తెర తొలిగింది. ఆంధ్ర రాజకీయాల్లో ముఖ్యపాత్రధారులు ముసుగులు తీసేసి నిలబడి ప్రేక్షకులకు స్పష్టత యిచ్చారు. ఈ ముఖ్యఘట్టం తర్వాత యీ పాత్రధారులు ఎంత తెలివిగా వ్యవహరిస్తారన్నదే ముఖ్యం. పవన్, బాబు ఎప్పుడూ సన్నిహితులే. ఈసారి ఎన్నికలలో భాగస్వామ్యం యిద్దరూ కోరుకుంటున్నారనేది తేటతెల్లం. టిడిపికి సాంప్రదాయకంగా ఉండే ఓట్లతో బాటు పవన్ తెచ్చే ఓట్ల శాతం కూడా కలిస్తే, కొన్ని స్థానాలలోనైనా వైసిపి ఓట్లశాతాన్ని మించుతుందని బాబు అంచనా. 2019లో అయితే తను అధికారంలో ఉన్నారు కాబట్టి, ప్రభుత్వవ్యతిరేక ఓటును చీల్చి తమకు సాయపడతాడనే లెక్కతో జనసేనతో పొత్తు పెట్టుకోలేదు. ఎన్నికల అనంతరం తమకు సీట్లు తగ్గితే పవన్ ఆదుకుంటాడని, సంకీర్ణ ప్రభుత్వంలో జనసేనకు కొన్ని మంత్రిత్వశాఖలు యిస్తే సరిపోతుందని అనుకున్నారు. అందుకే టిడిపి ఒంటరిగా పోటీ చేయగా, జనసేన లెఫ్ట్, బియస్పీలతో పొత్తు పెట్టుకున్నారు.
వీళ్లు ప్రత్యర్థులుగా నటించినా, ప్రజలు మాత్రం పవన్‌ను బాబు మనిషిగానే చూశారు. బాబు మీద ఆగ్రహంతో ఉన్న ఓటర్లు పవన్‌ను కూడా దండించారు. జనసేనకు ఠికాణా లేకుండా పోయింది. బిత్తర పోయిన పవన్ ఏం చేయాలో తెలియక, లెఫ్ట్, బియస్పీలను వదుల్చుకుని బిజెపితో చేతులు కలిపారు. బిజెపితో సఖ్యంగా ఉంటూ దానికి టిడిపిపై ఉన్న కోపాన్ని పోగొట్టాలని, ముగ్గురూ కలిసి 2014 నాటి కూటమిగా ఏర్పడాలని ప్రయత్నిస్తూ వచ్చారు. బిజెపికి నచ్చచెప్పారు, హెచ్చరించారు, అలిగారు. ఏం చేసినా బిజెపి మెట్టు దిగలేదు. బాబు ఎంత తగ్గి ఉన్నా బిజెపి ఆయనను దగ్గరకు తీసుకో దలచలేదు. తన చేష్టల ద్వారా పవన్‌కు ఆ విషయాన్ని స్పష్టీకరిస్తూనే వచ్చింది. మీ రోడ్‌మ్యాప్ కోసం చూస్తున్నా అంటూ పవన్ యిప్పటికైనా టిడిపితో పొత్తుకు సై అంటారో లేదో చెప్పండి అంటూ నిలదీశారు. అప్పటికీ కదలకపోతే నా దగ్గర మూడు ఆప్షన్లు ఉన్నాయి జాగ్రత్త, మేమూ టిడిపి కలిసి వెళ్లడం వాటిలో ఒకటి అని కూడా బహిరంగంగా అన్నారు.
