ఆంధ్రలో ఎన్నికలు జరగడానికి రెండేళ్లు సమయముండగా యిప్పణ్నుంచే పొత్తుల గురించి చర్చ మొదలైంది. వైసిపిని ఎదిరించడానికి అన్ని పార్టీలూ (అనగా 2019లోలా బియస్పీ, లెఫ్ట్ వంటి పార్టీలు కావు, యీసారి టిడిపి, బిజెపి) కలిసి వచ్చి కూటమి కట్టాలని పవన్ కళ్యాణ్ పిలుపు నిచ్చారు. చంద్రబాబు కూడా అలాటి పిలుపే యిచ్చారు. ఈ పొత్తు గురించి వాళ్లు నాలుగు మాటలని ఊరుకుంటే, వైసిపి నాయకులు మాత్రం పదిసార్లు దాన్ని పదేపదే వల్లించి, పొత్తు ఉందా లేదా? పొత్తు లేకుండా మాలా ఒంటరిగా పోటీ చేయలేరా? అంటూ కవ్విస్తున్నారు. ఏదీ కచ్చితంగా యిప్పటిదాకా తేలలేదు. ఇంతముందుగా పొత్తు మాటలు అవసరమా? అని కొందరి సందేహం.
రాజకీయ పార్టీలు చివరి నిమిషంలో ఆదరాబాదరాగా పొత్తు ఏర్పరచుకుని, టిక్కెట్ల పంపిణీల దగ్గర తొడతొక్కిసలాట జరిగి, ఒకే స్థానానికి రెండు కూటమి భాగస్వామ పక్షాలు నామినేషన్లు పడేసి, తర్వాత రాజీ ప్రయత్నాలు జరిగి, అలిగినవాళ్లు విత్‌డ్రా చేసుకోక, పొరబాటు జరిగిందని బయటకు చెప్పి, లోపల్లోపల గోతులు తవ్వి.. యిలా చెడగొట్టుకోవడం కంటె ముందుగానే పొత్తు కుదుర్చుకుని, ఏ స్థానం ఎవరికో ఓ మాట అనేసుకుంటే మంచిది. ఆ తర్వాత ఆ స్థానం ఎలాటయిన పార్టీ తమ అభ్యర్థిని కూడా ముందే నిర్ణయించేసిందంటే, అతను యిప్పణ్నుంచి నిధుల సేకరణ, జనసమీకరణ మొదలుపెడతాడు. నియోజకవర్గంలో పెళ్లిళ్లకు, చావులకు హాజరై, గుళ్లకు విరాళాలిచ్చి, మీలో ఒకణ్ని సుమా అని ఓటర్లకు చెప్పుకుంటాడు. కూటమి పార్టీలు పరస్పరావగాహనతో ప్రభుత్వ వ్యతిరేక నిరసన కార్యక్రమాలు చేస్తే ఒకరి అంగబలం, మరొక అర్థబలం కలిసి అవి విజయవంతమౌతాయి. అప్పుడు పాలకపక్షం గుండెల్లో గుబులు పుడుతుంది. మధ్య స్థాయి కార్యకర్తల్లో పార్టీ విజయంపై సందేహాలు ఏర్పడి, యీ కూటమివైపు ఫిరాయింపులు కూడా జరగవచ్చు.
