ఏ రాజకీయ పార్టీలను దరి చేరనీయకుండా మరాఠాల రిజర్వేషన్‌కై ఏడాదిన్నరగా పోరాడుతూ అన్ని పార్టీలకు దడ పుట్టించిన మరాఠా సేవా సంఘ్ (ఎమ్మెసెస్) యిప్పుడు చీలికలువాలికలు కాబోతోంది. సామాజిక సమస్యలపై ఉద్యమసంస్థల్లా ప్రారంభమైన సంస్థలన్నీ కొన్నాళ్లకు రాజకీయాల్లోకి ప్రవేశించాలా వద్దా అనే విషయంపై విడిపోతూ ఉంటాయి.
బ్రాహ్మణ వ్యతిరేకతే పునాదిగా ద్రవిడ కళగాన్ని స్థాపించిన రామస్వామి నాయకర్ దాన్ని సామాజిక సంస్థగానే ఉంచాలని పట్టుబట్టగా అతని శిష్యుడు అణ్నాదురై రాజకీయాల్లోకి వెళ్లాలని పట్టుబట్టి ఆ సంస్థను చీల్చి డిఎంకె స్థాపించాడు. లోకసత్తా రాజకీయాల్లోకి వెళ్లాలని జెపి నిశ్చయించగానే కొందరు వీడి వెళ్లిపోయారు. అన్నా హజారే శిష్యుడుగా వెలుగులోకి వచ్చిన అరవింద్ కేజ్రీవాల్ రాజకీయాల్లోకి వెళ్లగానే ఉద్యమం బలహీనపడింది. ఇప్పుడు ఎమ్మెసెస్ లోని ముఖ్యనాయుకులు ముగ్గురూ మూడు పార్టీలకేసి చూస్తున్నారు. రాబోయే ఎన్నికలలో ఒకరితో మరొకరు తలపడతారే ఏమో!
రెండు దశాబ్దాల క్రితం ఈ సంస్థను స్థాపించిన పురుషోత్తమ్ ఖేడేకర్ ఒక ప్రభుత్వోద్యోగి. జనాభాలో దాదాపు మూడో వంతు మంది ఉన్న మరాఠాలు 12% ప్రభుత్వోద్యోగాలు కైవసం చేసుకున్నారు. రాజకీయాల్లో కూడా వారిది చాలా ముఖ్యమైన పాత్ర, దాదాపు 50% పార్లమెంటరీ, అసెంబ్లీ నియోజకవర్గాల్లో వారి సంఖ్య తక్కినవారి కంటె అధికం. అందుకే ప్రస్తుతం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిపి 366 మంది ఉంటే వారిలో 210 మంది మరాఠాలే. 48 మంది ఎంపీలలో 23 మంది వారే. రాష్ట్రాన్ని యిప్పటిదాకా పాలించిన 15 మంది ముఖ్యమంత్రుల్లో 10 మంది వారే.
ఇంతటి ప్రాధాన్యత ఉన్నా బ్రాహ్మణశక్తులు తమని అణచి వేస్తున్నాయని, వారికి వ్యతిరేకంగా మరాఠాలలో అవగాహన పెంచడానికే యీ సంస్థను పెట్టానని వ్యవస్థాపకుడు చెప్పుకున్నాడు. దానికి తగ్గట్టుగానే ప్రస్తుతం లక్ష మంది ఉన్న సభ్యుల సహకారంతో బ్రాహ్మణ వ్యతిరేక పోరాటం సాగిస్తూనే ఉన్నాడు. బ్రాహ్మణ చరిత్రకారులు మరాఠా పాలకులను సవ్యమైన రీతిలో చిత్రీకరించలేదని ఆరోపిస్తూ ఉంటుందీ సంస్థ. 2004లో అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన భండార్కర్ ఓరియంటల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లోని పుస్తకాలను తగలబెట్టి తన తీవ్రస్వభావాన్ని చూపుకుంది.
బాబాసాహెబ్ పురంధరే అనే బ్రాహ్మణకవికి మహారాష్ట్ర ప్రభుత్వం 2015లో మహారాష్ట్ర భూషణ్ అనే అత్యున్నత పురస్కారం యిచ్చినపుడు అభ్యంతర పెట్టింది. 2017 జనవరిలో పుణెలోని శంభాజీ పార్కులో రామ్ గణేశ్ గడ్కరీ (1885-1919) అనే బ్రాహ్మణ మరాఠీ కవి, నాటకకర్త విగ్రహాన్ని పగలగొట్టింది. నూరేళ్ల క్రితం అతను రాసిన 'రాజసన్యాస్' అనే అసంపూర్ణ నాటకంలో శంభాజీ పాత్రను సవ్యంగా చిత్రీకరించలేదట. అదీ అతని పాపం. అలాటి వాడి విగ్రహాన్ని శంభాజీ పేర పెట్టిన పార్కులో వుంచడానికి వీల్లేదని పుణె కార్పోరేషన్‌ను హెచ్చరించింది. వాళ్లు పట్టించుకోకపోతే తనే విరక్కొట్టి పడేసింది.
