మునుగోడు ఫలితం బయటకు వచ్చింది. తెరాస గెలిచింది. బిజెపి కొంతమేరకు గెలిచింది. ఓడినది మాత్రం రాజగోపాల రెడ్డే. ఆ ప్రాంతమంతా తమ సోదరులదే, తమకు ఎదురు చెప్పేవారే లేరు అని అహంకరించి, హడావుడి చేసినందుకు ఉన్న పదవి ఊడింది.
తెలంగాణ ఉద్యమసమయం నుంచి చూస్తున్నాను, ఆ సోదరుల నోటికి హద్దుండదు. నాయకులెవరినీ లెక్క చేయరు. 2018లో కాంగ్రెసు ద్వారా గెలిచి, చాలాకాలంగా బిజెపితో గుసగుసలాడుతూ, అటువైపు వెళ్లిపోతా జాగ్రత్త అని కాంగ్రెసు నాయకత్వాన్ని బెదిరిస్తూ, చివరకు అంత పనీ చేస్తే ఫలితం యిలా వచ్చింది.
అతన్ని నమ్ముకుని బిజెపి చాలా పెట్టుబడి పెట్టింది, చాలా శ్రమ పడింది. తెరాస సర్వశక్తులూ ఒడ్డి, అతి కష్టం మీద గెలిచింది. అన్నీ హుజూరాబాద్లు కావని, అభ్యర్థులందరూ ఈటల రాజేందర్లు కారనీ నిరూపించింది. రాజగోపాల్ నెగ్గి ఉంటే బిజెపి అతన్ని పెద్ద హీరోని చేసి కూర్చోబెట్టేది. ఇప్పుడు ఏం చేస్తుందో, పార్టీలో అతనికి పరువు ఏం దక్కుతుందో వేచి చూడాలి.
రాజగోపాల్ కాంగ్రెసు పార్టీ నాయకుడిగా పని చేయలేదు. తన వ్యక్తిగత యిమేజిని పెంచుకోవాలనే చూశాడు. నియోజకవర్గంలోని ఓటర్ల యిళ్లలో ఏదైనా ఫంక్షనుంటే డబ్బు పంపుతూ, కొన్నిటికి హాజరవుతూ, పనులు చేసిపెడుతూ తనకు విశ్వాసంగా ఉండే అనేకమందిని తయారు చేసుకున్నాడు. ఇది నా అడ్డా అని పరిపూర్ణంగా నమ్మాడు. అందుకే యీ జూదం ఆడాడు.
బిజెపికి ఆ నియోజకవర్గంలో 2018లో వచ్చినది 12800 ఓట్లు. నల్గొండ జిల్లాలో కాంగ్రెసుకు, కమ్యూనిస్టులకు బలం ఉంది తప్ప బిజెపికి ఎన్నడూ లేదు. బిజెపికి బలం లేకపోతే ఏమైంది, నా బలం ఉంది కదా, దానొక్కదానితోనే తెరాసను ఎదుర్కోగలను అని యీయన ధీమా. దీనిలో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటాను అని ప్రకటించాడు. తీరా చూస్తే అది చాలలేదు. ఇప్పుడు నాది నైతిక విజయం అని చెప్పుకుంటూ సన్యాసం ఐడియాను అటకెక్కించాడు.
తెరాసకు 97 వేలు బిజెపికి 86700 కాంగ్రెసుకు 23900 వచ్చాయి. మెజారిటీ 10,300. తెరాస ఓటింగు శాతం గతంలో కంటె పెరిగి 43% అయింది. బిజెపీకి గతంలో కంటె పెరిగి 38.4% అయింది. వ్యత్యాసం 4.6%. కాంగ్రెసు 10.6% దగ్గర ఆగిపోయింది. కారు గుర్తును పోలిన గుర్తులను తీసివేయించాలని చూసినా బిజెపి పడనివ్వలేదు. దానివలన 6500 ఓట్లు తెరాస నష్టపోయింది. అవి కూడా కలుపుకున్నా తెరాసకు 11 వేలు వచ్చాయని అనుకోవాలి. వాళ్లు 30 వేల దాకా వస్తుందని ఆశ పెట్టుకున్నారట. కమ్యూనిస్టులకున్న రమారమి 15 వేల ఓట్లు పడ్డాయి కాబట్టే తెరాస నెగ్గింది కానీ లేకపోతే మునిగేది అని అర్థమౌతోంది. అది రాజగోపాల్‌కు మంటగా ఉంది.