ఏది ఏమన్నా బిజెపి చలించలేదు. టిడిపి దిశగా మెత్తపడలేదు. జనసేన మా మిత్రపక్షమే అంటూ పాట పాడుతూ వచ్చింది కానీ ఆచరణలో అదేమీ కనబరచ లేదు. నెలలు గడిచిపోతున్నాయి. ఇవతల జగన్ ఎన్నికలకు సిద్ధమై పోతున్నాడు. తన ఎమ్మెల్యేలందర్నీ గడపగడపకు తిరగమంటున్నాడు. వాళ్ల పనితీరు గురించి రిపోర్టులు తెప్పించుకుంటున్నాడు. టిక్కెట్లు యివ్వాలో లేదో పికె టీము ద్వారా అంచనాలు వేయిస్తున్నాడు. ఇటు ప్రతిపక్షాలు ఎవరి గూట్లో వాళ్లు కూర్చుని తమ మధ్య పొత్తు ఎప్పుడు పొడుస్తుందా అని చూస్తూ కూర్చున్నాయి. సాధారణంగా బిజెపి ఏ ఎన్నికైనా సరే సీరియస్‌గా తీసుకుందంటే ఏళ్ల ముందుగా ప్రణాళికలు రచించి, ద్వితీయశ్రేణి నాయకులను పంపించి, కార్యక్రమాలు చేయిస్తూ ఉంటుంది. తెలంగాణలో చూడండి, ఏడాదికి పైగా ఎంత హడావుడి చేస్తోందో, ఎంతమంది జాతీయ నాయకులను పంపిస్తోందో!
కానీ ఆంధ్ర విషయానికి వస్తే బిజెపి నిమ్మకు నీరెత్తినట్లు కూర్చుంది. ఏ కార్యక్రమమూ గట్టిగా తలపెట్టలేదు. దాని భాగస్వామి ఐన జనసేన చురుగ్గా లేకపోయినా వర్రీ కావటం లేదు, హుషారు చేయటం లేదు. అంటే ఆంధ్రలో యథాతథ స్థితినే అది కోరుకుంటోందని స్పష్టమౌతోంది. వైసిపిని గద్దె దింపే సామర్థ్యం టిడిపికి లేదని దాని అంచనా అని తోస్తోంది. పవన్ కళ్యాణ్‌కు కూడా అంత సీను లేదని, అతను వెళ్లి టిడిపితో కలిసి తమను ఎదిరించినా ఏమీ ఫర్వాలేదనీ, పోగొట్టుకునేది ఏమీ లేదని కూడా అది అనుకుంటూ ఉండాలి. ఇక్కడితో ఆగకుండా, అమిత్ షా జూనియర్‌ను బహిరంగంగా పిలిపించి మాట్లాడడం ద్వారా ఒక సంకేతాన్ని పవన్‌కు పంపించారు. సినిమా గ్లామర్ కోసం నీ ఒక్కడి మీదనే మేము ఆధారపడి లేము. కావాలంటే 2014లో నిన్ను ఉపయోగించు కున్నట్లే 2024లో జూనియర్‌ను ఉపయోగించు కోగలం అని చెప్పేశారు.
బిజెపి తనను ఖాతరు చేయడం లేదనే విషయం పవన్‌కు స్పష్టమైంది. ఇటు తనపై వైసిపి శ్రేణుల దాడి పెరుగుతోంది. టిడిపితో తన బంధాన్ని దాచి ఉంచిన కొద్దీ అందరకీ అదో నవ్వులాటగా మారిపోయింది. దత్తపుత్రుడు అని ముఖ్యమంత్రితో సహా వైసిపి నాయకులందరూ అనసాగారు. కాదు, కాదు అని బుకాయిస్తూ పోవడం కంటె ఏదో ఒక రోజు ఔను అనేస్తే పోతుంది కదా అనిపించి ఉంటుంది పవన్‌కు. ఔను మా యిద్దరి మధ్య పొత్తు ఉంది. ఆయన తనను కొడుకులా అభిమానిస్తారు. ఆయన నాయకత్వంలో ముందుకు సాగుతాను అని డిక్లేర్ చేసేస్తే ఆ పై యింకెవరూ ఏమీ అనలేరు కదా!
