కారులో వెళ్తూ రోడ్డుపైన ప్లాస్టిక్ కవర్ పడేశాడనే కారణంతో అర్హాన్ అనే యువకుడిపై బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ నోరుపారేసుకోవడం, ఈ తతంగాన్ని వీడియో తీసి ఆమె భర్త క్రికెటర్ విరాట్ కోహ్లి సామాజిక మాధ్యమంలో ఉంచడం ఇటీవల సంచలనంగా మారింది.
ఆ తర్వాత ఈ ఘటనపై అర్హాన్ స్పందిస్తూ.. తాను చేసిన పనికన్నా అనుష్క, విరాట్ చేసిన పని మరింత చెత్తగా ఉందని సోషల్ మీడియా వేదికగా మండిపడ్డాడు. అర్హాన్ తో పాటు అతడి తల్లి కూడా ఈ విషయంపై విరుష్క జంటపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా విరుష్కకు మరో షాకిచ్చాడు అర్హాన్. వాళ్లకు లీగల్ నోటీసులు పంపించాడు.
తనను విమర్శించడంతో పాటు ఆ వీడియోను రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తన మనోభావాలు దెబ్బతిన్నాయని, తన పరువుకు భంగం వాటిల్లిందని అర్హాన్ అందులో పేర్కొన్నాడు. అంతేకాకుండా తనకు క్షమాపణ చెప్పాలని కూడా ఆ లీగల్ నోటీసులో అర్హాన్ డిమాండ్ చేశాడు.
పొరపాటును రోడ్డుపై చెత్త వేశానని గతంలోనే అర్హాన్ క్షమాపణలు చెప్పాడు. కానీ తనతో అనుష్క విరాట్ లు ప్రవర్తించిన తీరు ఏ మాత్రం మర్యాదగా లేదని బాహాటంగా వెల్లడించాడు. అర్హాన్ పంపిన లీగల్ నోటీసులపై అనుష్క విరాట్ లు స్పందించాల్సి ఉంది. ఈ ఘటనపై ఇప్పటికే విరాట్ అనుష్కలపై సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో వ్యతిరేకత వచ్చింది.
వీడియోతో వైరల్ అయిపోదామని, ఏదో సంఘసేవ చేస్తున్నట్టు పబ్లిసిటీ కొట్టేద్దామని ఓవరాక్షన్ చేసిన విరుష్క జోడీకి పరిస్థితి మొత్తం ఇప్పుడు రివర్స్ అయింది.