2018లో కాంగ్రెసు అభ్యర్థిగా ఆయనకు టిడిపి, లెఫ్ట్ పార్టీలు మద్దతిచ్చాయి. ఇప్పుడు లెఫ్ట్ పార్టీలు తెరాసకు మద్దతిచ్చాయి. లెఫ్ట్ నాయకులు అమ్ముడుపోయారు అని స్టేటుమెంటు యిచ్చాడు. అంతే 2018లో వాళ్లను ఆయన కొనుక్కున్నాడా? ఇప్పుడు బిజెపి వాళ్లను కొనుక్కున్నాడా? ఏమైతేనేం, అప్పుడు 37 వేల మెజారిటీతో నెగ్గితే ఇప్పుడు పదివేల ఓట్ల తేడాతో ఓడిపోయాడు.
తన నియోజకవర్గంలోని పట్టణ ప్రాంతాల ఓటర్లపై చాలా ఆశలు పెట్టుకున్నట్లుంది. ఆ రౌండ్లు పూర్తి కాగానే, మేం అనుకున్నంత మద్దతు రాలేదు అని ఒప్పేసుకున్నాడు. 12 వ రౌండు పూర్తయ్యేసరికి ‘చూసింది చాల్లే’ అనుకుని, కౌంటింగు సెంటర్ నుంచి లేచి వెళ్లిపోయాడు. అల్టిమేట్‌గా ఆయన చేసినదేమిటి? ప్రతిపక్ష పార్టీ ఐన కాంగ్రెసు సంఖ్యను తగ్గించి, తెరాసకు యింకో సీటును కట్టబెట్టడం, బిజెపి నాయకుల ఉత్సాహంపై నీళ్లు చల్లడం!
ఆ విధంగా ఆయన మనకు ఉపకారం చేశాడనే చెప్పాలి. లేకపోతే బండి సంజయ్ బడబడ భరించలేక పోయేవాళ్లం. మునుగోడులో నెగ్గి ఉంటే కెసియార్ తక్షణం రాజీనామా చేసి ప్రజల తీర్పు కోరాలని పెద్ద హంగామా చేసేసి ఉండేవాడు. తెరాస నుంచి తండోపతండాలుగా మా పార్టీలోకి ఫిరాయించేస్తున్నారు, ప్రభుత్వం పడిపోతోందని హడావుడి చేసేసేవాడు.
అసలు ఆగస్టులో రాజగోపాల్ రాజీనామా చేసిన దగ్గర్నుంచి మునుగోడు గురించి ఒకటే గొడవ. ఎవరు నెగ్గుతారు అంటూ పత్రికలు, టీవీలు హోరెత్తించడంతో విసుగు వచ్చింది. ఆఫ్టరాల్ ఒక్క ఎమ్మెల్యే సీటు అదీ ఏడాది పాటు ఉండేది, దీనికోసం యింత హంగామానా అని. అబ్బే తెలంగాణ రాజకీయాలను మలుపు తిప్పే ఎన్నిక యిది అని బిజెపి వాళ్లు చావగొట్టేశారు. ఇప్పుడు చప్పబడి 87 వేల ఓట్లు వచ్చాయి, అదీ గొప్పే అని చెప్పుకుని ఊరడిల్లుతున్నారు. వాటిలో రాజగోపాల్ ఖాతాలో ఎన్ని వేయాలి, బిజెపి ఖాతాలో ఎన్ని వేయాలి అనేదానిపై రకరకాల లెక్కలు చెప్తున్నారు నిపుణులు.
బలమైన అభ్యర్థి దొరికినపుడు ఉపయెన్నికలు తెప్పించి, వాటిలో గెలిచి, మేం విన్నింగ్ స్ట్రీక్‌లో ఉన్నాం, రాబోయే ప్రభుత్వం మాదే అని చూపుకోవాలని బిజెపి వ్యూహం. 2023 ఎన్నికల నాటికి 119 స్థానాల్లోనూ బలమైన అభ్యర్థులు దొరికే ఛాన్సు ఎలాగూ ఉండదు. 20-25 స్థానాల్లో మాత్రమే ఉన్నారని ఎవరో రాశారు. వారెవరో నా అంచనాకు అందటం లేదు. తెరాసలో టిక్కెట్టు దొరకని వారు కొందరు యిటు వస్తారని లెక్కేశారేమో! ఈ లోపున పబ్లిక్ దృష్టిలో బిజెపి బలమైన శక్తి అని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. అందువలన కెసియార్చే అవమానింపబడి వచ్చినపుడు ఈటెలను చటుక్కున వాటేసుకున్నారు. తమ యంత్రాంగంతో, ఈటెల మీద సానుభూతితో హుజూరాబాద్ 23900 మెజారిటీతో గెలిచేశారు. ఇప్పుడు రాజగోపాల్ దొరికాడు. అదే యంత్రాంగం. కానీ 10 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అంటే దాని అర్థం బలమైన అభ్యర్థి దొరికినా నెగ్గుతామన్న గ్యారంటీ లేదన్నమాట. గెలుపోటములను నిర్ణయించే అనేక అంశాలుంటాయన్నమాట.