ఇక ప్యాకేజి స్టార్ అనే మాట ఎప్పుడు వస్తుంది? తన పార్టీ కంటూ సీట్లేమీ అడగకుండా, కేవలం ప్రచారం మాత్రం చేసి వెళ్లిపోతే అప్పుడు డబ్బు కోసం కాకపోతే ఎందుకు వచ్చాడు అంటారు. చీరల షాపు పబ్లిసిటీకై వచ్చిన స్టార్లు ఉత్తినే రారు కదా! అలాగే వేరే పార్టీ ప్రచారం కోసం స్టార్లు ఉత్తినే రారనే లెక్క ఉంటుంది. పొత్తు పెట్టుకుని, ఓ 50 సీట్లు తీసుకుని, వాటిలో గెలుపుకై ప్రచారసభల్లో తిరిగితే తనకూ స్టేక్ ఉంది కాబట్టి తిరుగుతున్నాడు, దీనిలో డబ్బు ప్రమేయం లేదు అనుకోవచ్చు. టిడిపి నియోజకవర్గాల్లో కూడా తిరిగి, వాళ్లను గెలిపిస్తే రేపు అధికారం పంచుకోవచ్చనే ఆశతో శ్రమిస్తున్నాడు అనుకోవచ్చు. ఎలా చూసినా పొత్తును బహిరంగ పరచడమే మేలు అనే నిర్ణయానికి పవన్, బాబు వచ్చేసి ఉంటారు.
ఇలా పొత్తు పెట్టుకోవడం వలన బిజెపికి కోపం వస్తే.. అని కూడా ఆలోచించి ఉంటారు. ఇప్పుడు చేస్తున్న మేలు ఏదైనా ఉంటే పోతుందనే భయం ఉంటుంది. ఇప్పుడేమీ చేయటం లేదు కాబట్టి పోతుందన్న భయమే లేదు. పొత్తు పెట్టుకున్నా వైసిపిని తిట్టాలి తప్ప బిజెపి జోలికి వెళ్లకూడదు, కేంద్ర విధానాలను విమర్శించ కూడదు అని కూడా బాబు, పవన్ నిశ్చయించుకుని ఉంటారు. ఎందుకంటే యీ పొత్తు ద్వారా సంయుక్త నిరసన కార్యక్రమాలు చేపట్టి, వైసిపికి తాము దీటైన ప్రత్యామ్నాయమని, తమకు విజయావకాశాలు మెండుగా ఉన్నాయని బిజెపిని నమ్మించగలిగితే, ఆఖరి క్షణంలో బిజెపి యీ కూటమి వైపు మొగ్గు చూపించవచ్చు.
ఎందుకంటే దానికి టిడిపి, వైసిపిలలో ఎవరిపైనా వలపు లేదు. ఎవరు రాష్ట్రంలో అధికారంలో ఉంటే వారితో సఖ్యంగా ఉంటే సరిపోతుంది. ప్రస్తుతం చూస్తే, వైసిపికి మెజారిటీ తగ్గినా మళ్లీ అధికారంలోకి వస్తుందనేట్లా పరిస్థితి ఉంది. రాబోయే నెలల్లో టిడిపి-జనసేన కూటమి ప్రజాగ్రహాన్ని సంఘటితం చేసి, గెలుపు గుఱ్ఱమనే భావన సర్వత్రా కలిగిస్తే అప్పుడు బిజెపి వచ్చి చేరవచ్చు. తొందరపడి దానితో తెగతెంపులు చేసుకోవడమెందుకు? అనే భావనతో కూటమి పక్షాలు విమర్శించక పోవచ్చు. కానీ బిజెపి వైఖరి ఎలా ఉంటుందో వేచి చూడాలి. ఆంధ్ర బిజెపిలో టిడిపి అనుకూల, వ్యతిరేక వర్గాలున్నాయనేది సర్వవిదితం. తన రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండగా టిడిపికి అనుకూలంగా వ్యవహరించిన కన్నా లక్ష్మీనారాయణ అధిష్టానాన్ని ఏమీ అనలేక సోము వీర్రాజుపై విరుచుకు పడ్డారు. పవన్ కళ్యాణ్ చేజారిపోవడానికి ఆయనే కారణమని నిందించారు. బిజెపిలో ఎంతో సీనియర్లే స్వతంత్రంగా వ్యవహరించ లేకుండా ఉన్నారు. అధిష్టానం చెప్పినా వీర్రాజు పవన్‌ను వాటేసుకోలేదని అనుకోలేము.
