ఒకప్పుడు ఈశాన్య రాష్ట్రాలలో బిజెపికి కాలూనేందుకు చోటుండేది కాదు. అలాటిది, గత నాలుగేళ్లలో మోదీ, అమిత్ షాల వ్యూహంతో అక్కడ పాగా వేసి, కాంగ్రెసును తరిమి కొట్టగలిగింది. అయినా 2019 ఎన్నికలలో బిజెపికి ఈశాన్య రాష్ట్రాల్లో 25 పార్లమెంటు సీట్లలో 14 మాత్రమే వస్తాయని సి ఓటరు చేసిన సర్వే చెప్పింది. ఎందుకలా అంటే 'పౌరసత్వ బిల్లుపై ఆ రాష్ట్రాల ఆగ్రహం' అని సమాధానం చెప్పుకోవాలి. బిజెపితో పొత్తు పెట్టుకుని అధికారం పంచుకుంటున్న పార్టీలతో కలిపి పది ఈశాన్య ప్రాంతీయ పార్టీలు యీ మంగళవారం గువాహతిలో సమావేశమై బిల్లును వ్యతిరేకిస్తున్నామని ప్రకటించారు. ప్రస్తుతానికి యివి బిజెపితో బంధం తెంపుకునే ఉద్దేశాన్ని ప్రకటించలేదు. బిల్లుపై పునరాలోచన చేయమని మాత్రమే అడుగుతున్నాయి. దానికి బిజెపితో బిహార్‌లో పొత్తు పెట్టుకున్న జెడియు, మొన్నటిదాకా పొత్తు పెట్టుకున్న ఎజిపి కూడా హాజరయ్యాయి.
ఈ బిల్లు గురించి గతంలోనే రాశాను. అవి చదవని వారికి క్లుప్తంగా చెప్పాలంటే – దేశవిభజన అంటే 1947కి కాస్త ముందు నుంచి, అప్పటి తూర్పు పాకిస్తాన్ నుంచి మన ఈశాన్య రాష్ట్రాలకు జనాలు వలస రాసాగారు. మతకలహాల వలన బాధితులుగా కొద్దిమంది వస్తే, మెరుగైన అవకాశాల కోసం చాలామంది వచ్చారు. 1971లో బంగ్లాదేశ్ ఏర్పడ్డాక కూడా యీ వలసలు ఆగలేదు. ఇంకా పెరుగుతూ పోయాయి. వాళ్లను ఓటు బ్యాంకులుగా మార్చుకోవడం కోసం యీ రాష్ట్రాలలోని రాజకీయ నాయకులను వారికి రక్షణ కల్పించసాగారు, సౌకర్యాలు సమకూర్చసాగారు. స్థానిక భాష, సంస్కృతిని మింగేసేటంతగా వాళ్ల సంఖ్య పెరిగిపోయింది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు తగ్గిపోవడంతో స్థానికులు ఆందోళన చేయసాగారు. ఉద్యమాలు నడిపారు. వాళ్లకు హామీ లిచ్చినవారే కానీ, చిత్తశుద్ధిగా అక్రమ వలసదారులను తరిమివేసిన వారు లేకపోయారు. ఎన్నికలలో అది ఒక అంశంగా మారుతూ వచ్చింది. ఇదంతా కాంగ్రెసు చేసిన నిర్వాకమని, తాము అక్రమ వలసదారులను తరిమివేస్తామని ఆశలు కల్పించి బిజెపి ఆకట్టుకుంది.
