ఎమ్బీయస్: ఇమ్రాన్ పతనం వెనుక…

పాకిస్తాన్ ప్రధానిగా ఇమ్రాన్ భవితవ్యం రేపు అనగా ఏప్రిల్ 9న తేలిపోతుంది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు పార్లమెంటు(జాతీయ అసెంబ్లీ) సమావేశమై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టే అవిశ్వాసతీర్మానంపై చర్చిస్తుంది. దానిలో మెజారిటీ రాకపోతే ఇమ్రాన్ రాజీనామా…

పాకిస్తాన్ ప్రధానిగా ఇమ్రాన్ భవితవ్యం రేపు అనగా ఏప్రిల్ 9న తేలిపోతుంది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు పార్లమెంటు(జాతీయ అసెంబ్లీ) సమావేశమై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టే అవిశ్వాసతీర్మానంపై చర్చిస్తుంది. దానిలో మెజారిటీ రాకపోతే ఇమ్రాన్ రాజీనామా చేయవలసి ఉంటుంది. నిజానికి యీ చర్చ 3నే జరగాల్సి ఉంది. స్పీకరుగా ఉన్న అసద్ ఖైజర్ ఇమ్రాన్‌కు అనుకూలంగా గోల్‌మాల్ చేస్తాడనే భయంతో ప్రతిపక్షాలు మొదట అతనిపై అవిశ్వాసం నోటీసు యిచ్చాయి. దీన్ని ముందే ఊహించిన ఇమ్రాన్ డిప్యూటీ స్పీకరు ఖాసిం సురీని ఆ స్థానంలో కూర్చోబెట్టాడు. అతను అవిశ్వాస ప్రతిపాదనను ‘ప్రభుత్వాన్ని కూల్చేందుకు విదేశీశక్తులు పన్నిన కుట్ర’ అంటూ తిరస్కరించాడు. ఆ తర్వాత ఇమ్రాన్ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ జాతిని ఉద్దేశించి ప్రసంగించాడు. పార్లమెంటును రద్దు చేయమని, ఇమ్రాన్ దేశాధ్యక్షుడు ఆరిఫ్ అల్వీకి సూచించడం, అతను వెంటనే దాన్ని అమలు చేసి, ఇమ్రాన్ సూచించిన వ్యక్తిని ప్రధానిగా నియమిస్తానని, అప్పటివరకు 15 రోజుల పాటు ఇమ్రాన్‌ను ఆపద్ధర్మ ప్రధానిగా ఉండమని ఆదేశాలిచ్చేశాడు. అంతర్గత వ్యవహారాల మంత్రి 90 రోజుల్లో ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించాడు.

ఇది చెల్లదంటూ ప్రతిపక్షాలు సుప్రీం కోర్టుకి వెళితే చీఫ్ జస్టిస్ ఉమర్ ఆటా బందియాల్ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్మాన తిరస్కరణ, ఇమ్రాన్ సిఫారసూ రాజ్యంగవిరుద్ధమని తీర్పిచ్చి, 9న అవిశ్వాసతీర్మానంపై చర్చ జరగాలని ఆదేశించింది. దానిలో ఇమ్రాన్ పరిస్థితి ఎలా ఉంటుందో వేచి చూడనక్కరలేదు. పార్లమెంటును రద్దు చేయాలని సిఫార్సు చేసినప్పుడే అర్థమై పోయింది, అతనికి బలం లేదని! 342 మంది సభ్యులున్న పార్లమెంటులో మ్యాజిక్ ఫిగర్ 172. తమకు 177 మంది మద్దతుందని ప్రతిపక్షాలు చెప్పుకుంటున్నాయి. అవునో కాదో రేపు తెలుస్తుంది. ఇమ్రాన్ గద్దె దిగడం ఖాయమే అయినా, ఆ పరిస్థితి రావడానికి కారణం అమెరికాయే అని ఇమ్రాన్ చెప్తున్న మాట నమ్మవచ్చా అనేది చర్చించడానికే యీ వ్యాసం.

