పవన్ కళ్యాణ్‌కు రాజకీయతత్త్వం క్రమంగా బోధపడుతోంది. ఇన్నాళ్లూ టిడిపి సర్కారు గెస్టుగా వారి నీడలో సేదదీరుతూ, వాళ్లకు కాల్షీటు ఆర్టిస్టుగా వ్యవహరిస్తూ, జనసేవ చేస్తున్నట్లు కూడా పేరు తెచ్చేసుకుంటూ వెలిగిపోయాడు. ప్రజాసమస్య ఉన్నపుడు దాని గురించి మథన పడినట్లు కనబడేవాడు. మంత్రులు పంపిన చార్డెర్డ్ ఫ్లయిట్లలో వెళ్లి ప్రజల్లోకి వెళ్లి మాట్లాడి స్పందించేవాడు, అప్పుడు ఆవేశపడేవాడు, అభిమానులు కేరింతలు కొట్టే స్పీచి యిచ్చేవాడు, ప్రభుత్వాధినేతతో మాట్లాడి మీ కష్టాలు తీరుస్తానంటూ హామీ యిచ్చేవాడు. తర్వాత ప్రభుత్వాధినేతతో మాట్లాడేవాడు కూడా.
ఆయనేం చెప్పేవాడో, యీయనకేం అర్థమయ్యేదో కానీ హైదరాబాదు వచ్చేశాక 'అంతా సవ్యంగానే ఉంది. అనుభవజ్ఞులైన ముఖ్యమంత్రి సమస్య తీరుస్తారని నాకు గట్టిగా నమ్మకం కుదిరింది' అనేవాడు. మళ్లీ యింకో ఆర్నెల్లకు మేలుకొనేవాడు. దేని గురించైనా గట్టిగా అడిగితే 'దాని గురించి నా కంటె వాళ్లకే ఎక్కువ తెలుసు, నేను వాళ్లకు సమయం యిస్తున్నాను' అనేవాడు. 'ఈయనకు ప్రశ్నలకు సమాధానం యివ్వడం కాదు కదా, ప్రశ్నలడగడమే రాదు' అని జనాలకు గట్టిగా నమ్మకం కుదిరేలా ప్రవర్తించాడు.
కానీ తనవరకు ఏ యిబ్బందీ లేదు. హ్యేపీగా టిడిపి ఆదరణలో ప్రజానాయకుడిగా గుర్తింపు పొందుతూ వచ్చాడు. ఇప్పుడు టిడిపికి వ్యతిరేకమయ్యాడు. ఇప్పుడు తెలుస్తోంది ఘర్షణ కలిగించే వేడి ఏమిటో! స్నేహంలో ఏం మాట్లాడినా కుదురుతుంది, చెడితే శ్రీరామా అన్నా బూతే అవుతుంది. ఇక నిందలు మోపితే ఎలా ఉంటుంది? టిడిపి ఊరుకుంటుందా? తన అనుకూల మీడియా చేత ఒక ఆట ఆడిస్తోంది. పవన్ నిలదొక్కుకోగలడో లేదో నిగ్గు తేలేది ఇప్పుడే!
బిజెపికి, టిడిపికి చెడింది. అనూహ్యంగా పవన్ టిడిపికి, బాబుకి, లోకేశ్‌కు వ్యతిరేకంగా మాట్లాడాడు. మోదీని పెద్దగా విమర్శించటం లేదు. దానివలన బిజెపి పవన్ ద్వారా టిడిపిని యిరుకున పెట్టాలని చూస్తోందన్న వాదన బలంగా వినిపించింది. పవన్ పూర్తి రాజకీయనాయకుడి అవతారం ఎత్తడానికి సిద్ధమయ్యాడు. ఆ సమయంలో శ్రీరెడ్డి తిట్టింది. దానిపై గోల జరిగింది. వర్మ ముందుకు వచ్చి తనదే తప్పంతా అని ఒప్పుకున్నాడు. పవన్ టార్గెట్టు వర్మ కాదు, వర్మను తిరిగి తిట్టినా ఏ ప్రయోజనం లేదు. అతనేమీ చలించడు.
