకే నారా వారు వారికి ఓ మంత్రోపదేశం చేస్తున్నారు. మీ నాయకుడు కేసుల్లో ఇరుక్కున్నాడు..అందువల్ల అతగాడికి మాట్లాడే అర్హత లేదు. సమస్యల పట్ల పోరాడే అర్హత లేదు. అసలు ఆ మాట కొస్తే మమ్మల్ని, కొశ్చనింగే చేయకూడదు అంటున్నారు. 

కానీ అనుమానం ఏమిటంటే, నేరారోపణలు వున్నవారు చట్టసభలకు పోటీ చేయడానికి కొన్ని వెసులు బాట్లు కల్పించింది మన రాజ్యాంగం. అంటే చట్టసభలకు ఎన్నిక కావచ్చు. ఎన్నికైన సభ్యులు ప్రజా సమస్యలపై పోరాడాలి, ప్రజల సమస్యలు తీర్చడానికి పాటు పడాలి అంటోంది మన రాజ్యాంగం. కానీ మన తెలుగుదేశం పార్టీ నాయకులు, మంత్రులు, ముఖ్యమంత్రి మాత్రం వైఎస్ జగన్‌కి అసలు అసెంబ్లీలో కానీ, బయట కానీ సమస్యలపై నోరు తెరిచే అర్హతే లేదంటోంది. ఇది బాబు సారథ్యంలో రాసిన రాజ్యాంగం.

ఇంతకీ ఎవరి రాజ్యాంగం కరెక్టు? మహా మహా మహానుభావులు రచించిన రాజ్యాంగానుసాసారం జగన్ అనే ప్రతిపక్ష నేత తన విధి నిర్వర్తించాలా?  లేకమహా మహా దేశాధినేతలేక పాఠాలు చెప్పానని తనంతట తాను చెప్పకునే చంద్రబాబు నిర్దేశించిన రాజ్యంగం ప్రకారం నడవాలా?

ఇదీ నా ప్రశ్న రాజా..నీకు సమాధానం తెలిసీ చెప్పకుంటే కొత్త రాజధాని పక్కన నువ్వు బినామీ పేర్లతో కొన్న 100 ఎకరాలు కబ్జాకు గురైపోతాయి సుమా అన్నాడు.

దానికి రాజు ‘చిన’బాబులా నవ్వి, చంద్రబాబులా రెండు వేళ్లు ఊపి, మాట్లాడకు..మాట్లాడకు అని చంద్రబాబు మాటలు పట్టకుని మాట్లాడడం మానేసినంత మాత్రాన ప్రపంచం సైలెంట్ అయిపోదు. జనం మాట్లాడ్డం ప్రారంభిస్తారు.. భేతాళా..అదే రాజ్యాంగం వారికి ఓటనే బ్రహ్మాస్త్రం ఇచ్చింది. దాని ముందు బాబు రాజ్యాంగం కాదు, మరే రాజ్యాంగమైనా తల వంచాల్సిదే..అన్నాడు.

రాజా..నేను ఒకటి అడిగితే నువ్వోకటి చెప్పావు..రామ్ గోపాల్ వర్మ మాదిరిగా..సర్లే అయినా చెప్పిందేదో బాగానే చెప్పావు..కానీ నే షూటింగ్‌కు వెళ్లాలి అంటూ చక్కాపోయాడు..భేతాళుడు.

చాణక్య

[email protected]