హుజూరాబాద్ విషయంలో అది కెసియార్ తెచ్చిపెట్టిన ఎన్నిక. అవమానకరంగా ఈటెలను కాబినెట్ నుంచి పంపించి, వేధించాడు. అందుకే కెసియార్‌కు ప్రజలు బుద్ధి చెప్పారు. మునుగోడులో వచ్చినది అనవసరమైన ఎన్నిక. ఓ ఏడాది కళ్లు మూసుకుంటే పోయేదానికి ఎన్నిక తెచ్చిపెట్టాడు రాజగోపాల్. ఎందుకు అంటే, ‘ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉండడం చేత నియోజకవర్గంలో అభివృద్ధి జరగటం లేదు’ అని సాకు చెప్పాడు. అలా అని అధికార పక్షంలోకి కాకుండా మరో ప్రతిపక్షంలో చేరాడు. ‘భలేగా గుర్తు చేశావు, ఈసారి అధికార పక్ష అభ్యర్థిని గెలిపించి అభివృద్ధి చేసుకుంటాం.’ అంటూ ప్రజలు తెరాస అభ్యర్థిని గెలిపించారు.
మూడున్నరేళ్లగా అభివృద్ధి జరగకపోతే చింతించని వాడు యిప్పుడే ఎందుకు చింతించాడు అంటే 18 వేల కోట్ల కాంట్రాక్టు వచ్చింది కాబట్టి అనుకున్నారు ప్రజలు. కాంట్రాక్టు మాట నిజమే అని రాజగోపాల్ ఒప్పుకున్నాడు. దానితో పాటు అతని సుశీ ఇన్ఫ్రాకు ఝార్ఖండ్‌లో రూ.3437 కోట్ల గని ప్రాజెక్టు ఎలాట్ చేసిన గొడవ ఒకటి బయటకు వచ్చింది. బిజెపి నేతలతో బేరాలాడిన ప్రతీసారీ దాని ఫైల్ ఎలా కదిలిందో మధు యాష్కీ వివరాలిచ్చారు. అదే కంపెనీ నుంచి ఎన్నికల వేళ రూ. 5.24 కోట్లు నియోజకవర్గంలోని ఓటర్లకు, కంపెనీలకు చెల్లింపులు చేశారని తెరాస వివరాలు అందచేస్తే ఎన్నికల కమిషన్ సంజాయిషీ అడిగింది. ఆ కంపెనీకి నాకు సంబంధం లేదు అనేశారు రాజగోపాల్. దానిలో ఆయన భార్యకు, కూతురికి 90% వాటాలున్నాయి. దాని ఎండీ వాళ్ల అబ్బాయి. అయినా ఆయనకు సంబంధం లేదంటే ఎన్నికల కమిషన్ నమ్మేసింది. దీని ప్రకారం చూస్తే ఆయన స్వలాభం కోసం బిజెపి వ్యూహంలో పావుగా మారడానికి ఒప్పుకున్నాడని తేటతెల్లమౌతుంది. తన పలుకుబడితో, డబ్బుతో సీటు నెగ్గేస్తే బిజెపి తరఫున రాష్ట్రస్థాయిలో పెద్ద లీడరై పోయి, బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందుకొద్దామని అనుకున్నాడేమో కూడా.
ఇది కాంగ్రెసు ఓటర్లకు ఏహ్యత కలిగించిందని సర్వేలు చెప్తున్నాయి. అందుకే వాళ్లు అతనిపై పగ బట్టి, అతన్ని ఓడించేందుకు కాంగ్రెసుకు బలం చాలదని గ్రహించి తమ ఓటు తెరాసకు వేశారని నిపుణులు చెప్పారు. రాజగోపాల్‌తో పాటు నియోజకవర్గంలోని కాంగ్రెసు క్యాడర్ మొత్తం తమ పార్టీలో చేరుతుందని భావించిన బిజెపి నాయకులు నిరాశ పడ్డారని కూడా వార్తలు వచ్చాయి. పోలింగు తేదీ దగ్గర పడుతున్నకొద్దీ బిజెపి నాయకులకు అనుమానాలు రాసాగాయి. అందుకే చివర్లో జరగవలసిన నడ్డా మీటింగు కాన్సిలైంది. (ఆ విషయమై రాజగోపాల్‌కి కోపం వచ్చిందని చదివాను). కౌంటింగు ముందు రోజు రాజగోపాల్ తను 5 వేల మెజారిటీతో నెగ్గుతానని అన్నారు. కౌంటింగు రోజు టీవీ చర్చల్లో పాల్గొన్న బిజెపి నాయకుడు డా. ప్రకాశ్ రెడ్డి నెగ్గినా, ఓడినా వెయ్యి ఓట్ల మార్జినే అన్నారు.
