అమెరికా ప్రపంచానికి పెద్దన్న. ఆర్థికంగా ఎన్ని ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నా, సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నా దాని ఇమేజ్ దానికుంది. సామాన్య ప్రజల నుంచి దేశాధినేతల వరకూ అమెరికాపై ఎనలేని మోజు. అమెరికా అధ్యక్షుడు తమ దేశాలకు రావాలని కోరుకుంటుంటారు. ఆయన్ని రప్పిస్తే అదో గొప్పతనంగా భావిస్తుంటారు. తమ దేశంలో కాలు పెట్టకూడదని ప్రధాని నరేంద్ర మోదీపై హూంకరించిన అమెరికా ఇప్పుడు ఆయనతో రాసుకొని పూసుకొని తిరుగుతోంది. మోదీ అమెరికా వెళ్లి తన మాటల మాయాజాలంతో, ఉపన్యాసాల మేజిక్‌తో అక్కడి ప్రజలనే కాకుండా, పాలకులను సైతం సమ్మోహితులను చేశారు. మోదీని నిరసించిన అమెరికా ప్రభుత్వం ఇప్పుడు ఆయన్ని ఆకానికి ఎత్తేస్తోంది. ‘చేయీ చేయీ తగిలింది…హాయిహాయిగా ఉంది’ అని పాడుకున్నట్లుగా మోదీఒబామా మరింత దగ్గరయ్యారు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జనవరి 26న జరిగే రిపబ్లిక్ దినోత్సవానికి ఒబామాను ‘అతిథి’గా ఆహ్వానించారు. ఎలాగూ ఒబామా ఇండియాకు వస్తున్నారు కాబట్టి పనిలో పనిగా తమ రాష్ట్రాలకు రప్పించి తమ ఇమేజ్ పెంచుకోవాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు యమ ప్రయత్నాలు చేస్తున్నారు.
ఒబామాను రప్పిస్తే అదో చరిత్ర
అమెరికా అధ్యక్షుడు ఇండియాకు రావడమంటేనే ఓ పెద్ద న్యూస్. అగ్రరాజ్యాధిపతి పర్యటనంటే సామాన్యమైన విషయం కాదు. ప్రపంచాన్ని ఉగ్రవాదం వణికిస్తున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడికి భద్రత భారీ స్థాయిలో ఉంటుంది. ఆయన పర్యటనకు కొన్ని నెలల ముందు నుంచే భద్రతా ఏర్పాట్లు సాగుతాయి. ప్రతి అంశంలోనూ నిశిత పరిశీలన ఉంటుంది. రిపబ్లిక్ డే కొన్నేళ్లుగా భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య సాగుతోంది కాబట్టి సహజంగానే వచ్చే అతిథికి కూడా భద్రత కట్టుదిట్టంగా ఉంటుంది. ఇక అమెరికా అధ్యక్షుడైతే చెప్పక్కర్లేదు. ఇంత పకడ్బందీగా ఒక కార్యక్రమానికి వచ్చే ఒబామాను కొన్ని గంటలపాటు హైదరాబాద్‌కో, ఆంధ్రప్రదేశ్‌కో తీసుకెళ్లడం సాధ్యమవుతుందా? ఆయన అసలు కార్యక్రమం రిపబ్లిక్ దినోత్సవంలో పాల్గొనడం. కుదిరితే కొసరు కార్యక్రమంగా ఏదో ఒక తెలుగు రాష్ట్రానికి రావడం. ఆయన వస్తారా? లేదా? అనేది ఇప్పటివరకు స్పష్టంగా తెలియలేదు. ఏదో ఒక తెలుగు రాష్ట్రానికి వస్తున్నారంటే ఈపాటికి సమాచారం వచ్చుండేది. పాలకులు ఆ విషయాన్ని గొప్పగా మీడియాకు చెప్పేవారే. ఒబామాను రప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నారుగాని అది ఎంతవరకు సఫలమవుతుందో తెలియదు. ఒబామాను రప్పించడంలో ఏ ముఖ్యమంత్రి విజయం సాధించినా అదో చరిత్రగా మారుతుంది. వాళ్లు ఆ విషయాన్ని జీవితాంతం ప్రచారం చేసుకునేందుకు అవకాశం కలుగుతుంది.
బాబు, వైఎస్ తరపున కేసీఆర్ చేరతారా?
