ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి ఇరాన్ మానవహక్కుల కార్యకర్త 51 ఏళ్ల నర్గీస్ మొహమ్మదీకి దక్కింది. తక్కినవాటి మాట ఎలా ఉన్నా, సాహిత్యం, శాంతి బహుమతులు సాధారణంగా అమెరికా పక్షాన, రైటిస్టుల పక్షాన ఉన్నవారికే దక్కుతాయి. రష్యన్లు, యితర అమెరికాకు వ్యతిరేక దేశాల పౌరులకు ఎవరికైనా దక్కాయంటే వారు స్థానిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడేవారే అయి ఉంటారు. ఈమె అమెరికాకు ప్రత్యర్థిగా ఉన్న ఇరాన్ దేశంలో ఆ ప్రభుత్వం అణచివేస్తున్న మానవ, మహిళా హక్కులకై పోరాడుతున్న మహిళ. సౌదీ అరేబియాలో కూడా మానవ హక్కుల హననం జరుగుతూనే ఉంటుంది. దానికి వ్యతిరేకంగా పోరాడేవారికి మాత్రం నోబెల్ బహుమతులు ఊహించలేము.
నోబెల్ విధానం ఏమైనప్పటికీ ఇరాన్లో మానవహక్కులు దారుణంగా హరిస్తున్న మాట, ప్రధానంగా మహిళల పట్ల వివక్షత మాట నిజమే. ప్రపంచంలో అన్ని దేశాల్లో కంటె అక్కడే ఉరిశిక్షలు ఎక్కువ. వాటిని వ్యతిరేకించడంతో బాటు, యితర హక్కుల కోసం యీమె పోరాడుతున్నారు. 22వ ఏట తొలిసారి అరెస్టయి, అప్పణ్నుంచి అనేక సార్లు జైల్లోకి వెళ్లివస్తూ, ప్రస్తుతం టెహరాన్‌కు సమీపంలో ఉన్న ఎవిన్ జైల్లో ఉన్నారు. కఠినశిక్షలకు, ఖైదీల పట్ల క్రూరత్వానికి పేరుబడిన ఆ జైలుకి ‘‘ఇరాన్ బాస్టిలీ’’ అనే పేరు వచ్చింది. ఫ్రాన్సులోని బాస్టిలీ జైలు దుర్భేద్యతకు, కాఠిన్యానికి మారుపేరుగా నిలిచింది. ఎవిన్ కారాగారాన్ని 1972లో కట్టించినది షా ఆఫ్ ఇరాన్. ఇరాన్ రాజుగా అతని 37 (1941-78) ఏళ్ల పాలనలో ఇరాన్ ఆర్థికంగా ఎంతో అభివృద్ధి సాధించిన మాట నిజమే కానీ, అతను నియంతృత్వానికి పేరుబడ్డాడు. తనను ఎదిరించినవారిని నిర్దాక్షిణ్యంగా మట్టుపెట్టాడు.