ఆంధ్రలో యిలాటి కార్యక్రమాలకు అంతా సిద్ధంగానే ఉంది కానీ చిక్కంతా బిజెపితో వచ్చింది. పొత్తుకు ఒప్పుకో అని టిడిపి, జనసేనలు రెండూ బిజెపిపై ఒత్తిడి తెస్తున్నాయి. అది ఊఁ అనటంలేదు. జనసేనతో మాకు ఆల్రెడీ ఉంది. అది చాలు, వైసిపిని ఓడించి అధికారంలోకి వచ్చేయడానికి అంటోంది. అది చాలదని టిడిపి, జనసేనల అభిప్రాయం. బిజెపికి నచ్చచెప్పి, సై అనిపించాలని వాళ్ల తాపత్రయం. పైకి చూస్తే యిది ఆశ్చర్యకరంగా కనిపిస్తుంది. బిజెపికి ఉన్న సత్తా ఎంత కనుక, దాని గురించి యింత వర్రీ అవడానికి? మూడేళ్ల క్రితం నోటా కంటె తక్కువ ఓట్లు తెచ్చుకున్న పార్టీతో పొత్తుకై యింత తహతహ లాడాలా? కేంద్రంలో, అనేక రాష్ట్రాలలో బిజెపి పెద్ద శక్తే కావచ్చు. పొరుగున ఉన్న తెలంగాణలో అధికార పార్టీకి గుండెల్లో దడ కలిగించే స్థితిలో ఉండవచ్చు. కానీ ఆంధ్రలో దానికి పెద్ద నాయకులూ లేరు, కార్యకర్తలూ లేరు, ఓటు బ్యాంకూ లేదు. మరెందుకు చింత? ఇక్కడ బలం కంటె మోరల్ సపోర్టు ముఖ్యం. రెండు పెద్ద చక్రాలను పట్టి ఉంచడానికి సైజులో చిన్నదైన చైను ఎంత అవసరమో, జనసేన, టిడిపిలను కలపడానికి బిజెపి లింకు అంత అవసరం.
పవన్‌కి టిడిపితో కలవాలని ఉంది, అటూ సేమ్ ఫీలింగు. పెద్ద ప్రతిపక్షం కాబట్టి టిడిపితో కలవడానికి జనసేన ఉత్సాహపడడంలో వింత లేదు. అయినా బాబే ముందుగా బయటపడ్డారు. జనసేనకు ప్రేమలేఖలు పంపాం కానీ స్పందన లేదని చెప్పుకున్నారు. భగవాన్కీ ఘర్ మేఁ దేర్ హై, అంధేర్ నహీఁ అన్నట్లు పవన్‌కీ ఘర్‌లో కూడా అదే పరిస్థితి. ఆలస్యంగానైనా ఓ రోజు కరుణించారు. టిడిపి పేరు చెప్పకపోయినా వైసిపి వ్యతిరేక పక్షాలన్నిటినీ ఏకం చేస్తానన్నారు. 151 సీట్లతో వైసిపి గద్దె కెక్కిన దగ్గర్నుంచి ‘నువ్వు ఒక్క ఛాన్సంటూ అర్థిస్తే జనాలు మోసపోయి ఛాన్సిచ్చారు. ప్రజావేదిక కూల్చిన మరుక్షణం నుంచి నీపై నమ్మకం కోల్పోయారు. దమ్ముంటే రిజైన్ చేసి, మళ్లీ పోటీ చేయి. ప్రజలీపాటికే తమ తప్పు తెలుసుకుని బాబుని మళ్లీ అధికారంలోకి తెచ్చేద్దామని తహతహ లాడుతున్నారు. నువ్వీ క్షణాన ఎన్నికలు పెట్టినా, ఆర్నెల్లు ఆగి పెట్టినా మాదే గెలుపు. ఆలస్యం చేసిన కొద్దీ నీకొచ్చే ఒకటీ, అరా కూడా రావు, చూసుకో.’ అని ముప్పొద్దులూ ఊదరగొడుతున్న ప్రతిపక్షం టిడిపియే. దాన్ని కలుపుకోకుండా వైసిపి వ్యతిరేక కూటమిని ఊహించుకోవడం కష్టం.
అయితే జనసేన, టిడిపి నేరుగా చేయి కలిపితే పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. 2014లో చూశాంగా అంటే కుదరదు. అప్పుడున్నది టిడిపి-బిజెపి కూటమి. పవన్‌ది ‘నిస్వార్థంగా’ వచ్చి పోషించిన గెస్ట్ రోల్. ఆయనకు అప్పుడు అభ్యర్థులు లేరు, నాయకులూ లేరు. ఇప్పుడైతే కొందరు పుట్టుకుని వచ్చారు. 2019లో పార్టీ అభ్యర్థులుగా నిలబడిన వారందరూ, ‘విజయావకాశాలు పెద్దగా లేనప్పుడు సొంత డబ్బు ఖర్చు పెట్టుకుని పోటీ చేశాం. మేం తెచ్చుకున్న ఓట్ల కారణంగానే పార్టీకి ఐదున్నరశాతం ఓట్లు వచ్చాయి. అది చూపించే మీరిప్పుడు కూటమి భాగస్వాములతో హెచ్చు సీట్ల కోసం బేరాలాడ గలుగుతున్నారు. ఈసారికి మీకు టిక్కెట్లివ్వం, ఆ సీట్లు కూటమిలోని తక్కిన రెండు పార్టీలకు ధారాదత్తం చేశాం అనడం న్యాయం కాదు.’ అని గగ్గోలు పెట్టగలరు.