అతని సినిమాలను బహిష్కరించమని పిలుపు నివ్వడం దండగ. అలాటి పిలుపు లేకుండానే ప్రేక్షకులు వాటి జోలికి పోవటం లేదు. ఇప్పుడీ పిలుపు నిస్తే వర్మ ఫలానా సినిమా తీశాడని ఉచిత పబ్లిసిటీ జరిగి అతను లాభపడవచ్చు. అందువలన వర్మ వెనక్కాల టిడిపి వాళ్లున్నారంటూ ఆరోపణ చేశాడు. అంటే తనకు జరిగిన నష్టాన్ని రాజకీయంగా లబ్ధి కలిగేట్లా మలచుకున్నాడు. ఆశ్చర్యమేముంది? ఏ రాజకీయ నాయకుడైనా చేసేదదే. దానికి అవకాశం కల్పించింది ఎవరు? శ్రీరెడ్డి వ్యవహారం! శ్రీరెడ్డి చిన్న ఆర్టిస్టని అందరికీ తెలుసు.
ఆమెకు ఒక టీవీ ఛానెల్ అంత ప్రాధాన్యత యివ్వడం ఆశ్చర్యం కలిగించింది. మొదట్లో ఆ కార్యక్రమానికి పెద్దగా ఆదరణ లేదు. ఏదో తన కష్టాలు చెప్తోంది, అయినా సినిమారంగంలో యిదేమైనా కొత్త విషయమా? మొదటిసారి వింటున్నామా? అని ఊరుకున్నారు. శేఖర్ కమ్ములను నిందించినా ఆయన తప్ప తక్కిన సినిమావాళ్లూ స్పందించలేదు. జనరల్‌గా ఆమె చేస్తున్న వాదనను ఖండించేవారూ లేరు. అయినా టీవీ ఛానెల్ రోజుల తరబడి ఆమెను పిలుచుకుని వస్తూ వచ్చింది.
ఏ ఛానెలైనా వేరే ఎవరిపట్లయినా అంత ఉదారంగా ఉంటుందా? ఎవరూ చూడటం లేదండీ, మీరు చెప్పాల్సినది చెప్పేశారుగా యిక చాల్లెండి అనేసేస్తుంది. ఆమె చెప్పిన విషయాలే చెప్తూ ఉండటంతో చూడడం మానేశారని గ్రహించి, ఏదో ఒక రకమైన పబ్లిసిటీ రావాలని ఫిలిం ఛాంబర్ ముందు అర్ధనగ్న ప్రదర్శన జరిపించారు. (ఎవరు అన్నది ప్రస్తుతానికి తెలియరాలేదు) అభిరామ్ పేరు చెప్పించారు. సినిమారంగంలో పెద్ద కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో ఏదో ఒక చలనం వస్తుందని అందరూ అనుకుంటూన్న సమయంలో ఆ కుటుంబం గురించి ఆమె ఏమీ అనకుండా పవన్ పేరెత్తి తిట్టింది.
ఎవరైనా ప్రముఖుణ్ని తిడితే కత్తి మహేశ్‌కు వచ్చినట్లు ఫ్రీగా పబ్లిసిటీ వస్తుంది కాబట్టి పవన్‌ను తిట్టు అని నేనే చెప్పాను అని వర్మ చెప్పాడు. పవన్నే ఎందుకు తిట్టాలి? ప్రముఖుడు పవన్ ఒక్కడేనా? లేటెస్టుగా ఘోరమైన ఫ్లాప్ యిచ్చాడతను. సూపర్ హిట్ యిచ్చిన రామ్‌చరణ్‌ను తిట్టమనవచ్చుగా? ఇవ్వబోతున్న మహేశ్‌బాబును తిట్టమనవచ్చుగా? మరీ హైప్ వచ్చేది.
సినీరంగంలో ప్రఖ్యాతులైన నిర్మాతలు, దర్శకులు, హీరోయిన్లు, కారెక్టరు ఆర్టిస్టులు కూడా ఉన్నారుగా! సినీరంగమే ఎందుకు, సినీతారలను తమకోసం, యితరుల కోసం వాడుకుంటూ ఉండే రాజకీయ ప్రముఖుల పేర్లు కూడా చెప్పవచ్చుగా! పవన్ ఒక్కడి పేరే చెప్పమనడం దేనికి? పోలీసుల వద్దకు వెళ్లి కేసు ఫైల్ చేయమనే సలహా యివ్వడం చేతనేనా? అది అంత చేటు సలహా కాదే! ఎవరైనా అనే మాటేగా! ఈ ప్రశ్నకు వర్మ సరైన సమాధానం చెప్పలేరు. అందుకే ఆయన సూత్రధారి కాదేమో, పాత్రధారి మాత్రమేనేమో అన్న అనుమానాన్ని తోసిరాజనలేం.