తీరా అధికారంలోకి వచ్చాక, శాశ్వతమైన ఓటు బ్యాంకు సృష్టించుకోవడానికి యీ అక్రమ వలసదారులలో హిందువులకు శాశ్వతపౌరసత్వం యివ్వడానికి సమకట్టింది. దానికోసం సిటిజన్‌షిప్ (అమెండ్‌మెంట్) బిల్లు, 2016 అని తయారు చేసింది. దాని ప్రకారం బంగ్లాదేశ్, పాకిస్తాన్, అఫ్గనిస్తాన్‌లలో వివక్షతకు గురై బాధితులుగా భారతదేశానికి వచ్చిన హిందువులు, క్రైస్తవులు, పార్శీలు, శిఖ్కులు, బౌద్ధులు, జైనులకు పౌరసత్వం లభిస్తుంది. ఏదో ఎఫెక్ట్ కోసం యిన్ని పేర్లు రాసినా, సమస్యంతా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన హిందువుల గురించే! బయటనుంచి వచ్చిన వారందరినీ మతంతో ప్రమేయం లేకుండా తరిమివేయాలని ఈశాన్య రాష్ట్రాల స్థానికుల డిమాండు. అబ్బే ముస్లిములనే తరిమివేద్దాం, హిందువులను ఉంచుకుందాం, వారికి పౌరసత్వం యిచ్చి సర్వహక్కులు యిద్దాం అని బిజెపి కేంద్ర నాయకుల స్టాండ్. ఇక్కడే ఘర్షణ వస్తోంది. కొందరు రాష్ట్ర బిజెపి నాయకులు కూడా స్థానిక పరిస్థితుల దృష్ట్యా కేంద్రంతో విభేదిస్తున్నారు. కాంగ్రెసును ఓడించడానికి బిజెపి ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుంది. వారి కెవ్వరికీ యీ బిల్లు నచ్చటం లేదు. ప్రస్తుతం ఆ బిల్లు లోకసభలో జనవరి 8న పాస్ అయిపోయింది, యీ బజెట్ సెషన్‌లో రాజ్యసభలో పాస్ కావాలి.
ఈశాన్య రాష్ట్రాలన్నిటిలో విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టి బంద్‌లు చేస్తున్నా అన్నిటి కంటె అసాంలో యీ రగడ ఎక్కువగా ఉంది. ఎందుకంటే బంగ్లాదేశ్ వలసదారుల గురించి ఆల్ అసాం స్టూడెంట్స్ యూనియన్ (ఆసు) 1980లలోనే ఉద్యమించింది, తర్వాతి రోజుల్లో అసాం గణ పరిషద్ (ఎజిపి)గా రాజకీయ పార్టీగా మారి పోరాడింది. హిందువైనా, ముస్లిమైనా బంగ్లాదేశ్ బెంగాలీల నందరినీ పంపించివేయడమే దాని లక్ష్యం. ఆసుకు చెందిన శర్వానంద సోనోవాల్ బిజెపిలో చేరి యిప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడు. అప్పుడలా, యిప్పుడిలా ఏమిటీ మార్పు అని స్పీకరుతో సహా 6గురు బిజెపి ఎమ్మెల్యేలు అతన్ని నిలదీశారు. కానీ అతను మౌనాన్ని ఆశ్రయించాడు. కానీ అతని కాబినెట్‌లో ఫైనాన్స్ మంత్రిగా ఉన్న హిమంత విశ్వశర్మ స్పష్టంగా చెప్పేశాడు – ''ఈ బిల్లు వలన 8-9 లక్షల మంది హిందూ అక్రమ వలసదారులకు మేలు కలుగుతుంది. అసాంలో అలాటివారు 5 లక్షల మంది ఉన్నారు. వారు 17 నియోజకవర్గాల్లో బిజెపి అభ్యర్థులకు మేలు చేకూరుస్తారు'' అని.
అసలైన పౌరులెవరో తేల్చడానికి నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్‌ఆర్‌సి) అని గతేడాది జులైలో తయారుచేసిన జాబితాలో 31 లక్షలమంది పేర్లు ఎగిరిపోయాయి. వారిలో 20 లక్షల మంది హిందువులని ఆసు అంటుంది. ఈ బిల్లు అసామీయులను, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన బెంగాలీలను విడగొట్టింది. బిల్లు పాస్ అయిన కొన్ని గంటల్లోనే బిజెపి అధికార ప్రతినిథి మెహదీ బోరా రాజీనామా చేశారు. అసమ్మతి తెలుపుతున్న బిజెపి నాయకులపై రాష్ట్ర బిజెపి షోకాజ్ నోటీసులు జారీ చేసింది కానీ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు రంజిత్ దాస్ మౌనంగా ఉన్నాడు. బిల్లు పాస్ ఐన మర్నాడే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న ముగ్గురు ఎజిపి మంత్రులు రాజీనామా చేశారు. ఆ మర్నాడే పోలీసులు బిల్లును వ్యతిరేకిస్తున్న అసామీ మేధావి డా. హీరేన్ గొహైన్‌పై ఏదో సాకు చూపి దేశద్రోహం కేసు పెట్టారు. దీనికి సర్వత్రా నిరసన వెలువడింది.