ఒకసారి కూటమంటూ ఏర్పడ్డాక 40 ఏళ్ల అనుభవం రీత్యా బాబు లీడ్ తీసుకుంటారు. ఇతర పార్టీల అభ్యర్థుల విజయావకాశాలను తన వద్ద నున్న తూనికరాళ్లతో తూస్తారు. అవసరమైతే అభ్యర్థిని మార్చమంటారు. అందువలన పాతవాళ్లందరికీ జనసేన టిక్కెట్టు యివ్వగలగుతుందన్న నమ్మకం లేదు. టిక్కెట్టు దొరకని అసంతృప్తులు ఏం చేస్తారో తెలియదు. లోతుగా ఆలోచిస్తే యిది చిన్న విషయమే. ఎందుకంటే జనసేనలో పేరున్న నాయకులు తక్కువ. నాయకుణ్ని ఎదిరించగల బలమైన అసంతృప్త నాయకులు అతి తక్కువమంది ఉంటారు. వాళ్లు కలిగించే ప్రభావమూ అంతంతమాత్రమే. అంతకంటె ముఖ్యమైన విషయం జనసేన-టిడిపిల మధ్య ఓట్ల బదిలీ ఏ మేరకు సాధ్యం అనేది!
టిడిపికి బలమైన ఓటు బ్యాంకు కమ్మ, బిసిలు. ఆ రెండు వర్గాలతోనూ కాపులకు స్పర్ధ ఉంది. కాపులు ప్రధానంగా బలపరిచే జనసేన ఓట్లు టిడిపికి, టిడిపి నుంచి జనసేనకు ఓట్లు పడతాయా? ఇక తటస్థ ఓటర్లు యీ కాంబినేషన్‌ను ఎలా చూస్తారు? ‘వైసిపి వాళ్లన్నట్లు పవన్ బాబుకి దత్తపుత్రుడనే మాట కన్ఫమ్ అయిందా? సమాజాన్ని మార్చే విషయంలో పవన్‌కు ఎన్ని వినూత్నమైన ఐడియాలున్నా బాబు వాటిని సాగనిస్తారా? ‘యూజ్ అండ్ త్రో’ పాలసీని యితని విషయంలోనూ అమలు చేస్తారా? కూటమికి ఓటేస్తున్నామని భ్రమ పెట్టుకోవడం కంటె టిడిపికే ఓటేస్తున్నాం అని గట్టిగా అనుకుని, ఆ పై నిర్ణయం తీసుకోవాలి’ అనుకోవచ్చు.
ఈ మాట రాస్తే జనసైనికులు నొచ్చుకోవచ్చు. మా ప్రభుత్వమే వస్తుందని పవన్ స్పష్టంగా చెప్పారు కదా అని వాదించవచ్చు. నిజమే, ‘‘పల్లకికి బోయీలెవ్వరు?’’ అనే వ్యాసంలో నేనూ రాశాను – పవన్ టిడిపి పల్లకీ మోయదలచుకోలేదు. తను పల్లకీలో కూర్చుని వారి చేతనే మోయిద్దా మనుకుంటున్నారు, ఆ విషయం ఉపన్యాసంలో కొన్ని భాగాలను కలిపి చూస్తే అర్థమవుతుంది అని రాశాను. అయితే యీ మధ్య పొత్తుకి నాయకత్వం మాదే అని బాబు అన్నారు. ‘ఫ్రంట్ మా నేతృత్వంలో ఉంటుంది. పొత్తులో భాగంగా భాగస్వాములకు కొన్ని సీట్లు యివ్వాలి కాబట్టి, వాటిని వదులుకోవడానికి టిడిపి నాయకులు సిద్ధంగా ఉండాలి’ అని ప్రకటించారు. అంటే పల్లకీలో కూర్చునేది నేనే అని ఆయన స్పష్టం చేశారు. ఇదేమీ పెళ్లి పల్లకీ కాదు, పెళ్లికూతురూ, పెళ్లికొడుకూ యిద్దరూ ఎక్కడానికి. ఒకరే ఎక్కగలరు. రెండో వాళ్లు మహా అయితే డిప్యూటీ సిఎం కాగలరు.