చివరకు తన స్వార్థం కోసం బలవంతపు ఎన్నిక తెచ్చిపెట్టి, ఏమీ బావుకోని నాయకుడిగా రాజగోపాల్ మిగిలారు. అతని అన్నగారు వెంకటరెడ్డిది మరీ దుర్మార్గం. కాంగ్రెసు పార్టీ వదిలిపెట్టకుండా, ప్రచారంలో పాల్గొనకుండా, తమ్ముడికి ఓటేయమని మెసేజిలు పంపుతూ అన్ని రకాలుగా నమ్మకద్రోహం చేశాడు. వ్రతం చెడినా ఫలం దక్కలేదు. ఓటమి వెక్కిరిస్తోంది. ఇలాటి ప్లాన్లు వేసే నాయకులందరికీ యిది హెచ్చరికగా పని చేయాలి. ఎన్నికలకు ముందు పార్టీలు మారితే సరేలే అనుకోవచ్చు. కానీ స్ట్రాటజీలో భాగంగా ఉపయెన్నికలు తెస్తే దానివలన ప్రజలకు ఏ లాభమూ లేదు.
తెరాస అభ్యర్థి ప్రభాకర రెడ్డిపై చాలా వ్యతిరేకత ఉంది. అనేకమంది అతనికి టిక్కెట్టు యివ్వవద్దని చెప్పినా కెసియార్ యిచ్చారు. అతనిపై కోపంతో చాలామంది బిజెపికి ఓటేశారు కానీ లేకపోతే గెలుపు మార్జిన్ యింకా ఉండేది అంటున్నారు. మరో చోట బలమైన నాయకుణ్ని తమ పార్టీలోకి గుంజుకుని యింకో ఉపయెన్నిక తెచ్చే మరో ప్రయోగం బిజెపి చేస్తుందా? అక్కడ తెరాసకు మంచి అభ్యర్థి దొరికితే? ప్రయోగాలు చేయడానికి బిజెపికి యీ నెల మాత్రమే గడువుంది. 2023 డిసెంబరులో అసెంబ్లీ ఎన్నికలు వచ్చేస్తాయి కాబట్టి ఏడాది గడువు లేకపోతే ఉప ఎన్నికలు జరపరు. తమకు పట్టున్న అర్బన్ ప్రాంతంలో మరో ప్రయోగం చేయాలని బిజెపి చూస్తోందని వార్త వచ్చింది. కర్మకాలి అది కూడా ఫెయిలైందంటే బిజెపికి పరువు పోతుంది.
బిజెపి మహా అయితే కాంగ్రెసును కొట్టగలదు కానీ తెరాసను కొట్టలేదు అనే అభిప్రాయం ప్రజల మనసుల్లో పడిపోతుంది. బిజెపి రిస్కు తీసుకుంటుందో లేదో చూడాలి. దీనిలోనే రాజగోపాల్‌కు అమిత్ షాతో తప్ప స్థానిక బిజెపి నాయకులతో సమన్వయం లేదని, రాజగోపాల్ కాంగ్రెసు నుంచి తన వెంట వచ్చినవారికే బాధ్యతలు అప్పగించటం వీళ్లకు నచ్చలేదని వార్తలు వచ్చాయి. రాజగోపాల్‌కు ఎంత డబ్బున్నా అతను డబ్బు పంపిణీ చేయకుండా తెరాస అతని సహచరులందరిపై నిఘా పెట్టిందిట. అధికారికంగా దాదాపు రూ.30 కోట్లు వివిధ ప్రాంతాల్లో సీజ్ అయిందట. అలాటప్పుడు అభ్యర్థి ఎంత ధనవంతుడైనా పెద్దగా లాభం ఉండదు.