ఈ ఘట్టానికి దారి తీసిన సంఘటనలను ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఇమ్రాన్ పిటిఐ (పాకిస్తాన్ తెహరీక్ఎ ఇన్సాఫ్) అనే పార్టీని 1996లో పెట్టాడు. 2012 వరకు ఏదో రాజకీయాల్లో ఉన్నాడంటే ఉన్నాడు. కానీ అప్పుడు అతనికో ఛాన్సు వచ్చింది. అప్పటివరకు రాజకీయాల్లో స్టార్స్‌గా ఉన్నది నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పిఎంఎల్‌-ఎన్‌ (పాకిస్తాన్‌ ముస్లింలీగ్‌, నవాజ్‌) భుట్టో కుటుంబం నేతృత్వంలోని పిపిపి (పాకిస్తాన్‌ పీపుల్స్‌ పార్టీ). 1999లో ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌కు అధినేతగా ఉన్న పెర్వేజ్‌ ముషారఫ్ సైన్యం మద్దతుతో కుట్ర చేసి నవాజ్ షరీఫ్‌ను గద్దె దింపేసి, తనే పాలించాడు. కొన్నాళ్లకు ప్రజాగ్రహం తట్టుకోలేక, తప్పని పరిస్థితుల్లో 2008 ఎన్నికలకు ఒప్పుకున్నాడు. ప్రవాసంలో ఉన్న మాజీ ప్రధానులు షరీఫ్, బేనజీర్ భుట్టోలతో రాజీ పడి, 2007లో నేషనల్ రికన్సిలేషన్ ఆర్డినెన్స్ (ఎన్ఆర్ఓ) అని తెచ్చాడు. ఆ విధంగా షరీఫ్, భుట్టోలు తమపై ఉన్న అవినీతి ఆరోపణలపై విచారణకు మినహాయింపు తెచ్చుకున్నారు.

ఇది ఇమ్రాన్‌కు అస్త్రంగా మారింది. దొంగలుదొంగలు ఊళ్లు పంచుకున్నట్లుంది అన్నాడు. ఎన్నికలలో పాల్గొనడానికి 2007లో బేనజీర్‌ భుట్టో విదేశాల నుంచి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూండగా హత్య జరిగి, ఆ సింపతీతో ఆమె భర్త జర్దారీ 2008లో అధ్యక్షుడు అయ్యాడు. అవినీతికి పేరుబడ్డాడు. 2012 వచ్చేసరికి  అవినీతినే ప్రచారాస్త్రంగా మార్చుకున్న ఇమ్రాన్‌ ఎన్‌ఆర్‌ఓను ప్రశ్నించాడు. షరీఫ్, జర్దారీ యిద్దరూ దేశాన్ని కొల్లగొడుతున్నారని, తను అవినీతిరహితమైన కొత్త పాకిస్తాన్‌ను నిర్మిస్తానంటూ ‘నయా పాకిస్తాన్’ నినాదంతో ప్రజాభిమానాన్ని పొందాడు. 2013లో 35 సీట్లు గెలిచాడు. చివరకు 2018లో 149 గెలిచి ఆరు యితర పార్టీల మద్దతుతో పాక్‌కు 22వ ప్రధాని అయ్యాడు. షరీఫ్ అన్నా, భుట్టో కుటుంబమన్నా పడని సైన్యం అతని గెలుపుకి సహాయపడిందనేది బహిరంగ రహస్యం.

ఆ ఎన్నికలలో పిఎంఎల్-ఎన్ కు 82, పిపిపికి 54 వచ్చాయి. ఆజన్మవైరం ఉన్న ఆ పార్టీలు యిప్పుడు చేతులు కలిపి పాకిస్తాన్ డెమోక్రాటిక్ మూవ్‌మెంట్ (పిడిఎం) గా ఏర్పడ్డాయి. ఈ మధ్యలో వారి బలం 84, 56కి పెరిగింది. 15 సీట్ల ఎంఎంఏ, 4 సీట్ల బిఎన్‌పి, 5 సీట్ల బిఎపి వారికి తోడయ్యాయి. ఇవి 7 సీట్లతో ఇమ్రాన్‌ పార్టీ పిటిఐకు భాగస్వామిగా ఉంటూ వచ్చిన ఎంక్యూఎం-పి ని తమవైపు లాక్కున్నాయి. పైగా పిటిఐలోని 11 మంది వీళ్లతో చేతులు కలిపారంటున్నారు. మొత్తం మీద వీళ్లు తమకు 177 మంది మద్దతు ఉందంటున్నారు. ప్రభుత్వపక్షం వైపు పిటిఐకు 155, జిడిఏకు 3, ఎఎంఎల్1, బిఎపి 1, పిఎంఎల్ క్యూ4 మొత్తం 164. ఇరు పక్షాలూ కలిపి మొత్తం 341. ఎవళ్లు ఎటు ఓటేస్తారో రేపు తేలిపోతుంది.

