1950లలో హిందీ చిత్రసీమలో పెద్ద హీరోలు – దిలీప్ కుమార్, రాజ్ కపూర్, దేవ్ ఆనంద్. దేవ్ హుందాగా తన పని ఏదో తను చేసుకున్నాడు కానీ రాజ్, దిలీప్‌ల మధ్య ఎప్పుడూ స్ఫర్ధ వుంటూ వచ్చింది. ఇద్దరూ పెషావర్‌కు చెందినవారే. 1923 డిసెంబరులో దిలీప్ పుడితే, 1924 డిసెంబరులో రాజ్ పుట్టాడు. ఇద్దరూ ఒకే స్కూల్లో చదువుకున్నారు. అయితే స్వభావాల్లో యిద్దరికీ చాలా తేడా ఉంది. దిలీప్ ముభావి, అంతర్ముఖుడు. ముడుచుకుపోయే స్వభావం. రాజ్ సరదా మనిషి, షో-మ్యాన్. సందడి చేయడం, తన గురించి గొప్పలు చెప్పుకోవడం, పబ్లిసిటీ కోసం ఏమైనా చేయడం అతని అలవాటు. ఈ స్వభావాలు వారి నటనల్లో కూడా ప్రతిఫలించాయి.
దిలీప్ ప్రేమికుడిగా, విషాద కథానాయకుడిగా రాణిస్తే, రాజ్ హాస్యంతో, ప్రజాసమస్యలు లేవనెత్తే కళాకారుడిగా రాణించాడు. 24 ఏళ్లకే రాజ్ దర్శకనిర్మాత అయిపోయాడు. స్టూడియో కూడా కట్టాడు. దిలీప్ దర్శకత్వంలో వేలుపెడుతూనే వున్నాడు కానీ తనను తాను దర్శకుడిగా ఎప్పుడూ ప్రకటించుకోలేదు. 37వ ఏట సినీనిర్మాత అయ్యాడు. ఒకే ఒక్క సినిమా. రాజ్‌కు చిన్నప్పుడే పెళ్లయింది. దిలీప్ 43 ఏళ్లకు కానీ పెళ్లి చేసుకోలేదు. అవివాహితుడు కావడం, తెరపై భగ్నప్రేమికుడిగా నటించడం చేత దిలీప్ మహిళా అభిమానులు విపరీతంగా ఉండేవారు. కామినీ కౌశల్, మధుబాల వంటి హీరోయిన్లు కూడా మినహాయింపు కాదు. రాజ్‌కు యీ విషయంలో అసూయ ఉండేది. ముఖ్యంగా కథానాయిక నర్గీస్ విషయంలో.
రాజ్ హీరోగా నిలదొక్కుకునే నాటికే నర్గీస్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. తను హీరోగా, సొంత దర్శకత్వంలో ''ఆగ్'' (1948) సినిమా నిర్మిస్తూ రాజ్ నర్గీస్‌ను తన పక్కన వేయమని కోరాడు. ఆమె అప్పటికే దిలీప్ సరసన ''అనోఖా ప్యార్'' (1948), ''మేలా'' (1948)లలో నటిస్తోంది. మెహబూబ్ ఖాన్ తీసిన ''అందాజ్'' (1949) వీళ్లు ముగ్గురూ వేశారు. నర్గీస్‌ను మూగగా ఆరాధించిన ప్రేమికుడిగా దిలీప్ వేస్తే, ఆమెను అపార్థం చేసుకునే భర్తగా రాజ్ వేశాడు. ముకేశ్ పాటలన్నీ దిలీప్ మీదే చిత్రీకరించారు. ప్రేక్షకుల సింపతీ ఎటు వుంటుందో సులభంగా ఊహించుకోవచ్చు. రాజ్‌కు యిది నచ్చలేదు. నర్గీస్ పక్కన తనే కనబడాలని కోరుకున్నాడు. తెర మీదా, తెర వెనుకా తమ జంట ప్రొజెక్టు కావాలని ఆశించాడు. ''ఆగ్'' ఓ మాదిరిగా ఆడినా భారీ బజెట్‌తో ''బర్సాత్'' (1950) ప్లాన్ చేశాడు. అది సూపర్ హిట్ కావడంతో దాని వెంటనే ''ఆవారా'' (1951) తీశాడు.