ఇలాటి ఉపయెన్నికలు ఎన్ని జరిగినా ఉపయోగం లేదు. జనరల్ ఎన్నికలు వచ్చేసరికి ప్రతీ చోట ప్రతిపక్షానికి రాజగోపాల్ వంటి బలమైన అభ్యర్థి దొరకడు, ప్రతీ చోట అధికార పక్షం యిన్నేసి కోట్ల ప్రభుత్వధనాన్ని వ్యయం చేయలేదు. ఇందరేసి మంత్రులను, ఎమ్మెల్యేలను, అధికారులను మోహరించలేదు. అయితే యీ ఎన్నిక తమ బలాబలాలపై అధికార పక్షానికి, ప్రతిపక్షానికి కొన్ని పాఠాలు నేర్పి ఉంటుంది. దానిలో మొదటిది ఎన్ని సంక్షేమ పథకాలు గుప్పించినా ఒక పరిమితికి మించి అది ఓట్లు రాల్చదు. మునుగోడులోని 2.41 లక్షల ఓటర్లలో 2.38 లక్షల మంది లబ్ధిదారులు ఉంటే 97 వేల మంది మాత్రమే అధికార పార్టీకి ఓటేశారు. వారిలో కూడా యితర కారణాలపై ఓటేసినవారు 20% మంది ఉన్నారనుకుంటే, పథకాలు చూసి వేసిన వారు 77 వేలు, అంటే లబ్ధిదారుల్లో 32% మంది మాత్రమే నన్నమాట. పథకాలు గుప్పిస్తే చాలు, సమాజంలో యితర వర్గాలకు గుండు కొట్టినా ఫర్వాలేదనే ధీమాతో ఉన్న జగన్ ఈ విషయాన్ని బాగా గుర్తు పెట్టుకోవాలి.
రెండోది ఓట్లు అమ్మడమనేది ఓటర్లకు మప్పితే వాళ్ల డిమాండ్లకు తట్టుకోలేని పరిస్థితి వస్తుంది. తిరుపతి ఉపయెన్నికలో వైసిపి ఓటర్లకు డబ్బు పంచలేదని అందరూ ఒప్పుకున్నారు. అధికార పార్టీ యివ్వకపోవడంతో ప్రతిపక్షమూ యివ్వలేదు. ఇక్కడ అవతలివాళ్లు యిస్తారేమో, ఓటర్లకు అటు తిరిగిపోతారేమోనన్న భయంతో యివ్వడం మొదలెట్టేసరికి అది వేలంపాటలా పెరుగుతూ పోయింది. చివరకు తెరాస ఓటుకి 5 వేలు, బిజెపి 4 వేలు యిచ్చిందని వినికిడి. అది నిజమైతే ఐదేసి వేలిచ్చి కేవలం పదివేల మార్జిన్ తెచ్చుకున్నందుకు తెరాస దుఃఖించాలి, 4 వేలూ వేస్టయినందుకు బిజెపి దుఃఖించాలి. 9 వేలు దక్కినా, ఓటుకి తులం బంగారం యివ్వలేదని ఓటరూ దుఃఖించాడు. ఆశ అంటూ మొదలైతే ఎక్కడ ఆగుతుందో ఎవరూ చెప్పలేరు. గతంలో కొన్ని వర్గాలు మాత్రమే ఓటు అమ్ముకునేవారు. ఇప్పుడు దాదాపు 90% మంది ఓటర్లు అమ్ముకున్నట్లు చెప్తున్నారు.
ఇకపై ప్రతి ఎన్నికా యిలాగే నడిస్తే, ఓటర్ల దాహాన్ని ఎవరు తీర్చగలరు? మద్యదాహం ఎలాగూ తీర్చవలసి వస్తోంది (రూ. 300 కోట్ల మద్యం అమ్ముడు పోయిందంటున్నారు) ధనదాహం కూడా తీర్చాలంటే పార్టీలన్నీ చేతులు పైకెత్తేయ వలసి వస్తుంది. ఓటర్లు ఒకరే కాదు, కార్యకర్తల దగ్గర్నుంచి సర్పంచుల దగ్గర్నుంచి ప్రతీవాళ్లూ డబ్బు అడిగారట. ఏదో బిర్యానీ తినిపిస్తాం, క్వార్టరు యిస్తాం అంటే సరిపోయే పరిస్థితి లేదు. దానితో పాటు డబ్బూ అడుగుతున్నారు. డబ్బు పుచ్చుకున్నాక ఓటేస్తారన్న గ్యారంటీ ఉందా? డబ్బు దారి డబ్బుదే, ఓటు దారి ఓటుదే. అలాటప్పుడు డబ్బు పంచడం దేనికి అనేది పార్టీలు గట్టిగా ఆలోచించాలి.
నిన్ననే టీవీలో ఎవరో చెప్తున్నారు. గత గుజరాత్ ఎన్నికలలో అసెంబ్లీ నియోజకవర్గానికి రూ.30 లక్షలు ఖర్చయిందట. మన దగ్గర సర్పంచ్ ఎన్నికకు అది సరిపోదు. కాంగ్రెసు ఏమీ పంచలేదట. (రూ.500 పంచిందని ఒకరన్నారు) అయినా దానికి 24 వేల ఓట్లు వచ్చాయి కదా. అంటే పార్టీకి వేద్దామనుకునే వాడు వేసి తీరతాడు. వేద్దామనుకోని వాడు డబ్బు పుచ్చుకునీ వేయడు. ఇదీ నీతి.
