పాకిస్తాన్ జనాభా 20.77 కోట్లు. ప్రాంతాలుగా చూస్తే 53% జనాభా అంటే 11 కోట్ల మంది పంజాబ్‌లో ఉన్నారు. అక్కడ నవాజ్ పార్టీకి ప్రాబల్యం ఎక్కువ. 23% మంది అంటే 4.80 కోట్లమంది సింధ్‌లో ఉన్నారు. అక్కడ భుట్టో పార్టీకి ప్రాబల్యముంది. 14.7% మంది అంటే 3 కోట్ల మంది ఉన్న ఖైబర్ ఫక్తూన్ ఖ్వా (కెపికె)లో ఇమ్రాన్‌కు పట్టుంది. బలోచిస్తాన్‌లో 5.9% మంది అంటే 1.23 కోట్లమంది ఉన్నారు. ఫెడరల్లీ ఎడ్మినస్ట్‌ర్‌డ్ (ఫాటా)లో అర కోటి అంటే జనాభాలో 2.5% ఉన్నారు. ఇస్లామాబాద్ కాపిటల్ టెరిటరీ (ఐసిటి) లో 20 లక్షల మంది ఉన్నారు.
ఓటర్లు 10.70 కోట్ల మంది. మన లోకసభ వంటి జాతీయ అసెంబ్లీలో 342 మంది సభ్యులుంటారు. మెజారిటీ కావాలంటే 172 సీట్లు రావాలి. ఈ 342లో 272 స్థానాలకు జనరల్ స్థానాలు. వాటిని ఎన్నికల ద్వారా భర్తీ చేస్తారు. తక్కిన 70 రిజర్వ్‌డ్ సీట్లలో 60 స్థానాలను మహిళలకు, 10 స్థానాలను మైనారిటీలకు పార్టీ బలాబలాల ఆధారంగా దామాషా పద్దతిన కేటాయిస్తారు. 5% కంటె ఎక్కువ ఓట్లు వచ్చిన పార్టీలకే యీ ఛాన్సు. ప్రాంతాల వారీగా చూస్తే పంజాబ్‌లో 148 జనరల్ సీట్లు 35 ప్లస్ రిజర్వ్‌డ్ మొత్తం 183. సింధ్‌లో 61 జనరల్ సీట్లు ప్లస్ 14 రిజర్వ్‌డ్ మొత్తం 75. కెపికెలో 35 జనరల్ సీట్లు ప్లస్ 8 రిజర్వ్‌డ్ మొత్తం 43. బలోచిస్తాన్‌లో 14 జనరల్ సీట్లు ప్లస్ 3 రిజర్వ్‌డ్ మొత్తం 17. ఫాటాలో 12 జనరల్ సీట్లు. రిజర్వ్‌డ్ లేవు. ఐసిటిలో 2 జనరల్ సీట్లు. రిజర్వ్‌డ్ లేవు. జాతీయ ఎసెంబ్లీకి ఎన్నికలు జరిగినప్పుడే రాష్ట్రాలకు కూడా ఎన్నికలు జరిగి, ముఖ్యమంత్రులను ఎన్నుకుంటారు. కేంద్రంలో ఒక పార్టీ అధికారంలో ఉన్నా, రాష్ట్రంలో మరో పార్టీ అధికారంలో ఉండవచ్చు.
ఇదంతా పక్కాగానే ఉంది కానీ ప్రధాన అధికారం ప్రధానిదా లేక అధ్యక్షుడిదా అనే ఊగిసలాట ఉంటూ వచ్చింది. దీనికి కారణం మధ్యమధ్యలో సైన్యం కలగజేసుకుంటూ వ్యవహారాలను చిక్కుపరిచింది. పాక్‌లో సైన్యానికి ఎందుకింత ప్రాధాన్యం అంటే తొలి రోజుల్లోనే పాక్ పాలకుల మధ్య విభేదాలను ఆసరాగా చేసుకుని 1958లో ఆయుబ్ ఖాన్ సైనిక కుట్ర చేసి నియంతగా మారడం! పాక్ ఏర్పడ్డాక మన లాగానే ప్రధాని కేంద్రంగా పాలన సాగేది. జిన్నా తను గవర్నరు జనరల్ అయి, లియాకత్ ఆలీ ఖాన్‌ను ప్రధానిని చేశాడు. అతను హత్యకు గురి కావడంతో మరొకరు వచ్చారు. ఇలా 1960 వరకు 7గురు ప్రధానులు పని చేశారు. 1958లో ఆయూబ్ రాగానే మార్షల్ లా పెట్టి 1960లో అధ్యక్ష వ్యవస్థ ఏర్పాటు చేసి సర్వాధికారాలు తన చేతిలోకి తీసుకున్నాడు. 1965లో ఇండియాతో యుద్ధానికి దిగి, పరువు పోగొట్టుకున్నాడు. 1969లో వ్యతిరేకత భరించలేక దిగిపోవాల్సి వచ్చినపుడు యాహ్యాఖాన్ అనే మరో మిలటరీ అధికారికి గద్దె నప్పగించి మరీ దిగాడు. అతను 1971లో వరకు నియంతగా పాలించి బంగ్లాదేశ్ యుద్ధంలో ఇండియాతో ఓటమి తర్వాత దిగిపోయాడు.
