కురుక్షేత్రంలో జరిగిన మహాభారత యుద్ధం భరతఖండంలోని పలు దేశాల రాజులందరూ పాల్గొన్న చాలా పెద్ద యుద్ధం. 18 అక్షౌహిణుల సైన్యం యుద్ధంలో పాలుపంచుకుంది. చాలాభాగం నాశనమైంది. ఇటువంటి యుద్ధం అనేక విధాల అనర్థానికి దారి తీస్తుందనే స్పృహ అందరికీ ఉంది. అందుకని దాన్ని నివారించడానికి రాజీ ప్రయత్నాలు, రాయబారాలు జరిగాయి. రాయబారం అనగానే మనందరికీ కృష్ణరాయబారమే గుర్తుకు వస్తుంది. కానీ దానికి ముందు రెండు రాయబారాలు జరిగాయి. ఆ రాయబారాలలో ఎవరు ఎలా ప్రవర్తించారు అనేది చెప్పడమే యీ వ్యాసం ఉద్దేశం. రాజకీయాలను అవగాహన చేసుకోవడానికి భారతపఠనం అత్యావశ్యకం. రాయబారిగా వెళ్లినవాడు ఏదో పాఠం అప్పచెప్పినట్లు సందేశం వినిపించి వచ్చేయకూడదు. అనేక విషయాలు గ్రహించి రావాలి. వీలైతే ఎదుటివాళ్లలో విభేదాలు కల్పించి రావాలి. అవన్నీ యీ ఘట్టాలలో బాగా తెలుస్తాయి. అందుకే వీటిపై ఫోకస్.
భారతంలో ఉద్యోగపర్వం అని ఉంది. చిన్నపుడు ఆ పర్వంలో విరాటరాజు కొలువులో పాండవులు ఉద్యోగం చేశారు కాబట్టి ఆ కథ ఉంటుంది కాబోలు అనుకునేవాణ్ని. కానీ తర్వాత దానికై విరాటపర్వం ఉందని తెలిసింది. మరి యిదేమిటి? ఇది తెలుగు ఉద్యోగం కాదు, సంస్కృత ఉద్యోగం. ప్రయత్నం అని అర్థం. ఈ ప్రయత్నం సంధికా? సమరానికా? రెండిటికీ అనుకోవాలి. స్పీకింగ్ ఫ్రమ్ స్ట్రెంగ్త్ అన్నట్లు సమరానికి సకల సన్నద్ధాలు చేసుకుని, అప్పుడు సంధికి ప్రయత్నిస్తే అవతలివాడు మన మాట మన్నిస్తాడు. అందుకని ఓ పక్క సైన్యం సమీకరించుకుంటూనే, అనవసరంగా యుద్ధం చేశారు అనే లోకాపనింద రాకుండా సంధి ప్రయత్నాలు జరిగాయి.
తిరుపతి వెంకటకవులు భారత కథను పాండవ జననం, పాండవ ప్రవాసం, పాండవ రాజసూయం, పాండవోద్యోగం, పాండవ విజయం, పాండవ అశ్వమేధం అనే నాటకాలుగా రాస్తే వాటిలో 4,5 నాటకాలు బాగా ప్రాచుర్యం పొందాయి. కొన్నాళ్లకు రెండిటిని కలిపి ‘పాండవోద్యోగవిజయాలు’ పేరు మీద నాటకం వేసేవారు. మరి కొన్నాళ్లకు ‘‘కురుక్షేత్రం’’ పేరు మీద నాటకం ఆడేవారు. దానిలోనే పద్యాలు విపరీతంగా ఫేమస్ కావడంతో మనకు రాయబారం అంటే కృష్ణ రాయబారం ఒక్కటే గుర్తుండిపోయింది. కానీ మొదటి రాయబారం ద్రుపద పురోహితుడిది. ఈయన పేరు మహాభారతంలో రాయలేదు.