ఉపయెన్నిక వచ్చిన నియోజకవర్గానికే అభివృద్ధి చేస్తామనే హామీలివ్వడం, బకాయిలన్నీ గబగబా చెల్లించడం ప్రమాదకరమైన క్రీడ. ఇలా అయితే రిజైన్ చేయి, మన ఊరు బాగుపడుతుంది అంటూ ప్రతి ఎమ్మెల్యే మీద ఒత్తిడి పెరుగుతుంది. అన్ని ప్రాంతాలను సమానదృష్టితో సమగ్రంగా అభివృద్ధి చేస్తే యీ యిబ్బందులుండవు. అధికార పార్టీకి యువత దూరమైంది కాబట్టే యింత తక్కువ మార్జిన్ వచ్చింది అంటున్నారు. ఉద్యమసమయంలో కెసియార్ వారిలో ఉవ్వెత్తున ఆశలు కల్పించారు. ఇంటికో ఉద్యోగం అన్నారు. ప్రయివేటు కంపెనీల్లో కూడా స్థానికులకు రిజర్వేషన్లు అన్నారు. అవేమీ జరగలేదు. నిజానికి హైదరాబాదు, పరిసర ప్రాంతాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్నాయి. అనేక పరిశ్రమలు, అన్ని రకాలవి, కొత్తగా వస్తున్నాయి. తెలుగేతరులెందరూ చిన్నా పెద్దా ఉద్యోగాలలో కనబడుతున్నారు. వారందరికీ వచ్చిన ఉద్యోగాలు స్థానికులకు ఎందుకు రావు?
అంతేకాదు, తెరాస పాలన వచ్చాక సాగునీటి వసతి బాగా పెరిగింది. హైదరాబాదు చుట్టుపట్ల జిల్లాలన్నిటిలో వ్యవసాయం లాభసాటిగా మారింది. భూముల రేట్లు పెరిగాయి. ఈ యువత వ్యవసాయం చేసుకునైనా ఉపాధి కల్పించుకోవచ్చు. పెద్ద పరిశ్రమలకు అనుబంధంగా చిన్న పరిశ్రమలు పెట్టుకోవచ్చు. పెరుగుతున్న కాలనీలలో దుకాణాలు పెట్టుకుని, వ్యాపారాలు చేసుకోవచ్చు. అయినా యువతలో అసంతృప్తి ఉందంటే వీళ్లంతా వైట్ కాలర్ జాబ్స్ కోసం ఎదురుచూస్తూ ఉపాధి అవకాశాల కోసం వెతుక్కోవటం లేదేమో అనిపిస్తోంది. ఉద్యమ సమయంలో వారిలో లేనిపోని ఆశలు కల్పించినందుకు తెరాస యిప్పుడు అనుభవిస్తోందన్నమాట.
తెరాస గ్రహించ వలసిన యింకో విషయం ఏమిటంటే ప్రతిపక్షాన్ని బతక నివ్వాలి. రెండు సీట్లు మాత్రమే గెలుచుకున్న టిడిపిని మొత్తంగా తనలో కలిపేసుకుని తుడిచి పెట్టేసింది సరే, 19 సీట్లు తెచ్చుకున్న కాంగ్రెసు లోంచి 12 మందిని ఫిరాయింప చేసుకోవడమెందుకు? 119 సీట్లలో 88 సీట్లు గెలుచుకున్నామన్న తృప్తి లేకుండా దాన్ని 100కు ఆ పైన 104కి తీసుకెళ్లాలన్న యావ ఎందుకు? 1978 అసెంబ్లీ ఎన్నికలలో ఇందిరా కాంగ్రెసు బొటాబొటీగా గెలిచి ప్రభుత్వం ఏర్పరచింది. ఆ తర్వాత జనతా పార్టీ నుంచి, రెడ్డి కాంగ్రెసు నుంచి ఎడాపెడా ఫిరాయింపులు ప్రోత్సహించి పార్టీని పెద్దది చేశాననుకుంది. దాంతో అంతర్గతంగా కుమ్ములాటలు పెరిగాయి. 1983లో ఎన్టీయార్ ప్రభంజనం వచ్చి కాంగ్రెసును చావుదెబ్బ కొట్టింది. అందువలన ప్రతిపక్షాలను నిర్మూలిస్తే, అంతిమంగా నష్టపోయేది తనే.