తండ్రి తదనంతరం రెండవ ప్రపంచయుద్ధ సమయంలో షా, రాజుగా అధికారానికి వచ్చాడు. ఇరాన్లో పార్లమెంటు, ఎన్నికలు కూడా ఉండేవి. 1951లో ప్రధానిగా అయిన మొహమ్మద్ మోసాద్దెగ్ అనేక ఆర్థిక, రాజకీయ సంస్కరణలు చేసి పేరు తెచ్చుకున్నాడు. అయితే అతను 1953లో బ్రిటిష్ పెట్రోలియం సంస్థను జాతీయం చేయడంతో బ్రిటన్, అమెరికా కలిసి అతనిపై తిరుగుబాటు చేయించి పదభ్రష్టుణ్ని చేశాయి. షాకు సర్వాధికారాలు కట్టబెట్టి అతనికి అండగా నిలిచాయి. అతను తన రాజకీయ శత్రువులపై ఎంత దమనకాండ జరిపినా దన్నిచ్చాయి. షా ఆర్థికాభివృద్ధి సాధించడంతో పాటు దేశ సంస్కృతిని పాశ్చాత్యమయం చేయడం ఇస్లామిక్ మత ఛాందసులను మండించింది. దాంతో వాళ్లు షాను ఎదిరిస్తున్న ఉదారవాదులు, జాతీయవాదులు, వామపక్షీయులు, కార్మిక నాయకులతో చేతులు కలిపారు. వారిని అణచడానికి షా విపరీతంగా మిలటరీ బలాన్ని పెంచడంతో పాటు, అమెరికా వారి సిఐఏ సాయంతో ‘సవాక్’ అనే మిలటరీ పోలీసును ఉపయోగించి మానవహక్కులను కాలరాశాడు. ప్రజల తిరుగుబాటు 1978 నాటికి తారస్థాయికి చేరడంతో షా 1979 ఫిబ్రవరిలో దేశం విడిచి ఈజిప్టు వెళ్లి ప్రవాసంలో ఉంటూనే చనిపోయాడు.
వెంటనే ఇస్లామిక్ తిరుగుబాటుదారులు ప్రవాసంలో ఉంటున్న ఆయతొల్లా ఖొమైనీ అనే మతగురువుని పిలుచుకుని వచ్చారు. అప్పణ్నుంచి ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్‌గా మారిపోయింది. పార్లమెంటు, ఎన్నికల వ్యవస్థ పెట్టారు కానీ మతపెద్దల కనుసన్నల్లోనే అన్నీ జరగాలనడంతో మత ఛాందసం పెరిగిపోయింది. ఇతర వాదాల వారందరినీ అణచి వేశారు. దానికి తోడు మహిళలపై విపరీతమైన ఆంక్షలు పెట్టసాగారు. మానవహక్కుల సంగతి సరేసరి. అందుకే యీ ప్రతిఘటనోద్యమాలు. నర్గీస్ 1972లో మధ్యతరగతి రైతు కుటుంబంలో పుట్టేనాటికి షా ప్రభుత్వం నడుస్తోంది. ఆమె మేనమామ, యిద్దరు కజిన్స్ లిబరల్స్ కావడంతో ఇస్లామిక్ పాలనను ఎదిరించి, జైలుకి వెళ్లారు. ఏడేళ్ల వయసులో వారంవారం యీమె జైలుకి వెళ్లి వాళ్లను చూసేది.
హైస్కూలు చదువు పూర్తయ్యాక అప్లయిడ్ ఫిజిక్స్ కోర్సులో చేరింది. ఒక విద్యార్థి సంఘంలో చేరి ఉరితీతకు వ్యతిరేకంగా ఉద్యమించింది. అక్కడే పరిచయమైన సాటి విద్యార్థి కార్యకర్త తాగ్ రహ్మానీని ప్రేమించి 27వ ఏట అతన్ని పెళ్లాడింది. కాలేజీ నుంచి బయటకు వచ్చాక పత్రికలకు వ్యాసాలు రాస్తూ జర్నలిస్టుగా పని చేసింది. ఆమె స్వతంత్ర భావాలు ఆమెను జైలు వైపుకి నడిపించాయి. మాటిమాటికీ అరెస్టు కావడం, బయటకు రావడం, మళ్లీ వెళ్లడం. ఆమె భర్త 2001లో అరెస్టయ్యాడు. ఆ మరుసటి సంవత్సరమే యీమె షిరీన్ ఎబాదీ అనే మానవహక్కుల కార్యకర్త స్థాపించిన ‘సెంటర్ ఫర్ డిఫెండర్స్ ఆఫ్ హ్యూమన్ రైట్స్’ సంస్థలో చేరింది. 2003లో నోబెల్ శాంతి బహుమతి పొందిన షిరీన్, ఆ బహుమతి తెచ్చుకున్న తొలి ఇరానియన్ మహిళ. ఇన్నాళ్లకు నర్గీస్‌కు దక్కింది.