ఇద్దరికీ ఉబలాటం ఉన్నపుడు ఎక్కే ఛాన్సు ఎవరికి వస్తుంది? సీట్లు ఎక్కువున్నవారికే వస్తుంది. 2019లో టిడిపికి ఓట్ల శాతం 39. జనసేనకు 5.5. సీట్లలో తేడా 23-1. ఐదేళ్లలో పరిస్థితి తిరగబడి పోతుంది, జనసేనకు టిడిపి కంటె ఎక్కువ సీట్లు, ఓట్లు వస్తాయని అనుకోవడం కష్టం. అందువలన టిడిపి మాటే నెగ్గుతుందని అనుకోవాలి. కానీ టిడిపి కంటె తక్కువ సీట్లు వచ్చినా జనసేన సిఎం పోస్టు డిమాండు చేయగలదు, ఆ సీట్లే కనుక అధికారంలోకి రావడానికి కీలకమైతే! టిడిపికి, వైసిపికి సరిసమానంగా సీట్లు వచ్చి, జనసేన ఎవరికి మద్దతిస్తే వాళ్లే సిఎం అనే పరిస్థితి వచ్చిందనుకోండి. అప్పుడు పవన్ ‘నేను కింగ్‌మేకర్ కాను, కింగే అవుతాను’ అని పట్టుబట్టవచ్చు.
బాబు తను ముఖ్యమంత్రి అయ్యాకనే అసెంబ్లీలో అడుగు పెడతానన్నారు, కాబట్టి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారంటేనే సిఎం అవుదామనుకుంటున్నారని అర్థం. జనసేన వాళ్లు పవన్ సిఎం అని 2018 నుంచీ నినదిస్తున్నారు. పైగా బిజెపి కూడా తమ సిఎం కాండిడేటు పవనే అని చెప్పింది. రాష్ట్రానికి యిద్దరు సిఎంలు ఉండరు కాబట్టి, పదవీకాలాన్ని సమానంగా పంచుకుంటారేమో తెలియదు. ఇవన్నీ యిప్పుడే తేల్చుకోవడం కష్టం. అందుకని యీ కూటమి అధికారంలోకి వస్తే ఎవరు సిఎం అనేది సస్సెన్సులో ఉంచి, అది ఒక పెద్ద సమస్యే కాదన్నట్లు కూటమి పక్షాలు ప్రవర్తించవచ్చు. ఈ లోపున ఎవరికి వారు, ‘మనవాడే కాబోయే సిఎం’ అని ఓటర్లకు చెప్పుకోవచ్చు. అయినా జనసేనకు, టిడిపితో అధికారికంగా యింకా పొత్తు కుదరలేదు. బిజెపితోనే ఉంది. వైసిపిని ఓడించడానికి రోడు మ్యాప్ యివ్వాల్సిన బాధ్యత బిజెపిదే అని పవన్ చెప్పారు. రిమైండర్లు పంపుతున్నారో లేదో తెలియదు కానీ బిజెపి దాని గురించి పట్టించుకున్నట్లు కనపడటం లేదు. ఇప్పుడు టిడిపితో పొత్తుకు బిజెపి కలిసి రాకపోతే ఎలా? అనేది పవన్ ఎదుట ఉన్న ప్రశ్న. బిజెపి చిన్న పార్టీ కదా, ఓట్లు పెద్దగా లేదు కదా, అదేమనుకుంటే మనకేం అనుకోవటం లేదు బాబు, పవన్. పైన చెప్పినట్లు జనసేన, టిడిపి అనే రెండు పెద్ద లోహాలను కలపగలిగే టంకం, బిజెపి! సైజులో చిన్నదే కానీ చేసే పని పెద్దది.