పాండవుల అజ్ఞాతవాసానంతరం, అభిమన్యుడు-ఉత్తర వివాహం అయ్యాక, విరాటరాజు సభలో పెళ్లి పేరుతో పిలిచిన రాజులందరి సమక్షంలో శ్రీకృష్ణుడు రాయబార ప్రస్తావన చేశాడు. ‘కౌరవులు అధర్మజూదం ఆడినా, పాండవులు ధర్మానికి కట్టుబడి, కష్టనష్టాల కోర్చి అరణ్యవాసం, అజ్ఞాతవాసం పూర్తి చేశారు కాబట్టి ధృతరాష్ట్రుడు వారి రాజ్యభాగాన్ని వారికి యివ్వాలి. ఇవ్వకపోతే పాండవులు యుద్ధం ప్రకటించగలరు. దుర్యోధనుడూ యుద్ధానికి సరేనంటాడు. రాజలోకం అటూ, యిటూ చేరక తప్పదు. జననాశనాన్ని నివారించడానికై మనం ఒక మనిషిని దుర్యోధనుడి వద్దకు పంపి అతని అభిప్రాయాన్ని తెలుసుకుంటే మంచిది’ అన్నాడు. అతని అన్నగారు బలరాముడు ‘ఔను, ఎవరినైనా పంపితే మంచిది. అయితే వెళ్లినవాడు అధర్మజూదం ఆడారు లాటి మాటలు వాడకుండా ఉండాలి’ అన్నాడు.
కృష్ణుడి సహచరుడు సాత్యకి బలరాముడిపై విరుచుకుని పడ్డాడు. ‘కౌరవులు ఆడినది కపటజూదమే. ఇప్పటికైనా ధృతరాష్ట్రుడు అర్ధరాజ్యాన్ని ధర్మరాజుకి యివ్వాలి. ఇవ్వకపోతే దూతను పంపనవసరమే లేదు. రాజ్యం వీరభోజ్యం కాబట్టి, పాండవులు కౌరవులపై యుద్ధం చేసి రాజ్యాన్ని సంపాదించాలి’ అన్నాడు. ద్రుపదుడు సాత్యకి మాటల్ని బలపర్చాడు. దాంతో పాటు యింకో సూచన చేశాడు. సహజంగా రాజులు తమను ఎవరు ముందు కోరితే వారికి సాయపడతారు కాబట్టి, శల్య, కేకేయ, ధృష్టకేతు, జరాసంధసుతులను మనవైపు తిప్పుకోవడానికి తగిన వ్యక్తులను పంపాలి అన్నాడు. ‘దుర్యోధనుడు యీపాటికి ఆ పని మొదలుపెట్టేసి ఉంటాడు’ అన్నాడు సాత్యకి. దూతగా ఎవర్ని పంపాలో ద్రుపదుడే చూసుకుంటాడు, మనం యిప్పుడు మనమన నగరాలకు వెళదాం అన్నాడు కృష్ణుడు.
ఆ తర్వాత ద్రుపదుడు తన పురోహితుణ్ని పిలిచి ‘రాయబారిగా వెళ్లేవాడు పంపేవారి హితాన్ని కోరినవాడై ఉండాలి, బుద్ధి, మాట్లాడే నేర్పు, సమయస్ఫూర్తి, ఇంగితజ్ఞానం కలిగి వుండాలి. ధృతరాష్ట్రుడు కుటిలుడు, కొడుకు మాట కాదనలేడు కాబట్టి నువ్వు సభలో నేరుగా అర్ధరాజ్యం అడిగితే అక్కడ కొందరు తిరగబడే ప్రమాదం ఉంది. నీవు ముందుగా పాండవుల ధర్మగుణాన్ని ప్రశంసించి భీష్మద్రోణాదులు, పండితులు, వృద్ధుల దృష్టి పాండవులపై ఉండేట్లు చేయాలి. ఆ తర్వాతే కౌరవసభలో పాండవులు వీరోచితంగా రాజ్యభాగాన్ని అడిగినట్లు మాట్లాడాలి. నీ మాటల వలన కురుసభలో భిన్నాభిప్రాయాలు ఏర్పడి, కొందరు యోధులు యుద్ధానికి విముఖులు అవుతారు. వారిని ఒక తాటిపైకి తేవడంలో దుర్యోధనుడికి సమయం పడుతుంది. ఈ లోపున పాండవులు ఏకాగ్రచిత్తంతో యుద్ధానికి ఏర్పాట్లు చేసుకుంటారు.’ అన్నాడు.