ఆ సంస్థలో నర్గీస్ ఎదిగినకొద్దీ అరెస్టయ్యే సందర్భాలు పెరుగుతూ పోయాయి. తొలిసారి అరెస్టయిన దగ్గర్నుంచి యిప్పటివరకు 13 సార్లు అరెస్టయింది. 31 ఏళ్ల జైలు శిక్ష 154 కొరడా దెబ్బలు విధించబడ్డాయి. 2009లో అధికారులు ఆమె పాస్‌పోర్టును స్వాధీనపరుచుకున్నారు. 2010లో అరెస్టు చేశారు. 2011లో ఆమె వలన దేశభద్రతకు ముప్పు అంటూ మళ్లీ అరెస్టు చేశారు. ఇది చూసి 2011లో ఆమె భర్త పారిస్‌కు వెళ్లి తలదాచుకున్నాడు. వీరిద్దరికి పుట్టిన కవలలు 2015లో అతని దగ్గరకు వెళ్లిపోయారు. అప్పణ్నుంచి ఆమె పిల్లల్ని చూడలేదు. జైల్లో ఉండగా అనారోగ్యం పాలు కావడంతో 2014లో కొంతకాలం విడిచి పెట్టారు. ఉరిశిక్షకు వ్యతిరేకంగా ఉద్యమించినందుకు 2015లో అరెస్టు చేసి 16 ఏళ్ల శిక్ష వేశారు. అనారోగ్య కారణాలపై అప్పుడప్పుడు విడిచి పెడుతున్నారు కానీ ఆరోగ్యం మెరుగు పడగానే వెంటనే జైల్లో పెట్టేస్తున్నారు. 2021లో పెట్రోలు ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా జరిగిన ప్రదర్శనల్లో చనిపోయిన యువకుడి అంత్యక్రియలకు హాజరైనప్పుడు ఖైదు చేసి, ఎవిన్ జైల్లో పెట్టారు.
జైల్లో ఉన్నా ఆమె రాతకోతలకు, ఇన్స్టాగ్రామ్ ద్వారా ప్రపంచంతో సంబంధం పెట్టుకోవడానికి అవరోధం ఉన్నట్లు లేదు. న్యూయార్క్ టైమ్స్, బిబిసిలకు వ్యాసాలు రాస్తోంది, యింటర్వ్యూలు యిస్తోంది. మహిళా ఖైదీల దుర్భర పరిస్థితుల గురించి ఆమె ‘‘వైట్ టైగర్’’ అనే పుస్తకం రాసి 2022లో విడుదల చేసింది. హిజాబ్ ధరించనందుకు 2022లో ఇరాన్ పోలీసులు అరెస్టు చేసిన యువతి జైల్లో చనిపోగా దేశ యువత ఆందోళనలు చేపట్టినపుడు జైలు నుంచే వారికి మద్దతిస్తూ వ్యాసాలు రాసింది. ఆమెకు అనేక అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి. అలెగ్జాండర్ లాంగర్ అవార్డు (2009), పెర్ యాంగర్ ప్రైజ్ (2011), రిపోర్టర్స్ విదౌట్ బోర్డర్స్ ప్రైజ్ (2022) పెన్, ఆక్స్‌ఫామ్ ఫ్రీ ఎక్స్ప్రెషన్ అవార్డు (2023), ఒలోఫ్ పామే హ్యూమన్‌రైట్స్ ప్రైజ్ (2023) వచ్చాయి. ఇప్పుడీ నోబెల్ శాంతి అవార్డు వచ్చింది.