దీనికి తోడు తమతో కలిసి రాకపోతే వైసిపితో లోపాయికారీ పొత్తు పెట్టుకుంటుందేమోనని వీళ్లిద్దరి భయం. 2019లో బిజెపితో బాగా చెడగొట్టుకోవడం చేతనే ఎన్నికల సమయంలో యిబ్బంది పడి భారీగా నష్టపోయామని బాబు దృఢాభిప్రాయం. ఇప్పుడు వైసిపి-బిజెపి బంధం బాగానే నడుస్తోంది. రాజ్యసభలో వైసిపి బిజెపికి మద్దతిస్తోంది. రాష్ట్రంలో వైసిపిని బిజెపి చికాకు పెట్టటం లేదు. ఆంధ్రకు యివ్వాల్సినవి యివ్వటం లేదు కానీ, అధికారపక్షాన్ని మరీ యిబ్బంది పెట్టటం లేదు. ముఖ్యంగా జగన్ కేసులు నత్తనడక నడుస్తున్నా చూసీచూడనట్లు ఊరుకుంది. ఈ బంధాన్ని తెంచుకుని బిజెపి తమ గట్టుకి రావాలని బాబు పట్టు. అప్పుడే కూటమికి ఊపు వస్తుందన్న ఆశ.
పవన్‌కు యిలాటి ఆశే కాకపోయినా మరోలా బిజెపి కలిసి రావాలని ఆశ. దానితో కలిసి ముప్పేట కూటమి ఏర్పరిస్తే అప్పుడు జనసేన టిడిపికి సెకండ్ ఫిడిల్ వాయిస్తోంది అనే మాట ప్రస్ఫుటంగా రాదు. వైసిపికి వ్యతిరేకంగా ఏర్పడిన విశాల వేదికలో మేమూ చేరాం, టిడిపినూ చేరింది అని చెప్పుకోవచ్చు. కావాలంటే బిజెపి స్థానంలో లెఫ్ట్‌తో కూటమి ఏర్పరచి కూడా యిలాగే చెప్పుకోవచ్చు. బాబు కన్నుగీటితే చాలు వాళ్లు వచ్చి వాలతారు. అయితే వాళ్ల వలన లాభం లేదు. ఓట్ల విషయంలో బిజెపి ఎంతో వాళ్లూ యించుమించు అంతే. కానీ అది కాదు విషయం. లెఫ్ట్ యిప్పటికే వైసిపితో విరోధం పాటిస్తోంది. కొత్తగా కలిసి వచ్చేదేమీ లేదు. వైసిపి-బిజెపి బంధం తెగి, కేంద్రం ద్వారా రాష్ట్రప్రభుత్వాన్ని యిబ్బంది పెట్టగలిగిస్తేనే యీ త్రిపక్ష కూటమికి ప్రయోజనం సిద్ధిస్తుంది.
వీళ్ల ఆలోచనలు వీళ్ల ప్రయోజనాల చుట్టూ తిరుగుతున్నాయి. మరి బిజెపి ఏమనుకుంటోంది? సొంతంగా గెలిచే ఛాన్సు 2024కి లేదు. అయితే 2029 వరకు ఖాళీగా కూర్చోలేదు కదా. రాష్ట్రంలో తన ఉనికిని చూపించుకోవాలి కాబట్టి అధికారంలో ఉన్న వైసిపిని విమర్శిస్తున్నారు. రేపు టిడిపి అధికారంలోకి వస్తే దాన్నీ అంటారు. అంతమాత్రం చేత అది యిప్పుడు టిడిపికి సన్నిహితం అని, రేపు వైసిపికి సన్నిహితం అనీ అనుకోవడానికి లేదు. ప్రస్తుతం వైసిపికి వ్యతిరేకం అంటూ హంగామా చేస్తే టిడిపికే లాభం. అది అధికారంలోకి వస్తే, వైసిపి బలమైన ప్రతిపక్షం అవుతుంది. తను దాని వెనక్కాలే తిరగాలి. అందుకని యీసారికి సహాయనిరాకరణతో టిడిపిని దూరంగా పెట్టి, దాన్ని వైసిపికి బలి యిచ్చేస్తే, 2024 పాటికి టిడిపి మరింత క్షీణించవచ్చు. పవన్ ఎలాగూ సీరియస్ పొలిటీషియన్ కాదు కాబట్టి, తాము జనసేన స్థానంలోకి రావచ్చు. ఇలా బిజెపి లెక్కలు వేసుకుంటూ కూర్చుంటే చూస్తూ కూర్చోవడానికి టిడిపి, జనసేనలకు ఓపిక లేదు. ఏదో ఒకటి చప్పున తేల్చండి అని బిజెపిపై వీళ్లు ఒత్తిడి చేస్తున్నారు. కానీ బిజెపి కిమ్మనటం లేదు. ఎందుకని?
రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలతో బిజెపికి లావాదేవీలుంటాయి. ఈ రోజు వైసిపితో ఉన్నాయి. 2024లో వైసిపి ఓడిపోయి, టిడిపి వస్తే దానితోనూ లావాదేవీలు పెట్టుకుంటుంది. బేరసాలాడుతుంది. వివాదాస్పద బిల్లులు పాస్ కావడానికి రాజ్యసభలో మాకు మద్దతివ్వండి. మేం మీ వ్యవహారాలు చూసీ చూడనట్లు వదిలేస్తాం అంటుంది. కాంగ్రెసేతర, కమ్యూనిస్టేతర ప్రతిపక్షాలతో వాళ్ల విధానం యిదే. ఒడిశాలో నవీన్ బిజెపితో ఎలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడో, తమిళనాడులో స్టాలినూ అలాగే ఉన్నాడు. ఎడిఎంకె పోయి డిఎంకె వచ్చినా తమిళనాడులో బిజెపి మరీ పోరాటాలు చేసేసి, రాష్ట్రాన్ని యిబ్బందిపాలు చేయటం లేదు. ఎప్పుడు ఎటాక్ చేయాలో దానికుండే టైమ్టేబులు దాని కుంది. ప్రస్తుతానికి బిజెపికి ఆంధ్రలో స్పాన్సర్లు లేరు. సొంతబలం మీద గెలిచి తీరతామని ఛాలెంజ్ చేయగల నాయకులూ లేరు, కార్యకర్తలూ లేరు, స్థానిక మీడియా సపోర్టూ లేదు. పార్లమెంటు ఎన్నికలు కూడా కలిసి వస్తాయి కాబట్టి మోదీ పై ఉన్న మోజు ప్రభావం పడి, కొన్ని సీట్లు గెలిస్తే గెలవవచ్చేమో కానీ అవి రెండంకెలకు చేరితే గొప్ప. ఆపాటి భాగ్యం కోసం యీ లోపున యితరులకు మేలు చేయడానికి బలమైన పార్టీతో ఉత్తిపుణ్యాన పేచీ పెట్టుకోవడం వాళ్లకు యిష్టం లేదు.
ఎన్నికలు అయి ఫలితాలు వచ్చేవరకూ బిజెపికి టిడిపి, వైసిపి రెండూ ఒకటే. ఎన్నికల తర్వాత ఎవరు గెలిచారో చూసి, వాళ్లతో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పొత్తు పెట్టుకుంటుంది. ముందే ఒకరితో ముడి పెట్టుకుని, అవతలి వాళ్లకు తలుపు మూసేయదు. ఆప్షన్లు ఫోర్క్లోజ్ చేసుకోదు. పవన్‌తో కలిసుంది కదా అంటే అది పెద్ద ఫోర్స్ కాదని దానికెలాగూ తెలుసు. దానివలన వైసిపి అలగదనీ తెలుసు. కన్యాశుల్కంలో గిరీశం అంటాడు ‘హాజీ సాయిబు తొందరపడి తురకల్లో కలిసిపోయాడన్నట్లు మనం తొందరపడి ఏ పనీ చేయకూడదు’ అని. ఆ సామెతకు అర్థం నాకు తెలియదు కానీ బిజెపి యిప్పుడు గిరీశంలాగానే ఆలోచిస్తోందని నా భావన. వైసిపి ఓడిపోతుందని దానికి కచ్చితంగా అనిపించిన రోజున టిడిపి కోరిక మన్నించి కూటమిలో చేరుతుంది. దానికి ఏ మాత్రం సందేహం ఉన్నా, తటస్థంగా ఉంటుంది. జగన్ అన్‌పాప్యులర్ అని ఎల్లో మీడియా ఎంత హోరెత్తించినా, ప్రజల నాడి చూస్తే తక్కువ మెజారిటీతో ఐనా వైసిపి మళ్లీ గెలవవచ్చన్న సందేహం ఉందేమో, అందుకే ఎటూ చెప్పకుండా కూర్చుంది. వచ్చే రోజుల్లో వైసిపి ప్రభుత్వం పట్ల వ్యతిరేకత గణనీయంగా ఉంటే అప్పుడే నిద్ర లేచినట్లు నటించి, రండి పొత్తు కడదాం అంటుంది.
