ఆ రాష్ట్రాలు ఎలా అమలు చేస్తున్నాయి?

ఏ ప్రభుత్వమైనా ఏదైనా అంశంపై వెంటనే నిర్ణయం తీసుకోలేని పరిస్థితిలో అదే అంశంపై ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయో తెలుసుకోవడానికి కమిటీని ఏర్పాటు చేసి అధ్యయనం చేయిస్తుంది. అందువల్ల ఒక క్లారిటీ వస్తుంది.…

ఏ ప్రభుత్వమైనా ఏదైనా అంశంపై వెంటనే నిర్ణయం తీసుకోలేని పరిస్థితిలో అదే అంశంపై ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయో తెలుసుకోవడానికి కమిటీని ఏర్పాటు చేసి అధ్యయనం చేయిస్తుంది. అందువల్ల ఒక క్లారిటీ వస్తుంది. దీంతో నిర్ణయం తీసుకోవడానికి అవకాశం కలుగుతుంది. ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో అసైన్డ్ భూములున్నవారికి ఆ భూములపై పూర్తి హక్కులు కల్పించాలనుకుంటోంది. దీంతో రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ అంశంపై ఇతర రాష్ట్రాల్లో ఏం జరుగుతున్నదో స్టడీ చేయాలని నిర్ణయించారు. ఇతర రాష్ట్రాల్లో అసైన్డ్ భూములపై రైతులు పొందుతున్న ప్రయోజనాలేమిటో అధ్యయనం చేయాలని డిసైడ్ చేశారు. దాన్నిబట్టి ఇక్కడ నిర్ణయం తీసుకోవడానికి అవకాశం కలుగుతుంది.

జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నానబెడుతున్న సీపీఎస్ రద్దు విషయంలోనూ ఇలా ఇతర రాష్ట్రాల్లో స్టడీ చేసి ఒక నిర్ణయం తీసుకోవచ్చు కదా. కానీ ఇప్పటివరకు జగన్ అలాంటి ప్రయత్నం చేయలేదు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు ఇచ్చిన హామీల్లో ఉద్యోగుల సీపీఎస్ రద్దు కూడా ఒకటి. అధికారంలోకి వస్తే వారం రోజుల్లోనే దీన్ని రద్దు చేస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. కానీ  ఇప్పుడు నాలుగేళ్లు కావస్తున్నా ఇది అమలుకాలేదు. దీంతో ఉద్యోగులు తమ పోరు ముమ్మరం చేస్తున్నారు. అయితే పోలీసులతో వారిని అణచివేస్తున్నారు. సీపీఎస్ పై అవగాహన లేకుండా జగన్ హామీ ఇచ్చారని వైసీపీ నాయకులు కవర్ చేశారు. 

అందుకే ఏదైనా హామీ ఇచ్చేముందు దాన్ని అమలు చేయగలమా లేదా అనేది కూలంకషంగా స్టడీ చేయాలి. లేకపోతే పీకకు చుట్టుకుంటుంది. తాజాగా సీపీఎస్ ను పంజాబ్ ప్రభుత్వం రద్దు చేసింది. దీనికన్నా ముందు జార్ఖండ్, ఛత్తీస్ ఘడ్, రాజస్తాన్  సీపీఎస్ ను  రద్దు చేశాయి. ఇప్పుడు పంజాబ్ కూడా అదే బాట పట్టింది. దీంతో ఏపీ ఉద్యోగులు మళ్ళీ ఆందోళనకు దిగుతామంటున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రాల్లో అమలు చేస్తున్న ఉద్యోగుల కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)ను రద్దు చేయాలంటూ కొంతకాలంగా ఆందోళనలు జరుగుతున్నాయి. అయితే దీన్ని ఎత్తేస్తే ఆ భారాన్ని తాము మోయాల్సి ఉంటుందనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావడం లేదు.

కొన్ని రాష్ట్రాల్లో తాము అధికారంలోకి వస్తే సీపీఎస్ రద్దు చేస్తామని రాజకీయ పార్టీలు హామీలిచ్చి అధికారంలోకి వచ్చాయి. మరికొన్ని రాష్ట్రాల్లో హామీ ఇవ్వకపోయినా ఉద్యోగుల ఆందోళన నేపథ్యంలో సీపీఎస్ రద్దు చేశాయి. దీంతో ఈ వ్యవహారం వైసీపీ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతోంది. వైఎస్ జగన్ విపక్ష నేతగా ఉన్నప్పుడు చేసిన పాదయాత్రలో అధికారమిస్తే వారం రోజుల్లోనే ఉద్యోగుల సీపీఎస్ రద్దు చేస్తానని హామీ ఇచ్చారు. అయితే ఆ హామీ ఇప్పటికీ అమలు కాలేదు. దీంతో ఉద్యోగులు ఆందోళన బాట పడుతున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం తాము దీని లోతు తెలియక హామీ ఇచ్చామని  గతంలోనే చెప్పేసింది.

అయినా ఉద్యోగులు మాత్రం పట్టు వీడటం లేదు. ఈ నేపథ్యంలో వారిని బుజ్జగించేందుకు జీపీఎస్ పేరుతో మరో పథకం అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నించినా వారు ఒప్పుకోలేదు. తమకు పాత పెన్షన్ పథకం మాత్రమే వర్తింపజేయాలని పట్టుబడుతున్నారు. దీంతో ప్రభుత్వం ఇరుకునపడుతోంది. ఏపీ వంటి రాష్ట్రాల్లో సీపీఎస్ రద్దు కోసం ఉద్యోగులు ఆందోళన చేస్తున్న  వేళ కొన్ని రాష్ట్రాల్లో ఉద్యోగుల డిమాండ్లకు తలొగ్గి ప్రభుత్వాలు సీపీఎస్ రద్దు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. సీపీఎస్ రద్దుపై ఒక్కో రాష్ట్రం సానుకూలంగా నిర్ణయం తీసుకుంటున్నాయి. ఇప్పటికే నాలుగు రాష్ట్రాల్లో సీపీఎస్ రద్దయింది.  

దీంతో ఏపీలోనూ సీపీఎస్ రద్దు కోసం ఉద్యమిస్తున్న ఉద్యోగ సంఘాలకు ఇది మరింత ఊపునిస్తోంది. అధే సమయంలో ప్రభుత్వంపై ఒత్తిడి మరింత పెరగబోతోంది. సీపీఎస్ రద్దు కాకపోతే మాత్రం వచ్చే ఎన్నికల్లో ఉద్యోగుల ఓట్లు కోల్పోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇంకేదైనా ప్రత్యామ్నాయానికి మొగ్గు చూపుతుందా? లేక ఉద్యోగుల ఓటుబ్యాంకును దృష్టిలో ఉంచుకుని సీపీఎస్ రద్దుకు సిద్దమవుతుందా?