రేపు ఇమ్రాన్ రాజీనామా చేసి, ప్రతిపక్షాలు అధికారంలోకి వచ్చినా, అందరూ కలిసి పని చేస్తారన్న నమ్మకమేమీ లేదు. వారిలో ఒకరికొకరికి పడదు. రాజకీయ అస్థిరత తప్పదు. అదృష్టం బాగుంటే త్వరలోనే ఎన్నికలు వస్తాయి, లేదా సైనిక పాలన రావచ్చు. అయినా ఇంత హఠాత్తుగా ప్రతిపక్షాలు ఇమ్రాన్ ప్రభుత్వానికి కూలదోయడానికి కారణమేమిటి అనేదే చర్చనీయాంశమైంది. ఇమ్రాన్ అవినీతికి పాల్పడ్డాడని ప్రతిపక్షాలు నోటిమాటగా అంటున్నా, దానికి గట్టి ఆధారాలేవీ చూపలేదు. అతని పాలనలో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైందని ఇప్పటి గణాంకాలు చూపుతున్నారు. వాటి ప్రకారం రెండేళ్లలో ద్రవ్యోల్బణం 12శాతానికి ఎగబాకింది. నిరుద్యోగం ప్రబలింది. ప్రపంచబ్యాంకు లెక్కల ప్రకారం విదేశీ ఋణం ఉన్న మొదటి పది దేశాలలో పాక్ ఒకటి. స్వదేశంలో ఉత్పాదక రంగం కుదేలవడంతో విదేశాల నుంచి తెచ్చిన అప్పులతోనే దేశం నడుస్తోంది. ఇవన్నీ నిజమే కానీ, ఇమ్రాన్‌కు ముందు పాక్ ఆర్థిక స్థితి ఏమైనా అమోఘంగా వుందా? పైగా రెండేళ్లగా కరోనా ప్రభావంతో ప్రపంచ దేశాలన్నీ కుదేలయ్యాయి. ఎల్లెడలా ఇన్‌ఫ్లేషన్ పెరిగింది.

అసలు కారణం ఏమిటంటే ఇమ్రాన్‌కు ఆర్మీ చీఫ్ ఖమర్ జావేద్ బాజ్వాతో చెడిందని గ్రహించి ప్రతిపక్షాలు నడుం బిగించాయి. ఐఎస్ఐ డైరక్టరు జనరల్ ఫాయిజ్ హమీద్‌ను మార్చినప్పటి నుంచి ప్రభుత్వంపై ఇమ్రాన్ పట్టు సడలిందంటున్నారు. సైన్యం ఇమ్రాన్‌ను దించాలని అనుకుంటూ వచ్చినా యిప్పటిదాకా దానికి అమెరికా మద్దతు లభించలేదు. కానీ ఇమ్రాన్ అమెరికాకు కోపం తెప్పించే పని ఒకటి చేశాడు. ప్రస్తుతం ఉక్రెయిన్ సంక్షోభంలో మరీ రెచ్చగొట్టాడు. దాంతో వేటు పడింది. ఇదీ ఇమ్రాన్ చెప్తున్న వెర్షన్. దీని ప్రకారం ఆఫ్గనిస్తాన్ నుంచి నిష్క్రమించాక అమెరికా పాకిస్తాన్‌లో ఒక సైనిక స్థావరాన్ని పెట్టుకోనివ్వమని పాక్ ప్రభుత్వాన్ని 2021 ఆగస్టులో కోరింది. దానికి ఇమ్రాన్ ఒప్పకోలేదు. అఫ్గనిస్తాన్‌పై పట్టు సాధించేందుకు అమెరికా ముషారఫ్, షరీఫ్ ప్రభుత్వాలను వాడుకుంది. ప్రతిపక్షనేతగా ఉండగా ఇమ్రాన్ యీ ముగ్గురినీ కూడా విమర్శించాడు. అది అమెరికా మర్చిపోలేదు. పాక్ సైన్యాన్ని గిల్లింది.