ఓ పక్క నర్గీస్ దిలీప్‌తో ''జోగన్'' (1950), ''బాబుల్'' (1950), ''హల్‌చల్'' (1951), ''దీదార్'' (1951) వేస్తోంది. కానీ బర్సాత్ సినిమా షూటింగు టైములో రాజ్‌తో ప్రేమలో పడింది. ఆమె తల్లి అభ్యంతరపెట్టింది కానీ ''ఆవారా'' తీస్తూండగా ఆమె మరణించింది. తండ్రి అంతకుముందే చనిపోవడంతో నర్గీస్‌పై ఆంక్షలు పెట్టేవారు లేకపోయారు. ఇక 1952 నుంచి 1956 వరకు ఆమె వరుసగా రాజ్‌తోనే నటించసాగింది. సొంత సినిమాలైన ''ఆహ్'', ''శ్రీ 420'' లోనే కాదు, బయట నిర్మాతలు తీసిన ''అన్‌హోనీ'', ''అంబర్'', ''ఆశియానా'', ''ధూన్'', ''పాపి'', ''చోరీచోరీ''లలో కూడా వేసింది. ఈ మధ్యలో దిలీప్‌తో వేసినది ''శికస్త్'' (1953) ఒక్కటే. ఆ విధంగా రాజ్ నర్గీస్‌ను దిలీప్ క్యాంప్‌ను విజయవంతంగా గుంజుకోగలిగాడు. తనూ దేవదాసు తరహా పాత్రలో మెప్పించగలనని అదే తరహా కథతో చూపించుకోవడానికి ''ఆహ్'' తీశాడు. దాని తెలుగు, తమిళ వెర్షన్లు హిట్ అయ్యాయి కానీ హిందీ సినిమా ఫ్లాపయింది. దీని తర్వాత దిలీప్ హీరోగా ''దేవదాస్'' (1956) వస్తే అది హిట్టయింది.
అయితే రాజ్, నర్గీస్ బంధం ఎక్కువకాలం కొనసాగలేదు. ''చోరీచోరీ'' (1956) సినిమా షూటింగుకై వెళ్లినపుడు రాజ్, దక్షిణాది హీరోయిన్ పద్మినితో ఒకే గదిలో పట్టుబడ్డాడు కాబట్టి నర్గీస్ కోపగించుకుంది అంటారు. అది కాకపోయినా రాజ్ ఓ పక్క తన కుటుంబజీవితం కొనసాగిస్తూనే, తనను బహిరంగంగా పెళ్లాడకుండా, తమ రొమాన్సును సినిమాలను ప్రమోట్ చేసుకోవడానికి వాడుకుంటున్నాడని ఆమె అభిప్రాయపడింది. ''మదర్ ఇండియా'' (1957)లో తనకు కొడుకుగా నటించిన సునీల్ దత్‌ను పెళ్లాడి, రాజ్‌కు గుడ్‌బై చెప్పేసింది. దాదాపు సినిమా రంగానికి దూరమైంది. నర్గీస్ తన పక్కన వేయడం మానేశాక దిలీప్ నిమ్మి (''ఆన్'', ''దాగ్'', ''ఉడన్ ఖటోలా'') మధుబాల (''తరానా'', ''సంగ్‌దిల్'', ''మొఘల్ ఏ ఆజమ్'') మీనాకుమారి (''ఫుట్‌పాత్'', ''అమర్'', ''ఆజాద్'') లతో సినిమా చేశాడు. ''దేవదాస్'' సినిమాలో చరద్రముఖి పాత్ర వేయడానికి వచ్చిన వైజయంతిమాల అతని దృష్టిని ఆకర్షించింది.