కాంగ్రెసును ఖతం చేయడం వలన యిప్పుడు బిజెపి ముందుకు వచ్చింది. కాంగ్రెసును బతకనిచ్చి ఉంటే ముప్పేట పోరులో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి తెరాస లాభపడేది. ఇప్పుడు మునుగోడులో కూడా కాంగ్రెసు మరింత బలంగా ఉండి ఉంటే, బిజెపికి అన్ని ఓట్లు వచ్చేవి కావు. ప్రతిపక్షాలకు తావు లేకుండా మొత్తం సీట్లు తామే గెలవాలని చూసినా, ఎన్నికల అనంతరం ఫిరాయింపులను ప్రోత్సహించినా జరిగే అనర్థం యిది అని కళ్ల ఎదుట కనబడుతోంది. బిజెపి తెలుసుకోవలసిన పాఠం ఏమిటంటే, ఇల్లలకగానే పండగ కాదని. హైదరాబాదు కార్పోరేషన్ ఎన్నికలలో సీట్లు బాగా రాగానే తెరాస ప్రభుత్వాన్ని పడగొట్టే శక్తి తమకు వచ్చిందని అనుకోరాదని.
సాధారణంగా పట్టణ ప్రాంతాల్లో, ముఖ్యంగా రాజధానిలో అధికార పార్టీ పట్ల వ్యతిరేకత ఎప్పుడూ ఉంటుంది. ఇక్కడ మధ్య తరగతి జనం, అధికాదాయ వర్గాలు, పేపరు బాగా చదివే ప్రజలు ఎక్కువగా ఉండి ఎప్పుడూ అసంతృప్తితో రగులుతూంటారు. కానీ గ్రామాల్లో పరిస్థితి అలా ఉండదు. అక్కడ చిన్నదానికే సంతోషపడే వర్గాలుంటాయి. బిజెపికి తెలంగాణలో పట్టు చాలా తక్కువ. క్రమేపీ పార్టీని పటిష్టపరుచుకుంటూ రావాలి. నాయకులు హెచ్చులకు పోయి, బడాయి కబుర్లు చెపితే జనం నవ్వుకుంటారు. రాజగోపాల రెడ్డి వంటి బలమైన నాయకుణ్ని పెట్టుకుని కూడా మునుగోడులో ఓడిపోయారు కదా, యిప్పటికైనా ప్రలాపాలు తగ్గించాలి. ఇప్పటికైనా లేనిపోని ఛాలెంజులు చేసేముందు తమాయించుకోవాలి. లేకపోతే ప్రజల్లో నవ్వులపాలవుతారు, క్యాడర్లో ఆత్మవిశ్వాసం తగ్గుతుంది.
కాస్త నిదానంగానైనా పార్టీని నిర్మించుకోవాలి, విశ్వసనీయులైన నాయకులను తయారు చేసుకోవాలి. ఇతర పార్టీల నుంచి ఫిరాయింపుదార్లను తెచ్చి అర్జంటుగా అధికారాన్ని చేజిక్కించుకోవాలని చూస్తే యిలాగే తడబడాల్సి వస్తుంది. తెల్లవారి లేస్తే కాంగ్రెసును బండబూతులు తిడుతూ జీవితమంతా కాంగ్రెసులో గడిపిన రాజగోపాల్‌ను పార్టీలో ఎందుకు తీసుకున్నారంటే వారి వద్ద సమాధానం ఏముంది? గెలిచే కాండిడేట్ అని తీసుకున్నాం అని చెప్పుకోవాలి. అలాటప్పుడు సిద్ధాంతాలపై నడిచే పార్టీ అని ఎలా నమ్మించగలరు? 2023లో కూడా తెరాస అధికారంలోకి వచ్చి, బిజెపి ఎమ్మెల్యేలను చేర్చుకోవడానికి చూస్తే వీళ్లంతా వలస పక్షుల్లా వెళ్లిపోతారేమో! మునుగోడు ఎన్నికకు ముందు ఎంతమంది టపటపా పార్టీ ఫిరాయించారో చూశాం కదా!
నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం నేర్పుతున్న పాఠం ఏమిటి? ఇలాటి వ్యవహారాలతోనే 8 ప్రభుత్వాలను పడగొట్టి ఉండవచ్చు. కానీ రోజులన్నీ మనవి కావు. పదిమంది ఎమ్మెల్యేలను ఫిరాయింప చేసి, కెసియార్ పని అయిపోయింది, తెరాస మునిగే నౌక అని గ్రహించి, అందరూ అతన్ని విడిచి వెళ్లిపోతున్నారు అని మీడియాలో హంగు చేద్దామని ప్లాను వేసుకుంటే అది బెడిసికొట్టింది. బిజెపి యిలా చేసిందా అని ప్రజలెవ్వరూ నివ్వెరపోలేదు.
