ఎదురుచూసిన అమావాస్య వచ్చేసింది. ఎన్నికలకు ఏడాది ఉండగా టిడిపి, బిజెపి పొత్తు విచ్ఛిన్నమౌతుందని అందరూ అనుకుంటున్న మాట నిజమైంది. పరస్పర నిందాపర్వంలోకి యిద్దరూ అడుగుపెట్టారు. బాబు ఎన్‌డిఏలోంచి బయటకు వస్తున్నామని ప్రకటించేశారు. ఇక టిడిపి నాయకులు మోదీ, పవన్, జగన్‌లను విడివిడిగా, కలివిడిగా దుమ్మెత్తి పోస్తున్నారు. నిన్నటిదాకా పవర్‌స్టార్‌గా కనబడిన పవన్ యిప్పుడు కిరాయిస్టార్‌గా కనబడసాగాడు. స్టార్ హీరో కాదు, స్టార్ విలన్ అంటున్నారు. డైరక్షన్ మోదీదే అని డైరక్టుగా అంటున్నారు.
అవిశ్వాస తీర్మానంపై ఊగిసలాట ఆపేసి, పెట్టి తీరతామంటున్నారు బాబు. మూడో ఫ్రంటు నాయకత్వం బాబుదే, కెసియార్ ముందడుగు వేసినా బాబుకున్న అనుభవం ఆయనకు లేదని మమతాదులు అనుకుంటున్నారని అనుకూల మీడియా అప్పుడే వార్త వండి వార్చేసింది. బాబుకి అనుభవం ఉందన్న మాట ఎంత నిజమో, ఆయన గాలికోడిలా అటూయిటూ మారడంతో విశ్వసనీయత పోగొట్టుకున్నాడన్నదీ అంతే నిజం, కెసియార్ ఇంకా కొత్త చీపురు.
ఇన్నాళ్లూ దిల్లీలో, అమరావతిలో కలిసి కాపురం చేసిన బిజెపి, టిడిపి ఆంధ్రకు ఉద్ధరించింది ఏమీ లేదు. తమ వైఫల్యాలను వేలెత్తి చూపడానికి వేరెవరో కావాలి కదా! ఇన్నాళ్లూ ఆంధ్ర ఎదగపోవడానికి కారణం ప్రభుత్వ కార్యకలాపాలతో ఏ సంబంధం లేని ప్రతిపక్షమే కారణమంటూ నిందిస్తూ వచ్చారు. ఇప్పుడు పాలనలో పాలు పంచుకున్నవారే త్వం శుంఠ: త్వం శుంఠ: ఘట్టానికి వచ్చేశారు. తిట్టుకోవడానికి ఏడాది టైముంది. ప్రజలకు యికపై పుష్కలంగా ఇన్ఫోటైన్‌మెంట్.
ఎంటర్‌టైన్‌మెంట్‌తో బాటు బోల్డంత యిన్ఫర్మేషన్ కూడా లభిస్తుంది. 5 వేల కోట్లతో నయా రాయపూర్ ఎంత అందంగా తయారైందో చూడండి, అమరావతి కట్టడానికి బాబుకి లక్షల కోట్లు కావాలట అంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో వస్తోంది. బాబు బడాయిలను ఎండగడుతూ ఇంకా యిలాటివి ఎన్ని వస్తాయో తెలియదు.
సోషల్ మీడియాను మేనేజ్ చేయడంలో ఆరెస్సెస్, బిజెపిలకు సాటి వచ్చేవారు లేరు. దిల్లీని మించిన రాజధాని కట్టుకోండని మోదీ అన్నారు కదా అని ఎవరైనా గుర్తు చేస్తే 'శంఖుస్థాపనకు వచ్చి గుప్పెడు మట్టి, చెంబెడు నీళ్లు యిచ్చినపుడే దక్కినదానితో సరిపెట్టుకోండనే మౌనసందేశం ఉంది' అని బిజెపి వారు వాదించవచ్చు. ఇన్నాళ్లూ అవినీతి, కేసులు అంటే వైసిపి వారే సంజాయిషీ చెప్పుకోవలసి వచ్చేది.