వైజయంతి తమిళ, తెలుగు సినిమాలలో నటిస్తూనే ''బహార్'' (1951), ''లడ్కీ'' (1953), ''నాగిన్'' (1954), ''మిస్ మాలా'' (1954), ''యాస్మిన్'' (1955)లలో నటించింది. ఈ సినిమాల్లో ఆమె పక్కన వేసిన హీరోలు కిశోర్ కుమార్, ప్రదీప్ కుమార్, సురేశ్, కరన్ దివాన్ అంతగా పేరున్నవారు కారు. అందం, స్ఫురద్రూపం, అభినయం, నాట్యకౌశలం అన్నీ కలబోసిన వైజయంతి దిలీప్‌ను ఆకర్షించింది. ''నయా దౌర్'' (1957) సినిమా నిర్మాణసమయంలో మధుబాల తండ్రికి, దర్శకనిర్మాత బిఆర్ చోప్డాకు తగాదా వచ్చింది. సినిమా ఔట్‌డోర్‌లో తీస్తానని ముందుగానే నిర్మాత చెపితే సరేనని ఒప్పుకున్న మధుబాల తండ్రి, షూటింగు ప్రారంభమయ్యాక కుదరదని పేచీ పెట్టాడు. ఎందుకంటే దిలీప్, మధుబాల మధ్య నడుస్తున్న రొమాన్సు ఔట్‌డోర్ షూటింగు సందర్భంగా యింకాస్త ముందుకు వెళ్లి కూతురు తనను విడిచి వెళ్లిపోతుందన్న భయం అతనిది. దాంతో చోప్డా మధుబాలపై కేసు పడేసి, ఆమెకు బదులుగా ఎవర్ని తీసుకుందామా అని ఆలోచించాడు. దిలీప్ వైజయంతి పేరు సూచించాడు.
కేసు విచారణ సమయంలో దిలీప్ మధుబాలే మాట తప్పిందని, మధుబాలకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాడు. దాంతో వాళ్లిద్దరి మధ్య మాటలు పోయాయి. అయినా అప్పటికే ఒప్పుకున్న ''మొఘల్ ఏ ఆజమ్''లో వారు తెరపై శృంగారాన్ని అద్భుతంగా పండించారు. ఆ తర్వాత కలిసి నటించలేదు. ''నయా దౌర్'' సూపర్ హిట్ కావడంతో దిలీప్, వైజయంతి జంట పాప్యులర్ అయింది. ''మధుమతి'' (1958), ''పైఘామ్'' (1959)లలో కూడా యిదే జంట విజయవంతమైంది. ''యహూదీ'' (1958), ''కోహినూర్'' (1960)లలో తన సరసన మీనా కుమారి నటించి, అవి హిట్టయినా, దిలీప్ సొంతంగా ''గంగా జమునా'' (1961) సినిమా నిర్మాణం తలపెట్టినపుడు వైజయంతినే హీరోయిన్‌గా తీసుకున్నాడు. బందిపోటుగా మారిన అన్నకు, పోలీసు ఆఫీసరైన తమ్ముడికి మధ్య ఘర్షణ ఆ సినిమా యితివృత్తం. తర్వాతి రోజుల్లో ఎన్నో సినిమాలు దానికి నకలుగా వచ్చినా ఆ సినిమాకు మాత్రం అనేక సెన్సారు కష్టాలు వచ్చాయి.