ఈ బిల్లు పట్ల అసామీయులు కోపంగా ఉన్నారని గ్రహించిన కేంద్ర బిజెపి ప్రభుత్వం 1985 నాటి అసాం ఒప్పందం అమలును సమీక్షించడానికి బెజ్‌బారువా అనే ఉన్నతాధికారి అధ్యక్షతన ఒక హైలెవెల్ కమిటీ వేసింది. అప్పటి కేంద్ర ప్రభుత్వానికి, అసాం ప్రభుత్వానికి కుదిరిన ఆ ఒప్పందంలో విదేశీయులందరినీ గుర్తించి, వెనక్కి పంపేస్తామని ఉంది. ఓ పక్క బిల్లు పాస్ చేయిస్తూ మరో పక్క దాని సమీక్ష చేయడంలో చిత్తశుద్ధి లేదని ఆ కమిటీ సభ్యులు సమావేశానికి రాలేదు. బిజెపి విడుదల చేసిన 'అసాం విజన్ డాక్యుమెంట్, 2016-2025'లో 1985 ఒప్పందాన్ని అక్షరాలా అమలు చేస్తామని మాటిచ్చిందని గుర్తు చేశారు. స్థానికులకు రిజర్వేషన్‌లు యిచ్చే ప్రతిపాదన పరిగణిస్తున్నామని ఫీలర్లు వదిలినా లాభం లేకపోయింది. నిస్సహాయుడైన చైర్మన్ తన పదవికి రాజీనామా చేశారు.
బిల్లు కారణంగా అసాం ఒక్కటే భారం మోయనక్కరలేదని, పౌరసత్వం పొందిన అక్రమ వలసదారులు దేశంలో ఎక్కడైనా నివసించవచ్చని, యావత్ భారతదేశం వారి భారం మోస్తుందని రాజనాథ్ సింగ్ పార్లమెంటులో ప్రకటన చేస్తూ అసామీలను ఊరడించబోయారు. కానీ భారమంతా తమపైనే పడుతుందనే భీతితో అసాం ప్రజలున్నారు. ఐదు లక్షల మంది అసాం ప్రభుత్వోద్యోగులు తాము నిరాహారదీక్ష చేస్తామని, అవసరమైతే మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని హెచ్చరించారు.
ఇక ఈశాన్యభారతంలోని తక్కిన రాష్ట్రాలకు వస్తే – ఎన్‌డిఏ లో భాగస్వామి ఐన ఎన్‌పిపి (నేషనల్ పీపుల్స్ పార్టీ) పాలిస్తున్న మేఘాలయాలో కాన్రాడ్ సంగ్మా ప్రభుత్వం బిల్లును వ్యతిరేకిస్తూ కాబినెట్ తీర్మానం చేసింది. ఆ కాబినెట్‌లో ఉన్న ఏకైక బిజెపి మంత్రి కూడా బిల్లు తొందరపాటు చర్య అన్నాడు. రాజ్యసభలో బిల్లు పాస్ అయితే తాము ఎన్‌డిఏ నుండి వైదొలుగుతామని ఎన్‌పిపి అంటోంది.
బిల్లు పాస్ చేసిన రోజు త్రిపురలో విద్యార్థి సంఘాలు, యువకులు ఆందోళన చేశారు. త్రిపురలో బిజెపి సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న ఐపిఎఫ్‌టి (ఇండీజినస్ పీపల్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర) ఆందోళనకారులకు నైతికపరమైన మద్దతు యిస్తాం కానీ ఆందోళనలో పాల్గొనమని చెప్పింది. అది వైదొలగినా ప్రభుత్వానికి ముప్పు లేదు. బిజెపిలోని గిరిజన నాయకులు ఆందోళనకారులకు తమ మద్దతు ప్రకటించారు.