వాళ్లు బాబుకి వ్యతిరేకంగా సేకరించిన సాక్ష్యాలన్నీ బిజెపి వారికి అందించి, టిడిపి వారిని కూడా తమ స్థాయికి తెచ్చారు. ఇప్పుడు పిట్టపోరు, పిట్టపోరు పిల్లి తీర్చిందన్నట్లు బిజెపి వీళ్లిద్దరూ పనికి రారు, మాకు ఓటేయండి, స్వచ్ఛమైన పాలన అందిస్తాం అనే నినాదంతో ముందుకు వెళ్లవచ్చు. మీరు మాత్రం తక్కువా అని టిడిపి ఎదుర్కోవచ్చు. నాలుగేళ్లగా ఎవరు ఎంత పోగేశారో, ఎవరు ఎవర్ని గడ్డిపోచలా తీసిపారేశారో, ఎన్ని చీకటి ఒప్పందాలు జరిగాయో, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ప్రశ్నోత్తరాల కాండ ఎలా సాగిందో అన్నీ బయటకు వస్తాయి. ఇవన్నీ తెలుసుకునే హక్కు ఆంధ్రప్రజలకు ఉంది. బెటర్ లేట్ దాన్ నెవర్ అన్నట్లు యిప్పుడూ రెండు కలిసి ఆ హక్కును ప్రజలకు దఖలు పర్చబోతున్నాయి.
హమ్మమ్మ, యిన్నాళ్లూ యిద్దరూ కలిసి అన్ని రంగాల్లో ఆంధ్ర రోదసిలో దూసుకుపోతుందని ఎంతెంత బుకాయించారు! ఈ అభివృద్ధి కేంద్రం దయే అంటూ అసెంబ్లీ తీర్మానాలు, వెంకయ్యనాయుడి పుణ్యమే అంటూ సన్మానాలు. ఒకటా? రెండా? వీళ్లు చేశారు, ఆయన చేయించుకున్నాడు. సభావేదికలపై బాబుపై ఫిర్యాదు రూపంలో నిందాస్తుతి కూడా 'ఈయనకు ఎంత యిచ్చినా తృప్తి లేదండీ, రాష్ట్రానికి లక్షల కోట్లు యిచ్చినా యింకా యింకా కావాలంటాడు, మరీమరీ కష్టపడి రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకుపోతానంటాడు, యీయనతో వేగడం ఎలా బాబూ?' అంటూ ! ఈయన ముసిముసి నవ్వులు. వాస్తవానికి ఏమీ జరగటం లేదని యిద్దరికీ మనసులో తెలుసు. అయినా అభినయించి పారేశారు. నటనలో వీళ్లకు ఆంధ్ర నటులెవ్వరూ సాటిరారని అర్థమయ్యే మోదీ వాళ్లెవరికీ పద్మ అవార్డులు యివ్వలేదీసారి.
ఇప్పుడు ప్రి క్లయిమాక్స్ ఘట్టంలోకి సినిమా చేరింది. పొగడ్తల సీనులు అయిపోయాయి. 'తొల్లి నీ వది చేయలేదే?' 'గతము మరచి, వదరుట పాడియే' 'సాగిలబడినపుడేమాయె నీ పౌరుషంబు' 'ఇప్పుడు చూపుదు నా పరాక్రమము' వంటి పద్యాలు పాడుకునే సీనిది. చూసే ప్రేక్షకులకు హుషారు కలిగి చప్పట్లు కురిపించడం ఖాయం. రసవత్తరమైన యీ సీను రాకుండా బాబు జాగ్రత్త పడుతూ వచ్చారు.