50 కట్స్ చెప్పారు. అలా అయితే సినిమా ధ్వంసమై పోతుందని బ్రాడ్‌కాస్టింగ్ మంత్రిగా ఉన్న కేస్కర్ వద్ద మొత్తుకున్నా ఆయన వినలేదు. చివరకి దిలీప్ నెహ్రూ దగ్గరకు వెళ్లి చెప్పుకుంటే సినిమా రిలీజైంది. దీని కంతా ఒక ఏడాది పట్టింది. అదే సమయంలో రాజ్ కపూర్ పద్మిని హీరోయిన్‌గా ''జిస్ దేశ్ మే( గంగా బహతీ హై'' సినిమాను తీశాడు. అది చంబల్ లోయలోని బందిపోట్లను సంస్కరించే థీమ్‌తో తయారైంది. నలుపు, తెలుపు సినిమా. గంగా జమునా రంగుల్లో తీసినది. పద్మిని కన్న వైజయంతి హిందీ ప్రేక్షకులకు సుపరిచితురాలు. దిలీప్ సినిమా ముందుగా రిలీజైతే తన సినిమా దెబ్బ తింటుందనే భయంతో రాజ్ తన పలుకుబడి ఉపయోగించి ''గంగా..''కు యిబ్బందులు కలిగించాడనే పుకారు ఎవరు నమ్మినా నమ్మకపోయినా దిలీప్ నమ్మాడు. చివరకు ''జిస్ దేశ్..'' విడుదలయ్యాకే ''గంగా..'' విడుదలైంది. రెండూ సూపర్ హిట్ అయ్యాయి.
అప్పట్లో ఫిల్మ్‌ఫేర్ అవార్డులకు చాలా విలువ ఉండేది. తన సినిమాకు అవార్డులు చాలా వస్తాయని దిలీప్ ఆశించాడు. కానీ డైలాగ్సుకి, సినిమాటోగ్రఫీకి, ఉత్తమ నటిగా వైజయంతికి మాత్రం వచ్చాయి. ''జిస్ దేశ్..''కైతే ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడులతో బాటు ఎడిటింగ్, ఆర్ట్ డైరక్షన్‌కు కూడా వచ్చాయి. దీనిలోనూ రాజ్ మేనేజ్‌మెంట్ ఉందని దిలీప్‌కు సందేహం. ఇలా ఉండగా దక్షిణాది నిర్మాతలు ''పెళ్లికానుక'' సినిమాను ''నజరానా'' (1961)గా హిందీలో తీస్తూ హీరోహీరోయిన్లగా రాజ్ కపూర్, వైజయంతిలను తీసుకున్నారు. మద్రాసులో షూటింగు సందర్భంగా వైజయంతిని చూసి రాజ్ యింప్రెస్ అయ్యాడు. గతంలో నర్గీస్ లాగానే యీమెను కూడా దిలీప్ నుండి లాగేసుకుంటే…? అనుకున్నాడు. తన మనసులో మెదలుతున్న ''సంగమ్'' కథాంశాన్ని చెప్పాడు. ఓ సారి దిలీప్‌తో ''అందాజ్‌నే కొద్దిగా మార్చి ''సంగమ్'' పేరుతో మళ్లీ తీద్దామనుకుంటున్నాను.
నర్గీస్‌కు బదులు వైజయంతి ఉంటుందంతే. నువ్వు ఏ పాత్ర వేస్తానన్నా ఓకే.'' అని ఆఫర్ యిచ్చాడు. ''నువ్వు హీరోగా నైనా తప్పుకో, లేదా దర్శకుడిగానైనా తప్పుకో. అప్పుడు వేస్తాను.'' అన్నాడు దిలీప్. దానికి రాజ్ ఒప్పుకోలేదు. చివరకి రాజేంద్ర కుమార్‌ను తీసుకున్నాడు. పద్మినితో రాజ్ అనుబంధం ఎక్కువగా సాగలేదు. ''ఆషిక్'' (1962)లో మాత్రం జంటగా వేశారు. (తర్వాత ఎప్పుడో ''మేరా నామ్ జోకర్'' (1970)లో తీసుకున్నాడు). ''సంగమ్'' సినిమా షూటింగు విదేశాల్లో కూడా జరగడంతో నిర్మాణం చాలా ఏళ్లు పట్టింది. ఈ లోపున రాజ్ పబ్లిసిటీ డిపార్టుమెంటు వాళ్లు వైజయంతిని రాజ్ కొత్త ప్రేయసిగా ప్రొజెక్ట్ చేయసాగారు.