అతను హస్తినకు వెళ్లిన తర్వాత పాండవులు రాజులందరికీ కబురు పెట్టి, యుద్ధంలో సాయపడమని కోరారు. కృష్ణుడి సాయం అడగడానికి అర్జునుడు స్వయంగా వెళ్లాడు. ఆ సంగతి చారుల ద్వారా తెలుసుకుని దుర్యోధనుడు కూడా ద్వారకకు వెళ్లాడు. ఆ ఘట్టం అందరికీ తెలుసు కాబట్టి యిక్కడ విపులంగా రాయటం లేదు. కౌరవులు, పాండవులు శాంతికై ప్రయత్నం చేస్తున్నట్లు కనబడుతూనే బలసమీకరణలో పడ్డారు. నకుల సహదేవుల మేనమామ శల్యుణ్ని మెప్పించి దుర్యోధనుడు తనవైపు తిప్పుకోవడం యిక్కడే జరుగుతుంది. పాండవుల వైపు చేరిన రాజుల్లో జరాసంధుడి కొడుకు జయత్సేనుడు, సముద్రద్వీప వాసులతో సహా వచ్చిన పాండ్యరాజు, చేదిరాజు ధృష్టకేతువు, యాదవరాజు సాత్యకి, విరాటుడు, ద్రుపదుడు మొదలైనవారు ఉన్నారు. మొత్తం ఏడు అక్షౌహిణుల సైన్యం అయింది.
కౌరవుల వైపు చేరినవారిలో భోజరాజు కృతవర్మ, భగదత్తుడు, భూరిశ్రవుడు, జయద్రథుడు, యవనులతో, శకులతో కలిసి వచ్చిన కాంభోజరాజు సుదక్షిణుడు, దక్షిణ దేశస్థులతో వచ్చిన మాహిష్మతీరాజు నీలుడు, అవంతి రాజులైన విందానువిందులు, ఐదుగురు కేకయ రాజులు, అంబష్ఠ, త్రిగర్త, యాదవసైన్యం ఉన్నారు. మొత్తం 11 అక్షౌహిణిల సైన్యం అయింది. అదంతా హస్తినకు చేరింది. రాయబారిగా వచ్చానంటూనే ద్రుపద పురోహితుడు కౌరవ సైన్యసంపదను గమనించి, వారి వివరాలను ద్రుపదుడికి చేరవేశాడు.
సభలో మాట్లాడుతూ ‘దుర్యోధనుడి దుండగాలను ధృతరాష్ట్రుడు చూసీచూడనట్లు ఉపేక్షించాడు. రాజ్యాన్ని సమానంగా అనుభవించే హక్కు కురుపాండవుల కుంది. జననాశన హేతువైన యుద్ధం పాండవుల కిష్టం లేదు. అలా అని వారికి భయమూ లేదు. వారి వైపు ఉన్న యోధుల సంగతి మీకందరికీ తెలుసు. పాండవులను పిలిచి, వారి రాజ్యభాగాన్ని వారికి అప్పగించడం మేలు.’ అని చెప్పాడు. అది విని భీష్ముడు ‘బ్రాహ్మణస్వాభావికమైన పరుషపు మాటలు పలికినప్పటికీ ద్రుపద పురోహితుడు సత్యమే పలికాడు. అలా చేస్తే మంచిది.’ అన్నాడు. దానిపై కర్ణుడికి కోపం వచ్చింది. ‘జూదం కపటం కాదు. యుద్ధం పేరు చెప్పి భయపెడితే దుర్యోధనుడు సగం కాదు కదా, పావు రాజ్యం కూడా యివ్వడు. అసలు అజ్ఞాతవాస సమయం పూర్తి కాకుండానే పాండవులు దొరికిపోయారు కాబట్టి వాళ్లు మళ్లీ వనవాసానికి వెళ్లాలి.’ అన్నాడు.