అందువలన పవన్ దీని వెన లోకేశ్ ఉన్నాడని అంటే ఓహో అనుకుంటాం. దానికి ఆధారం చూపించలేకపోయాడు అంటే ఏ రాజకీయ నాయకుడైనా ఆధారాలు చూపిస్తున్నారా? ఆరేడేళ్లగా టిడిపి జగన్ లక్ష కోట్లు తిన్నాడని ఆరోపిస్తూ వచ్చింది. ఆధారాలు చూపించిందా? బాబుకి సింగపూరులో ఆస్తులున్నాయని వైసిపి ఆరోపణలు చేస్తూ వచ్చింది. ఆధారాలు చూపిందా? ఆధారాలుంటే కోర్టుకే వెళుదురు. కర్ణాకర్ణిగా విన్న వార్తలు కావడంతోనే ఆరోపణలు చేసేసి, కాదని రుజువు చేసుకోవాల్సిన బాధ్యత అవతలివాళ్లది అనుకుంటారు నాయకులు.
పవన్ మీద ప్రయోగించిన మాట మరీ అంత చెడ్డపదమేమీ కాదని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వాదించారు. అలాటప్పుడు దాన్ని తమ యూట్యూబ్ ఛానెల్లో మ్యూట్ ఎందుకు చేశారు? ఈ మాటను అన్ని ఛానళ్లూ మాటిమాటికీ ఎందుకు చూపించాయి? దాన్ని బట్టి అర్థమవుతోంది, ఆమె చాలా తీవ్రమైన పదం వాడిందని. ఆమె అభినయంలో కూడా అనౌచిత్యమేమీ కనబడలేదా వీళ్లకు? పవన్ నా వేలి ఉంగరంతో సమానం అనే అర్థంలో వేలు చూపించిందని సమర్థిస్తారా? పవన్ ఫ్యాన్స్ బూతులు ఉపయోగిస్తారు కాబట్టి మేమూ ఉపయోగిస్తాం అనడంలో అర్థమేమైనా ఉందా? కామెంట్లు రాసేవాళ్లు బూతులు వాడుతున్నారని వ్యాసకర్త కూడా బూతులు వాడతాడా? రోడ్డు మీద పిచ్చివాడు జిప్ తీసి తిరుగుతాడని మనమూ తిరుగుతామా? పవన్ ఎప్పుడైతే యీ కుట్రను బాబు తలకి చుట్టాడో, అప్పుడు పచ్చమీడియా తనేమిటో చూపించింది.
టిడిపి అభిమానిగా పవన్ ఉన్నంతకాలం అతని మీటింగుకు షామియానా వేసిన దగ్గర్నుంచి ప్రత్యక్ష ప్రసారం చేసిన టీవీలు టిడిపితో బంధాలు తెంపుకున్నాక అతనూ, మరి కొందరు నటులు ఫిలిం ఛాంబర్‌కి వెళ్లినా, అభిమానులు వీరంగం చేసినా కవర్ చేయలేదు. ఏప్రిల్ 20న రోజంతా బాబు భజనే. పూట నిరాహారదీక్షలు దేశంలో పూటకు వందమంది చేస్తారు. బాబు చేస్తే భూమి బద్దలయిందా? భువనం దద్దరిల్లిందా? హోదా వచ్చిందా? కనీసం హామీ వచ్చిందా? దాని కోసం అన్ని కార్యక్రమాలూ రద్దు చేసుకుని అదే చూపించాయి చాలా తెలుగు ఛానెళ్లు. నేను గమనించినంత వరకు 2,3 ఛానెళ్లు మాత్రమే కొంత కవరేజితో సరిపెట్టాయి.
