250 ఏళ్లగా తిరువనంతపురం పద్మనాభాలయం ధర్మకర్తలుగా వున్న తిరువాన్కూర్ రాజవంశం సెలవు పుచ్చుకోవలసి వచ్చింది. సుప్రీం కోర్టు ఆదేశాల ననుసరించి రాజవంశ ప్రతినిథి ఐన ఆదిత్య వర్మ ఏప్రిల్ 27న గుడికి తన హోండా సిటీ కారులో వచ్చి జిల్లా జడ్జికి గుడి తాళం చెవులు, నేలమాళిగల తాళం చెవులు అన్నీ అప్పగించారు. ఒక చిరునవ్వుతో తన విషాదాన్ని అదుపు చేసుకుంటూ తన చేతిలో వున్న కారు తాళం చెవిని ఎత్తి చూపిస్తూ ''నా దగ్గర వున్న కీ యిది ఒక్కటే..'' అన్నాడు. ఈ నాటకీయ ఘట్టానికి నేపథ్యం చాలానే వుంది.
వెయ్యేళ్లనాటి ఆ గుడికి తాము దాసానుదాసులమని, తమ ఆస్తి సర్వస్వం పద్మనాభుని సొంతమని, 1750లో అప్పటి రాజు మార్తాండవర్మ ప్రకటించారు. ఆయన వారసులందరూ గుడి ఆస్తులను సంరంక్షిస్తూ వచ్చారు. స్వాతంత్య్రం వచ్చాక, రాజరికాలు అంతరించాక ఏం చేయాలన్న ప్రశ్న తలెత్తింది. అప్పటిరాజు చిత్ర తిరునాళ్ బలరామవర్మకు, భారత ప్రభుత్వానికి 1949లో ఒప్పందం కుదిరింది. దాని ప్రకారం గుడి రాచకుటుంబం నిర్వహించే ట్రస్టు ఆధ్వర్యంలోనే గుడి నడపడానికి కేరళ ప్రభుత్వం ఒప్పుకుంది. 1991లో ఆయన మరణించాక, ఆయన తమ్ముడు మార్తాండ వర్మ వారసుడిగా వచ్చాక గుడిలో అక్రమాలు జరగనారంభించాయి. పాత రాజుకి ఆప్తుడు, మాజీ ఐపియస్ అధికారి అయిన టి పి సుందరరాజన్‌కు యిది బాధ కలిగించింది. గుడి ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్నాయని కోర్టులో కేసు వేశాడు.
2007 డిసెంబరులో తిరువనంతపురం కోర్టు రాచకుటుంబానికి గుడిపై హక్కులు లేవని తీర్పు యిచ్చింది. దీన్ని మార్తాండవర్మ సవాలు చేశారు. 2011లో కేరళ హైకోర్టు కింది కోర్టును తీర్పును సమర్థిస్తూ గుడి ఆస్తులు స్వాధీనం చేసుకోమని కేరళ ప్రభుత్వాన్ని ఆదేశించింది. మార్తాండవర్మ దీనిపై సుప్రీం కోర్టుకి వెళ్లి స్టే తెచ్చుకున్నారు. అయితే సుప్రీం కోర్టు ఒక కమిటీ వేసి గుడి ఆస్తుల విలువ తేల్చమని కూడా చెప్పింది. ఆ కమిటీ నేలమాళిగలు తెరవ నారంభించడంతో అందరికీ ఆ ఆలయసంపద గురించి తెలియవచ్చింది. అయితే ఆరవ మాళిగ (కల్లార బి అంటారు) తెరిస్తే అరిష్టమంటూ ప్రచారం జరిపి దాన్ని తెరవనీయకుండా చేశారు.
ఇదే సమయంలో గుడి వ్యవహారాలు కక్షుణ్ణంగా పరిశీలించమంటూ సొలిసిటర్ జనరల్‌గా పనిచేసిన గోపాల సుబ్రమణ్యంను అమికస్ క్యూరే (న్యాయస్థానానికి మిత్రుడు)గా నియమించింది. ఆయన తన ప్రాక్టీసు పక్కన పెట్టి, సొంత ఖర్చులతో రాకపోకలు సాగించి, లోతుగా విచారణ జరిపి ఈ ఏప్రిల్‌లో 575 పేజీల నివేదికను సమర్పించారు. దాని ఫలితమే యీనాడు రాచకుటుంబం నుండి గుడిని స్వాధీన పరచుకోవడం! ఈ నివేదికలోని ముఖ్యాంశాలు చూసినా కళ్లు తిరుగుతాయి.
* నేలమాళిగలనుండి బంగారం, నగలు, వజ్రాలు భారీ స్థాయిలో తరలించబడ్డాయి
* బంగారు రజనును ఎవరికీ అనుమానం రాకుండా ఇసుకలో కలిపి గుడి బయటకు తరలించారు
* 30 ఏళ్లగా ఆదాయం వివరాలు సరిగ్గా లేవు, ఆడిట్ జరగలేదు. కరన్సీ నోట్లను ఒక స్టీలు బాక్స్‌లో పెట్టి తాళం కూడా వేయటం లేదు.
