ఊరుకున్న వాడితో ఊరంతా చాల్లేరని సామెత. ఇప్పుడు కేంద్రం-రాష్ర్టం వ్యవహారం అలాగే వుంది. రాష్ట్రానికి మాటలెక్కువ.. కేంద్రానికి మౌనమే మక్కువ. రుణమాఫీ నుంచి రాజధాని దాకా ఏ వ్యవహారం తీసుకోండి.. చూసుకోండి.. అన్నిటా కేంద్రం మాట ఏమన్నా వినిపించిందా? కనీసం ఎక్కడన్నా, ఏదన్నా అర్థం ధ్వనించిందా? కానీ రాష్ర్టం వ్యవహారం అంతా రివర్సు. మాటలే మాటలు.. ఒకరిని మించిన మాటల వీరులు మరొకరు. స్మార్ట్ సిటీ అని ఒకరంటే, మెగా సిటీ అని ఇంకొకరు.. అదిగో ఆసుపత్రి అని ఒకరంటే, ఇదిగో సూపర్ స్పెషాలిటీ అని వేరొకరు. ఇదీ కేంద్రం-రాష్ర్టం తీరు. ఇలా మాటకు మౌనానికి మధ్య అయోమయంలో వున్నారు ఆంధ్ర ప్రజలు.
రాజకీయ నాయకులు ఎన్నయినా చెప్పచ్చు.. అది వారికి అవసరం.. వారి హక్కు. వారి వారి పార్టీలకు అవశ్యం. కానీ అధికారంలో వున్న రాజకీయ నాయకులు మాత్రం స్పష్టంగా మాట్లాడాలి. కేసీఆర్ తన ప్రభుత్వ ఉపముఖ్యమంత్రి రాజయ్య అలవి కాని హామీలు ఇచ్చారని బుస్సుమన్నారు. దానికి కులం రంగు పులిమి, ప్రతిపక్షాలు ఖస్సు మన్నాయి. ఆ సంగతి అలా వుంచితే కేసీఆర్ మంచికో, చెడుకో, కావాలనో, అనుకోకుండానో అన్న పాయింట్‌ను మాత్రం చూడండి. అలవి కాని హామీలు ఇవ్వద్దు.. చేసేదే చెబుదాం.. చేయలేంది వదిలేద్దాం.. అన్నది చాలా మంచి మాట. గుండె లోతుల్లోంచి వచ్చి వుంటే శభాష్ అనదగ్గ మాట. తెలంగాణ సంగతి అలా వుంచితే ఆంధ్ర వ్యవహారాలు చూస్తే మాత్రం చిత్రంగా వున్నాయి. ఈ వైనానికి భిన్నంగా వున్నాయి.
ముఖ్యమంత్రి నుంచి చోటా మంత్రి వరకు తెల్లారి లేచింది మొదలు రకరకాల అభివృద్ధి పథకాల గురించి ఏకరవుపెట్టడమే. వాటిలో సాధ్యమయ్యేవి ఎన్ని అన్నది కూడా చూడడం లేదు. దేశం మొత్తం మీద వంద స్మార్ట్ సిటీలు అంటే, రాష్ట్రానికి మహ అయితే నాలుగు వస్తాయనుకుంటే, మన ప్రభుత్వ పెద్దలు మాత్రం 14 స్మార్ట్ సిటీలు అని చెబుతున్నారు. ఒక్క స్మార్ట్ సిటీ సంగతే కాదు, దాదాపు అన్నీ అలాంటి వ్యవహారాలే. కానీ చిత్రంగా కేంద్రం వైఖరి ఇందుకు భిన్నంగా వుంది. రాష్ర్ట ప్రభుత్వం గురించి కానీ, దాని పథకాల గురించి కానీ, తాము ఏం చేస్తామన్నది పెదవి విప్పడం లేదు. అసలు కేంద్ర ప్రభుత్వం ఒక్క కరెంటు సంగతి మినహా మరే విషయంలోనూ రాష్ర్టం సంగతి పట్టించుకోవడం లేదు.. ప్రస్తావించడం లేదు.