కానీ మనకి యీ సీను చూసే భాగ్యం కలిగించిన పుణ్యాత్ములు మాత్రం మోదీ, అమిత్‌లు. టైమింగ్ ఎంపిక వాళ్లదే. ఇప్పుడు యిద్దరూ కలిసి అంతా గ్యాసే, బోగస్సే అని చెప్పబోతున్నారు. అయితే వెర్షన్లు తేడాగా ఉంటాయి లెండి. అడుగు ముందుకు పడకపోవడానికి బిజెపి నిధులు బిగబట్టడమే అని టిడిపి అంటుంది. ఇచ్చిన వాటికి టిడిపి లెక్క చెప్పకపోవడమే అసలు సమస్య అని బిజెపి చెపుతుంది. ఎవరు కారణమన్నది తర్వాతి మాట, యిద్దరూ కలిసి మభ్యపెట్టారన్నది గమనించాల్సిన అంశం.
ఆంధ్రకు సరైన పాలన అందించలేకపోవడం బాబు వైఫల్యం. ఆ వైఫల్యాన్ని తన కనుగుణంగా ఎన్‌క్యాష్ చేసుకోలేకపోవడం జగన్ వైఫల్యం. అందువలన మూడో రాజకీయశక్తికి చోటుంది అని అనుకుంటూ వచ్చాం. అయితే ఆ ఖాళీని ఎవరు భర్తీ చేస్తారన్నది ఎవరూ చెప్పలేకపోయారు. బిజెపికి రాష్ట్రంలో క్యాడర్ లేదు. పైగా దాన్ని ఎదగనీయకుండా యిద్దరు నాయుళ్లూ కలిసి కాపు కాశారు. ఇక పవన్‌కు జనాకర్షణ ఉంది కానీ అతను కాలక్షేపం, కాల్‌షీటు పొలిటీషియన్. జనఘోష వినేటప్పుడు ఒకలా స్పందిస్తాడు, బాబుగారితో ప్రత్యేక సమావేశాల తర్వాత యింకోలా ప్రకటిస్తాడు. స్థిరత్వం లేని మనిషిగా తోచాడు. చివరకు ఆటల్లో అరిటిపండుగా తేలాడు. అందువలన 2019లో మహా అయితే మెజారిటీ తగ్గవచ్చు కానీ బాబు తిరిగి రావడం ఖాయమని అనిపిస్తూనే ఉంది.
బిజెపికి ఆంధ్రలో బలం లేని కారణంగా నిరాసక్తంగా ఉందని, అందుకే హోదా కానీ నిధులు కానీ యివ్వకుండా బిగబడుతోందని తోచసాగింది. కానీ బిజెపి ఆంధ్రను రైటాఫ్ చేయలేదని యిటీవలి సంఘటనలు నిరూపిస్తున్నాయి. ఉత్తరాదిన బిజెపి పాలిత రాష్ట్రాలలో సీట్లు తగ్గే ప్రమాదం ఉంది కాబట్టి ఆ మేరకు దక్షిణాదిన పెంచుకోవడానికి బిజెపి ప్రయత్నిస్తోంది. కర్ణాటకలో గట్టి ప్రయత్నం చేస్తోంది. తమిళనాడులో చాలా రకాల ప్రయత్నాలు చేసి ప్రస్తుతానికి ఏం తోచక ఉంది. 2జి స్కాము కేసు, మారన్ సోదరులపై టెలిఫోన్ ఎక్స్‌ఛేంజ్ కేసు ఎత్తివేత చూస్తూ ఉంటే డిఎంకెతో పొత్తు పెట్టుకుని కొన్ని సీట్లు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తోందని అనిపిస్తోంది. ఇక ఆంధ్రకు వచ్చేసరికి సాంతం వదులుకోకుండా కొన్ని సీట్లయినా పెంచుకోవడానికి లెక్కలు వేసిందని యిప్పుడు స్పష్టమైంది.
