పీయూష్ గోయల్ నేపథ్యం

ఇటీవల రెండు తెలుగురాష్ట్రాల దృష్టిని ఆకర్షించిన కేంద్ర కాబినెట్ మంత్రి పీయూష్ గోయల్. ‘‘తన రాష్ట్రంలో విద్యుత్ కొరత గురించి తెలంగాణ ముఖ్యమంత్రి నా దగ్గరకు వచ్చి అడగలేదే, బహుశా ఆయనకు తీరిక లేదేమో..’…

ఇటీవల రెండు తెలుగురాష్ట్రాల దృష్టిని ఆకర్షించిన కేంద్ర కాబినెట్ మంత్రి పీయూష్ గోయల్. ‘‘తన రాష్ట్రంలో విద్యుత్ కొరత గురించి తెలంగాణ ముఖ్యమంత్రి నా దగ్గరకు వచ్చి అడగలేదే, బహుశా ఆయనకు తీరిక లేదేమో..’ అనే ప్రకటన కేసీఆర్ తక్షణం ఢిల్లీ రప్పించి, అతనితో మాట్లాడేలా చేసింది. ‘‘చంద్రబాబు నాయుడుకి మంచి దూరదృష్టి వుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విద్యుత్ విషయంలో అన్ని రకాలుగా సహకరిస్తాం.’’ అని ప్రకటన చేసి ‘పీయూష్ ఆంధ్ర పక్షపాతి’ అని తెలంగాణ నాయకుల విమర్శలు పోగేసుకున్న వ్యక్తి కూడా పీయూషే! అతి ముఖ్యమైన పవర్, కోల్, రిన్యూవబుల్ ఎనర్జీ శాఖలను చూస్తున్న పీయూష్ తండ్రి వేదప్రకాశ్ గోయల్ వాజపేయికి అనుచరుడు, ఆయన కాబినెట్‌లో షిప్పింగ్ మంత్రి. పీయూష్ తల్లి చంద్రకాంత ముంబయినుండి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైంది. పీయూష్ కూడా తండ్రిలాగే యువకుడిగా వుండగానే బిజెపిలో చేరి వాజపేయి దృష్టి ఆకర్షించాడు. తండ్రిలాగే ఆ పార్టీకి కోశాధికారిగా వ్యవహరించాడు. ఈ రోజు మంత్రి అయ్యాడు. పీయూష్ చార్టెర్డ్ ఎక్కౌంటెన్సీ పరీక్ష సెకండ్ ర్యాంక్‌తో పాసయ్యాడు, లాయరుగా, మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్‌గా, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్‌గా పనిచేశాడు. బ్యాంక్ ఆఫ్ బడోదా, స్టేటు బ్యాంక్ ఆఫ్ ఇండియా బోర్డుల్లో నామినేటెడ్ మెంబరుగా వున్నాడు. యేల్ యూనివర్శిటీ, ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ, ప్రిన్స్‌టన్ యూనివర్శిటీలలో 2011-13 మధ్య లీడర్‌షిప్ ప్రోగ్రాంలకు హాజరయ్యాడు. ప్రస్తుతం హార్వార్డ్ బిజినెస్ స్కూలు ద్వారా ఒపిఎమ్ కోర్సు (ఓనర్/ప్రెసిడెంట్ మేనేజ్‌మెంట్) చదువుతున్నాడు. పీయూష్ కుమారుడు ధృవ్ హార్వార్డ్ యూనివర్శిటీలో ఆర్ట్‌స్ డిగ్రీ చేస్తున్నాడు, కూతురు రాధిక లండన్‌లో వెస్ట్‌మినిస్టర్ స్కూలులో చదువుతోంది. 

మోడీ అతన్ని తొలిసారి మంత్రిగా చేస్తూనే అతిముఖ్యమైన శాఖలు అప్పగించాడు. ఇతను 27 ఏళ్ల ఉత్సవ్ మిత్రాను ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా వేసుకున్నాడు. ఉత్సవ్ శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్‌లో చదివాడు, బెన్ కాపిటల్‌లో ప్రయివేటు ఈక్విటీ ఎనలిస్టుగా, మెకన్సీ, ముంబయిలో ఎనలిస్టుగా పని చేశాడు. ప్రస్తుతం ఫైళ్లన్నీ అతని ద్వారానే మంత్రికి చేరుతున్నాయి. పీయూష్ వచ్చినప్పటినుండి పరుగులు పెడుతున్నాడు, అధికార్ల చేత పరుగులు పెట్టిస్తున్నాడు. కోల్ మినిస్ట్రీ లోని 450 మంది అధికారులను చేతన్ భగత్ నిర్వహించే మోటివేషన్ సెషన్‌కు హాజరు కావాల్సిందని ఆదేశాలు జారీ చేశాడు. పవర్ శాఖలో అధికారులను వెంటబెట్టుకుని వారం రోజులపాటు గుజరాత్ పర్యటించి అక్కడ విద్యుత్ పరిస్థితి అధ్యయనం చేయించాడు. పంజాబ్, మహారాష్ట్ర, కశ్మీర్ వెళ్లి పవర్ ప్రాజెక్టులు ప్రారంభించి వచ్చాడు. గుజరాత్, రాజస్థాన్, కర్ణాటకలలో విండ్, సోలార్ పవర్ ప్రాజెక్టులు సాధించిన విజయాలను గమనిస్తున్నాడు. త్వరలో ఎన్నికలు జరగబోతున్న పంజాబ్, ఝార్‌ఖండ్‌లలో అనేక హైడ్రో ఎలక్ట్రిక్, రిన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టులు ప్రకటించాడు. భేషజాలకు పోకుండా విషయం తెలిసిన ఇలాంటి మంత్రితో తెలివిగా వ్యవహరిస్తే తెలుగు రాష్ట్రాలు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలకు పరిష్కారమార్గం తప్పక దొరుకుతుంది. 

-ఎమ్బీయస్‌ ప్రసాద్

[email protected]