ఇదంతా దిలీప్‌కు చిర్రెత్తించింది. అప్పటికే అతను వైజయంతితో కలిసి ''లీడర్'' సినిమాలో నటిస్తున్నాడు. దిలీప్‌ను ముందు నుంచి ప్రోత్సహిస్తూ వచ్చిన ఫిల్మిస్తాన్ శశధర్ ముఖర్జీ, తన కొడుకు రామ్ దర్శకత్వంలో ఆ సినిమాను ప్లాన్ చేశాడు. రాజకీయాలు, నిర్భయుడైన జర్నలిస్టు, హత్య.. యిత్యాది అంశాలతో కథ నడుస్తుంది. బోల్డు పాటలు. విషాదమూర్తిగా తనకున్న యిమేజి చెరిపేసుకోవడానికి కామెడీ కూడా ప్రయత్నించాడు దిలీప్. ఇవన్నీ చాలనట్లు స్క్రిప్టు విపరీతంగా దిద్దడమే కాకుండా, అందరి ఎదుటా డైరక్షన్ కూడా మొదలుపెట్టేశాడు. దానితో యీ సినిమా షూటింగూ లేటయింది. వైజయంతి యీ రెండు సినిమాల మధ్య విపరీతంగా నలిగింది. పంతం కొద్దీ యిద్దరూ ఒకేసారి డేట్స్ అడిగేవారు.
అవతలి సినిమాకు ఎక్కువ ప్రాధాన్యత యిస్తున్నావని ఆరోపించేవారు. ఈ గొడవలకు తోడు రాజ్ పబ్లిసిటీ శాఖ వారు రాజ్-వైజయంతి సాన్నిహిత్యాన్ని ప్రజల మెదళ్లలో నాటుకునేందుకు కథనాలు పుట్టించసాగారు. వైజయంతి మైసూరు మహారాజు కూతురని, ఆర్కె స్టూడియోలోని రాజ్ కుటీరంలో వైజయంతి రాత్రుళ్లు గడుపుతోందని.. యిలా అనేక కథలు. ఇవన్నీ వాళ్లు పుట్టించినవే తప్ప వాస్తవాలు కాదు అని వైజయంతి తన ఆథరైజ్‌డ్ బయాగ్రఫీలో చెప్పుకుంది. 'వాస్తవం కాకపోవడమేం? ఆ సమయంలో మా నాన్నపై అలిగి మా అమ్మ నాలుగున్నర నెలలు హోటల్లో ఉంది కూడా' అంటాడు ఋషి కపూర్. ఏమైతేనేం, ''సంగమ్'' రిలీజై సూపర్ హిట్ అయింది. అదే ఏడాది రిలీజైన ''లీడర్'' ఫ్లాపయింది. ఇది దిలీప్‌ను మండించింది.
''లీడర్'' నిర్మాణంలో ఉండగానే అతని యింకో సినిమా ఎఆర్ కర్దార్ అనే దర్శకనిర్మాతగా ''దిల్ దియా దర్ద్ లియా'' (1966) ప్రారంభమైంది. దిలీప్ హీరోయిన్‌గా వహీదా రెహమాన్ పేరును సూచించాడు. కథను దిలీప్ చిత్తం వచ్చినట్లు మార్చేసి, డైరక్షన్ తనే చేపట్టి సినిమాను ఘోరంగా ఫ్లాపవడానికి కారకుడయ్యాడు. అయినా ''రాముడు-భీముడు'' సినిమాను హిందీలో ''రామ్ ఔర్ శ్యామ్''గా తీస్తూ నాగిరెడ్డి దిలీప్‌నే ఎంచుకున్నారు. హీరోయిన్లగా వైజయంతి, మాలా సిన్హా (దరిమిలా ఆమె స్థానంలో ముంతాజ్ వచ్చింది)లను తీసుకున్నారు. డైరక్టరుగా చాణక్య పేరున్నా దిలీపే డైరక్షన్ చేయడంతో కోపం వచ్చి వైజయంతి కొన్ని రోజుల షూటింగు తర్వాత సినిమా నుంచి తప్పుకుందని డివి నరసరాజుగారు తన పుస్తకంలో రాశారు. బహుశా నాగిరెడ్డి అదే చెప్పి ఉంటారు. కానీ వైజయంతి తన ఆత్మకథలో దిలీపే తనను తీయించేశాడని రాసింది.