అరుణాచల్ ప్రదేశ్‌లో ముఖ్యమంత్రి పేమా ఖండూ బిల్లుకు అనుకూలంగానే మాట్లాడుతున్నాడు. కొంతమంది కావాలని గందరగోళాన్ని సృష్టిస్తున్నారన్నాడు. బహుశా అతని విసురు మాజీ ముఖ్యమంత్రి గెగాంగ్ అపాంగ్‌పై కావచ్చు, ఎందుకంటే అతను బిజెపి నుంచి రాజీనామా చేశాడు.
మణిపూర్‌లో బిజెపి సొంతంగా పాలిస్తోంది. స్థానికంగా వస్తున్న వ్యతిరేకత తట్టుకోలేక ఈ బిల్లు నుండి మణిపూర్‌కు మినహాయింపు యివ్వాలని కేంద్రాన్ని కోరింది – అది అమలులో అసాధ్యమని తెలిసినా, స్థానికుల కోపాన్ని చల్లార్చడానికి ప్రయత్నించింది. కానీ సఫలం కాకపోవడం చేత ముఖ్యమంత్రి బిరేన్ సింగ్ బిల్లును పునస్సమీక్షించాలని కేంద్రప్రభుత్వాన్ని బహిరంగంగా కోరాడు.
క్రైస్తవులు అధిక సంఖ్యలో ఉన్న మిజోరామ్‌లో అన్ని పార్టీల వారూ బిల్లును వ్యతిరేకించారు. అక్రమంగా వలస వచ్చిన క్రైస్తవులకు పౌరసత్వం యిస్తామని బిల్లులో ఉన్నా వారేమీ సంతోషించలేదు. బిల్లుకు వ్యతిరేకంగా రిపబ్లిక్ దినోత్సవ సభలను బహిష్కరించారు. పతాకావిష్కరణకు వెళ్లిన గవర్నరును ఖాళీ మైదానం వెక్కిరించింది. మిజోరాం ముఖ్యమంత్రి జోరాంతంగా మోదీని కలిసి బిల్లుకు తమ ప్రతిఘటన తెలిపారు.
నాగాలాండ్‌లో కూడా జనాభాలో క్రైస్తవులదే మెజారిటీ. దాని ముఖ్యమంత్రి నైఫ్యూ రియో బిల్లుపై పునరాలోచన చేయమంటూ మోదీకి ఉత్తరం రాశాడు. మంత్రివర్గంలో ఉన్న బిజెపి మంత్రులు కూడా బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశారు. బిల్లును తమ రాష్ట్రంలో అమలు చేయమని ముఖ్యమంత్రి, చీఫ్ సెక్రటరీ ప్రకటించారు. ఎందుకంటే భారత పౌరసత్వం ఉన్నా ఆర్టికల్ 371 (ఎ) కింద నాగాలాండ్‌లో ఆస్తులు కొనడానికి వీలు లేదు.
వీరంతా యిలా వ్యవహరించడానికి కారణమేమిటి? 2019లో బిజెపి అధికారంలోకి వచ్చినా దాని మెజారిటీ తగ్గుతుందనీ, ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలలో బలహీనపడుతుందని అనుకుంటున్నారు. ఎందుకంటే ఈశాన్యంలో సగానికి పైగా 14 సీట్లు అసాంలోనే ఉన్నాయి. అక్కడే దెబ్బ తగిలేట్లుంది. ఇప్పుడు బిజెపి వెనుక నిలిచి, స్థానికుల ఆగ్రహాన్ని మూటగట్టుకుని, రాజకీయంగా నష్టపోవడం దేనికని వారి ఆలోచన, అంటున్నారు పరిశీలకులు.
– ఎమ్బీయస్ ప్రసాద్ (జనవరి 2019)
[email protected]