ప్రస్తుతం ఉన్న ఆంధ్ర బిజెపి నాయకుల్లో టిడిపికి సన్నిహితులే ఎక్కువ అని గ్రహించిన అమిత్ షా, వారికి మూలవిరాట్టయిన వెంకయ్య నాయుణ్ని రాజకీయాల్లోంచి తప్పించేశారు. వద్దని ఆయన మొత్తుకున్నా లాభం లేకపోయింది. ఇక టిడిపిని బయటకు పంపాలి. తామే తీసేస్తే యిప్పటికే తమపై అలిగిన యితర భాగస్వామ్య పక్షాలు అన్యాయమని గోల పెడతాయి. అందువలన పొమ్మనలేక పొగ పెట్టినట్లు చేయాలి. 14 నెలల వరకు ముఖ్యమంత్రికి ఎపాయింట్‌మెంటు యివ్వకపోయినా, ప్రతిపక్ష నాయకుడి ప్రతినిథికి రెండుసార్లు యిచ్చినా బాబు రియాక్టు కావటం లేదు. దూషణభూషణ తిరస్కారములను ఆశీస్సులుగా తలచేవారిని ఏం చేయాలో మోదీకి అర్థం కాలేదు.
టిడిపి అంటే పడని సోము వీర్రాజు వంటి బిజెపి నాయకులను గిల్లారు. ఆయన రెండెకరాల బాబు అవినీతి అంటూ రెచ్చిపోయి మాట్లాడారు. అయినా బాబులో స్పందన లేదు. నాలుగేళ్లగా హోదా జపం చేస్తూ, యిటీవల పాదయాత్రలో కూడా హోదాపై జనాలలో స్పందన తెస్తున్న జగన్ అక్కరకు వచ్చాడు. రాష్ట్రమంతా హోదా గురించి వేడి బాగా పుట్టింది. హోదా వద్దు, ప్యాకేజీ ముద్దు అంటూ పాడుతూ వచ్చిన బాబు గత్యంతరం లేక హోదా గురించి అడగక తప్పని పరిస్థితి కలగజేశారు.
ఆయన అడిగినదాకా ఉండి హోదా యివ్వం, ప్యాకేజీ అంతా ఉత్తుత్తిదే అని జేట్లే చేత చెప్పించారు. బాబు ఏదో ఒకటి చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. అప్పుడు కూడా ఆయన ఎన్‌డిఏ లోంచి బయటకు వచ్చే సాహసం చేయలేదు, అవిశ్వాస తీర్మానం పెడతాననీ అనలేదు. ఛీఛా అన్నా చిరాకు పడక, దులపరించుకుని పోతూ, జుట్టు పట్టుకుని బయటకీడ్చినా చూరు పట్టుకుని వేళ్లాడుతూ ఉన్నవాళ్లకి యీ డోసు చాలదనుకున్నారు. ఈశాన్య రాష్ట్రాలలో జయం సాధించాక దృష్టి యిటు మరల్చి పవన్‌ను ప్రయోగించారు.
మీడియా ప్రభావం అనండి, టిడిపి ప్రచారం అనండి, రాష్ట్రంలో అవినీతి అనగానే జనాలకు జగనే గుర్తుకు వస్తాడు. టిడిపి ఓట్లు కొనేస్తోందనీ తెలుసు, ఎమ్మెల్యేలనూ కొనేస్తూందనీ తెలుసు, నామినేషన్ పద్ధతిలో కాంట్రాక్టులు కట్టబెడుతోందనీ తెలుసు, కేంద్రం యిచ్చిన డబ్బులకు లెక్కలు చెప్పటం లేదనీ తెలుసు. ఇన్ని తెలిసినా బాబు అభిమానులు ఆయనను అవినీతిపరుడని అనడానికి తటపటాయిస్తారు. ప్రభుత్వ యంత్రాంగమంతా అవినీతిమయమని, చిన్న అధికారి యింట్లో సైతం కోట్లు దొరుకుతున్నాయనీ, నిజాయితీగా ఉన్న అధికారిని టిడిపి ఎమ్మెల్యేలు వేధిస్తున్నారనీ ఆధారాలతో సహా టీవీల్లో వస్తోంది కదా అంటే 'ఎంతైనా జగన్ కంటె బెటరు, రాష్ట్రం కోసం ఏదో తంటాలు పడుతున్నాడు.