నోబెల్ శాంతి బహుమతి ప్రకటించినప్పుడల్లా, మహాత్మా గాంధీకి ఎందుకివ్వలేదా అనే సందేహం మెదలుతుంది. ఆయన అహింసా మార్గం ప్రపంచంలో ఎందరో స్వాతంత్ర్య యోధులకు స్ఫూర్తి నిచ్చింది. ఇటీవలి కాలంలో గాంధీ గురించి చెడు మాత్రమే వింటూ దాన్నే నమ్ముతున్నవారు ప్రపంచంలోని 195 దేశాల్లో 150 దేశాల ఆయన పేర స్టాంపు ఎందుకు విడుదల చేశాయా అని ఒక్క క్షణం ఆలోచించాలి. ఆయనలో లోపాలున్నాయి, ఆయన విధానాల్లో పొరపాట్లున్నాయి. కానీ మొత్తమంతా లెక్క వేసుకుని చూస్తే ఆయనలా భారతీయులను ప్రభావితం చేసిన నాయకుడు మరొకడు లేడు. అనేక మంది ప్రపంచ నాయకులు ఆయనను ఆదర్శంగా తీసుకున్నామని చెప్తారు. బానిసత్వం నుంచి బయట పడడానికి హింసామార్గాన్ని అవలంబించిన పోరాటాల్లో కొన్ని విజయవంతమయ్యాయి. అనేకం విఫలమయ్యాయి. అహింసా మార్గంలో నడిచి, కోట్లాది నిరక్షరాస్యులలో చైతన్యం రగిలించి, యిక్కణ్నుంచి వెళ్లకపోతే లాభం లేదని సామ్రాజ్యవాదులకు తోచేట్లా చేసిన గాంధీ కంటె శాంతి బహుమతికి అర్హులెవరుంటారు?
గాంధీకి నోబెల్ శాంతి బహుమతి యివ్వాలని ఆయన బతికుండగానే నాలుగు సార్లు, 1937, 38, 39, 47లలో నామినేషన్లు వచ్చాయి. కానీ కమిటీ ఎంపిక చేయలేదు. 1947 ఆగస్టులో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చాక 1948లో మళ్లీ నామినేషన్ వచ్చింది. నామినేషన్లకు గడువు జనవరి నెలాఖరు. అక్టోబరులో ప్రకటన, డిసెంబరులో ప్రదానం. నామినేషన్ల గడువు పూర్తవడానికి రెండు రోజుల ముందే గాంధీ హత్య జరిగింది. మరణానంతర (పోస్తుమస్) అవార్డులు యివ్వకూడదని నోబెల్ వారు నియమం పెట్టుకున్నారు. ప్రకటించాక, తీసుకునే లోపున మరణిస్తే మాత్రం బహుమతి వారి వారసులకు అందచేస్తారు. స్వీడిష్ రచయిత ఎరిక్ ఏక్సిల్ కార్ల్ఫెర్డ్ట్ నోబెల్ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. ఆయనకు ఓ సారి అవార్డు యిస్తానంటే బాగుండదు వద్దన్నారు. అందువలన 1931లో ఆయన చనిపోయిన ఆర్నెల్లకు పోస్తుమస్గా అవార్డు ప్రకటించారు. ఇది ఒక మినహాయింపు మాత్రమే అన్నారు. గాంధీ విషయంలో మాత్రం అలాటి మినహాయింపు యివ్వలేదు. 1948లో జీవితులైన వారెవరిలోనూ కమిటీ కంటికి శాంతి బహుమతికి అర్హులు కనబడక పోవడంతో ఎవరికీ యివ్వలేదు.