ఎమ్మెల్యేలు ఫిరాయిస్తున్నారంటే అమ్ముడు పోతున్నారనే ప్రజలకు కచ్చితంగా తెలుసు. సిద్ధాంతాల కోసం పార్టీ మారామని అంటే చిన్న పిల్లాడు కూడా నమ్మడు. అందుకే ఫామ్‌హౌస్ సంఘటన మునుగోడు ఎన్నికపై ప్రభావం చూపలేదంటున్నారు. అక్కడున్న నలుగురు ఎమ్మెల్యేలలో ముగ్గురు కాంగ్రెస్ నుంచి యీ మార్గాన్నే తెరాసలోకి వచ్చారు కదా! తాము ఓట్లు అమ్ముకుంటున్నట్లే, ఎమ్మెల్యేలు తమను తాము అమ్ముకుంటున్నారు, దీనిలో విడ్డూరం ఏముంది అని ఓటరు అనుకుని ఉంటాడు.
మునుగోడు ఎన్నిక తర్వాత బిజెపి గ్రహించ వలసిన విషయం ఒకటుంది. కెసియార్ పట్ల అసంతృప్తి ఉంది కానీ ఓటర్లకు ఆగ్రహం లేదు. కెసియార్‌ను తీసిపారేసి బండి సంజయ్‌ను నెత్తిన పెట్టుకునేందుకు ప్రజలు ఉబలాట పడటం లేదు. పరిస్థితి మారేంతవరకు బిజెపి ఓపిక పట్టాలి. దూషణలు తగ్గించాలి. కెసియార్ కుటుంబపాలన గురించే అస్తమానం మాట్లాడితే లాభం లేదు. ముఖ్యంగా రాజగోపాల్ మాట్లాడితే నవ్వు వచ్చింది. తనూ అన్నగారూ కలిసి యింకొకరికి ఛాన్సివ్వకుండా ఆ ప్రాంతాన్ని ఏలేస్తూ మరొకరిని ఎలా అంటారు? కుటుంబపాలన అనేది మధ్యతరగతిలో పెద్ద అంశం కానీ గ్రామీణుల్లో కాదు. జనతా పార్టీ నాయకుడైన దేవీలాల్‌ను ఓ సారి అడిగారు, పదవులన్నీ నీ బంధువులకే కట్టబెడుతున్నావే అని. అతను ‘నా వాళ్లకు కాకపోతే బన్సీలాల్ (కాంగ్రెసు ప్రత్యర్థి) బంధువులకు కట్టబెట్టాలా?’ అని. హరియాణా జనం పకపకా నవ్వారు తప్ప అతన్ని తప్పుపట్టలేదు. మన ప్రజాస్వామ్యంలోనే రాచరికపు ఛాయలున్నాయని మర్చిపోకూడదు.
ఇక కాంగ్రెసు పార్టీ నేర్చుకోవలసిన పాఠం ఏమిటంటే పార్టీ ఎంత నిస్తేజంగా ఉన్నా, నాయకులు తమలో తాము ఎంత కలహించుకుంటున్నా ప్రజల్లో దాని పట్ల నమ్మకం యింకా పోలేదు. ప్రముఖ నాయకులు ప్రచారానికి రాకపోయినా, డబ్బివ్వకపోయినా 24 వేల ఓట్లు పడ్డాయంటే గొప్పే కదా! తెరాస, బిజెపి నాయకులు సమ ఉజ్జీలుగా ఉండే నియోజకవర్గాల్లో కాంగ్రెసు గెలవవచ్చేమో కూడా! అది దృష్టిలో పెట్టుకుని నాయకులు అంతఃకలహాలు మానాలి. రేవంత్ రెడ్డి తంటాలు పడుతూంటే పడనివ్వాలి. పత్రికలకెక్కి యాగీ చేసి పార్టీ పని అయిపోయిందనే భావాన్ని ప్రజలకు కలిగించ కూడదు. పార్టీకి యింకా ఓటు బ్యాంకు ఉందని చూపించుకుంటే, 2023 ఎన్నికలలో వామపక్షాలు కాంగ్రెసుతో చేతులు కలపవచ్చేమో! ఈలోగా బిజెపి బాగా బలపడితే, కెసియారే అవగాహనకు రావచ్చేమో! పార్టీని చంపుకుంటే ఏ బేరాలూ అడే స్థితిలో ఉండమనీ, అప్పుడు తామే అధ్యక్షుడైనా ఏ ప్రయోజనమూ లేదనీ నాయకులు గ్రహించాలి.