దుబారా ఖర్చులు చేస్తున్నాడు కానీ అవన్నీ పెట్టుబడులు ఆకర్షించడానికేగా….' అనేస్తారు. అలాటి యిమేజి ఉన్న బాబును ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టాలని నిర్ణయం జరిగింది. పవన్ చేత ఆ అద్దాల మేడ మీద రాళ్లేయించారు. 'మీ పాలన యావత్తు అవినీతిమయం. మీ కుమారుడు అవినీతిపరుడు' అనే మాటలు జగన్ అంటే యింత యింపాక్ట్ ఉండేది కాదు. బాబు జేబులో మనిషిగా పేరుబడిన పవన్ అనడంతో సంచలనం చెలరేగింది. అప్పుడుకూడా ఎన్‌డిఏలోంచి బయటకు రాకపోతే సిగ్గూశరం లేదని రుజువైపోతుందన్న భయం వేసి కాబోలు, బయటకు వచ్చేస్తున్నాం, అవిశ్వాస తీర్మానానికి మద్దతిస్తాం అనే ప్రకటన చేశారు.
పవన్‌పై కోపం వస్తే బిజెపిపై అలగడం దేనికి? పవన్ వెనక్కాల వైసిపి ఉంది, ఉండవల్లి ఉన్నాడు అని అప్పటికప్పుడు అన్నా, అబ్బే బిజెపియే ఉంది మర్నాటికల్లా నిర్ధారణ అయివుంటుంది. పవన్ తన ఉపన్యాసంలో అవిశ్వాస తీర్మానం ప్రస్తావన వదిలేశాడు కానీ కేంద్రాన్ని హోదా గురించి నిలదీశాడు. దాని కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తానన్నాడు. అయినా అతను బిజెపి పలుకులే పలికాడని టిడిపికి అనుమానం. ఎందుకంటే బాబు పరువు తీయడానికి పవన్ చాలా విషయాలు ఒక్కసారిగా కుమ్మరించేశాడు.
రిప్ వాన్ వింకిల్ 20 ఏళ్ల తర్వాత నిద్రలేచి లోకం చూసి ఆశ్చర్యపడ్డట్లు వనజాక్షిపై దాడి, యిసుక మాఫియా, ఎర్రచందనం స్మగ్లింగ్ వగైరాలు పవన్‌కు ఒక్కసారిగా తెలిసి ఆశ్చర్యపరచాయి. కళాకారులు సున్నితంగా ఉంటారని, దేనికైనా టక్కున స్పందిస్తారని అనుకుంటాం. కానీ పవన్‌కు అలాటి లక్షణాలు లేవు. బాబు మూడు మాటలు మాట్లాడితే ఆరు అబద్ధాలు ఉంటాయన్న సంగతి, ఆయనా ఆయన కొడుకూ జనాల్ని తొక్కేస్తున్నారనీ, పాలనంతా అవినీతిమయం చేశారనీ కూడా లేటుగానే సింక్ అయింది. అన్నిటినీ మించి లోకేశ్‌కు శేఖర్‌రెడ్డికి పెట్టిన లింకు ఉంది చూశారూ, అది బాబును మర్మస్థానంలో కొట్టి ఉంటుంది.