దానాదీనా తేలిందేమిటంటే, వైసిపి పాలనను జనాలు ఛీత్కరించుకుంటున్నారు. ప్రభుత్వం దానంతట అదే పడిపోయేట్లుంది, మనం కాస్త నెడితే చాలు అని బిజెపికి తోచేట్లా చేయవలసిన బాధ్యత టిడిపి, జనసేనలదే! దానికిగాను వీళ్లేదైనా గట్టి ప్రయత్నం చేయాలి, ఎంతసేపూ ఎబిఎన్, టీవీ5ల్లో కూర్చుని ప్రజలు నెత్తిమీద నుంచి వైసిపి కుంపటిని దింపుకుందా మనుకుంటున్నారు అని ఆస్థాన పానెలిస్టుల చేత రోజూ వల్లె వేయిస్తే లాభం లేదు. ప్రభుత్వం పట్ల ఏదైనా అసంతృప్తి ఉంటే క్షేత్రస్థాయితో మసలే నాయకులకు తెలిసిపోతుంది. వైసిపి అధికారంలోకి వచ్చి మూడేళ్లయింది కాబట్టి, యీ పాటికే కొంతమంది తిరగబడి ఉండాలి. కనీసం మొన్న మంత్రివర్గ మార్పు తర్వాతైనా కొందరు పార్టీలోంచి బయటకు వెళ్లిపోయి వుండాల్సింది. అది జరగలేదు. సణుగుళ్లు వారంలోపునే సద్దు మణిగాయి.
పైగా ఇంకోటి గమనించాలి. టిడిపి, జనసేనల వైపు కొత్తగా నాయకులెవరూ రాలేదు, జనసేనకు మీడియా సపోర్టు, ఇండస్ట్రియలిస్టుల, పెద్ద వ్యాపారస్తుల సపోర్టూ గతంలోనూ లేదు, ఇప్పుడూ లేదు. టిడిపి నాయకులెవరూ అరుగు దిగటం లేదు. జేబులోంచి డబ్బులు తీసి ఉద్యమాలు నడపటం లేదు. జూమ్ మీటింగుల్లో, ట్విట్టర్లో హడావుడి చేస్తే సరిపోయిందా? టిడిపి హయాంలో ప్రయోజనాలు పొందినవాళ్లు యిప్పుడు ఏవైనా కొన్ని ఉద్యమాలు స్పాన్సర్ చేయాలా? వద్దా? బాబూ, లోకేశే హైదరాబాదులో కూర్చున్నారు, మనమెందుకు చేతులు కాల్చుకోవడం అనుకుని కాబోలు ఊరుకుంటున్నారు. తెల్లారి లేస్తే టీవీ చర్చల్లో కనబడే పట్టాభి బూతుపదం ఉపయోగించి కేసులో యిరుక్కున్నాక పూర్తిగా కనబడడం మానేశారు. అలాగే మాల్యాద్రి, బండారు, గోరంట్ల, కంభంపాటి రామమోహన రావు.. యిలాటి టిడిపి వీరులంతా టీవీల నుంచి కనుమరుగై పోయారు. మరో రెండేళ్లలో అధికారంలో వచ్చే పార్టీ మన టిడిపియే అని వాళ్లకు తోస్తే ఊరుకుందురా?
