ఆంధ్రజ్యోతి తను చేయించిన సర్వేలో టీడీపీకే మళ్లీ పట్టంకడతారని వచ్చిందంటూ కథనాలు వేస్తోంది. వాస్తవఫలితాలకు అతి దగ్గరగా ఉంటాయని పేరుబడిన ఎగ్జిట్‌పోల్స్ కూడా తప్పిపోతున్నాయని గమ నిస్తూనే వున్నా సర్వే అనగానే ఆసక్తిగా చదువుతాం. దీనిలో వింతగా తోచిందేమిట్రా అంటే రాజగోపాల్ సర్వే అన్నట్లుగా కలరింగు ఇవ్వ డం!
ఆంధ్రజ్యోతికి పత్రిక, టీవీ ఛానెల్ కూడా ఉంది. వాళ్లు ఎవర్ని కావాలంటే వాళ్ల సేవలు ఉపయోగించుకుని సర్వేలు చేయించు కోవచ్చు. ఈసారి ఆర్జీస్ ఫ్లాష్ సర్వే చేత చేయించుకున్నాం అని చెప్పుకోవచ్చు. దానికి 'రాజగోపాల్ చేయించుకునే..' అని చేర్చడం దేనికి, అది హెడింగ్‌లో పెట్టడం దేనికి? అంటే రాజగోపాల్‌కి ఉన్న రెప్యుటేషన్, క్రెడిబిలిటీ తమ సంస్థకు లేదని చెప్పుకోవడమా?
నాకు గుర్తున్నంతవరకు రాజగోపాల్ 'టుడేస్ చాణక్య' చేత కూడా చేయిం చుకున్నారు. ఎవరు, ఎవరి చేత చేయించుకున్నా ముఖ్యంగా చూడ వలసినది శాంపుల్ పరిమాణం ఎంత, ఎక్కడ చేశారు అని.
వీళ్లు సర్వే చేసినది 19 సీట్లలో. అంటే కేవలం 11% సీట్లలో అన్నమాట. ఒక్కో దానిలో 1200 మందిని సర్వే చేశారు. మొత్తం 22,800 మంది. దాన్నిబట్టి మొత్తం రాష్ట్రానికి అన్వయించారు. సెలక్టు చేసిన 19 సీట్లలో 68% సీట్లు గతంలో టీడీపీని గెలిపించినవి తీసుకున్నారు. వాటన్నిటిలో టీడీపీ గెలుస్తుందని తెలుసుకున్నారు. ఆ ప్రకారం చూస్తే 110 వస్తాయని తేల్చారు.
2014 ఎన్నికలో టీడీపీ 102 స్థానాలు గెలిచింది. తర్వాత 22మంది వైసీపీ నుంచి పార్టీ ఫిరాయించారు. దానిబలం ప్రస్తుతం 126. అది ఇప్పుడు 110 కి పడిపోతుంది, అంటే 87% కి తగ్గి పోతుంది. వైసీపీకి 2014లో 67 వచ్చాయి. 22 మంది వెళ్లిపో యారు. 45 అయింది. సర్వేలో దానికి 60, అంటే 133%కి పెరుగుతుంది అని వచ్చింది.
సర్వే నిజమే అయితే టీడీపీ సొంత స్థానాలనో, ఫిరాయింపుదార్లను చేర్చుకున్న స్థానాలనో మొత్తం 16 టిని పోగొట్టుకుంటుంది. సర్వే ఫలి తాలను ప్రచురించేటప్పుడు ఈ కోణంలో వారు పరామర్శించలేదు.
2014లో ఓటర్లలో చంద్రబాబు ఏదో చేస్తారన్న ఆశ మాత్రమే ఉంది. అవతల బైబిల్ చేత్తో పట్టుకుని తిరుగుతున్న విజయమ్మ, ఆమె కొడుకు కనబడినవాళ్లందరినీ క్రైస్తవులుగా మార్చేస్తారనే భయం ఉంది. అందువలన 45%ఓట్లు పడ్డాయి. ఈ 4 సంవత్సరాలలో బాబు న భూతో అన్న తీరులో రాజధానికై 33 వేల ఎకరాల సేకరించారు. పైసా చెల్లించకుండా సింగపూరు వాళ్ల చేత ప్లాన్లు గీయించారు. ప్రపంచమంతా నివ్వెరపోయి చూసే స్థాయి రాజధానికి ప్రణాళికలు రచించి, నాలుగైదుసార్లు శంకుస్థాపనలు కూడా చేశారు.