ఈ మధ్య ఉండవల్లి మాట్లాడుతూ 'ఇంత అనుభవజ్ఞుడైన బాబు మోదీని గట్టిగా ఎందుకు అడగలేకపోతున్నారో నాకు అర్థం కావటం లేదు. ఓటుకు నోటు కేసు చాలా చిన్నది. 'బ్రీఫ్‌డ్ మీ' అంటే బ్రీఫ్‌కేసులు పట్టుకెళ్లమని అర్థం కాదు కదా, డబ్బుతో ప్రమేయం లేకుండానే నచ్చచెప్పి ఓటేయిస్తానంటే సరే అన్నాను అని చెప్పి తప్పించుకోవచ్చు. అది కాదండీ, ఆయనకు, ఆయన కుటుంబసభ్యులకు సంబంధించిన గూఢరహస్యమేదో మోదీ దగ్గర ఉందని, అది పెట్టుకుని ఆయన యీయన్ను బ్లాక్‌మెయిల్ చేస్తూన్నాడా అని నా కనుమానం' అన్నారు.
అదేమిటో యిప్పుడు స్పష్టత వచ్చింది. శేఖర్ రెడ్డి దగ్గర దొరికిన కాగితాలు శశికళను జైలుకి పంపి, తన పార్టీని విచ్ఛిన్నం చేయడానికి ఉపయోగపడ్డాయి. ఆ కాగితాల్లో లోకేశ్‌కు సంబంధించిన కాగితం కూడా ఉందా? ఉందట, అది చూపించి మోదీ మిమ్మల్ని బెదిరిస్తున్నారట అని ఓ బాణం వేశాడు పవన్. కార్తీ ద్వారా చిదంబరాన్ని కొట్టినట్లు లోకేశ్ పేరు చెప్పి తనకూ గురిపెడతారని భయమేసిన బాబుకి అందివచ్చిన అస్త్రం, మోదీతో తక్షణవైరం తెచ్చుకోవడం. ఇప్పుడు ఆ శేఖర్ రెడ్డి కాగితం బయటకు వచ్చినా రాజకీయకక్షలో భాగం అని వాదించవచ్చు.
'చూశారా, మీకోసం పోరాడితే మోదీ నాపై యిలాటి అభాండం వేశాడు' అని ఆంధ్రప్రజల దగ్గర వాపోవచ్చు. నిజానికి బాబు వద్ద యిప్పుడు మిగిలిన అంబు ఆత్మగౌరవం ఒకటే. అది ఎన్టీయార్ నలభై ఏళ్ల క్రితమే అరగదీసేసిన నినాదం. ముఖ్యమంత్రులను మారిస్తే తెలుగువారి ఆత్మగౌరవం దెబ్బ తిందని ఉద్యమం చేసిన ఎన్టీయార్ తను ముఖ్యమంత్రి అయ్యాక ఒక్క కలంపోటుతో మంత్రులందరినీ పీకి పారేసి దిల్లీ వెళ్లి కూర్చున్నపుడు మంత్రులకూ ఆత్మగౌరవాలుంటాయని మర్చిపోయారు. అయినా ఎన్టీయార్ స్ఫూర్తితో మన ఆత్మగౌరవం కోసం పోరాడి బిజెపికి బుద్ధి చెపుదాం అని టిడిపి వారు అప్పుడే మొదలుపెట్టారు.