బిజెపి అధిష్టానానికి టిడిపి అంటే పడదు, టిడిపికి తమను సన్నిహితం చేయాలని చూసిన పవన్ వైఖరి నచ్చలేదు. అందువలన పవన్ హెచ్చరికలకు స్పందించకుండా కూచుని ఏం చేసుకుంటావో చేసుకో అన్నట్లు కూర్చుంది. దానికి తగ్గట్టే వీర్రాజు ప్రవర్తించారు. ఇప్పుడు బిజెపి నుంచి టిడిపి అనుకూల వర్గాలు వెళ్లిపోయి జనసేన, లేదా టిడిపిలో చేరతాయేమో చూడాలి. టిడిపి క్షేత్రస్థాయిలో అచేతనంగా ఉండడం చూసి వైసిపి నుంచి తమను తాము కాపాడుకోవాలనుకునే వర్గాలు బిజెపిలో చేరతాయేమో అనుకుంటూ ఉంటే, యిప్పుడు బిజెపి నుంచే టిడిపి-జనసేన కూటమిలోకి ఫిరాయింపులు జరిగేట్లున్నాయి. అదే జరిగితే కూటమికి, బిజెపికి మధ్య వైరుధ్యం కలగవచ్చు. బిజెపి పొత్తు నుంచి బయటకు వస్తే మేం కలిసిరావడానికి సిద్ధం అంటూ సిపిఐ ప్రకటించింది. కానీ లెఫ్ట్ పొత్తు కంటే బిజెపి పొత్తే టిడిపికి ఎక్కువ ముద్దు. ఎన్నికల ముహూర్తం దాకా చూసి, బిజెపి కుదరదు పొమ్మంటే, అప్పుడు లెఫ్ట్‌ను దరి తీయవచ్చు. ఈ కూటమిలో కాంగ్రెసు కూడా వచ్చి చేరినా వైసిపి బెంగపడాల్సింది ఏమీ లేదు. కాంగ్రెసు పేరుకే పార్టీ. అది వచ్చి చేరితే బిజెపి కూటమిపై మరింత కన్నెర్ర చేస్తుంది.
ఈ పొత్తుతో వైసిపి కలవరపడుతోందని కొందరు భావిస్తున్నారు. ఇదేమీ కొత్త పొత్తు కాదు, లోపాయికారీగా ఎప్పణ్నుంచో నడుస్తున్నదే! స్థానిక ఎన్నికలలో కూడా కొన్ని చోట్ల టిడిపి, జనసేన పరస్పర సహకారం అందించుకున్నాయని ఆంధ్రజ్యోతి వెంకట కృష్ణే చెప్పారు. ఇటీవలి కాలంలో పవన్ బాబుని విమర్శించింది లేదు. బాబు పవన్‌ను పన్నెత్తి మాట అన్నదీ లేదు. బాబు ప్లాను ప్రకారమే పవన్ నడుస్తూంటారని వైసిపి వాళ్లకే కాదు, సాధారణ జనాలకు కూడా అనిపిస్తుంది. ఇప్పుడీ వైజాగ్ ఘటనలు, టిడిపి-జనసేన కలయికకు దారి తీసిన పరిణామాలు కూడా టిడిపి ప్రణాళిక ప్రకారమే జరిగాయని అనుకోవచ్చు.