భీష్ముడికి కోపం వచ్చింది. ‘ఉత్తరగోగ్రహణం సమయంలోనే చెప్పాను, పాండవుల సమయం పూర్తయిందని. ఆనాడు అర్జునుడు ఆరుగురు రథికులను బాణాలతో జయిస్తే యివాళ నువ్వు సభలో అర్జునుణ్ని వాగ్బాణాలతో జయిస్తున్నావు. ఈ పురోహితుడు చెప్పినట్లు చేయకపోతే మనమంతా యుద్ధంలో అర్జునుడి చేతిలో దెబ్బలు తిని, మట్టి కరుస్తాం.’ అని ఎత్తిపొడిచాడు. తమ మధ్య విభేదాలు అవతలివాళ్లకు తెలిసే ప్రమాదం ఉందని గ్రహించిన ధృతరాష్ట్రుడు కలగజేసుకుని, భీష్ముని అనునయించి, కర్ణుడిని నివారించి, రాయబారితో ‘నేను బంధుమిత్రులతో, పెద్దలతో ఆలోచించి పాండవుల దగ్గరకు ఒక సౌమ్యుణ్ని పంపుతాను.’ అని అతనికి కానుకలు యిచ్చి పంపేశాడు. ఆ తర్వాత తన రథసారథి, వ్యాసుడి శిష్యుడు ఐన సంజయుణ్ని పిలిచి ‘పాండవులు ఉపప్లావ్యంలో ఉన్నారట. నువ్వు అక్కడకు వెళ్లి, ఇచ్చకంగా మాట్లాడి, ధర్మరాజును యుద్ధవిముఖుణ్ని చేయి. వాళ్లను రెచ్చగొట్టవద్దు. వెళ్లినపుడు పాండవుల సైన్యంలో ఉన్న అశ్వాలను, రథాలను గమనించు.’ అని చెప్పాడు. నేనూ శాంతి కోరుకుంటున్నానని వాళ్లకు చెప్పు అంటూ తన మనసులో మాట చెప్పాడు.
సంజయుడు ఉపప్లావ్యానికి వెళ్లేసరికి అక్కడ కృష్ణుడు కూడా ఉన్నాడు. సంజయుడు ధర్మరాజుని నువ్వు యింతటివాడివి, అంతటివాడివి అని పొగిడి, ఇరు పక్షాలూ నాశనమయ్యే యుద్ధం చేస్తే ఏం లాభం చెప్పు. దాయాదులను చంపుకుంటే గెలుపు కూడా ఓటమి లాటిదే. పాండవులు ధర్మరహితమైన పని చేయరని భీష్మధృతరాష్ట్రులు కూడా అనుకుంటున్నారు అని ముగించాడు. ఈ రాయబారం శుష్కప్రియం, శూన్యహస్తంలా ఉందని ధర్మరాజుకి అర్థమైంది. అర్ధరాజ్య ప్రస్తావన లేకుండా యీ రాజీ ప్రతిపాదన ఏమిటి? అందుకని ‘సంజయా! నేను యుద్ధాన్ని కోరుతున్నట్లు నీకెవరైనా చెప్పారా? నేనెప్పుడైనా అన్నానా? సంధి కుదిరితే యుద్ధం చేయవలసిన అవసరమేముంది? ఇంద్రప్రస్థాన్ని నాకు యిచ్చేస్తే చాలు.’ అని స్పష్టంగా చెప్పాడు.
దానికి సంజయుడు ‘యుద్ధం లేకుండా కౌరవులు నీకు రాజ్యభాగం యివ్వకపోవచ్చు. అయినా నువ్వు మాత్రం యుద్ధానికి కారకుడివి కావద్దు. యుద్ధం చేసి రాజ్యం పొందడం కంటె భిక్షాటనతో బతకడం మేలు. యుద్ధం పాపకార్యం. అందుకనే నువ్వు దాని జోలికి యిన్నాళ్లూ వెళ్లలేదు. నువ్వు వనవాసానికి వెళ్లినపుడు కూడా యిప్పుడున్న యావన్మంది నీతోనే ఉన్నారు. కావాలంటే అప్పుడే నువ్వు యుద్ధానికి దిగి వుండవచ్చు. కానీ దిగలేదు. ఎందువలన? యుద్ధం మంచిది కాదని తెలుసు కాబట్టి.13 ఏళ్లలో శత్రువుల బలాన్ని పెరగనిచ్చి, నీ సహాయకులను బలహీనపర్చుకుని, యిప్పుడు యుద్ధానికి వెళదామనుకోవడంలో విజ్ఞత ఉందా? నువ్వు విద్వాంసుడివి. వానప్రస్థాన్ని స్వీకరించు, అంతేకాని దేవయాన మార్గం నుంచి తప్పుకోకు.’ అని హితోక్తులు చెప్పాడు.