రుణమాఫీతో మొదలు
ఎనభై వేలకోట్ల ఖర్చుతో కూడిన రుణమాఫీని ఎన్నికల వరంగా ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. రైతుల మీద ప్రేమ కావచ్చు. లేదా వారి ఓట్ల మీద ఆశకావచ్చు. అది రాజకీయపార్టీగా సహజం. దాన్ని తప్పు పట్టలేం. కానీ తీరా గెలిచిన తరువాత ఆశగా కేంద్రం వైపు చూడడం ప్రారంభించారు. కానీ చిత్రంగా ఈ రోజుకు కేంద్రం నుంచి ఒక్క మాట వినిపిస్తే ఒట్టు. రిజర్వ్ బ్యాంక్ తన ప్రకటనలు తాను చేసుకుపోతోంది తప్ప, కేంద్ర ఆర్థికమంత్రి మాట్లాడడం లేదు. మాట సాయమో, చేత సాయమో చేయమని ముఖ్యమంత్రి అడిగి వుండరు అని అనుకోవడానికి లేదు. అయినా అక్కడి నుంచి మాత్రం స్పందన లేదు. రిజర్వ్ బ్యాంక్ రుణమాఫీకి మోకాలు అడ్డుతోందని రాష్ర్ట ప్రభుత్వం పెద్దలు ఆరోపించారు. అలాంటపుడు కేంద్ర ఆర్థిక మంత్రి అది నిజమో కాదో తేల్చి చెప్పాలి కదా. నిజమైతే తన సాయం తాను చేయాలి కదా? కాదంటే, మీరు హామీ ఇచ్చి, రిజర్వ్ బ్యాంకును ఎందుకు తిడతారని అడగాలి కదా?
ప్రత్యేక హోదా
రాష్ట్రానికి ప్రత్యేక హోదా అన్నారు విభజన సమయంలో, ఇంత వరకు కేంద్రం ఏమీ అనడం లేదు. ఒకటి రెండు రోజుల క్రితం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మాత్రం రెండు రాష్ట్రాలకు హోదా వుంటుందని మాత్రం ప్రకటించారు. ఎప్పటి నుంచి, విధి విధానాలేమిటి? ఆ హోదా వల్ల ఒకగూడేదేమిటి? అన్నది ఇంతవరకు ఎవరికి తోచింది వారు వల్లె వేసుకోవడమే తప్ప, అసలు వ్యవహారం ఎవరికీ తెలియదు. కేంద్రం మాట్లాడదు. దీనిపైనే ఆంధ్ర భవిష్యత్ ఆధారపడి వుందన్న సంగతి తెలిసిందే. పైగా తెలంగాణకు కూడా అదే హోదా వుందంటే, హైదరాబాద్‌లో పరిశ్రమలు ఎందుకు ఆంధ్రకు తరలివెళ్తాయి. కొత్తవి రావాలన్నా తెలంగాణతో పోటీపడాలి.
రాజధాని వ్యవహారం
శివరామకృష్ణన్ కమిటీ నివేదిక తయారైంది. కేంద్రానికి చేరింది. అంతకు ముందే రాష్ర్టంలో రాజధాని రగడ ప్రారంభమైంది. కేంద్రానికి వ్యవహారం తెలియకుండా వుంటుందని అనుకోలేం. కానీ ఒక్క మాటన్నా మాట్లాడారా? లేదు కాక లేదు. పోనీ కమిటీ నివేదిక అందింది. అప్పుడన్నా కేంద్రం పెదవి విప్పిందా? నివేదిక అందింది, పరిశీలిస్తున్నాం, ఏం సంగతీ చెబుతాం. లేదూ, ఇవీ కమిటీ సిఫార్సులు, దీని ప్రకారం మీరు చేసుకోవాల్సింది మీరు చేసుకోండి అని ఏమన్నా అందా? అదీ లేదు.
రాష్ర్ట అసెంబ్లీ రాజధాని తీర్మానం చేసింది. పోనీ అప్పుడన్నా కేంద్రం అదేమిటీ ? మాకు అందిన కమిటీ నివేదిక ఏమిటి? మీరు చేస్తున్నదేమిటి? అని అడిగిందా? అదీ లేదు. ఒక్క వెంకయ్య నాయుడు మాత్రం వత్తాసు తీసుకుని, రాజధానిని రాష్ర్టం నిర్ణయించుకోవచ్చు అన్నారు. ఆ మాట ఆయన ఏ హోదాలో అన్నట్లు? కేంద్రం ప్రతినిధిగానా? లేదా పార్లమెంటు వ్యవహారాల మంత్రిగానా? లేక ఆంధ్ర రాష్ట్రానికి చెందిన మంత్రిగానా? మూడోది వాస్తవంగా అనుకోవాల్సింది. మరి అలాంటపుడు కీలకమైన రాజధానిపై కేంద్రం ఎందుకు పెదవి విప్పడం లేదు?
కానరాని నిధులు
ప్రపంచ స్థాయి, హైదరాబాద్‌ను మించిన రాజధాని నిర్మించుకునేందుకు కేంద్రం సాయం చేస్తుందన్నది విభజన సమయంలోని మాట. ఇప్పటికి ఆ దిశగా ఏమన్నా పురోగతి వుందా? పోనీ శివరామకృష్ణన్ కమిటీ సంగతి అలా వుంచి, రాష్ర్ట ప్రభుత్వం తన నిర్ణయం తాను తీసుకున్నాకయినా, కేంద్రం పెదవి విప్పి, సరే, మీరు రాజధాని డిసైడ్ చేసుకున్నారు.. ఇదిగో మా వంతు సాయం.. అని అందా? అదీ లేదు.