తెలుగు టీవీ ఛానెళ్లు ఒక పార్టీకి, ఒక కులానికి మాత్రమే అనుకూలంగా పనిచేస్తాయని అంటే 'ఛ, అలా ఆలోచించడం మన కుసంస్కారం' అని అనుకునేవాళ్లు సైతం 'ఈ పరిశీలనలో నిజం ఉంది' అని అనుకునేట్లా చేశాయి ఆనాటి ఆ ఛానెళ్లు. పవన్ వ్యవహారం స్క్రోలింగులో కూడా చూపలేదు. తమకు అనుకూలంగా లేనివాళ్లను యివి ఎలా తొక్కివేస్తాయో ఆ రోజు కళ్లకు కట్టినట్లు చూపారు. ఆ దీక్ష అయిపోయిన మర్నాడు ఆంధ్రజ్యోతి టీవీ చర్చ పెట్టింది. దానిలో 'రేపు' నరసింహారావుగారు చెలరేగిపోయారు. పవన్‌ను తిట్టని తిట్టు లేదు, మానసిక రోగి అన్నాడు, మరోటన్నాడు.
టిడిపికి వ్యతిరేకంగా ఉన్నవాళ్లందరి మానసిక విశ్లేషణ చేసి, వాళ్లను రోగులుగా తేల్చడం ఆయన వృత్తి. సోనియాను చేశాడు, వైయస్‌ను చేశాడు, జగన్‌ను చేశాడు, టిడిపితో విడిపోయాక మోదీని చేశాడు, యిప్పుడు పవన్‌ను చేశాడు. టిడిపిని తప్పుపట్టిన వాళ్లందరూ మతిస్థిమితం లేనివాళ్లగా ఆయన వద్ద సర్టిఫికెట్టు పొందుతారు. ఆయన అంతటితో ఆగలేదు, పవన్ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు రావన్నాడు, వాళ్ల మానసిక విశ్లేషణ కూడా చేసేశాడేమో మరి. అభిమాన సంఘాలు చట్టవిరుద్ధమైనవన్నాడు. వాటిని రద్దు చేయాలన్నాడు. ఎన్టీయార్ అభిమాన సంఘాల మద్దతుతో అధికారంలోకి వచ్చిన టిడిపిని వీపున మోస్తూన్న యీయన అభిమాన సంఘాల గురించి యిలా ఎలా అంటాడో తెలియదు.
బాలకృష్ణ అభిమాన సంఘాలు అతని సినిమా రిలీజు రోజున ఎనుబోతును బలియిచ్చిన రోజున యీ సలహా యివ్వలేదేం యీయన? ఫలానా వారి వ్యాఖ్యల వలన నా పరువు పోయింని రాధాకృష్ణలా కేసు పెట్టడం అనేక సందర్భాల్లో జరుగుతుంది. కేసు పర్యవసానం తేలేటప్పటికి ఏళ్లూ, పూళ్లూ పట్టవచ్చు. అయితే యీ లోపున తన ఛానెల్లో సమీక్ష పేర యిలా తిట్టించడానికి వీళ్లకేం హక్కుంది? ఛానెలు చేతిలో లేని మన బోటి వాళ్లకు యీ అడ్వాంటేజి లేదు కదా. మీడియా తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందంటే యిదే మరి!
మీడియాని అంటే మీడియా యాజమాన్యాన్ని అన్నట్లే. ఏదైనా పత్రికలో అభ్యంతరకరమైన రచన ప్రచురింపబడినప్పుడు ఆ వ్యాసరచయిత పేరు బయటకు చెప్పినప్పుడు అతనూ, సంపాదకుడు, ప్రచురణకర్తా బాధ్యులు, నిందితులు అవుతారు. విడిగా రచయిత పేరు ప్రస్తావించకుండా ఫలానా టీవీ, ఫలానా పత్రిక అంటే ప్రచురణకర్త, సంపాదకుడు మాత్రమే బాధ్యులు. వాళ్లని అంటే జర్నలిస్టులు ఫీలై పోవడం దేనికో నాకు అర్థం కాలేదు. వాళ్లు ఉద్యోగులు, ఏ టీవీలో పనిచేస్తూ ఉంటే దాని యాజమాన్యానికి అనుగుణంగా వార్తలు, వ్యాఖ్యలు రాయవలసినవారు.