గతంలో అమరావతి ఉద్యమకారుల దేవస్థానం యాత్ర రాయలసీమ ద్వారా సాగినప్పుడు వైసిపి పట్టించుకోలేదు. యాత్ర శాంతియుతంగా జరగడంతో అమరావతి ఏకైక రాజధాని అనే విధానానికి రాయలసీమ ప్రజలు వ్యతిరేకం కాదు అనే వాదనను టిడిపి వర్గాలు ముందుకు తెచ్చాయి. ఇప్పుడు మా గమ్యం అరసవెల్లి అంటూ ఉత్తరాంధ్ర వైపు వెళ్లే పాదయాత్ర కూడా శాంతియుతంగా సాగితే ఉత్తరాంధ్ర ప్రజలు కూడా వ్యతిరేకం కాదు, విశాఖపట్నంకు ఏమీ యివ్వకపోయినా వాళ్లేమీ అనుకోరు అని టిడిపి అనవచ్చనే భయం పట్టుకుంది వైసిపికి. అందువలన అరసవెల్లి యాత్రకు అడ్డంకులు కల్పించాలని సంకల్పించింది. సాక్షాత్తూ ముఖ్యమంత్రే ‘వీళ్లు యాత్రకు వెళితే స్థానిక ప్రజలు ఊరుకుంటారా?’ అంటూ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఆ ప్రాంతపు మంత్రులు, ఎమ్మెల్యేల చేత యాత్రకు వ్యతిరేకంగా స్టేటుమెంట్లు యిప్పించారు. జెఎసి ఏర్పాటు చేయించారు.
నిజానికి ప్రజలు చిత్రమైన వాళ్లు. ఇలాటి అంశాలపై పత్రికల్లో, టీవీల్లో, సోషల్ మీడియాలో నానా హడావుడీ అయిపోతూ ఉంటుంది కాని, సాధారణ ప్రజలు స్పందించరు. ఎవరి పనుల్లో వారుంటారు. ఆస్తిక యాత్ర అని చేయండి, వచ్చి వేడుక చూస్తారు, మర్నాడు నాస్తిక యాత్ర అని చేయండి, దాన్నీ చూస్తారు. వైయస్ పాదయాత్ర చేస్తే అదీ చూస్తారు, బాబు యాత్ర చేస్తే దాన్నీ చూస్తారు. జగన్, లోకేశ్, సోము వీర్రాజు, సిపిఐ రామకృష్ణ.. ఎవరు చేసినా చూస్తారు. ఆంధ్రకు తగని అన్యాయాన్ని చేసిన రాహుల్ వచ్చి పాదయాత్ర చేసినా సరేలే అని ఊరుకుంటారు. దారికి అడ్డుపడి, నువ్వు చేసిన నిర్వాకమేమిటి అని అడగరు. నోరెత్తి ఏమీ చెప్పకపోయినా, ఎన్నికల సమయంలో మాత్రం చేతలతో చూపిస్తారు. ఎవరికి ఓటేద్దామనుకుంటారో వాళ్లకు వేస్తారు. ఏ కారణం చేత అలా ఓటేశారో తెలుసుకోవడానికి విశ్లేషకులు జుట్టు పీక్కుంటూ ఉంటారు.
అమరావతి ఉద్యమం ప్రారంభించి వెయ్యి రోజులైంది అని మనం లెక్కపెట్టుకోవడమే తప్ప, అక్కడి ప్రజలు వైసిపికి ఓటేశారంటే దాన్ని ఎలా అన్వయించుకోవాలి? అలాగే అమరావతి ఏకైక రాజధాని అంటూ యాత్ర వెళితే రాయలసీమ, ఉత్తరాంధ్రలలో ప్రతిఘటన రాకపోతే ఏమనుకోవాలి? ఇదంతా పత్రికా పాఠకుల, టీవీ వీక్షకుల, నెటిజన్ల సమస్య తప్ప సాధారణ ప్రజల సమస్య కాదు. వాళ్లకు దైనందిన జీవితంలో ఎదురయ్యే సమస్యలే ప్రధానం. అందువలన ఉత్తరాంధ్రలో అమరావతి వ్యతిరేక ఉద్యమం ప్రజల్లోంచి వచ్చిందంటే నమ్మలేము. ఇది వైసిపి స్పాన్సర్డ్ ఉద్యమం. విశాఖపట్నం సెంటిమెంటును రగిలించాలని వైసిపి దూకుడుగా, దురుసుగా వ్యవహరిస్తోంది. శాంతిభద్రతలు కాపాడడం ప్రభుత్వకర్తవ్యం అనే బాధ్యతను విస్మరిస్తోంది.