కితం ఏడాది అహ్మద్‌నగర్ జిల్లాలో మరాఠా మైనర్ బాలికను హరిజన యువకులు బలాత్కారం చేయడంతో మరాఠాల ఆత్మగౌరవం నినాదంతో మొదలైన ఉద్యమం రిజర్వేషన్ల డిమాండుతో ముందుకు సాగింది. ఏ రాజకీయపార్టీ ప్రమేయం లేకుండా భారీ మౌనప్రదర్శనలతో అందరి దృష్టినీ ఆకర్షించింది. అయితే దాని వలన ఏ ప్రయోజనమూ ఒనగూడలేదు. దాంతో రాజకీయ పార్టీగా మారిస్తే తప్ప మన మాట ఎవరూ వినరని సంస్థ అధ్యక్షుడు మనోజ్ అఖారే వాదించసాగాడు. గతంలో మరాఠా కులానికి ప్రాతినిథ్యం వహించే పార్టీలుగా శివ్ సంగ్రామ్, మరాఠా స్వరాజ్య పార్టీ, శివ ధర్మ పార్టీ, ఛావాస్ సంఘటన అనే పేర పార్టీలు పెట్టినా వాటికి గిరాకీ లేకపోయింది. మరాఠాలు ఎన్‌సిపికో, కాంగ్రెసుకో మద్దతుదారులుగా ఉండిపోయారు.
'అందువలన మనం ఉద్యమసంస్థగా కొనసాగుతూనే బ్రాహ్మణవాదానికి, హిందూత్వవాదానికి వ్యతిరేకంగా పోరాడే పిడబ్ల్యుపి వంటి వామపక్ష పార్టీకి మద్దతు యివ్వాలి తప్ప ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగకూడదు' అని వాదిస్తారు. రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ గాయక్‌వాద్. అతని సహచరులు శాంతారామ్ కుంజీర్, శ్రీమంత్ కోకటే. అయినా మనోజ్ వినలేదు. 2017 నవంబరులో జరిగిన స్థానిక ఎన్నికలలో రంగంలోకి దిగాడు. ప్రవీణ్ పక్షం వాళ్లు ఎవరూ ఓటేయలేదేమో, ఎమ్మెసెస్ అభ్యర్థి ఒక్కడూ గెలవలేదు. పైగా విరాళాలేమీ రాకపోవడంతో వాళ్లంతా అప్పుల పాలయ్యారు. అయినా మనోజ్ ఉత్సాహం చల్లారలేదు. పార్టీగా మారి తీరాలనే వాదిస్తున్నాడు.
మరాఠాల్లో కొంతమంది కాంగ్రెసుకు, మరి కొంతమంది ఎన్సీపికి, యింకొందరు పిడబ్ల్యుపికి, ఇంకా కొందరు కొత్త పార్టీకు ఓట్లేస్తే, యీ విధమైన చీలిక వలన బిజెపి లాభపడుతుందని ఎమ్మెసెస్ కార్యకర్తల భయం. అయితే సంస్థ వ్యవస్థాపకుడు ఖేడేకర్ బిజెపి-శివసేన కలిసి 2019లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయని దానికి మద్దతు యిస్తానని ప్రకటించాడు. బిజెపిలో బ్రాహ్మణనాయకులైన దేవేంద్ర ఫడ్‌ణవీస్, నితిన్ గడ్కరీలు పాల్గొన్న మూడు సభల్లో వాళ్లతో కలిసి పాల్గొన్నాడు.
దానికి ప్రతిగా దేవేంద్ర శివాజీ తల్లి జీజాబాయి పేర ఖేడేకర్ కట్టబోయే స్మారక చిహ్నానికి రూ.200 కోట్లు యిస్తానని హామీ యిచ్చాడు. అంతేకాదు బ్రాహ్మణేతర రచయితల రచనలపై పరిశోధన చేసేందుకు బలిరాజా రిసెర్చ్ యిన్‌స్టిట్యూట్ అనే సంస్థను ఎమ్మెసెస్ నాగపూర్‌లో 2017 ఆగస్టులో ప్రారంభించినపుడు దేవేంద్ర, నితిన్ హాజరయ్యారు కూడా. ఈ విధంగా మరాఠా సేవా సంఘ్ నాయకులు తలో పార్టీకేసి చూస్తూన్నపుడు అది రిజర్వేషన్ల కోసం రాజకీయ పోరాటం ఎలా చేయగలదో అనుమానమే.
– ఎమ్బీయస్ ప్రసాద్
[email protected]