కషా?, గుంటూరు వాసుల బంగరు భవిష్యత్తుకు బాటలు వేశారు, హైదరాబాదు నుంచి ఆంధ్ర నడిబొడ్డుకు రాజధానిని తరలించారు, తాత్కాలిక భవనాలంటూనే పకడ్బందీగా పెద్దపెద్ద భవనాలు కట్టారు, ఎంతో ఘనంగా రెండు పుష్కరాలు నిర్వహించారు, పట్టిసీమ నుంచి గోదావరి జలాలను రాయలసీమకు తరలించారు, నదులను అనుసంధానం చేయించారు, అనంతపురం జిల్లా నుంచి కరువును పారద్రోలారు, పోలవరం చాలా భాగం కట్టి, జాతికి అంకితం కూడా యిచ్చారు, హిందూ, ముస్లిం పండగలకు చంద్రన్న కానుకలను యిచ్చారు, కాపులకు రిజర్వేషన్ యిచ్చారు, వైజాగ్‌లో సదస్సులు నిర్వహించి లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చేట్లా ఒప్పందాలు చేసుకున్నారు, తను నిద్ర పోకుండా, అధికారగణాన్ని నిద్రపోనివ్వ కుండా అన్ని ప్రాజెక్టులను ఏకకాలంలో స్వయంగా పర్యవేక్షిస్తూ, ఆంధ్రయువతకు సూార్తిే కలిగిస్తూ, వారు అంతర్జాతీయ అవార్డులు తెచ్చుకునేట్లా చేస్తూ, వారిలో ఉత్సాహాన్ని రగిలిస్తూ ఉన్నారు. ఆయన ఎంత గొప్ప పాలనాసమర్థుడో, రాష్ట్రం మేలు కోసం కేంద్రాన్ని ఎంత పీడిస్తారో వెంకయ్యనాయుడుగారు ప్రాసాలంకారాలతో ఎన్ని ప్రసం గాలు చేశారో చెప్పనలవి కాదు. ఇంత చేసినా ఈసర్వేప్రకారం టిడిపికి ఓటింగుశాతం 0.5% తగ్గింది తప్ప పెరగలేదు. ఇది వింతగా లేదూ?
ఇక వైసిపి, గత ఎన్నికలలో 44.6% ఓట్లు తెచ్చుకుంది. ఇప్పుడది దాదాపు 7% ఓట్లు పోగొట్టుకుంది. 33% మంది ఎమ్మెల్యేలను ఫిరాయింపుల ద్వారా పోగొట్టుకుంది కాబట్టి ఆ లెక్క ప్రకారం 15% ఓట్లు కూడా పోయి వుండాలి. కానీ దానిలో సగమే పోయాయన్నమాట. అంటే నాయకులు ఫిరాయించినంత సులభంగా ఓటర్లు ఫిరాయించ లేదన్నమాట.
రెండున్నరేళ్ల టిడిపి పాలన పూర్తయ్యాక చేసిన సర్వేలో బిజెపికి 5.4% ఓట్లు వస్తాయని తేలింది. అది యిప్పుడు 1%కి పడిపోయింది. అప్పటికి, యిప్పటికి తేడా ఏమిటి? అప్పుడూ బిజెపి ప్రత్యేక హోదా యివ్వలేదు. ఆర్థిక లోటు పూరించలేదు. నిధులు కురిపించలేదు. రాజధానికి మట్టి, నీళ్లూ తప్ప మరేమీ యివ్వలేదు. అయినా ఆ స్థాయిలో ఉంది. మరి యిప్పుడు? టిడిపి కటీఫ్ అందంతే, దెబ్బకి అది ఐదోవంతుకి పడిపోయింది.
టిడిపియా? మజాకా? వైసిపికి, టిడిపికి, బిజెపికి అందరికీ తగ్గిన ఓట్లన్నీ జనసేన ఖాతాలో పడ్డాయి. ఏకంగా 9%! కానీ ఒక్క సీటూ రాదు. 1% ఓట్లతో బిజెపి 4 సీట్లు తెచ్చుకుంటుంది కానీ దానికి 9 రెట్లు ఓట్లతో జనసేన ఒక్కటీ తెచ్చుకోలేదు. అంటే ఓట్లన్నీ అన్ని నియోజకవర్గాల్లో చెదిరిపోయాయ న్నమాట, పాపం.