పవన్‌ను బాధితుడిగా చూపించి, సింపతీ రగిలించడానికి యిదే సరైన అదను అనుకున్నారు బాబు. బహుశా ఆయన సలహాపైనే పవన్ వైజాగ్ యాత్ర పెట్టుకుని ఉంటారు. లేకపోతే పవన్ ప్రత్యేకంగా అక్కడకు వెళ్లవలసిన అవసరం కనబడదు. ఆయన జనవాణి సభను జరగనిస్తే తమ ప్రతిష్ఠకు భంగం అనుకుంది వైసిపి ప్రభుత్వం. అందుకే పవన్‌తో చాలా అప్రజాస్వామికంగా, దుర్మార్గంగా వ్యవహరించింది. పవన్ తనకు చేతనైన విధంగా స్పందించి, ప్రభుత్వబాధితుడిగా ముద్ర వేయించుకుని విజయవాడ చేరారు. వెంటనే బాబు ఓదార్పు పేరుతో పవన్ ఉన్న హోటల్‌కు వచ్చి కలిశారు. ఇదేమీ పార్టీల మధ్య వ్యవహారం కాదు, బాధిత వ్యక్తి పట్ల సంఘీభావం తెలపడం మాత్రమే, అందుకే ఒంటరిగా వచ్చాను అని బాబు చెప్పుకోవచ్చు.
తన పట్ల వైసిపి ప్రభుత్వం వ్యవహరించిన తీరుని బిజెపి కేంద్ర ప్రభుత్వం నిరసించి, అభ్యంతరం తెలిపి, మొట్టికాయలు వేస్తుందని పవన్ ఆశించి భంగపడ్డారని కొందరంటున్నారు. అందుకే బిజెపికి ఊడిగం చేయను, మా పోరాటం మాదే అంటూ ప్రకటించారని కూడా అంటున్నారు. నిజానికి యిలాటివి జరగనిస్తేనే వైసిపి ప్రభుత్వంపై జనాలకు మొహం మొత్తుతుందని బిజెపి అంచనా కావచ్చు. గతంలో జగన్ ఓదార్పు యాత్ర చేస్తానన్నపుడు కాంగ్రెసు ప్రభుత్వం అడ్డంకులు సృష్టించి, జగన్ యిమేజిని పెంచింది. చూసీచూడనట్లు వదిలేసి ఉంటే ఏమయ్యేదో! ఇప్పుడు పవన్ జనవాణి ద్వారా వైజాగ్‌లో ఏ సునామీ సృష్టిస్తారని వైసిపి భయపడింది? జనాలకు ఆయన కొత్తా? ఆయనకు జనాలు కొత్తా? ప్రస్తుతం వైసిపి జరిగిన ప్రజావ్యతిరేక చట్టం ఏదైనా తెచ్చిందా? మామూలుగా జరిగిపోవలసిన దాన్ని వైసిపి రచ్చ చేసుకుంది. ఇలాటి పొరపాట్లను సరిదిద్దడానికి బిజెపికి ఏం అవసరం? కావాలనే జరగనిస్తుంది.