పదేపదే దిల్లీ ప్రదక్షిణాలు చేసి, ఎపాయింట్‌మెంట్స్ కోసం దిల్లీ దర్బారులో సాగిలబడినపుడు, నిధుల కోసం దేబిరించినపుడు, మీకు గుర్తుకు రాని ఎన్టీయార్ స్ఫూర్తి యిప్పుడు జనాలకు గుర్తు రావాలా? అబ్బా, ఎంత ఆశ? తెలుగు రాష్ట్రాన్ని చీల్చమని లేఖ యిచ్చినపుడు, ఒకే పార్టీకి చెందిన ఆంధ్ర, తెలంగాణ నాయకులు పార్లమెంటులో ముష్టిఘాతాలకు దిగినపుడు ఏమైంది యీ ఆత్మగౌరవం? సాటి తెలుగువాడైన ప్రతిపక్ష నాయకుడితో కలిసి కూర్చోవడానికి, అతన్ని సంప్రదించడానికి యిచ్చగించని మీరు యావత్తు ఆంధ్ర జాతి గురించి ఎలా మాట్లాడగలరు? టిడిపి ఎన్టీయార్ గురించి ఎక్కువ మాట్లాడితే బిజెపి పురంధరేశ్వరిని రంగంలోకి దింపి, ఎన్టీయార్ వారసత్వాన్ని హైజాక్ చేయవచ్చు. ఆవిడ హుందాగా మాట్లాడుతూ బాబు వాదనలు తిప్పికొట్టగల సమర్థురాలు.
భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉన్న ఆంధ్ర ప్రజలు నాలుగేళ్లగా ఏడుస్తున్నా చలించని బాబు యిప్పుడు కన్నీరు కార్చారట. 2019 ఎన్నికలలో అదే ఆయన ట్రేడ్‌మార్క్ అవుతుంది. 2004 ఎన్నికలకు కూడా బిక్కమొహంతో, రక్తసిక్తమైన దుస్తులతో పోస్టర్లు వేయించుకుని సానుభూతితో గెలిచేస్తాననుకుంటూ ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. నాపై దాడి చేసిన మావోయిస్టులను అణచడానికి నాకు శక్తి నివ్వండి అని అడిగారు.
ఇప్పటికే మీకు చాలా బలం ఉన్నా వాళ్లను నియంత్రించ లేకపోయారు, యిక మీకు చేతకాదులే, వేరేవాళ్లను చూసుకుంటాం అని జనాలు సానుభూతితో బాబుని యింటికి పంపించి పదేళ్లు రెస్టు తీసుకోమన్నారు. ఇప్పుడూ అలాటి కథే. 'మెజారిటీ సీట్లు యిచ్చాం. అవి చాలనట్లు యితర పార్టీల నుంచి ఫిరాయింపులు చేసుకుని మరింత బలపడ్డారు. అయినా రాష్ట్రానికి ఏమీ చేయలేకపోయారు. మీరిచ్చిన లేఖే రాష్ట్ర విభజనకు బీజం అని తెలుసు. హైదరాబాదు కేంద్రపాలితమవుతుందని ఆశపడి సమైక్య ఉద్యమాన్ని పట్టించుకోలేదు. చివరకు ఉభయక్షవరమైంది. సర్లే జరిగినదేదో జరిగింది. కొత్త రాష్ట్రం కాబట్టి నిధులు కావాలి.
పైన మోదీ, కింద మీరు ఉంటే నిధులు కురుస్తాయని మీకు ఓట్లేసి ముఖ్యమంత్రిని చేశాం. పనులేమీ జరగలేదు. మీకూ బిజెపికి చెడింది. 2019లో బిజెపికి సీట్లు తగ్గవచ్చు కానీ వాళ్ల ఆధ్వర్యంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుంది. మీరిక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉంటే పైసలు రాలవు. బిజెపి ఓ పక్క పవన్‌ను, మరో పక్క వైసిపిని దువ్వుతోందంటున్నారు. ఎన్నికలకు ముందో, వెనుకో, బాహాటంగానో, చాటుమాటుగానో పొత్తు పెట్టుకోవచ్చు. ముగ్గురూ కలిసి ఏలతారో లేదో యిప్పుడే చెప్పలేం కానీ మీకు ఓటేస్తే మాత్రం కచ్చితంగా నిధులు రావు. అప్పుడు మీరే మా మీద సానుభూతి చూపించాలి' అనవచ్చు ఓటర్లు. చూదాం ఏమవుతుందో.
– ఎమ్బీయస్ ప్రసాద్
[email protected]