పథకాలే పథకాలు
రాష్ర్ట ప్రభుత్వం బోలెడు ఆశాభావ పథకాలు ప్రకటించింది. జిల్లాకో పోర్టు, తూర్పు గోదావరిలో రెండు, మిగిలిన జిల్లాలకు ఒకటి వంతున స్మార్ట్ సిటీలు, అలాగే జిల్లాకో విమానాశ్రయం. మిగిలిన హామీల సంగతి ఎలా వున్నా, ఈ మూడింటికీ కేంద్రంతో లింక్ వుంది. గడచిన ప్రభుత్వంలో ఇచ్చిన పోర్టు నిర్మాణానికే ఇప్పటికి శ్రీకారం చుట్టలేదు. మరి కొత్తగా మరో పది నుంచి 13 పోర్టులంటే ఏమనుకోవాలి. అసలు ఇది సాధ్యమా కాదా? దీనికి కేంద్రం అనుమతులు కూడా అవసరమా కాదా? వాటికి కేంద్రం ఊ కొడుతుందా? ఒక్క మాట చెప్పరేం?
అలాగే విమానాశ్రయాలు. అది కూడా కేంద్రం పరిధిలోని వ్యవహారమే కదా. దానికీ మాట్లాడరేం. అవును నిజమే ఆంధ్రకు 10 వరకు కొత్త విమానాశ్రయాలు ఇస్తున్నాం అని ఓ మాట విసిరేయరేం. రాష్ర్టం చెబుతున్న మాటలు నిజం అనుకోవాలా.. పబ్బం గడుపుకోవడానికి అనుకోవాలా? కేంద్రంతో ముడిపడిన ప్రాజెక్టులపై రాష్ర్టం ప్రకటనలు చేస్తున్నపుడు అవునో కాదో, సాధ్యమో అసాధ్యమో కేంద్రం చెప్పాలి కదా?
ఇక స్మార్ట్ సిటీలు. ఇదో బ్రహ్మ పదార్థం. అసలు స్మార్ట్ సిటీ అంటే ఏమిటి అని నెట్‌లో వెదికి వెదికి చదివి తెలుసుకోండి. ఆశ్చర్యం వేస్తుంది. మన గజిబిజి నగరాల్ని స్మార్ట్ సిటీలుగా మార్చడం సాధ్యమా అన్న అనుమానం వస్తుంది. అందుకే కేంద్రం తొందర పడడం లేదు. దేశం మొత్తం మీద వంద మాత్రమే అంది. అంటే మన రాష్ర్టంలో నాలుగో అయిదో. అది కూడా దశలవారీగా చేస్తామంది. ముందుగా మహారాష్ర్టలో, గుజరాత్‌లో, మహా అయితే ప్రధాని నియోజకర్గమైన కాశీలో అన్నారు. అలాంటపుడు ఆంధ్ర ప్రభుత్వం ప్రతి జిల్లా కేంద్రాన్ని స్మార్ట్ సిటీ చేస్తామంటోంది? మరి దీన్ని కేంద్రం అడగాలి కదా.. ఇది సాధ్యం కాదు అని చెప్పాలి కదా. లేదూ. మేము నాలుగింటికో, అయిదింటికో నిధులు ఇస్తాం. మిగిలిన వాటిని మీరు చూసుకుంటరా అని అడగాలి కదా. ఒక్క స్మార్ట్ సిటీ రూపొందించాలన్నా వేల కోట్లు కావాలి. మరి ఎలా సాధ్యం అని నిలదీయాలి కదా?
కరెంటు ఊరట
ఒక్క కరెంటు విషయంలోనే కేంద్రం చాలా స్పష్టమైన వైఖరితో వుంది. దానిపై చకచకా చర్యలు తీసుకుంటోంది. ప్రకటనలు వస్తున్నాయి. అంటే దీన్ని బట్టి అర్థమవుతోంది ఏమిటంటే, కేంద్రం చేయాల్సింది చకచకా చేస్తుంది. ప్రకటనలు చేస్తుంది. మిగిలినవి పట్టించుకోదు. ఇక్కడ ప్రతిపక్ష ప్రభుత్వం వుంటే, దాని ఇజ్జత్ తీయడానికి ఆ మాటలన్నీ కల్ల అని చెప్పి వుండేదేమో? కానీ తమ మిత్రపక్ష ప్రభుత్వం వుండడంతో, ఆ మాటలు, ప్రకటనలు విని, అవునని అనలేక, కాదని ఖండించలేక, మౌనవ్రతం పాటిస్తోంది. కానీ మౌనం అర్థాంగీకారం అని ప్రజలు అనుకుంటే, రేపు మరోసారి వారి ముందుకు వెళ్లాల్సి వచ్చినపుడు, నిలదీయడంలో దాని వాటా దానికి ఇచ్చేస్తారు. అది తప్పదు.
చాణక్య