నిజానికి ఆ పాటికి ఆమె రాజ్ వ్యక్తిగత వైద్యుడైన డా.బాలితో ఉంటూ దరిమిలా పెళ్లి చేసుకుంది. అయినా ఒకప్పుడు తనను విడిచి రాజ్ క్యాంప్‌కి ఫిరాయించిందనే కోపం దిలీప్‌లో ఉంది. 8 రోజుల ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుని బొంబాయి వెళుతూండగా నాగిరెడ్డి మేనేజర్ వచ్చి తర్వాతి డేట్స్ ఎప్పుడు యిస్తారో రాతపూర్వకంగా యివ్వండి అని అడిగాడు. నేను యిప్పుడు ఏ సంతకాలూ పెట్టనని చెప్పి వైజయంతి విమాన మెక్కింది. విమానంలో ఆమెతో ''నజరానా'', ''సూరజ్'' తీసిన నిర్మాత వీనస్ కృష్ణమూర్తి కనబడ్డాడు. ఇదేమిటి యిలా అడుగుతున్నారు అని ఆయనతో చెపితే 'నీకు తెలియదా? నిన్ను తీసేసి వహీదాను పెట్టేశారు' అన్నాడాయన. బొంబాయి రాగానే వైజయంతి ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న మన్‌మోహన్ కృష్ణకు ఫిర్యాదు చేసింది. ఆయన నాగిరెడ్డికి నోటీసు పంపడంతో సినిమాపై స్టే వచ్చింది. మర్నాడే నాగిరెడ్డి మేనేజర్ బొంబాయి వచ్చి క్షమాపణలు చెప్పి, ఒప్పుకున్న డబ్బంతా చెల్లించి వెళ్లాడు.
ఈ సినిమాలోనే కాదు, దిలీప్ ''గుడిగంటలు'' హిందీ వెర్షనైన ''ఆద్మీ'' (1968) సినిమాకు కూడా వహీదాను సూచించాడు. ఒకప్పుడు ఎంతో సన్నిహితంగా మెలగిన వైజయంతి, దిలీప్ శత్రువులై పోయారు. వారిద్దరూ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ''సంఘర్ష్'' (1968) నిర్మాణం ఆగిపోయింది. భారీ తారాగణం. హీరోయిన్‌ను మార్చే సావకాశం లేదు. దర్శకుడు రవైల్ యిద్దరి దగ్గరకు వచ్చి మొత్తుకున్నాడు. చివరకు సినిమా షూటింగు పున:ప్రారంభమైంది – అదీ శృంగార సన్నివేశంతో. ఏమవుతుందో చూడాలని జర్నలిస్టులంతా వచ్చారు. దిలీప్, వైజయంతి యిద్దరూ ప్రొఫెషనల్సే కాబట్టి, కెమెరా ముందు ప్రేమికులుగా అద్భుతంగా నటించారు. లైట్లు ఆఫ్ చేయగానే పలకరింపులు లేవు.
సినిమా పూర్తయి 1968లో రిలీజై ఓ మాదిరిగా ఆడింది. ఆ తర్వాత వైజయంతి దిలీప్‌తో కానీ రాజ్‌తో మళ్లీ నటించలేదు, స్నేహం పెట్టుకోలేదు. దేవ్ ఆనంద్, ఉత్తమ్ కుమార్, శమ్మీ కపూర్, ధర్మేంద్ర, రాజేంద్ర కుమార్‌లతో నటించి 1970లో సినిమాలు మానేసింది. ''దీవార్''లో తల్లి పాత్ర ఆఫర్ వచ్చినా చేయలేదు. కథానాయకిగానే రిటైరై, నృత్యప్రదర్శనలు యిస్తూ యిప్పటికీ చురుగ్గానే ఉంది.
– ఎమ్బీయస్ ప్రసాద్ (జూన్ 2018)
[email protected]