పవన్ మమ్మల్ని ఏదో అనేశాడంటూ వాళ్లు రోడ్డెక్కడం వింతగా లేదా? విజయ్ మాల్యా బ్యాంకులను మోసం చేసి విదేశాలకు పారిపోయాడు అంటే అతని సంస్థల ఉద్యోగులందరూ నిరసనలు తెలిపారా? చందా కొచ్చర్ అవకతవకలకు పాల్పడింది అని వార్త వస్తే ఐసిఐసిఐ ఉద్యోగులు రోడ్డు ఎక్కారా? ఎవరైనా జర్నలిస్టు ప్రత్యేకంగా యిన్వాల్వ్ అయిన చోట (మహాటీవీ మూర్తి లాగ) కేసులో వారి పేరు ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. ట్విట్టర్లో జర్నలిస్టుల పేర్లు వచ్చాయా? టీవీ యజమానుల పేర్లు వచ్చాయా? నేను పవన్ ట్వీట్లను సమర్థించటం లేదు.
చాలా వింతవింత పుంతలు తొక్కుతోంది అతని ధోరణి. లోకేశ్‌పై ఆరోపణలు చేసినపుడు వెనక్కాల అమిత్ షా మద్దతుతో పాటు ప్లానింగూ ఉందనుకున్నాను. కానీ పవన్‌ను చూస్తే అమెచ్యూరిష్ వ్యవహారంగా ఉంది. అతన్ని బెదరగొట్టిన ఘనత మాత్రం తెలుగు మీడియాదే. పచ్చ మీడియా కచ్చ కడితే ఎలా ఉంటుందో తెలిసేందుకు యిది వెల్కమ్ డ్రింక్ లాటిదే. అసలు విందు ముందుంది.
మొన్నటిదాకా పవన్‌ను జగన్‌ను తెగ విమర్శించాడు. హోదా గురించి, ప్రజాసమస్యల గురించి అధికారంలో ఉన్న బిజెపి, టిడిపి ఏం చేశాయని అడగని పవన్ మాటిమాటికీ ప్రతిపక్ష నాయకుడు ఏం చేశాడని అడుగుతూ వచ్చాడు. టిడిపిని కాస్త గిల్లినందుకే యిన్ని పాట్లు పడవలసి వస్తోంది కదా, టిడిపికి పీడకలగా ఉన్న జగన్ యింకెన్ని అపనిందలు, అవమానాలు, అఘాయిత్యాలకు గురై ఉంటాడో పవన్‌కి యిప్పటికైనా బోధపడి ఉండాలి. అయినా జంకకుండా ముందుకు సాగుతున్న అతని పోరాటస్ఫూర్తిని మనసులోనైనా అభినందించాలి.
సాక్షి, విశాలాంధ్ర, ఆర్గనైజర్ వంటి పత్రికలు తమ రాజకీయ లక్ష్యాలను తేటతెల్లంగా చెప్పేసుకుంటాయి. కానీ కొన్ని పత్రికలు, టీవీ ఛానెళ్లు స్వతంత్ర సంస్థలనే ముసుగులో మిస్‌యిన్‌ఫర్మేషన్, డిస్ఇన్ఫర్మేషన్ సరఫరా చేస్తూంటాయి. మొన్నటిదాకా మోదీని ఆకాశానికి ఎత్తిన తెలుగు మీడియా టిడిపితో చెడిపోయిన తర్వాత మోదీని ఎంత తిడుతున్నాయో చూస్తున్నాం. కర్ణాటకలో బిజెపి ఓటమి ఖాయం అనే వార్తలు పుంఖానుపుంఖాలుగా వెలువరిస్తున్నాయి. టిడిపితో యింకా అంటకాగుతూ ఉంటే కథనాలు మరోలా ఉండేవి.