టిడిపి-జనసేన కలయిక ఆంధ్ర రాజకీయాలను మలుపు తిప్పే కీలకఘట్టమని, యిదొక వాటర్‌షెడ్ అని కొందరు వర్ణిస్తున్నారు. నా దృష్టిలో యిది యిక్కడే ఆగితే యిది తెచ్చే పెనుమార్పంటూ ఏమీ ఉండదు. ఎందుకంటే బాబు యిచ్చే ఆఫర్లతో పవన్ హ్యేపీయే కానీ, పవన్ అభిమానులు దీనితో సంతృప్తి పడరు. వాళ్లకు కావలసినది పవన్ ముఖ్యమంత్రి కావడం! టిడిపితో కూటమి అనగానే చంద్రబాబే ముఖ్యమంత్రి అవుతాడని ఎవరైనా ఊహిస్తారు. చంద్రబాబు పట్ల వ్యతిరేకతను పవన్ ఓటు బ్యాంకు 2019లో చాలా ఘాటుగానే వ్యక్తపరిచింది. అధికారంలోకి వచ్చాక వైసిపి వాళ్లపై ప్రత్యేకంగా దృష్టి సారించి, దువ్వుతోంది. జగన్‌ను కాదని బాబును ముఖ్యమంత్రి చేయడం వాళ్లకు హుషారు కలిగించే విషయం కాదు. అదే పవన్ ముఖ్యమంత్రి అంటే ‘మనవాడికి యిన్నాళ్లకు ఛాన్సు వచ్చింది.’ అనే జోష్‌తో ఓట్లు పడతాయి. అప్పుడే ఆ ఓట్ల బదిలీ శాతం టిడిపి శాతానికి చేరి, అనేక నియోజకవర్గాల్లో వైసిపి శాతాన్ని దాటగలుగుతుంది.
ఇది జరగాలంటే, బాబు త్యాగం చేయాలి. మొదటి రెండున్నరేళ్లు పవన్ ముఖ్యమంత్రి, తర్వాత నేను అని ముందే ప్రకటించాలి. కానీ యిలా ప్రకటించాలంటే ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగుపెడతానని ప్రకటించిన బాబుకి కాస్త యిబ్బందే. లోకేశ్ కాస్త మొరాయించవచ్చు. కానీ 2024 ఛాన్సు వదులుకుంటే 2029 నాటికి టిడిపి మరింత నీరసించవచ్చు. క్యాడర్ నిరుత్సాహంలో కూరుకు పోవచ్చు. ఇప్పుడు కాస్త వదులుకుంటే, తర్వాతి రోజుల్లో పొందేది ఎక్కువగా ఉంటుంది. ‘ఇలా చేస్తే జనసేన బలపడిపోతుంది, 2029 నాటికి అదే మనకు ప్రత్యర్థి కావచ్చు’ వంటి భయాలు పెట్టుకోవడం అనవసరం. కూటమిలో భాగస్వామ్య పక్షాలు సరిగ్గా వ్యవహరించకపోతే యీ రెండు పార్టీలు ప్రత్యర్థులు అయితే కావచ్చు. కానీ అది ముందుగా ఊహించి, ప్రస్తుత పరిస్థితిని చెడగొట్టుకోవడం అవివేకం.
కూటమి గెలిచాక ఏడాది తర్వాత పవన్ ముఖ్యమంత్రి పదవి వదులుకుని సినిమాల్లోకి వెళ్లిపోయినా ఫర్వాలేదు. పవన్ పేరుకి ముఖ్యమంత్రి ఐనా, రిమోట్ బాబు చేతిలోనే ఉండవచ్చు. కీలక మంత్రిత్వశాఖలన్నీ టిడిపి వద్దే ఉండవచ్చు. ‘ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో ముందే తేల్చం, ఫలితాలు వచ్చాక వచ్చిన సీట్ల బట్టి నిర్ణయించుకుంటాం’ లాటి ట్రిక్కులు వేస్తే ప్రమాదం. అందరికీ బాబు చాణక్యమంటే భయమే. ఒకరి అభ్యర్థులను మరొకరు ఓడించి, వాళ్ల సీట్ల సంఖ్య తగ్గిద్దామని చూస్తారు. కూటమి తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థి పవన్ అని ప్రకటించిన రోజునే వైసిపి యీ పొత్తును చూసి భయపడాలి. అప్పటివరకు చింతేమీ లేదు. ఇప్పుడున్న పరిస్థితే కొనసాగుతుంది.
– ఎమ్బీయస్ ప్రసాద్ (అక్టోబరు 2022)