ధర్మరాజు ‘సంజయా! నేను ధర్మబద్ధంగా నడుచుకుంటున్నానా లేదా అనేది ధర్మానికి అధినాయకుడైన కృష్ణుడే చెప్తాడు.’ అని కృష్ణుడివైపు చూశాడు. అప్పుడు కృష్ణుడు సంజయుడితో ‘నేను యిద్దరినీ శాంతించమనే చెప్తాను. కానీ ధృతరాష్ట్రుడు తన పిల్లలతో పాటు తనూ పూర్తి రాజ్యాన్ని ఆశిస్తూ వుంటే యుద్ధం అనివార్యమౌతుంది కదా! జ్ఞానమార్గం పేరుతో తను చేయవలసిన కర్మను విడిచిపెట్టడం కూడా తప్పే! పాండవులు యుద్ధానికి, సంధికి రెండింటికి సిద్ధంగా ఉన్నారు. రాజైన ధృతరాష్ట్రుడు తన కర్తవ్యాన్ని గుర్తుంచుకుని అది చేయాలి. ఆ విషయమే ఆయనకు చెప్పు. నేను కూడా సంధికి ప్రయత్నిస్తాను.’ అన్నాడు. సంజయుడు బయలుదేరబోతూండగా ధర్మరాజు చివరిగా ‘న్యాయమైన వాటాగా మాకు ఇంద్రప్రస్థం రావాలి. పోనీ మాకు అధిస్థలం, వృకస్థలం, మాకంది, వారణావతం అనే నాలుగింటితో బాటు చివరి ఐదవది ఏదో ఒకటి కలిపి ఐదు నగరాలు, నగరాలు కుదరదంటారా, మా ఐదుగురు సోదరులకు ఐదు గ్రామాలివ్వమని రాజుకు నచ్చచెప్పు’ అని కోరాడు.
తిరుగు ప్రయాణంలో సంజయుడికి దుఃఖం వచ్చింది. అతను పాండవులతో చెప్పిన మాటలు అతని మనసులోనివి కావు. విధినిర్వహణలో భాగంగా ధృతరాష్ట్రుడు చెప్పమన్నది చెప్పాడు. అతని పన్నాగం స్పష్టంగా తెలుస్తూనే వుంది. శాంతి అంటూ ధర్మరాజాదులకు యివ్వచూపినది ఏమీ లేదు. వాళ్లు వనాలకు పోవాలి. తన సంతానం రాజ్యమేలాలి. ధర్మరాజు ఐదూళ్లు యిచ్చినా చాలంటున్నాడు. ఇటు ధృతరాష్ట్రుడు రిక్తహస్తం చూపిద్దామనుకుంటున్నాడు. ఇది పదేపదే తలచుకుని సంజయుడికి పట్టరాని కోపం వచ్చింది. హస్తినకు చేరేటప్పటికి అర్ధరాత్రి అయినా, వెళ్లి ధృతరాష్ట్రుణ్ని లేపించాడు. ‘రాజా! నువ్వు నీ పిల్లల్ని సమర్థించుకుంటూ పెద్దలు చూపిన మార్గానికి విరుద్ధంగా నడుచుకున్నావు. ఇప్పటికీ పాండవులకు వాళ్ల భాగాన్ని యివ్వదలచుకోలేదు. అందువలన నీకు ఇహలోకంలోను, పరలోకంలోను కూడా దుర్గతి తప్పదు, ఇప్పుడు నువ్వు చేస్తున్న పని దహనకార్యంలా ఉంది.’ అని దురుసుగా మాట్లాడాడు. ‘అది సరేలే, యింతకీ పాండవులేమన్నారో చెప్పు’ అన్నాడు ధృతరాష్ట్రుడు ఆతృతగా. ‘అది రేపు సభలో అందరి ఎదుటా చెప్తా’ అంటూ సంజయుడు విసురుగా యింటికి వెళ్లిపోయాడు.
ఇక ధృతరాష్ట్రుడికి దిగులు పట్టుకుంది. విదురుణ్ని పిలిపించాడు. సంజయుడు యిలా తిట్టిపోయాడు. ధర్మం అంటే ఏమిటి? ఏదైనా నాకు చెప్పి మనశ్శాంతి కలిగించు అని కోరాడు. అప్పుడు విదురుడు రాత్రంతా అతనికి ధర్మబోధ చేస్తూనే ఉన్నాడు. భారతంలో కొన్ని అధ్యాయాలు దీనికి కేటాయించారు. మర్నాడు కొలువులో సంజయుడు తన సంభాషణా వివరాలన్నీ సభకు నివేదించాడు. అది విన్నాక భీష్ముడు ‘నరనారాయణులనే తాపసులు మహాబలశాలులు, అన్ని లోకాలలో వ్యాపించి వుంటారు. వారిలో నరుడు అర్జునుడిగా, నారాయణుడు కృష్ణుడిగా అవతరించారని అంటున్నారు. దుర్యోధనా! వారితో యుద్ధం చేసే ఆలోచన మానుకో.’ అన్నాడు. కర్ణుడు ‘భీష్మా, పాండవులందరినీ నేనే చంపగలను’ అన్నాడు.