మీడియాయే కాదు, సోషల్ మీడియా కూడా హఠాత్తుగా రంగు మార్చుకుంది. మోదీని తిడుతూ, వెక్కిరిస్తూ ఎన్ని వాట్సప్‌లు వచ్చిపడుతున్నాయో! టివి 5 వంటి ఛానెళ్లలో యాంకర్లు ఉదయపు చర్చాకార్యక్రమాల్లో పాల్గొనే బిజెపి నాయకులను హోదా గురించి నిలదీస్తూన్నారు. వాళ్లేం మాట్లాడబోయినా, 'ఓహో అందుకేనా హోదా యివ్వలేదు?' అంటూ వెక్కిరిస్తున్నారు. గత నాలుగేళ్లగా యిలాటి వెక్కిరింపులేవీ లేవే! హోదా గురించి టిడిపి గప్‌చుప్‌గా ఉన్నంతకాలం వీళ్లూ గప్‌చుప్. వాళ్లు లేస్తేనే వీళ్లూ లేస్తారు. ఇది యాంకరు సొంత ప్రతాపం కాదు, యాజమాన్యపు నిర్ణయం.
పవన్ యిప్పుడు ప్రతికూల వాతావరణాన్ని ఎదుర్కుంటున్నాడు. ఇది సినిమా స్క్రిప్టు ప్రకారం నడిచే వ్యవహారం కాదు కాబట్టి హీరో గెలిచి తీరతాడన్న నమ్మకం లేదు. కంటకప్రాయమైన రాజకీయపథంలో క్లిష్ట పరిస్థితులు వచ్చినపుడు మాత్రమే నాయకత్వ పటిమ బయటపడుతుంది. దీన్ని పవన్ ఎలా హేండిల్ చేస్తాడో వేచి చూడాలి. ఒక్కటి మాత్రం నిజం. అతను సంయమనంతో వ్యవహరించక పోవడం తటస్థులకు నచ్చకపోవచ్చు. కానీ అభిమానులకు అటువంటి ఎక్సెంట్రిసిటీయే నచ్చుతుంది. ఎన్టీయార్ హావభావాలు, నాటకీయత, విపరీత ఆలోచనలు, ఛాందసం – అన్నీ మేధావులనుకునే పాత్రికేయులకు, కార్టూనిస్టులకు వేలంవెర్రిగా తోచి వ్యతిరేకంగా ఉండేవారు. కానీ అవే అభిమానులను వెర్రెక్కించాయి.
డ్రామారావు అని కాంగ్రెసు వాళ్లు వెక్కిరించినా, సోబర్‌గా ఉండే విజయభాస్కర్ రెడ్డిని కాదని తెలుగు ప్రజలు రామారావుని ముఖ్యమంత్రి చేశారు. పవన్ యిప్పుడు ట్వీట్లతో గందరగోళం చేస్తున్నట్లే, ఎన్టీయార్ కూడా రాజకీయప్రవేశం చేసిన తొలి రోజుల్లో గందరగోళంగా, తికమకగా కామెంట్లు చేసి విమర్శల పాలయ్యారు. ఒక తీవ్రమైన తెలివితక్కువ వ్యాఖ్య చేసినప్పుడు 'దుర్యోధనుడు మయసభలో ప్రవేశించి జారిపడినట్లుంది' అని కాంగ్రెసు వారు వెక్కిరించారు కూడా. అయినా అభిమానులు పట్టించుకోలేదు.
చూడబోతే కాస్త ఎక్సెన్ట్రిక్గా ఉన్నవాళ్లంటేనే మోజుంటుందేమో. చిరంజీవి ప్రజారాజ్యం పెట్టినపుడు హుందాగా ప్రసంగాలు చేసేవారు. పవన్ ఆవేశంగా పంచెలూడగొట్టండి మార్కు ఉపన్యాసాలిచ్చేవాడు. చిరంజీవి కంటె పవన్ సభలకే ఎక్కువమంది జనం వచ్చారు. పవన్ యిప్పటి తీవ్రావేశం ఓటర్లను ఆకర్షిస్తుందో, విముఖులను చేస్తుందో ఎటూ చెప్పలేం. పైగా పవన్ పట్ల పచ్చ మీడియా కత్తి కట్టి విలన్‌గా చూపించిన కొద్దీ అతని అభిమానులకు, కులస్తులకు అతనిపై సానుభూతి పెరగడం ఖాయం. మొన్నటిదాకా మీరు ఆడించినట్లు ఆడినందుకు యిదా ఫలం? అని వారూ అనుకుంటారు. 'అతి చేస్తే గతి చెడుతుంది' అని మీడియా మోతుబర్లు కూడా గుర్తించాలి.
– ఎమ్బీయస్ ప్రసాద్
[email protected]