ఈ సర్వేలో గమనించవలసిన విషయం ఏమిటంటే ఎటూ తేల్చుకోనివారి శాతం 5.40 ఉంది. 2014 ఎన్నికలలో టీడీపీ-బీజేపీ కూటమి మధ్య వైసీపీ మధ్య ఓట్ల శాతంలో తేడా – 2.5%, కానీ సీట్ల లో తేడా – 39! అందువలన తటస్థులుగా ఉన్నవారు ఎటు మొగ్గుతారు అనేది చాలా ప్రధానమైన అంశం. ఈ సర్వేలో 'ఎటూ తేల్చుకోనివారి' శాతం నియోజకవర్గం బట్టి 0.50% నుంచి 9.79% వరకు ఉంది. సరాసరి ఐన 5.40% కంటె ఎక్కువ ఉన్న నియోజక వర్గాలు 11 కాగా సరాసరి కంటె తక్కువ ఉన్నవి 8. ఇలాంటి పరిస్థితిలో 2014 లో తక్కువ మార్జిన్‌లో ఫలితాలు అటూఇటూ అయిన నియోజకవర్గాలను ఈసర్వేకు ఎంపిక చేసి ఉంటారు అనుకున్నాను. అలాగే తీసుకున్నారా అని చూశాను. వెయ్యి నుంచి 5వేల వరకు మార్జిన్ ఉన్నవి 6 తీసుకున్నారు, 6-10 వేల మార్జిన్‌వి 3, 11-15 మార్జిన్‌వి 3, 16-20 మార్జిన్‌వి 1, 21-25 మార్జిన్‌వి 2, 26-30 మార్జిన్‌వి 2, 31-35 మార్జిన్‌వి 0, 36-40 మార్జిన్‌వి 2 తీసుకున్నారు. 10వేల మార్జిన్ కంటె ఎక్కువ వచ్చినవి తీసుకోవడం అనవసరమని నా అభిప్రాయం. ఎందుకంటే అవి ఆ పార్టీకి బలమైన స్థానాలన్నమాట. 10వేల లోపు మార్జిన్ ఉన్నవి 9 స్థానాలు మాత్రమే. 10వేల మార్జిన్‌పై బడ్డ 10 స్థానాల్లో టీడీపీవి 8 తీసుకున్నారు, వాటిలో ఒకటి వైసీపీకి పోతుందన్నారు, 1 బీజేపీది తీసుకుని, అది వైసీపీకి పోతుం దన్నారు, 1 వైసీపీది తీసుకుని అది టీడీపీకి పోతుందన్నారు.
ఏతావతా టీడీపీ బలం అలాగే ఉంటుంది కానీ బీజేపీ నుంచి వైసీపీ ఒక సీటు గెలుచుకుంటుంది. బీజేపీతో విడిపోవడం వలన బీజేపీ నష్టపోతోంది కానీ టీడీపీ చెక్కు చెదరకపోగా, గతంలో కంటె ఇంకా ఎక్కువ సీట్లు తెచ్చుకుంటుందని చెప్పడమే సర్వే లక్ష్యంగా తోస్తోంది.
అసలు ఇప్పుడు సర్వే ఎందుకు చేశారో అన్న అనుమానం వస్తోంది. ఎన్నికలు ఇంకా ప్రకటించలేదు. టీడీపీ, బీజేపీ పరస్పర ఆరోపణలు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. విజయవాడ సెంట్రల్ వంటి నియోజకవ ర్గంలో 10% మంది ఇంకా ఎటూ తేల్చుకోలేదు.
'బాబు పాలనలో ఒక్కో ఏడాది పూర్తికాగానే సర్వే చేస్తున్నాం, మూడేళ్ల పాలన అయ్యాక చేసి సరిగ్గా ఏడాది అయింది కాబట్టి ఈ ఏడాదీ చేశాం' అనడానికి లేదు. జగన్ పాదయాత్రకు స్పందన వస్తోంది, ప్రత్యేకహోదా గురించి బాబును మాట్లాడేలా జగన్ చేస్తున్న ఒత్తిడి ప్రజలను ఆకర్షిస్తోంది అనే వాదన ఆంధ్రజ్యోతి వారిని కలవరపెట్టి ఉంటుంది. జనాలు వచ్చినంత మాత్రాన ఓట్లు పడతాయన్న గ్యారంటీ లేదని, ఓటు మేనేజ్‌మెంటు, బూత్ మేనేజ్‌మెంటు ప్రత్యేకమైన కళ అని, బాబుని ఆ విద్యలో మించడం ఓ పట్టాన సాధ్యంకాదనీ వాళ్లకీ తెలుసు. అయినా టీడీపీ క్యాడర్‌లో ఒకపాటి కలవరం కలుగుతోందేమో. ఏం భయంలేదు, విజయలక్ష్మి మన పక్కనే ఉందని చెప్పడం తన ధర్మంగా జ్యోతివారు భావించి ఉండవచ్చు.
లేకపోతే టీడీపీకి కంచుకోటల్లాటి నియోజ కవర్గాల్లో సర్వే నిర్వహించి, దాన్నే రాష్ట్రాని కంతటికీ అన్వయించి ప్రకటించడమేమిటి, విడ్డూరం కాకపోతే!
-ఎమ్బీయస్ ప్రసాద్