అప్పుడు భుట్టో అధికారంలోకి వచ్చి 1973లో ప్రధాని పదవిని మళ్లీ ప్రముఖంగా చేశాడు. తన పార్టీకి చెందిన ఫజల్ చౌధురీని అధ్యక్షుణ్ని చేశాడు. కానీ 1977లో జియా ఉల్ హక్ అనే అతను సైనిక కుట్ర చేశాడు. భుట్టోను జైలుపాలు చేసి, 1978లో చౌధురీని దింపేసి తనే అధ్యక్షుడయ్యాడు. అయితే అతను 1988లో ఒక విమాన ప్రమాదంలో చనిపోయాడు. తను ఉండగానే 1985లో సార్వత్రిక ఎన్నికలు జరిపించాడు. అప్పణ్నుంచి మళ్లీ ప్రధాని పదవి మళ్లీ అస్తిత్వంలోకి వచ్చింది. 1988 నుంచి 1999లో ముషారఫ్ నియంతగా వచ్చేవరకు ప్రధానులదే ప్రాముఖ్యత. 2008 వరకు నడిచిన ముషారఫ్ పాలనలో ప్రధానులు నామమాత్రంగానే ఉన్నారు. ముషారఫ్ దిగిపోయాక ప్రధానులకు అధికారం తిరిగి వచ్చింది. ప్రస్తుతానికి ప్రధానిదే పైచేయి. ఇమ్రాన్ ప్రధాని అయ్యాక తన పార్టీ సభ్యుడైన ఆరీఫ్ అల్వీనే అధ్యక్షుణ్నే చేశాడు.
పాకిస్తాన్‌లో సైనిక పాలన యిలా సాగుతున్నా, ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోతున్నా అమెరికా ఎప్పుడూ దానికి మద్దతుగా నిలిచింది. ఎందుకంటే వాళ్లిద్దరి మధ్యా ఉన్న సైనికబంధం! 1950, 60లలో మౌలిక వసతులకై అమెరికా చాలా సాయం చేసింది. 1959లో ఆయూబ్ అధినేతగా ఉండగా పెషావర్‌లో అమెరికన్ ఎయిర్ ఫోర్సు, సిఐఏల రేడియో ట్రాన్స్‌మిషన్ లిజనింగ్ పోస్టు పెట్టుకోనిచ్చాడు. దానిలో 800 మంది ఉద్యోగులు, 500 మంది సహాయసిబ్బంది ఉండేవారంటే అది ఎంత పెద్దదో తెలుసుకోవచ్చు. దాని ద్వారా రష్యా యితర దేశాలతో సాగించే సంభాషణలను వాళ్లు వినేవారు. అక్కణ్నుంచి గూఢచారులు రష్యాలోకి చొరబడేవారు కూడా. 1960లో రష్యాలో పట్టుబడిన అమెరికన్ గూఢచారి ఫ్రాన్సిస్ పవర్స్ యీ బేస్ నుంచి వెళ్లినవాడే. 1970లో దాన్ని మూసేశారు. బెలూచిస్తాన్‌లో ఒక ఎయిర్‌ఫీల్డ్‌ను అబూదాబీకి చెందిన ఒక రాచకుటుంబం 2001లో అద్దెకు తీసుకుని దాన్ని పాక్ అనుమతితో సిఐఏకు అద్దె (సబ్‌లీజ్) కిచ్చింది. అక్కడ చాలామంది అమెరికన్ మిలటరీ అధికారులు నివసిస్తూ అక్కణ్నుంచే డ్రోన్ ఆపరేషన్స్ నిర్వహించేవారు. వాటి వలన వివాదాలు రావడంతో 2011లో మూసేయాల్సి వచ్చింది. ఇలాటి స్థావరాలు యింకా ఉండేవి. ప్రస్తుతానికి పాక్‌లో మిలటరీ స్థావరాలు లేవంటున్నారు.
