భలే ఛాన్స్ .. రండి బాబూ రండి!

తెలంగాణ రాజకీయంలో ప్రస్తుతం ఆహ్వానాల పర్వం నడుస్తోంది. ఒకవైపు పునరుజ్జీవం పొందుతూ.. ఈసారి ఎన్నికల్లో తెరాసను మట్టికరపించి.. అధికారంలోకి వస్తాం అంటూ కాంగ్రెస్ పార్టీ ఉరకలెత్తుతోంటే.. ఆ పార్టీలో అంతో ఇంతో ఠికానా ఉన్న…

తెలంగాణ రాజకీయంలో ప్రస్తుతం ఆహ్వానాల పర్వం నడుస్తోంది. ఒకవైపు పునరుజ్జీవం పొందుతూ.. ఈసారి ఎన్నికల్లో తెరాసను మట్టికరపించి.. అధికారంలోకి వస్తాం అంటూ కాంగ్రెస్ పార్టీ ఉరకలెత్తుతోంటే.. ఆ పార్టీలో అంతో ఇంతో ఠికానా ఉన్న లీడర్లందిరినీ ఖాళీ చేసేయడానికి తెరాస స్కెచ్ వేసినట్లుగా కనిపిస్తోంది. ప్రధానంగా గత ఎన్నికల ఫలితాలను బట్టి చూసినప్పుడు.. తెరాస కాస్త బలహీనగా కనిపించిన జంటనగరాల్లో బలం పుంజుకోవడంపై వారు కాన్సంట్రేట్ చేస్తున్నారు. అందులో భాగంగా.. కాంగ్రెస్ ను ఖాళీ చేయడానికి  ప్రయత్నాలు సాగుతున్నట్లు కనిపిస్తోంది.

ఎవరు అవునన్నా, కాదన్నా.. కులాలే రాజకీయాలను శాసిస్తున్న మాట కొంత వరకు నిజం. తెలంగాణలో కూడా రాజకీయ అధికారాన్ని , పెత్తనాన్ని అందిపుచ్చుకోవడంపై కులాల మధ్య పోటీ ఉంది. తెరాస వెలమల పార్టీగా, కాంగ్రెస్ రెడ్ల పార్టీగా ముద్ర పడిపోయాయి. ఆ నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి రెడ్లను ఆకర్షించడం కష్టమే అయినప్పటికీ.. అక్కడ ఎటూ మీకు భవిష్యత్తు ఉండదు.. అనే పాయింటును చూపిస్తూ ఇతర కులాల వారిని తమ పార్టీలోకి లాగేయడానికి గులాబీ దళం అత్యుత్సాహంతో పనిచేస్తున్నట్లుగా కనిపిస్తోంది.

కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే ఇటీవలి కాలంలో ఆ పార్టీలో చేరిన ప్రముఖులు రేవంత్ రెడ్డి, నాగం జనార్దనరెడ్డి లాంటి వారు మాత్రమే. తీరా ఇప్పుడు ఎన్నికల వేళ దగ్గరకు వస్తున్న సమయంలో వలసల విషయంలో తెరాస గేర్ మార్చింది. ఎన్నటినుంచో తెరాసలోకి ఫిరాయించడానికి మంతనాలు చేసుకుంటూ వచ్చిన దానం నాగేందర్ ను చేర్చేసుకున్నారు. తాజాగా ఇప్పుడు భాగ్యనగరంలో కాంగ్రెస్ కు మరో కీలక నాయకుడుగా గుర్తింపు ఉన్న మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కు కూడా ఎర వేశారు. తెరాస నాయకులు వెళ్లి ఆయన జన్మదిన వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొనడం, ప్రత్యేకంగా ఆంతరంగికంగా భేటీ కావడం ఇదంతా వలసలకు సంకేతాలే.

అయితే పార్టీ వర్గాల ద్వారా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి.. తెరాసలోకి వలసలు ముఖేష్ తో కూడా ఆగకపోవచ్చునని తెలుస్తోంది. తెరాసకు బలమైన ప్రత్యర్థిగా ఎదగాలని అనుకుంటున్న కాంగ్రెస్ ను కూడా ఖాళీ చేయడం టార్గెట్ గా వారు చెలరేగుతున్నారు. తెదేపాను దాదాపుగా ఇప్పటికే ఖాళీ చేసేశారు. అక్కడ పూర్తిగా కొత్త నెత్తురు రావాల్సిందే. ఇప్పటికి ఉన్న వారిలోనూ కొందరు రాబోయే రోజుల్లో జారిపోయినా ఆశ్చర్యం లేదని పలువురు అంటున్నారు.