1960 సంవత్సరంలో మళ్లీ యిదే పునరావృతమైంది. అర్హులైన వారెవరూ కనబడక వాయిదా వేసేశారు. ఎవరూ కనబడకపోతే మరణానంతర అవార్డులపై నియమాన్ని సడలించి గాంధీగారికి ప్రకటించి ఉండవచ్చు కదా అనిపించింది ప్రపంచంలో చాలామందికి. అప్పుడు విఎం మాధవన్ నాయర్ అనే ఐసిఎస్ ఆఫీసరు ప్రయత్నించారని సెప్టెంబరు 24 ‘‘వీక్’’లో ఒక వ్యాసం వచ్చింది. ఆయన 1960 డిసెంబరులో నార్వేకు భారత రాయబారిగా వెళ్లారు. నోబెల్ ఫౌండేషన్ సాటి నోర్డిక్ దేశమైన స్వీడన్లో ఉంది కాబట్టే, నార్వే ప్రభుత్వ పెద్దల ద్వారా కమిటీకి చెప్పిద్దామని చూశారు. ప్రధాని ఎయినార్ రెండేళ్ల క్రితమే ఇండియాకు వచ్చి గాంధీ సమాధిని దర్శించి ఉన్నారు. నార్వే రాజధాని ఓస్లోలో కౌంటీ గవర్నరుగా ఉన్న ట్రైగ్వే గతంలో యునైటెడ్ నేషన్స్‌కు తొలి సెక్రటరీ జనరల్‌గా ఉండే రోజుల్లో గాంధీ హత్య జరిగిన రోజున అన్ని దేశాల పతాకాలను అవనతం చేయించి, గాంధీపై గౌరవాన్ని చాటుకున్న వ్యక్తి.
నాయర్ వీళ్లిద్దరిని కలిసి, వారి ద్వారా కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. 1960ది ఖాళీగా ఉంది కాబట్టి నామినేషన్ ప్రక్రియతో సంబంధం లేకుండా గాంధీకి మరణానంతర బహుమతి ప్రకటించవచ్చని వాదించారు. 1961 సెప్టెంబరు నాటికి గాంధీ పేరు దాదాపు ఖరారైంది. ఇంతలో సెప్టెంబరు 18న యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ డేగ్ హేమర్స్కిక్జోల్డ్ విమాన ప్రమాదంలో మరణించారు. అప్పటికే ఆయన పేర నామినేషన్ ఉంది. పైగా ఆయన స్వీడన్ దేశస్తుడు. అందువలన 1961 బహుమతి ఆయనకే అని నిశ్చయమై పోయింది. మరణానంతరమైనా ఫర్వాలేదు అని మినహాయింపు యిచ్చేశారు. దాంతో 1960 బహుమతి గాంధీకి యివ్వడంపై పునరాలోచన ప్రారంభమైంది.
నియమాన్ని అధిగమించి ఒక మరణానంతర బహుమతి అంటే సరేలే అనుకోవచ్చు. కానీ 1960, 1961 రెండిటికీ ఒకేసారి మినహాయింపు యివ్వడమా? బాగుండదు అనుకున్నారు కమిటీ సభ్యులు. అందువలన 1960 బహుమతిని దక్షిణాఫ్రికాలో జాతివివక్షతకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఆల్బర్ట్ లుతులీకి యిచ్చారు. చిత్రమేమిటంటే ఆ ఉద్యమాన్ని దక్షిణాఫ్రికాలో ప్రారంభించినది మహాత్మా గాంధీయే. ఈ ఆల్బర్ట్ గాంధీ మార్గంలోనే నడిచి, ఖ్యాతి గడించి, శాంతి బహుమతి గెల్చుకున్నాడు. ఇతనే కాదు, అమెరికాలో ఆఫ్రికన్-అమెరికన్ల హక్కులకై శాంతియుతంగా పోరాడి, 1964లో నోబెల్ శాంతి బహుమతి గెల్చుకున్న మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ కూడా నేను గాంధీ అనుయాయినే అని చాటుకున్నాడు. అయినా యిప్పటికీ నోబెల్ కమిటీ గాంధీకి మరణానంతర ఎవార్డు యిచ్చే ఉద్దేశంలో లేదు.(ఫోటో – 2023 విజేత నర్గీస్, 1960 విజేత ఆల్బర్ట్, క్రింద 1961 విజేత డేగ్)
– ఎమ్బీయస్ ప్రసాద్ (అక్టోబరు 2023)