1983కి ముందు సంక్షేమ పథకాల ప్రచారం ఆంధ్ర ప్రజలకి పెద్దగా తెలియదు. ఎన్.టి.ఆర్ ముఖ్యమంత్రయ్యాక సానుకూల మీడియా వ్యవస్థ వల్ల ఆయన చేసిన ప్రతి చిన్న వెల్ఫేర్ స్కీముకి ప్రచారం లభించింది. ప్రచారానికి తగ్గట్టుగా ప్రజాదరణ కూడా లభించింది. ఫలితంగా ఆయనలా స్కీములు పెట్టుకుంటూ పోయాడు. తర్వాత ఆ సంక్షేమాన్ని మరో స్థాయికి తీసుకువెళ్లి ఆరోగ్యశ్రీ వంటి పథకాలతో జనాన్ని ఆకర్షించిన నాయకుడు వై.ఎస్.ఆర్.
అయితే సంక్షేమమొకటే ఎజెండా కాకుండా ఓటుకింతని ఇచ్చి కొనడం మొదలుపెట్టిన ఘనత చంద్రబాబుది. ఏకంగా ఓటుకు రూ 500 ఇచ్చి తన ఓటుకి అంత విలువుందా అని సామాన్యుడికి అనిపించేలా చేసిన సంఘటన అది. అప్పటి నుంచి ఆ పార్టీ ఈ పార్టీ అని తేడా లేకుండా డబ్బు పంచడం సాధరణమైపోయింది. నిన్నటికి నిన్న మునుగోడులో డబ్బిస్తేనే ఓటేస్తామని మీడియా సాక్షిగా చెప్పిన ఓటర్లు ఏ పార్టీవాళ్లు ఎంతెంత ఇచ్చారో కూడా చెప్పారు.
ఇప్పుడు అమెరికాలో కూడా పరిస్థితులు మారుతున్నాయి. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యమైన ఇండియాని చూసి నేర్చుకుంటోందో లేక వినాశకాలే విపరీతబుద్ధిలాగ అమెరికా పార్టీల నాయకులకే సహజంగా అటువంటి ఆలోచనలు వస్తున్నాయో తెలియట్లేదు.
అమెరికా రాజకీయాలు ట్రంప్ ముందు, తర్వాత అన్నట్టు చెప్పుకోవాలి. ట్రంప్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు చారిటీ పేరుతో జనానికి డబ్బులు పంచాడు. అఫీషియల్ గా దీనిని వెల్ఫేర్ స్కీం అనలేం కానీ, ఓటర్లని లైన్లో పెట్టుకోవడానికి చేసిన కార్యక్రమం. చంద్రబాబు పసుపుకుంకాలు, జగనన్న నవరత్నాలు చెప్పి చేసిన స్కీములు. ట్రంప్ వ్యవహారం మాత్రం సందర్భాన్ని బట్టి ప్రభుత్వ సొమ్ము పంచేవాడు. కరోనా లాక్డౌన్ల కాలంలో పంచింది ఈ బాపతే.
ఒకసారి అలవాటయ్యాక తప్పదు కదా. ఇప్పుడు డెమోక్రాట్స్ కూడా అదే పద్ధతి అవలంబిస్తున్నారు. బైడెన్ ప్రభుత్వం కూడా సందర్భోచితంగా డబ్బుల పంపిణీ చేస్తూనే ఉంది. బైడెన్ ప్రభుత్వంలో స్టూడెంట్ లోన్స్ మాఫీలు మొదలైనవి జరిగాయి.
ఇప్పుడు డెమాక్రాట్ ప్రభుత్వానికి పోటీగా రిపబ్లికన్స్ కొత్త వాగ్దానాలు చేస్తున్నారు. ఇంతవరకు కథ జరుగుతోంది.
ఇక జరగబోయేది ఎలా ఉంటుందో ఊహించొచ్చు. ఎన్నికలకి ముందే పార్టీల పక్షాన జనానికి డబ్బివ్వడం మొదలవుతుంది. ప్రస్తుతం మిడ్ టర్మ్ ఎలక్షన్స్ కే దాదాపు 16.7 బిలియన్ డాలర్స్ ఖర్చు పెట్టారు అన్ని పార్టీలవాల్ళూ కలిసి. అదంతా మీడియాకి, ప్రచారానికి పెట్టిన ఖర్చు మాత్రమే. ఇకపై జనానికి పంచేందుకు కూడా బడ్జెట్ పెడతారు. ఓటర్స్ ని స్థానికంగా డిన్నర్ పార్టీలకి పిలవడం, ఇంటికొక బ్లూ లేబుల్ బాటిలో మరొకటో గిఫ్ట్స్ గా ఇవ్వడం లాంటి దరిద్రాలు కూడా జరగొచ్చు.
డెమాక్రసీ అంటే డబ్బిచ్చి ఓట్లు కొనుక్కోవడం అనే స్థాయికి ఇండియా దాదాపు వచ్చేసింది. లేకపోతే బారులు తీసి మునుగోడులో 94% మంది ఓట్లేయడమేంటి? ఎంత చెట్టుకి అంత గాలి లాగ ఎంత డబ్బుకి అంత ఓటింగ్ పర్సెంటేజ్ అన్నమాట. ఇప్పుడు అమెరికా కూడా ఆ దిశగా ప్రయాణం మొదలుపెట్టిన సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి జరుగుతున్నది ఆరంభం మాత్రమే. ముందుంది అసలు పండగ.
హరగోపాల్ సూరపనేని