భీష్ముడు ధృతరాష్ట్రుడితో ‘నిత్యం ప్రగల్భాలు పలికే యీ కర్ణుడు పాండవులలో పదహారో వంతు కూడా పోలడు. ఉత్తర గోగ్రహణంలో తన ముద్దుల తమ్ముడు అర్జునుడి చేతిలో చస్తే అపుడు వీడేమి చేశాడు? ఘోషయాత్రలో ఏం చేశాడు?’ అని గుర్తు చేశాడు. ద్రోణుడు ‘అర్జునుడితో సమానమైన విలుకాడు మూడు లోకాల్లోనూ లేడు.’ అని ప్రకటించాడు. ఇవన్నీ విని ధృతరాష్ట్రుడు భీమార్జునుల బలాన్ని గుర్తు చేసుకుని సభలో ప్రశంసించాడు. తన పుత్రులకేసి చూసి ‘ఇలాటివారితో యుద్ధం రాకపోవడమే మంచిది. మీకూ అలాగే తోస్తే శాంతికోసం ప్రయత్నిద్దాం. నా మనసూ శాంతిస్తుంది.’ అన్నాడు. రాజే అలా అనడంతో ధైర్యం చేసి సంజయుడు ‘పాండవుల శక్తియుక్తుల గురించి మీరు చెప్పినది నిజం. కానీ మీరు దీనంగా పలకడం సరియైనది కాదు. మీ కొడుకులను అదుపు చేయవలసిన బాధ్యత మీపై ఉంది.’ అని గుర్తు చేశాడు.
వ్యవహారం శ్రుతి మించుతోందనుకున్న దుర్యోధనుడు ‘మహారాజా! మీరు భయపడవలసిన పని లేదు. మనకు అండగా అనేకమంది రాజులు నిలిచి వున్నారు. పాండవులకు విద్యలు నేర్పిన భీష్మద్రోణులు మన పక్షానే ఉన్నారు. మన సంగతి తెలిసే ధర్మరాజు భయపడి, ఐదూళ్లు చాలంటున్నాడు. నిరంతరాభ్యాసంతో గదాయుద్ధంలో నేను అసమానుణ్ని అయ్యాను. భీముడి శరీరాన్ని పిండిపిండి చేయగలను. ఇక సైన్యం సంఖ్యలో కూడా మనకే ఎక్కువ ఉంది.’ అన్నాడు. ఆ తర్వాత పాండవుల వైపు ఉన్నవారి బలాబలాల గురించి సంజయుడు వివరించాడు. అంతా విని ధృతరాష్ట్రుడు ‘నేను, భీష్మద్రోణాది పెద్దలు యుద్ధాన్ని కోరుకోవటం లేదు. నిజానికి నువ్వూ కోరుకోవటం లేదు. కర్ణుడు, దుశ్శాసనుడు, శకుని నిన్ను ప్రేరేపిస్తున్నారు…’ అని దుర్యోధనుడికి హితవు చెప్పబోయాడు.
దానికి దుర్యోధనుడు ‘తండ్రీ! నేను మీ ఎవ్వరి మీదా నెపం పెట్టటం లేదు. నేనూ, కర్ణుడూ మేమిద్దరమే యుద్ధం అనే యజ్ఞం ప్రారంభించాం. ధర్మరాజును యజ్ఞపశువుగా పెట్టుకున్నాం, అతన్ని వధిస్తాం. నేనూ, కర్ణుడూ, దుశ్శాసనుడూ ముగ్గురం పాండవులను చంపగలం. అది జరగకపోతే పాండవులు నన్ను చంపి యీ భూమిని అనుభవిస్తారు. నేను దానికైనా సిద్ధమే తప్ప పాండవులతో కలిసి మాత్రం ఎన్నడూ జీవించను. వాడియైన సూదిమొన మోపినంత భూమి కూడా పాండవులకు వదిలిపెట్టను.’ అని ప్రకటించాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు తక్కినవారి కేసి చూసి ‘ఈ దుర్యోధనుణ్ని వదిలిపెట్టేశాను. కానీ అతని వెంట నడిచి యమసదనానికి పోతున్న మీ కోసం ఏడుస్తున్నాను.’ అన్నాడు.