ఇలా వుండగా రష్యా, ఉక్రెయిన్‌పై దాడికి సంకల్పించింది. దశాబ్దాలుగా తన ఉప్పు తింటూ వచ్చిన పాక్ తనకు వంతపాడుతూ రష్యాను దుయ్యబడుతుందని ఆశించిన అమెరికాకు ఇమ్రాన్ ఆశాభంగం కలిగించాడు. పైగా రష్యా ఉక్రెయిన్‌పై దాడి ప్రారంభించిన ఫిబ్రవరి 24న అతను మాస్కోకి వెళ్లాడు. దాంతో అమెరికా భగ్గుమంది. తక్షణమే పదవి నుంచి తప్పించడానికి పాక్ సైన్యానికి పురమాయించింది. అది ప్రతిపక్షాలకు ఊతమిచ్చింది. దాని పర్యవసానమే యిది. దీనికి సాక్ష్యంగా ఇమ్రాన్ ఒక లేఖ చూపించాడు. ఇమ్రాన్ గద్దె దిగకపోతే పాక్‌కు కష్టాలు తప్పవని అమెరికా ఆ లేఖలో రాసిందని ఉందన్నాడు. పాక్ రాయబారి దాన్ని ఖండించానుకోండి. అమెరికా ప్రభుత్వంలోని సహాయమంత్రి డోనాల్డ్ లూ దీనిలో ప్రధానపాత్ర వహించినట్లు ఇమ్రాన్ అభియోగం.

పాకిస్తాన్ ఏర్పడినప్పటి నుంచి పాక్ సైన్యం, అమెరికా కలిసి పాలకులను మార్చివేసిన సంగతి గమనిస్తే ఇప్పుడు ఇమ్రాన్ చేస్తున్న అభియోగాలను అభూతకల్పనలని కొట్టిపారేయడం కష్టం. అవి నిజమైతే కావచ్చు. ఎందుకంటే టైమింగ్ అలాటిది. ఉక్రెయిన్ వ్యవహారంలో అమెరికా ధిక్కారమును సైతునా? అనే మోడ్‌లో ఉంది. తటస్థంగా ఉన్న ఇండియాపై కూడా చాలా ఒత్తిడి తెస్తోంది. అయినా ఇండియా లొంగకపోవడం ఇమ్రాన్‌ మెప్పుకు, అసూయకు కారణమైంది. ఇప్పుడతను అమరవీరుడి అవతారం ఎత్తాడు. పాక్ స్వతంత్ర విదేశాంగ విధానాన్ని నిలుపుకోవడానికి ప్రయత్నించినందునే తను ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వస్తోందని ప్రజలకు చెప్పుకుంటున్నాడు. అలా నిలుపుకునే వెసులుబాటు భారతదేశానికి ఉందని, పాక్‌కు లేదని వాపోయాడు. నిజం చెప్పాలంటే గత పాక్ పాలకులతో పోలిస్తే ఇమ్రాన్ ఇండియా పట్ల మరీ ద్వేషాన్ని ప్రదర్శించలేదు. ఏ కారణంగానైనా సరే ఇండియాను మెచ్చుకుంటే పాక్‌లో జరిగే రాజకీయ నష్టం తెలిసి కూడా అతనా సాహసాన్ని చేసినందుకు మెచ్చుకోవాలి.

చివరగా ఇమ్రాన్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే – అమెరికా ప్లస్ సైన్యం కారణంగా వచ్చాడు, వాళ్ల కారణంగానే వెళుతున్నాడు. అయితే పోతూపోతూ పాక్ ప్రజాస్వామ్యంలోని డొల్లతనాన్ని, అమెరికా కనుసన్నల్లో నడిచే దాని లోపభూయిష్టమైన విదేశాంగ విధానాన్ని బయటపెట్టి మరీ వెళుతున్నాడు. ఎన్నికలంటూ జరిగితే ప్రతిపక్షాలు యితన్ని దేశద్రోహిగా ఎలా చిత్రీకరించ గలుగుతాయో వేచి చూడాలి. అమెరికా ప్రయోజనాల కోసం అఫ్గనిస్తాన్‌ తాలిబాన్లను పాక్ పాలకులు సమర్థిస్తూ వచ్చినా, పాక్ ప్రజలు తాలిబాన్ టెర్రరిజం బాధితులే! ఇప్పుడు అమెరికా అఫ్గన్‌ను వదిలేసి వెళ్లిపోవడంతో పెచ్చుమీరిన తాలిబాన్ల వలన పాక్ నష్టపోతోంది కాబట్టి ప్రజల్లో అమెరికా పట్ల ఆగ్రహం ఉండవచ్చు. అది ఏ మేరకు ఉందో ఎన్నికలలో ఇమ్రాన్‌కు పడే ఓట్ల వలన తెలిసేందుకు అవకాశముంది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో కూడా 155 మంది పార్లమెంటు సభ్యులు ఇమ్రాన్ వెంటే ఉన్నారని యీ సందర్భంలో గమనించాలి.

– ఎమ్బీయస్ ప్రసాద్ (ఏప్రిల్ 2022)

[email protected]