ఆ స్థావరాల ద్వారా అమెరికా, పాక్ కలిసి భారత్‌ను గమనిస్తూ, గూఢచర్యం జరుపుతూ వచ్చాయి. ఎందుకంటే భారత్ రష్యాతో సఖ్యంగా వుండేది. తర్వాతి రోజుల్లో రష్యన్ ఆధిపత్యంలో ఉన్న అఫ్గనిస్తాన్‌పై పోరాటం సాగించడానికి తాలిబన్లను తయారు చేయడంలో, తర్ఫీదు చేయడంలో పాక్ అమెరికాకు సహాయపడుతూ వచ్చింది. అందువలన అమెరికా భారత్, పాక్ వివాదాల్లో పాక్ పక్షమే వహిస్తూ వస్తుంది. ఇటీవల ట్రంప్ వచ్చిన తర్వాత పాక్‌కు సాయం కొద్దిగా తగ్గింది కానీ లేకపోతే అమెరికా ఎప్పుడూ సాయం చేస్తూనే వస్తోంది. ప్రజాస్వామ్యం గురించి, మతతత్వం గురించి, మానవహక్కుల గురించి లెక్చర్లు దంచే అమెరికాకు పాక్‌లో నడిచే సైనిక పాలన, మతఛాందసత్వం, మైనారిటీల పట్ల దౌర్జన్యం ఏవీ కంటికి ఆనవు. తన సలహాల కారణంగా బంగ్లాదేశ్ విడిపోయాక భుట్టో పాక్‌లో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పాలని ఆశించాడు. కానీ జియా ఉల్ హక్ అతన్ని ఉరి తీసి, దేశాన్ని సైనిక పాలనలోకి తెచ్చాడు. అతని హయాంలోనే ఆఫ్గాన్ ముజాహిదీన్ పేరుతో జిహాదీలను తయారు చేస్తూ పాక్‌ను ఉగ్రవాద కేంద్రంగా మార్చాడు. దాని కారణంగా యిరుగు పొరుగు దేశాలే కాదు, పాక్ కూడా నష్టపోతోంది.
పాత చరిత్రను పక్కకు పెట్టి, 1988 నుంచి పాలకులుగా ఉన్నవారి సంగతి చూడవచ్చు. ఎందుకంటే అప్పణ్నుంచి అధికారంలో ఉన్న పార్టీలే యిప్పుడూ ఎన్నికల రంగంలో ఉన్నాయి. 1988-90 మధ్య పిపిపికి చెందిన బేనజీర్ భుట్టో, 1990-93 మధ్య పిఎంఎల్-ఎన్‌కు చెందిన నవాజ్ షరీఫ్, 1993-96 మధ్య బేనజీర్, 1997-99 మధ్య నవాజ్ ప్రధానులుగా ఉన్నారు. 1999 అక్టోబరు నుంచి 2002 నవంబరు వరకు మార్షల్ లా అమల్లో ఉంది. ముషారఫ్ తను అధ్యక్షుడిగా ఉంటూ పాక్ ముస్లిమ్ లీగ్ (క్యూ) నాయకులను ప్రధానులుగా పెట్టాడు. 2008లో ముషారఫ్ దిగిపోయాక ఆ పార్టీ ప్రాముఖ్యత పోయింది. ఆ ఎన్నికలలో పిపిపి నెగ్గి, ఆ పార్టీ అధ్యక్షుడైన అసిఫ్ జర్దారీ తను అధ్యక్షుడై తన పార్టీకి చెందిన యూసఫ్ జిలాని, రజా ఆష్రఫ్‌లను ప్రధానులు చేశాడు. అధ్యక్షపాలన నడిచే రోజుల్లో మార్చేసిన రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడికి నేషనల్ అసెంబ్లీని రద్దు చేసే, ప్రధానిని తొలగించే అధికారం ఉంటుంది. సుప్రీం కోర్టు అనుమతి ఆమోదించాలనే చిన్న షరతు పెట్టారంతే. 2010లో చేసిన రాజ్యాంగ సవరణ అధ్యక్షుడి అధికారానికి కత్తెర వేశారు. అధ్యక్షుణ్ని ఎన్నుకునే అధికారం సెనేట్, నేషనల్ అసెంబ్లీకి యిచ్చారు.
2013 ఎన్నికలలో ఆ పార్టీ ఓడిపోయి, నవాజ్ నెగ్గి 2017 జులై వరకు ప్రధానిగా ఉన్నాడు. అతన్ని సుప్రీం కోర్టు అనర్హుడిగా ప్రకటించడంతో తను పదవి దిగిపోయి, తన పార్టీకే చెందిన షహీద్ అబ్బాసీకి పగ్గాలు అప్పగించాడు. అతను 10 నెలల పాటు అంటే 2018 మే వరకు ప్రధానిగా ఉన్నాడు. అతని పదవీకాలం 2018 మేలో ముగిసిపోయింది. ఎన్నికల ఫలితాలు వచ్చేవరకు పాక్ పాలనను ఆపద్ధర్మ ప్రభుత్వం చేతిలో పెట్టారు. నసీరుల్ ముల్క్ అనే రిటైర్డ్ జడ్జి ప్రధానిగా ఉన్నాడు. ఆరుగురు సభ్యుల కాబినెట్‌లో కొందరు వ్యాపారస్తులు, మరి కొందరు మాజీ ప్రభుత్వాధికారులు ఉన్నారు. ఇది ఈ ఆగస్టు 18న ఇమ్రాన్ ప్రధాని అయ్యేవరకు పాక్‌ను పాలించింది.
– ఎమ్బీయస్ ప్రసాద్ (సెప్టెంబరు 2018)
[email protected]