తండ్రి మాటలు విని దుర్యోధనుడు తన కోపాన్ని అణచుకుంటూ ‘రాజా! పాండవులకు దేవతల సాయం ఉంటుందను కుంటున్నావు. నేను ద్వేషించినవాణ్ని దేవతలు కూడా రక్షించరు. లేకపోతే పాండవులు పదమూడేళ్ల పాటు అష్టకష్టాలు పడేవారే కాదు. నాకు మంత్రశక్తులున్నాయి. నీళ్లను స్తంభింపచేసి వాటి మీద రథాలను నడిపించగలను. ఇలా ఎన్నో విద్యలు వచ్చు.’ అని గొప్పలు చెప్పుకున్నాడు. ఇతనిలా మాట్లాడుతూ వుంటే కర్ణుడు వంత పాడసాగాడు, ‘నా దగ్గర దివ్యాస్త్రాలున్నాయి. ఈ భీష్మద్రోణుల అవసరమే లేదు, నేను ఒక్కణ్నే వెళ్లి పాండవుల్ని చంపేస్తాను.’ అని. భీష్ముడికి కోపం వచ్చింది. ‘కర్ణా! ఇంద్రుడిచ్చిన శక్తి కృష్ణుడి చక్రంతో ముక్కలవుతుంది. నీకున్న సర్పముఖబాణం అర్జునుడి బాణాలతో దెబ్బ తింటుంది. కృష్ణుడు అర్జునుణ్ని రక్షిస్తాడు, చూస్తూ ఉండు’ అన్నాడు. కర్ణుడికి విపరీతంగా క్రోధం వచ్చింది. ‘ఈ భీష్ముడు అణగారే వరకు నేను యుద్ధంలో శస్త్రం పట్టను.’ అని ప్రతిజ్ఞ చేసి సభలోంచి వెళ్లిపోయాడు.
భీష్ముడు హేళనగా ‘ఈ కర్ణుడు తన మాట ఎలా నిలబెట్టుకుంటాడో చూద్దాం. అబద్ధం చెప్పి పరశురాముడి వద్ద బ్రహ్మాస్త్రం పొందిన రోజునే ఈ అధముని యొక్క ధర్మమూ, తపస్సూ నశించిపోయాయి.’ అన్నాడు. జ్ఞాతివిరోధం తగదని విదురుడు కూడా చెప్పిన మీదట, ధృతరాష్ట్రుడు మళ్లీ కొడుక్కి చెప్పి చూశాడు. దుర్యోధనుడు ఏమీ బదులు చెప్పకపోవడంతో రాజులందరూ మౌనంగా ఉన్నారు. కాస్సేపటికి వెళ్లిపోయారు. ఇలా సంజయ రాయబారం కూడా విఫలమైంది. ధృతరాష్ట్రుడు ఎంతసేపూ యుద్ధం తప్పించు అని దుర్యోధనుణ్ని కోరుతున్నాడు తప్ప, రాజుగా నాకున్న అధికారం వినియోగించి, అర్ధరాజ్యాన్ని ధర్మరాజుకి యిస్తాను, నువ్వేం చేయగలవు? అని కొడుకుని నిలదీయటం లేదు. నా కుమారుడు నా మాట వినటం లేదు అని లోకానికి చూపే తాపత్రయమే తప్ప నిజంగా యుద్ధాన్ని నివారించటం లేదు. పైకి ఏమి చెప్పినా, యుద్ధంలో పాండవులందరూ నశించిపోతారని, శత్రుశేషం ఉండదని అతని ఆశ కాబోలు.
ఈ వ్యాసరచనకు సామవేదం వారి ‘ఇదీ యథార్థ మహాభారతం’, ‘శ్రీ లలితా త్రిపుర సుందరీ ధార్మిక పరిషత్’వారి వ్యాస మహాభారతం ఉద్యోగపర్వం 1 పై ఆధారపడ్డాను. వారికి కృతజ్ఞతలు. తర్వాతి వ్యాసంలో కృష్ణ రాయబారం గురించి వివరిస్తాను.
– ఎమ్బీయస్ ప్రసాద్ (మార్చి 2022)