యుపిఏకు చిత్తశుద్ధి లేక స్విస్ బ్యాంకుల నుండి నల్లధనం తెప్పించలేదు. మేం చూడండి, తడాఖా చూపిస్తాం అంటూ వచ్చిన ఎన్‌డిఏ యిప్పటిదాకా ఏమీ చేయలేకపోయిందని అందరం గ్రహించాం. కోర్టు అడిగే ప్రశ్నలు తట్టుకోలేక పాత జాబితాలే యిస్తోంది, పాత సాకులే చెప్తోంది. మనబోటి వాళ్లు ఆ మాట అంటే 'అబ్బే, మేం ఆయా దేశాలతో ఒప్పందాలు తిరగరాసుకుని వివరాలు తెప్పించేస్తాం' అంటోంది ఎన్‌డిఏ ప్రభుత్వం.
మంగళవారం నాడు భారత్‌లో వుండే స్విజర్లండ్ రాయబారి స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు – ''మా దేశంలోని ఒక బ్యాంకులోంచి దొంగతనంగా సంపాదించిన ఓ లిస్టు పట్టుకుని వచ్చి యిది నిజమా కాదా అని అడిగితే మేం సహకరించం. (ప్రస్తుతం మన దగ్గర వున్న లిస్టు అలాటి చోరీ బాపతే). మా బ్యాంకుల ఖాతాదారులందరందరూ పెద్దమనుషులే అని మా ఉద్దేశం. కాదు, దొంగలు, వారు దాచుకున్నది నల్లధనం, అవినీతిమార్గాల్లో సంపాదించిన ధనం అని మీరంటే ఆ ముక్క నిరూపించవలసినది కూడా మీరే. మేం యిచ్చిన వివరాలతో విచారణ ప్రారంభించడం కాదు, మీ విచారణ ముగించి అప్పుడు ఆధారాలతో మా వద్దకు రండి. అప్పుడు మేం వివరాలు అందిస్తాం'' అని. దీన్నే క్యాచ్ 22 పరిస్థితి అంటారు. అనుమతి పత్రం గది లోపలే దొరుకుతుంది, కానీ గది లోపలకి రావడానికి అనుమతి పత్రం చూపించాలి.
'స్విస్ బ్యాంకుల్లో మీరు డబ్బు దాచుకున్నారు కాబట్టి మీరు దొంగలే' అని మన పౌరులను అడలగొడదామని మన ప్రభుత్వం అనుకుంటోంది. అలా కుదరదు, వేరే ఆధారాలతో పరిశోధించి, వారు నేరస్తులని చూపాలి. 'అయినా దొంగడబ్బు దాచుకోవడానికి స్విజర్లండ్ ఒక్కటే వుందా? ప్రపంచంలో అనేక దేశాలున్నాయి. అసలు మమ్మల్ని నిలదీసేముందు భారతదేశం దేశంలో నల్లడబ్బు దాచుకునే స్థలాలు వెతుక్కోవాలి' అని వాతలు పెట్టాడు స్విస్ రాయబారి. స్విస్ నేషనల్ బ్యాంకు ప్రకారం భారతీయ ఖాతాదారులకు చెందిన రూ.14 వేల కోట్లు స్విస్ బ్యాంకుల్లో వుంది.
మన దేశంలో వున్న నల్లడబ్బు అంతకు కొన్ని వేల రెట్లు వుందని, తెల్లడబ్బు కంటె నల్లడబ్బు కనీసం ఒకటిన్నర రెట్లు ఎక్కువని అందరికీ తెలుసు. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ అనే సంస్థ గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్ ఆన్ ఆటోమెటిక్ ఎక్స్‌ఛేంజ్ ఆఫ్ టాక్స్ ఇన్ఫర్మేషన్ అనే వ్యవస్థను 2017 నాటికి ప్రపంచమంతా నెలకొల్పాలని ప్రయత్నిస్తోంది. అప్పుడు సమాచారప్రసారం సులభతరమౌతుంది. 'మేం దానికై తయారవుతూ మా విధివిధానాలను మార్చుకుంటున్నాం. 2017 తర్వాత యీ సమస్యలేవీ రావు.' అంటున్నాడు రాయబారి. మన దేశం యీ ఆర్గనైజేషన్‌లో యింకా చేరనే లేదు!
ఎమ్బీయస్ ప్రసాద్