అమెరికా అధ్యక్షులను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు రప్పించిన చరిత్ర అప్పటి ముఖ్యమంత్రులు చంద్రబాబు, వైఎస్ రాజశేఖరరెడ్డిలకు ఉంది. హైటెక్ ముఖ్యమంత్రిగా, ఆంధ్రప్రదేశ్ సిఇవోగా పేరు సంపాదించుకున్న చంద్రబాబు నాయుడు అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్‌ను హైదరాబాద్‌కు రప్పించారు. ఆయన పరిపాలనలో ఇదో ముఖ్య ఘట్టంగా నిలిచిపోయింది. హైటెక్ సిటీ కట్టింది తానేనని, హైదరాబాద్‌ను బ్రహ్మాండంగా అభివృద్ధి చేశానని ఇప్పటికీ చెప్పుకునే బాబు ‘నేను అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్‌ను తీసుకొచ్చా’ అని గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు. వైఎస్‌ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జార్జి బుష్ వచ్చారు. కాని బాబుకు వచ్చినంత ప్రచారం వైఎస్‌కు రాలేదు. ఇప్పుడు వీరి సరసన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేరతారా? చూడాలి. తెలంగాణ సాధించిన వ్యక్తిగా పేరు తెచ్చుకున్న కేసీఆర్ తెలంగాణకు తొలిసారి అమెరికా అధ్యక్షుడిని రప్పించిన ఘనత కూడా సాధించాలని అనుకుంటున్నారు. విడిపోయిన ఆంధ్రప్రదేశ్‌కు ఒబామాను తీసుకువచ్చి తన సత్తా మరోసారి చాటాలని బాబు ఉవ్విళ్లూరుతున్నారు.
వస్తే క్రెడిట్ ఎవరి ఖాతాలోకి?
ఒబామాను ఇద్దరు ముఖ్యమంత్రులూ ఆహ్వానించారు. ఆయన తెలుగు రాష్ట్రాలకు రావాలని నిర్ణయించుకుంటే హైదరాబాద్ మాత్రమే వస్తారని అనుకుంటున్నారు. ఇది రాజధాని. ఇక్కడ సమస్త పౌకర్యాలున్నాయి. భద్రతా ఏర్పాట్లకు అవకాశముంది. ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని నగరం లేదు కాబట్టి ఆయన ఎక్కడికి వెళతారు? అందువల్ల చంద్రబాబు ఆహ్వానాన్ని మన్నించినా హైదరాబాద్‌కు మాత్రమే వస్తారు. అప్పుడు ఈ క్రెడిట్ ఎవరి ఖాతాలోకి వెళుతుంది? హైదరాబాద్ తెలంగాణ రాజధాని కాబట్టి ఈ క్రెడిట్ తనదేనని కేసీఆర్ చెప్పుకుంటారా? హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కాబట్టి ఇదంతా తన ఘనతేనని బాబు చెప్పుకుంటారా? ఒబామాను రప్పించి తీరుతానని
బాబు తన పార్టీ నాయకులకు చెప్పారట…! అమెరికాలో తనకున్న పరిచయాలను వినియోగించి ఒబామాను రప్పిస్తానని కేసీఆర్ కుమారుడు, మంత్రి కేసీఆర్ చెప్పుకున్నారట. ఒబామా హైదరాబాద్ రాకుండా ఢిల్లీ నుంచే తిరిగి వెళ్లిపోయే అవకాశం కూడా ఉందని కొందరు చెబుతున్న సమాచారం.
ఒబామా వస్తే ఏమైనా ఒరుగుతుందా?
ఒబామా ఇద్దరు చంద్రుల్లో ఎవరి ఆహ్వానాన్ని మన్నించి ఎక్కడికి వచ్చినా తెలుగు ప్రజలకు ఏమైనా ఒరుగుతుందా? తమ రాష్ర్టంలో అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అంటూ ఈ ముఖ్యమంత్రులు ఆయనకు ఏవేవో చెబుతారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాలను చూపిస్తారు. అమెరికా అధ్యక్షుడికి ఏం చెప్పాలో, ఏం చూపించాలో ముందే నిర్ణయించేస్తారు. ఆయనకు సామాన్య ప్రజలు కనబడరు. వారి సమస్యలు తెలియవు. అతిథి కాబట్టి ఆయనా నాలుగు మంచి మాటలు మాట్లాడి వెళ్లిపోతారు. ఇంతకు మించి జరిగేది ఏం ఉండదు. అమెరికా అధ్యక్షుడు వచ్చినంత మాత్రాన ప్రజలు జీవితాల్లో మార్పు రాదు. ఆమెరికా అధ్యక్షుడిని రప్పించామంటూ నాయకులు జీవితాంతం చెప్పుకుంటారు.
సునయన