తెలంగాణ ఉద్యమం నడిచే రోజుల్లో కొందరు ఎన్నారైలు భారీ విరాళాలు యిచ్చి సహకరించేవారు. వారిలో కొందరు వచ్చి టిక్కెట్లు అడిగేవారు. నెగ్గారా, ఓడారా అన్నది వేరే విషయం. ఇది గెలిచే గుఱ్ఱం అనే ఆశ అయితే కెసియార్ కలిగించారు కదా. ఇప్పుడు టిడిపి తరఫున అలా దిగి, హంగు చేసే ఎన్నారైలు కానీ, యిండస్ట్రియలిస్టులు కానీ ఎవరూ కనబడటం లేదు. అనాదిగా ఉన్న నాయకులు పునాదిరాళ్లలా చలనం లేకుండా ఉన్నారు. పవన్ తరఫున ఎవరైనా వస్తారా అని చూడబోతే, సినీరంగం నుంచి ఖాళీగా ఉన్న మాజీ కారెక్టరు యాక్టర్లు కూడా ఎవరూ వచ్చి చేరలేదు. పారిశ్రామిక రంగం నుంచి అయితే ఎవరూ పెట్టుబడి పెట్టేట్లు కనబడటం లేదు. టీవీ చర్చల్లో వచ్చేందుకు కూడా ఏ మేధావీ ముందుకు రావటం లేదు.
‘మా వైపు ఉన్నామని బిజెపి ప్రకటిస్తే చాలు, మాకు వీళ్లందరూ వచ్చి పడతారు’ అని టిడిపి, జనసేన అంటే, ‘పెళ్లయితే తప్ప పిచ్చి కుదరదు, పిచ్చి కుదిరితే తప్ప పెళ్లి కాదు’ సామెతలా ఉంటుంది. అయినా ఎవరో వస్తారని, ఏదో మేలు చేస్తారని.. పాటలో చెప్పినట్లు బిజెపి వచ్చి, పొత్తు పెట్టుకుని తమను గట్టున పడేస్తుందని ఎదురు చూసే బదులు, టిడిపి, జనసేన తమ కార్యకర్తలను హుషారు చేయడంపై దృష్టి పెట్టాలి. ప్రభుత్వం చేస్తున్న పొరపాట్లను మేధావి వేదికల ద్వారా, సామాన్య ప్రజల మధ్యకు వెళ్లి చర్చించి వైసిపి ప్రభావాన్ని తగ్గించాలి. టీవీలో చెప్తున్నాంగా వినమను అంటే కుదరదు. పొట్ట నింపుకునే పనిలో ఉన్న సామాన్యుడు, సరిగ్గా ఆ టైముకి టీవీ పెట్టుకుని విని, ప్రభావితమై పోడు.
ప్రభుత్వ వైఫల్యాల గురించి ప్రశ్నా వేదికలపై చర్చ జరగాలి. మేం అధికారంలోకి వస్తే ఫలానాఫలానా సంక్షేమ పథకాలను ఎత్తివేస్తాం, లేదా కుదిస్తాం, అలా చేసి మిగిల్చిన డబ్బుతో అభివృద్ధి, ఇన్ఫ్రా పనులు చేస్తాం, అమరావతిపై యింత వెచ్చిస్తాం, దాని నుంచి యింత రాబడతాం అని క్లియర్‌కట్‌గా చెప్పాలి. గతంలో రైతు ఋణమాఫీ నూటికి నూరు శాతం సాధ్యమే అని కుటుంబరావు గారు టీవీలో బల్లలు గుద్ది మరీ చెప్పారు. ఆచరణకు వచ్చేసరికి కోతలు పెట్టారు. అందువలన యీ సారి మరింత నమ్మశక్యమైన ప్లాన్లు వేసి ప్రజలను ఒప్పించాలి. బజెట్‌లో దేనిదేనికి ఎంతెంత శాతం యిస్తారో ముందే చెప్పేస్తే బెస్టు. 2024 ఛాన్సు వదులుకుంటే బాబుకి మళ్లీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు మరింత సన్నగిల్లుతాయి. పవన్ కంటారా, వయసు ఆయన పక్షాన ఉంది. ఆయన రాజకీయాల పక్షాన ఉంటారో లేదో చెప్పలేం.
– ఎమ్బీయస్ ప్రసాద్ (మే 2022)