* హుండీ నుండి నెలకు 130 లక్షల రూ.ల ఆదాయం వస్తోందని అంచనా. కానీ హుండీ తెరిచి లెక్కించేటప్పుడు రికార్డులు మేన్‌టేన్ చేయడం లేదు. హుండీ తెరిచి వచ్చిన నాణాలన్నీ లెక్కపెట్టాక, తిరుచ్చి నుండి వచ్చే వ్యాపారస్తుడి చేతికి యిస్తున్నారు. దానికి రసీదు అదీ వుండదు. పోనీ బ్యాంకులో ఖాతా లేదా అంటే 17 బ్యాంకుల్లో 34 ఖాతాలు పెట్టారు.
* గుడి భూములను అమ్మేసినట్లు తోస్తోంది. కొన్ని ట్రస్టులు బోగస్‌గా కనబడుతున్నాయి.
* ఉద్యోగుల వద్ద బంగారం, వెండి రేకులు కనబడ్డాయి. అవి వారి దగ్గర వున్నట్టు ఎక్కడా రికార్డు చేయలేదు
* 17 కిలోల బంగారం కనబడలేదు. ఏమైంది అని అడిగితే నగలు చేయమని బయటి కంసాలికి యిచ్చాం అన్నారు
* కల్లార బి తెరిస్తే అరిష్టమంటూ యింత హంగామా చేశారు కానీ దాన్ని అంతకుముందే పలుమార్లు తెరిచారని స్వయంగా చూసినవారు చెప్పారు. అక్కడున్న నగలను ఫోటోలు తీశారు. అవి తమ సొంతమని రాచకుటుంబం అనుకుని అమ్మాలని చూసింది. నగలు ఎలా వున్నాయో చూపడానికి ఫోటోలు తీసుకున్నారు.
* కొన్ని గదులు చూస్తే వాటిలో విలువైన వస్తువులు వున్నాయని అనుమానం కూడా రాదు. వెళ్లి చూస్తే భక్తులు యిచ్చిన బంగారం, వెండి నగలన్నీ మామూలు పెట్టెల్లో పెట్టి వున్నాయి. అలాటి గదుల్లో తాళం వేసి పెట్టిన ఒక హుండీలో ప్రాచీనకాలం నాటి నాణాలు, నగలు కనబడ్డాయి. ఇవన్నీ గుడి ఉద్యోగుల అజమాయిషీలోనే వున్నాయంటున్నారు. తాళం చెవులు అడిగితే లేవంటున్నారు.
* ఎన్నో పురాతన నాణాలు ఉట్టినే సంచుల్లో పడి వున్నాయి. భద్రత లేదు.
* జరుగుతున్న అక్రమాలు బయటపెట్టడానికి ప్రయత్నించినవారిపై ఆగడాలు జరిగాయి. ఒక ఉద్యోగినిపై అత్యాచారం జరిగింది. ఒక ఉద్యోగిపై ఆసిడ్ దాడి జరిగింది. మరొక ఆటోడ్రైవర్‌ను చంపి గుడి ఎదుట వున్న కొలనులో పడేశారు
ఈ నివేదిక చదవగానే సుప్రీం కోర్టు యిక ఆగలేదు. వెంటనే గుడిని అప్పగించమని రాజకుటుంబాన్ని ఆదేశించింది. ఇప్పుడు మార్తాండవర్మ లేడు. 2013 డిసెంబరులో మరణించాడు. ఆయనపై కేసు వేసిన సౌందరరాజన్ 2011లోనే పోయాడు. ఐదుగురు సభ్యులతో గుడి నిర్వహణ కమిటీ ఏర్పాటు చేసింది. ఏదైనా ముఖ్యమైన విషయాలలో రాచకుటుంబాన్ని సంప్రదించండి తప్ప వారికి నిర్వహణలో భాగం కల్పించవద్దు అంది. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్‌గా పని చేసి రిటైరైన వినోద్ రాయ్‌ను గత పాతికేళ్లగా జరిగిన లావాదేవీలు సమీక్షించమంది. నిపుణుల కమిటీ ఏర్పరచి నేలమాళిగల్లోని వస్తువుల ఖరీదు కట్టమంది.
రాచకుటుంబం వీటన్నిటికి మౌనంగా సమ్మతించింది. బలరామవర్మ కుమారుడైన రామవర్మ, ఆస్పిన్‌వాల్ అండ్ కంపెనీ అనే వంద కోట్ల పబ్లిక్ లిమిటెడ్ కంపెనీకి మేనేజింగ్ డైరక్టర్. మంగళూరులో దాని హెడాఫీసు. షిప్పింగ్, లాజిస్టిక్స్, ప్లాంటేషన్స్, టూరిజం వ్యాపారాలు చేస్తూ వుంటారు. బెంగుళూరు, చెన్నయ్, త్రివేండ్రంలలో అనేక భవంతులు వున్నాయి. ఆయన తన ప్రతినిథిగా ఆదిత్యవర్మను పంపి ప్రభుత్వానికి తాళం చెవులు అప్పగించేశారు.
– ఎమ్బీయస్ ప్రసాద్